అసెంబ్లీ: గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను రిసీవ్ చేసుకోవడంలో ప్రొటోకాల్ పాటించలేదంటూ టీడీపీ తోకపత్రికల అబద్ధపు రాతలను అసెంబ్లీ వేదికగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. స్వయంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ వెళ్లి.. గవర్నర్‌కి ఘనస్వాగతం పలికి.. సభలోకి తీసుకువచ్చారని ఆధారాలతో సహా తెలియజేశారు. ప్రోటోకాల్ పాటించలేదుని, సీఎం కోసం గవర్నర్ వేచి ఉన్నారంటూ ఎల్లో పత్రికలు నిస్సిగ్గుగా అబద్ధాలు అచ్చేశాయని మంత్రి బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగంలో దిశచట్టంపై అబద్ధాలు చెప్పించారనే ఆరోపణపైనా బుగ్గన తీవ్రంగా స్పందించారు. వాస్తవాలను సభలో వివరించారు. గౌరవ గవర్నర్, స్పీకర్, ముఖ్యమంత్రి, చట్టసభను అవమానించే రీతిలో ఎల్లో మీడియా బాధ్యతారహితంగా రాస్తున్న తప్పుడు కథనాలను ప్రజల ముందు ఎండగట్టారు. `రాష్ట్రంలో మహిళల భద్రత, రక్షణకు నా ప్రభుత్వం కట్టుబడి ఉంది. మహిళలపట్ల నేరాలకు పాల్పడేవారిపై త్వరితగతిన చర్యలు తీసుకోవడానికి మైలురాయిగా పరిగణించదగ్గ దిశ బిల్లును చేపట్టడమైంది. 2019లో రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రత కోసం ఓ చట్టాన్ని తెచ్చి, దాన్ని అసెంబ్లీలో ఆమోదించి, గవర్నర్ ఆమోదాన్ని పొంది, 2021లో కేంద్రానికి పంపింది. ఇప్పటి వరకూ ఆ బిల్లు కు సంబంధించి క్లారిఫికేషన్స్, రిప్లయ్‌లు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉంది. కానీ, ప్రతిపక్ష టీడీపీ అసలు దిశ బిల్లే లేదని తప్పుడు ఆరోపణలు చేయడం సిగ్గుచేటు. మహిళలకు భద్రత అందించేందుకు గొప్ప సదుద్దేశంతో ప్రభుత్వం ఈ చట్టాన్ని తెచ్చింది. తప్పుడు వార్తలతో గౌరవ సభను, సభ్యులను, గవర్నర్ ను అవమానిస్తూ కథనాలు రాసిన పత్రికలపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సింది`గా స్పీకర్ తమ్మినేని సీతారాంను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి కోరారు.