పది పంటల్లో ఐదు పంటల పేర్లయినా చెప్పగలరా..?

ప‌వ‌న్‌, లోకేష్‌ల‌కు మంత్రి కాకాణి గోవ‌ర్థ‌న్‌రెడ్డి సూటి ప్ర‌శ్న‌

సీఎం వైయస్‌ జగన్‌ను విమర్శించే స్థాయి పవన్, లోకేష్‌లకు లేదు

రైతులకు మేలు జరుగుతుంటే బాబు తట్టుకోలేకపోతున్నాడు

సంక్షేమ పథకాలు అమలు చేసేరోజు.. డైవర్ట్‌ పాలిటిక్స్‌కు తెరలేపుతున్నాడు

చంద్రబాబుపై మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపాటు

తాడేపల్లి: ఆంధ్రరాష్ట్ర చరిత్రలో రైతాంగానికి అండగా నిలిచి.. సంపూర్ణ సహాయ సహకారాలు అందించి.. రైతుపక్షపాతిగా నిలిచిన నాయకుడు ముఖ్యమంత్రి  వైయస్‌ జగన్‌ అని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. రైతులు సంతోషంగా లేరని మాట్లాడుతున్న చంద్రబాబు.. ఎందువలనో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతులకు మేలు చేస్తుంటే.. చంద్రబాబు తట్టుకోలేకపోతున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు మొసలి కన్నీరు కార్చినా.. రైతులు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ను విమర్శించే స్థాయి పవన్, లోకేష్‌లకు ఉందా అని ప్రశ్నించారు. పది పంటలు చూపిస్తే.. కనీసం ఐదు పంటల పేర్లయినా పవన్, లోకేష్‌ చెప్పగలరా..? అని ప్రశ్నించారు. 

 వైయస్‌ఆర్‌ రైతు భరోసా కింద మూడేళ్ల పాటు రూ.13,500 చొప్పున రైతులకు అందించారని, నాల్గవ సంవత్సరం మొదటి విడత కింద 50 లక్షల మంది పైచిలుకు మే మాసంలో ఇచ్చే పెట్టుబడి సాయం రూ.7,500ల్లో రూ.5,500 నేడు విడుదల చేస్తున్నారని, మరో రూ.2 వేలు పీఎం కిసాన్‌ పథకం కింద ఈనెలాఖరుకు విడుదల చేయనున్నారని చెప్పారు. ఎలాంటి లంచాలకు, వివక్షకు తావులేకుండా అర్హత గల రైతులందరికీ వైయస్‌ఆర్‌ రైతు భరోసా –పీఎం కిసాన్‌ పథకం అందజేస్తున్నామన్నారు. వరుసగా నాల్గవ ఏడాది.. మొదటి విడత రైతు భరోసా పథకం అమలు కార్యక్రమంలో మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు..

ఈ సందర్భంగా మంత్రి కాకాణి మాట్లాడుతూ..  

రైతులకు సంబంధించి గతంలో ఎన్నడూ లేనివిధంగా స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశాం. ఆంధ్రరాష్ట్ర చరిత్రలో రైతాంగానికి అండగా నిలిచి సంపూర్ణ సహాయ సహకారాలు అందించి.. రైతుపక్షపాతిగా నిలిచిన నాయకుడు ముఖ్యమంత్రి  వైయస్‌ జగన్‌. అందులో భాగంగా పంట రుణాలకు సున్నావడ్డీ, వైయస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా కింద ఈక్రాప్‌లో నమోదు చేసుకున్న వారందరికీ చెల్లింపులు చేపట్టడం, రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు. 

వ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టి రైతు భరోసా కేంద్రాలు స్థాపించి.. రైతులకు ముగింటికే అవసరమైన ఎరువులు, విత్తనాలు ఇలా రైతాంగానికి సంబంధించిన ప్రతి ఒక్కటీ అందజేసే మహోన్నత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వైయస్‌ఆర్‌ రైతు భరోసా కేంద్రాలు చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోతాయి. 10778 కేంద్రాలు స్థాపించాం. ఐక్యరాజ్యసమితికి అనుబంధ సంస్థగా ఉన్న ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ రైతు భరోసా కేంద్రాలను గ్లోబల్‌ స్థాయిలో ఇచ్చే అవార్డుకు నామినేషన్‌ చేసింది. 
రైతులకు సంబంధించి నాణ్యత ప్రమాణాల కోసం ల్యాబ్‌లు, పొలంబడులు, రైతుల సూచనలు, సలహాలు స్వీకరించేందుకు వ్యవసాయ సలహా మండళ్లు ఏర్పాటు, కౌలు రైతులకు వ్యవసాయ రుణాలు, ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించి సీజన్‌ ముగిసేలోగా ఇన్‌పుట్‌ సబ్సిడీ, వైయస్‌ఆర్‌ యంత్రసేవాకు సంబంధించి 3000 ట్రాక్టర్లు జూన్‌ 6వ తేదీన సీఎం చేతుల మీదుగా రైతులకు అందజేయబోతున్నాం. 

రైతురథం పేరుతో చంద్రబాబు రైతులకు ట్రాక్టర్లు ఇచ్చాడు. అయితే..  రైతులు కోరుకున్న కంపెనీలు కాకుండా.. ప్రభుత్వ పెద్దలు ముందుగానే ఆ కంపెనీలతో మాట్లాడుకొని లాలూచీపడి లావాదేవీలు మాట్లాడుకొని రైతురథాలు అందజేశారు. ఈరోజు అలాంటివి లేకుండా.. పారదర్శకంగా, ఎక్కడా అవినీతికి తావులేకుండా, రైతు ఏ డీలర్‌ దగ్గరకు వెళ్లి.. ఏ ట్రాక్టర్‌ కావాలో కొనుక్కుంటే.. ప్రభుత్వం నేరుగా సబ్సిడీ రైతుల ఖాతాల్లోకే నేరుగా జమ చేసే కీలక నిర్ణయం తీసుకున్న వ్యక్తి సీఎం వైయస్‌ జగన్‌. 

గతంలో అనేక రకాల పరిపాలన చూశాం. చంద్రబాబు అవినీతిని వ్యవస్థీకృతం చేశాడు. రైతుల పేరు చెప్పి చట్టాలు మార్చి నీరు–చెట్టు పేరుతో దోచుకున్నాడు. చంద్రబాబు వెయ్యి జన్మలు ఎత్తినా, తలకిందుల తపస్సు చేసినా, బాబు రైతుల పట్ల అనుసరించిన విధానాలను ఆంధ్రరాష్ట్ర ప్రజలు ఎన్నటికీ మర్చిపోరు. బషీర్‌బాగ్‌లో రైతులపై కాల్పులు జరిపాడో.. ఆ ద్రోహాన్ని రైతులు మర్చిపోరు. 

వైయస్‌ జగన్‌ ప్రభుత్వం సంక్షేమ పథకాన్ని అమలు చేసేరోజున.. చంద్రబాబు దానికి వ్యతిరేకంగా సంఘ విద్రోహశక్తులను పురిగొల్పి.. డైవర్ట్‌ పాలిటిక్స్‌కు తెరలేపుతాడు. దానికి ఎల్లోమీడియా తోడై.. ప్రభుత్వంపై విషప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు కూల్చిన దేవాలయాలను సీఎం వైయస్‌ జగన్‌ పునర్‌ నిర్మిస్తున్నారు. విద్యార్థులకు అండగా నిలిచేందుకు విద్యా దీవెన, వసతి దీవెన చేపడితే.. పేపర్‌ లీకు అంటూ ప్రభుత్వంఐ విషప్రచారం చేశారు. పేపర్‌ లీకులకు కారణం చంద్రబాబు దగ్గరుండే నారాయణ కాదా..? అత్యాచారాలు, హత్యల్లో చంద్రబాబు మనుషులకు జోక్యం ఉందని రుజువు అవుతుంది. 

రైతులు సంతోషంగా లేరన్న  చంద్రబాబు.. ఎందువల్ల లేరో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నాను. టీడీపీ హయాంలో రాష్ట్రం కరువు కాటకాలతో విలయతాండవం ఆడింది. చంద్రబాబు – కరువు కవల పిల్లలు అని చెప్పాం. మంచి పాలకుడు ఉంటే ప్రకృతి సహకరిస్తుందనేందుకు సీఎం వైయస్‌ జగన్‌ పాలన నిదర్శనం. బాబు హయాంలో వెలవెలబోయిన జలాశయాలు.. నేడు కళకళలాడుతున్నాయి. 

వైయస్‌ఆర్‌ రైతు భరోసా కింద ఐదు విడతల్లో 13500 చొప్పున రూ.67500 ప్రతి రైతు కుటుంబానికి ఇస్తున్నందుకు బాధపడుతున్నారా.. చంద్రబాబు సమాధానం చెప్పాలి. గత ప్రభుత్వం పెట్టిన ఇన్‌పుట్‌ సబ్సిడీ బకాయిలను కూడా చెల్లిస్తూ.. సీజన్‌ ముగియకముందే నష్టపరిహారం చెల్లిస్తుంటే.. ఎందుకు రైతులు బాధపడుతున్నారో బాబు సమాధానం చెప్పాలి. ఆత్మహత్యలకు సంబంధించిన పరిహారాన్ని కూడా సీఎం వైయస్‌ జగన్‌ చెల్లించారు. గోదావరి డెల్టాకు సంబంధించి జూన్‌ 1వ తేదీనే నీరు విడుదల చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయానికి రైతులు బాధపడుతున్నారా చంద్రబాబు సమాధానం చెప్పాలి. పది పంటలు చూపిస్తాం.. ఐదు పంటల పేర్లు పవన్, లోకేష్‌ చెప్పగలరా..? అలాంటి మీరు ప్రభుత్వం మీద విమర్శలు చేస్తారా..? సీఎం వైయస్‌ జగన్‌ను విమర్శించే స్థాయి పవన్, లోకేష్‌కు ఉందా..? ఆలోచించాలి. రైతు క్షేమం కోసం పనిచేస్తున్న సీఎం వైయస్‌ జగన్‌కు సంపూర్ణ ఆశీస్సులు అందించి సహకరించాలని కోరుకుంటున్నాను. 

 

Back to Top