అన్నమయ్య జిల్లా: వైయస్ జగన్ మోహన్ రెడ్డి కేబినెట్లో విద్యా శాఖ మంత్రిగా పని చేయడం గర్వంగా భావిస్తున్నానని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మదనపల్లెలో నిర్వహించిన జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. అందరికీ నమస్కారం, విద్యార్ధులందరికీ నా అభినందనలు. ఒక మంచి కార్యక్రమానికి సీఎంగారు క్రమం తప్పకుండా ప్రతి త్రైమాసికానికి చెల్లింపులు చేస్తున్నారు. 11 లక్షల మంది విద్యార్ధులకు రూ. 694 కోట్లు ఇవాళ జమ చేస్తున్నారు. నాడు దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు విద్యార్ధులంతా చదువుకోవాలని ఫీజు రీఇంబర్స్‌మెంట్ స్కీమ్ ప్రవేశపెట్టారు, దానికి ఇంకా మెరుగులు దిద్దతూ ప్రతి విద్యార్ధి చదువుకోవాలనే లక్ష్యంతో సీఎంగారు పని చేస్తున్నారు. విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. ఈ దేశమంతా కూడా ఏపీ వైపు, సీఎంగారి వైపు చూస్తున్నారు, ఏ విధంగా ఇంత అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారని చూస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం, నాడు నేడు వంటి అనేక కార్యక్రమాలు అమలుచేస్తున్నారు. ఉన్నత విద్యలో కూడా స్కిల్ డెవలప్‌మెంట్ తీసుకొచ్చి చదువులు పూర్తవగానే ఉద్యోగాలు వచ్చేలా విద్యార్ధులకు శిక్షణనిస్తున్నారు. గత ప్రభుత్వం ఏడాదైనా, రెండేళ్ళయినా ఫీజు రీంబర్స్‌మెంట్ ఇవ్వలేదు. జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన ఈ రెండు పథకాలకే రూ. 12,401 కోట్లు ఖర్చుచేసిన ప్రభుత్వం ఇది. విద్యా శాఖ మంత్రిగా నేను గర్వపడుతున్నాను అంటూ బొత్స సత్యనారాయణ తన ప్రసంగాన్ని ముగించారు.