అమరావతి: మేము ఇక్కడికి దొడ్డిదారిన రాలేదని..ప్రజలు ఎన్నుకుంటే వచ్చామని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. శాసన మండలిలో టీడీపీ సభ్యులు మంత్రి బొత్స సత్యనారాయణపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. బొత్స వీధి రౌడీ అంటూ టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి దుర్భషలాడారు. అలాగే టీడీపీ ఎమ్మెల్సీలు జగదీశ్వర్‌రావు, అంగర రామ్మోహన్ మంత్రులపై దూసుకెళ్లారు. టీడీపీ సభ్యుల ప్రవర్తనను మంత్రి బొత్స తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. మమ్మల్ని వీధి రౌడీలని టీడీపీ సభ్యులు ఎలా అంటారని బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా..ఇలాంటి ప్రవర్తన ఎప్పుడూ చూడలేదని చెప్పారు. టీడీపీ సభ్యులు నోటికెంతొస్తే అంత మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మేం రన్నింగ్ కామెంటరీ చేసే వ్యక్తులం కాదని స్పష్టం చేశారు. ప్రభుత్వం తరఫున మాకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని తెలిపారు. ఇది పెద్దల సభ: ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి ఇది పెద్దల సభ..సభ్యులు హుందాగా వ్యవహరించాలని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సూచించారు. టీడీపీ సభ్యులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం సరికాదన్నారు. టీడీపీ సభ్యులు సభా సంప్రదాయాలు పాటించడం లేదని ఉమ్మారెడ్డి పేర్కొన్నారు.