విజయనగరం: ధాన్యం సేకరణలో వున్న సమస్యలు పరిష్కరించి జిల్లాలో రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేసేందుకు చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏప్రిల్ నెలాఖరులోగా రైతుల నుంచి 5 లక్షల టన్నుల ధాన్యం సేకరిస్తామని వెల్లడించారు. జిల్లాలో ఇప్పటికే 3.53 లక్షల టన్నుల ధాన్యం సేకరించడం జరిగిందన్నారు. మిగిలిన 1.53 లక్షల టన్నుల ధాన్యం సేకరణ విషయమై జిల్లా అధికారులు, రైస్ మిల్లర్లతో చర్చించి సమస్యలు పరిష్కరించామన్నారు. ధాన్యం సేకరణకు ఇకపై వారం వారీగా మిల్లు వారీగా లక్ష్యాలను నిర్దేశించడం జరుగుతోందన్నారు. రైతులకు పండించిన పంటలకు మద్ధతు ధర కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ మేరకు జిల్లాలో ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లాలో ఖరీఫ్ సీజనులో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేసే విషయంలో వున్న సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో మంత్రి బొత్స సత్యనారాయణ ఆదివారం రైస్ మిల్లర్ల సంఘం ప్రతినిధులు, జిల్లా అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లాపరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎం.పి. బెల్లాన చంద్రశేఖర్ సహా జిల్లాకు చెందిన శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి, వ్యవసాయ, పౌరసరఫరాల అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. జిల్లాలో పండించిన ధాన్యం తూర్పుగోదావరి జిల్లాకు తరలించ అవకాశం వున్నప్పటికీ జిల్లాలో రైస్ మిల్లుల పరిశ్రమను ప్రోత్సహించడం ద్వారా ఈ పరిశ్రమపై ఆధారపడిన కుటుంబాలకు జీవనోపాధి కల్పించడం కోసం జిల్లాలోని రైస్ మిల్లులకు అవకాశం కల్పిస్తున్నట్టు మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. దీనిలో భాగంగా 1ః2 నిష్పత్తిలో రైస్ మిల్లులు బ్యాంకు గ్యారంటీలు సమర్పించేందుకు అవకాశమిస్తున్నట్టు తెలిపారు. ఈ విషయంలో మంత్రి, పౌరసరఫరాల సంస్థ ఎం.డి. వీరపాండ్యన్‌తో సమావేశంలో నుంచి ఫోనులో మాట్లాడి 1ః5 బ్యాంకు గ్యారంటీలు సమర్పించాలనే నిబంధనల వల్ల ధాన్యం సేకరణలో ఇబ్బందులు వస్తున్నాయని, 1ః2 నిష్పత్తినే కొనసాగించాలని కోరారు. అదేవిధంగా 50 మెట్రిక్ టన్నుల నాన్ సార్టెక్స్ మిల్లుల ద్వారా సేకరణకు అవకాశం ఇచ్చారని, ఈ ధాన్యం ఫోర్టిఫైడ్ బియ్యంగా మార్పు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ధాన్యం సేకరణలో భాగంగా ఏ మిల్లు నుంచి ఎంత పరిమాణంలో తీసుకుంటున్నారో రోజువారీగా పౌరసరఫరాల డిప్యూటీ తహశీల్దార్లతో పర్యవేక్షణ చేయాలన్నారు. వచ్చే ఏడాదికి మాత్ర ఫోర్టిఫైడ్ బియ్యం తయారీకి అవసరమైన బ్లెండింగ్ యంత్రాలను మిల్లులు ఏర్పాటు చేసుకోవాలని, ఆ యంత్రాలు కలిగివున్న మిల్లులకే లెవీకి అవకాశం ఇస్తామని మంత్రి స్పష్టంచేశారు. సమావేశంలో శాసనసభ్యులు బొత్స అప్పలనరసయ్య, బడ్డుకొండ అప్పలనాయుడు, పీడిక రాజన్నదొర, కడుబండి శ్రీనివాసరావు, శంబంగి వెంకట చినప్పలనాయుడు, వ్యవసాయ శాఖ జె.డి. బి.టి.రామారావు, పౌరసరఫరాల సంస్థ డి.ఎం. దేముడు నాయక్, జిల్లా పౌరసరఫరాల అధికారి పాపారావు, పౌరసరఫరాల సంస్థ టెక్నికల్ మేనేజర్ మీనా, జిల్లా రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు కొండపల్లి కొండబాబు తదితరులు పాల్గొన్నారు. విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధాని వచ్చి తీరుతుంది మూడు రాజధానుల ఏర్పాటు అనేది తమ ప్రభుత్వ విధానమని దీనిప్రకారం విశాఖలో కార్యనిర్వాహక రాజధాని వచ్చి తీరుతుందని మంత్రి స్పష్టంచేశారు. విజయనగరం కలెక్టర్ కార్యాలయంలో మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులను ఏర్పాటు చేయాలన్నది తమ ప్రభుత్వ విధానమని మంత్రి స్పష్టంచేశారు. అయితే గతంలో ఆమోదించిన రాజధాని చట్టంలో సాంకేతిక సమస్యలు వున్నందున వాటిని సరిచేసి మరో సమగ్రమైన బిల్లును తీసుకువస్తామని ముఖ్యమంత్రి ఇదివరకే అసెంబ్లీలో ప్రకటించారని ఆ ప్రకారమే మరో బిల్లు తీసుకువస్తామన్నారు. రాష్ట్రంలో రాజధాని ఏర్పాటు అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని కేంద్ర మంత్రి పార్లమెంటులో ఇచ్చిన సమాధానంలో స్పష్టంగా పేర్కొన్నారని మంత్రి చెప్పారు. రాజ్యసభలో నాటి ప్రధానమంత్రి మన్ మోహన్ సింగ్ ప్రకటించిన విధంగా మన రాష్ట్రానికి ప్రత్యేకహోదా కల్పించాలని తమ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూనే వుంటుందని, వివిధ వేదికల్లో దీనిపై ప్రశ్నిస్తున్నామని మంత్రి చెప్పారు.