ప్రజలకు ఇబ్బందికలిగే ఎలాంటి నిర్ణయాన్ని వైయ‌స్ జ‌గ‌న్ తీసుకోరు

2,794 వార్డులకు గాను 571 వార్డుల్లో వైయస్‌ఆర్‌సీపీ ఏకగ్రీవం

ఏకగ్రీవాల్లో 98.8 శాతం వైయస్‌ఆర్‌సీపీ విజయం

వైయస్‌ జగన్‌ నాయకత్వాన్ని ప్రజలు పూర్తిగా విశ్వసిస్తున్నారు

 2018లో తాగునీటిపై యూజర్ చార్జీలు 33.3 శాతం పెంచుతూ జీవో ఇచ్చింది చంద్రబాబు కాదా..?

 లోకేష్ లాంటి సుంఠల గురించి మాట్లాడటం టైం వేస్ట్..

 ఎన్నికల వేళ పగటి వేషగాళ్ళలా టీడీపీ నాయకులు రోడ్ల మీదకు వచ్చి అవాకులు, చెవాకులు

 టీడీపీ పనైపోయింది.. ప్రెస్ మీట్లు, మీడియాలో తప్ప ఆ పార్టీ కనిపించదు

 ఆస్తిపన్ను పెంచుతున్నట్లు చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు

తాడేపల్లి: ప్రజలకు ఇబ్బంది కలిగే ఎలాంటి నిర్ణయాన్ని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకోదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేవారు. మున్సిపల్‌ ఎన్నికల తరువాత ఆస్తి పన్ను పెంచుతున్నట్లు టీడీపీ చేస్తున్న తప్పుడు ప్రచారం అవాస్తమని ఆయన కొట్టిపారేశారు. ఇలాంటి ప్రచారాలు మానుకోవాలని సూచించారు. చంద్రబాబు కుమారుడు నారా లోకేష్‌ చిన్నా, పెద్ద తేడా లేకుండా అహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గురువారం తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.  
   
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో.. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ ఎన్నికలలో నూటికి 80 శాతంకు పైగా వైయస్ఆర్సీపీ మద్దతుదారులను ప్రజలు గెలిపించారు. ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో కార్పోరేషన్, మున్సిపాల్టీలకు సంబంధించి 12 కార్పోరేషన్లు, 75 మున్సిపాల్టీలు అంటే మొత్తం 87 చోట్ల జరుగుతున్న ఎన్నికల్లో మొత్తం 2,794 వార్డులకు గాను 578వార్డులు-డివిజన్లు ఏకగ్రీవమైతే.. అందులో 571  వైయస్ఆర్సీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. ఏకగ్రీవాల్లో 98.8 శాతం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇదొక చరిత్ర. 

మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తులు లేవు కాబట్టి టీడీపీ వాళ్ళు బుకాయించారు. మేం వాస్తవాలు చెప్పినా, 30-40 శాతం గెలిచామని టీడీపీ వాళ్ళు సంబరాలు చేసుకున్నారు. పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించినట్టే..  అన్ని కార్పోరేషన్లు, మున్సిపాల్టీల్లో వైయస్ఆర్సీపీ విజయం సాధిస్తుందన్న నమ్మకం, పూర్తి విశ్వాసంతో ఉన్నాం. ఇదేదో ఊహ కాదు, జగన్ గారి ప్రజారంజకమైన పరిపాలనతోనే ఇది సాధ్యమవుతుందని మాకు నమ్మకం, ధైర్యం. 

 ప్రజల మద్దతుతో వైయస్ జగన్ గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజలు ఆదరిస్తున్నారు. అన్నివర్గాలకు, అన్ని  ప్రాంతాలకు సమన్యాయం చేస్తూ.. కులాలు, పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. జగన్ మోహన్ రెడ్డిగారు నాయకత్వం అయితేనే మాకు మంచి జరుగుతుందని రాష్ట్ర ప్రజలు సంపూర్ణంగా విశ్వసిస్తున్నారు. 

చంద్రబాబు ఏనాడూ ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు. మేనిఫెస్టోలు అంటే చంద్రబాబుకు అవో చిత్తు కాగితాలు మాత్రమే. అందుకే చంద్రబాబు ప్రతి ఎన్నికకూ ఒక మేనిఫెస్టోను విడుదల ఇస్తూ.. ఆ తర్వాత వాటిని అటకెక్కిస్తున్నాడు.  మాకు మాత్రం మేనిఫెస్టోనే భగవద్గీత, ఖురాన్, బైబిల్. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే నాయకుడు జగన్ మోహన్ రెడ్డిగారు. 

 ఆస్తి పన్ను మేం పెంచేస్తున్నామంటూ చంద్రబాబు నాయుడు విమర్శలు చేస్తున్నాడు. ఇది ప్రజా ప్రభుత్వం. మా నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజల మనోభీష్టం మేరకే పరిపాలన చేస్తారు తప్ప, ప్రజలకు ఇబ్బంది కలిగించేలాగానీ, ప్రజలకు ఆర్థికంగా నష్టం కలిగించే  అంశాలనుగానీ ఎప్పుడూ అమలు చేయరు.

 భారతదేశంలో తీసుకుంటున్న సంస్కరణలో భాగంగా.. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల్లో భాగంగా,  ఆస్తి విలువను ప్రామాణికంగా తీసుకుని ఇంటి పన్ను వేయాలని చట్టం చేశాం.  చంద్రబాబు నాయుడు మాదిరిగా ఇష్టారాజ్యంగా పన్నులు విధించటం లేదు. ఒక శాస్త్రీయమైన విధానంలో, దేశం అంతా  పర్యటించి, ట్యాక్స్ పేయర్స్ అభిప్రాయాలను తీసుకుని, అన్ని అంశాలను అధ్యయనం చేసి, చట్ట సభల్లో చర్చించి మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నాం. 

టీడీపీ హయాంలో  బలవంతుడు, ధనవంతుడిదే రాష్ట్రం అనే అభిప్రాయం ఉండేది. అలాకాకుండా, అందరికీ ఒకే విధానం ఉండాలని, పలు దఫాలుగా చర్చించి, పేద, ధనిక అన్న తేడా లేకుండా 15 శాతం మించకుండా పన్ను వేయటానికి వీల్లేదని చట్టాన్ని తీసుకొచ్చాం. ఇందులో ప్రజలు ఎవరూ.. మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు, ఎవరి ప్రాపకం కోసమో, ఎవరి సిఫార్సుల మీదనో ఆధారపడాల్సిన పనిలేదు. 

ఆస్తి పన్ను విధానాన్ని ఇంత సరళీకృతం చేస్తే.. 15 శాతం కంటే పన్ను పెంచటానికి వీల్లేదని ఎక్కడుందని, జీవో ఏది అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. 2020 నవంబరు 24న ఇచ్చిన జీవోఎంఎస్ 198లో నాల్గవ పేజీలో 9 అంశంలో 15 శాతం కంటే పన్ను పెంచటానికి వీల్లేదని చాలా స్పష్టంగా చెప్పాం. చంద్రబాబు నాయుడులా అధికారం లేనప్పుడు ఒకలా, అధికారం ఉన్నప్పుడు మరోలా నిర్ణయాలు మేం తీసుకోం.

 టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఒక జీవో ఇచ్చారు. 17-5-2018నాడు జీవో ఎంస్ 159 పేరుతో పట్టణ ప్రాంతాల్లో తాగు నీటిపై యూజర్ ఛార్జీలు పెంచుతూ జీవో ఇచ్చారు. డొమిస్టిక్ కేటగిరిలో..  భవనాలకు త్రాగునీటి పన్ను రూ. 100 ఉంటే దానిని 33.3 శాతం పెంచారు. గత ఎన్నికల ముందు చంద్రబాబు ఎందుకు ఈ జీవో ఇవ్వాల్సి వచ్చింది. చంద్రబాబుకు ఈ జీవో గుర్తు లేదా..? అప్పుడు లోకేష్ కూడా మంత్రిగానే ఉన్నాడు. లోకేష్ కు అనుభవం లేకపోవడం వల్ల తెలియపోయినా.. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు జ్ఞానం ఏమైంది. అంటే అధికారంలో ఉంటే ఒక మాట. అధికారం పోతే ఒక మాట.  చంద్రబాబు కుర్చీలో కూర్చుంటే ఒక మాట.. లేకపోతే మరో మాట. ప్రజలు నవ్వుకుంటున్నారు. 

ప్రజల సంక్షేమం, ఆరోగ్యమే లక్ష్యంగా.. ముఖ్యమంత్రి గారు ప్రజలకు సంబంధించి త్రాగునీరు, పారిశుధ్యం, విద్య, వైద్యం, ఆరోగ్యం, వీటన్నింటినీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వినూత్నమైన కార్యక్రమాలను అమలు చేస్తున్నారు.  త్వరలో 550  అర్బన్ క్లినిక్ లు ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తున్నారు. నాడు-నేడులో భాగంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కార్పొరేట్ స్థాయిలో విద్య, వైద్య సౌకర్యాలు అందిస్తున్నారు. 

ఎన్నికలు వచ్చాయని పగటి వేషగాళ్ళలా ఈరోజు టీడీపీ నాయకుడు రోడ్ల మీదకు వచ్చి మాట్లాడుతున్నారు. చంద్రబాబు మాటలు చూస్తే జాలేస్తుంది. టీడీపీ పని అయిపోయింది. క్షేత్రస్థాయిలో ఆ పార్టీ ఎక్కడా కనిపించడం లేదు. కార్యకర్తలు నీరసించిపోయారు. ఆ పార్టీకి నాయకత్వమే లేదు. ప్రతిపక్షంగా అసలు టీడీపీ ఎక్కడుంది..? ప్రెస్ మీట్లు, మీడియాలో తప్ప టీడీపీ కనిపించడం లేదు. 

ఈ ప్రభుత్వం మీది. ప్రజల ఆలోచన ప్రకారమే ప్రభుత్వం విధానాలు రూపొందిస్తూ ముందుకు వెళుతుంది. చంద్రబాబు నాయుడు మాదిరిగా మోసం, మాయ, దగా మాకు చేతకాదు. ఆ అవసరం కూడా మాకు లేదు. చంద్రబాబు చేసే మోసమైన వ్యవహారాలకు, బూటకపు మాటలకు ప్రజలు దూరంగా ఉండాలని కోరుకుంటున్నాను. 

 నోటికి అడ్డూ అదుపులేకుండా, అహంకారపూరితంగా చిన్నా పెద్దా తేడా లేకుండా లోకేష్ ఈరోజు కూడా విశాఖ వెళ్ళి ఇష్టానుసారంగా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. లోకేష్ మాటలు వింటుంటే... ఇలాంటి వాళ్ళు కూడా రాజకీయాల్లో ఉంటారా.. ? అనిపిస్తుంది. లోకేష్ ను చూస్తుంటే.. ఒక సుంటగా కనిపిస్తున్నాడు. అతని గురించి మాట్లాడటం కూడా సమయం వృథానే. 

విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు... అన్నది మా విధానం.  దాన్ని పరిరక్షించుకోవడం మా బాధ్యత. నష్టాల నుంచి లాభాల్లోకి తెచ్చేందుకు ముఖ్యమంత్రి గారు ప్రత్యామ్నాయాలను సూచిస్తూ ప్రధానమంత్రి గారికి లేఖ రాశారు. రేపు జరగబోయే రాష్ట్ర బంద్ కు మా సంఘీభావాన్ని తెలియజేస్తున్నామ‌ని మంత్రి బొత్స‌స‌త్య‌నారాయ‌ణ పేర్కొన్నారు. 

 

Back to Top