మేం అడ్డుకుంటే ఇన్ని వేల నామినేషన్లు ఎలా వేశారు? 

నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగింది

ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ నామినేషన్లు వేశారు

అధికారంలో ఉన్నప్పుడు బాబు వ్యవహరించిన తీరు మర్చచిపోయారా?

ప్రజలకు ఇచ్చిన ప్రతీ వాగ్ధానాన్ని అమలు చేస్తున్నాం

ప్రజలపై మాకు విశ్వాసం ఉంది

టీడీపీ తానా అంటే బీజేపీ, జనసేన తందానా 

మంత్రి బొత్స సత్యనారాయణ

తాడేపల్లి: చంద్రబాబు చెప్పినట్లు నామినేషన్లు వేయకుండా మేం అడ్డుకుంటే ఇన్ని వేల మంది ఎలా నామినేషన్‌ వేశారని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ నామినేషన్లు వేశారని, నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగిందన్నారు. చంద్రబాబు దుష్ట బుద్ధితో మాట్లాడుతున్నారని, రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ప్రజలపై మాకు విశ్వాసం ఉందని, వైయస్‌ జగన్‌ ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారన్నారు. విశాఖలోని వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. 

ప్రజల్లో అపోహాలు సృష్టించేందుకు టీడీపీ ప్రయత్నం చేస్తోంది. నిన్నటి రోజు చంద్రబాబు మాట్లాడిన మాటలు చూస్తే అర్థమవుతుంది. ఒకపక్క చంద్రబాబు, మరోపక్క జనసేన, దాని మిత్ర పక్షాలు మాటలు విడ్డూరంగా ఉన్నాయి. ఎన్నికలు ఎందుకు ఏకగ్రీవం చేసుకోవచ్చు కదా అంటున్నారు. వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని, ఈ రాష్ట్రం పక్క రాష్ట్రాలకు తలమానికగా ఉండాలని భిన్న ప్రక్రియలు చేపట్టాం. ఈ విధానం జరుగుతుంటే ఇవాళ చంద్రబాబు దుష్ట ఆలోచనతో మాట్లాడుతున్నారు. చంద్రబాబు, టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు మీ మాటలు ఒక్కసారి ఆలోచించుకోండి. రాష్ట్రంలో 9696 ఎంపీటీసీ స్థానాలు ఉంటే..వాటికి సుమారు 50063 నామినేషన్లు దాఖలు అయ్యాయి. అందులో వైయస్‌ఆర్‌సీపీ 23 వేలు, టీడీపీ 18 వేలు, జనసేన 2 వేలు, బీజేపీ 1800 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అభ్యర్థులను బూతుల వద్దకు రానివ్వకపోతే, నామినేషన్లు చించివేస్తే ఇవన్నీ ఏ రకంగా దాఖలు చేశారో చెప్పాలి. దుర్భుద్ధితో అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ నిందలే కదా? ఎక్కడో అక్కడ మీ కార్యకర్తలు గలాటలు సృష్టిస్తే..ఏదో జరిగిపోతుందని అసత్యాలు చెబుతున్నారు. నిన్నటి రోజు మాచర్లకు బొండా ఉమా, బుద్ద వెంకన్న వెళ్లారు. ఎవరూ ఏ ప్రాంతానికైనా వెళ్లవచ్చు. అక్కడ ఉన్న పరిస్థితులకు శాంతిభద్రతలకు కలుగకుండా వెళ్తాం. ఆ రోజు నంద్యాల ఉప ఎన్నికల సమయంలో ప్రచారానికి వెళ్తే ఆ రోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు, ఆయన మంత్రులు అంతా అక్కడే మకాం వేశారు. నేను అక్కడికి వెళ్లే ముందు ఇంటలీజెన్సీ డీజీకి సమాచారం ఇచ్చాను. రాజకీయబద్ధంగా అప్పుడు ప్రచారం చేసుకున్నాం. ఇది తప్పా? ఉమా మాదిరిగా పది కార్లు వేసుకొని వెళ్లి దివ్యాంగుడిని ఢీ కొట్టలేదే? ఇలాంటి వ్యక్తులను పక్కన కూర్చొని చంద్రబాబు బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు. స్థానికులు క్రోపోద్రికులయ్యారు. సుమారు 50 వేల మంది వచ్చి నామినేషన్లు వేస్తే చంద్రబాబు ఎలా మాట్లాడుతారు? గతంలో చంద్రబాబు హయాంలో ఎన్నికలు జరిగినప్పుడు అంబటి రాంబాబు ఎంపీటీసీలను బస్సులో తీసుకెళ్తుంటే అప్పుడు దాడి చేసింది మీరు కాదా? దాడులు చేసే సంస్కృతి మీది. శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తాం. వైయస్‌ఆర్‌సీపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుంది. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న ఏకైక పార్టీ వైయస్‌ఆర్‌సీపీనే. అన్ని వర్గాలకు మేలు చేశాం. పేదలకు రేపు ఇళ్లు ఇవ్వబోతున్నాం. ఇన్ని కార్యక్రమాలు చేపట్టిన తరువాత మాకెందుకు ఓటమి భయం ఉంటుంది. ప్రజల పట్ల పూర్తి విశ్వాసం ఉంది. మొన్నటి కంటే ఎక్కువగా గెలిపిస్తామన్న నమ్మకం మాకు ఉంది. ప్రజలు కోరుకున్న నాయకుడు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి. అధికారం కోల్పోయిన తరువాత చంద్రబాబు సహనం కోల్పోయి మాట్లాడుతున్నారు. నీ బెదిరింపులకు ఎవరూ భయపడరు. ఆ రోజు 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా తీసుకెళ్లావు. ఈ రోజు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఎవరైనా పార్టీలో చేరాల్సి వస్తే ఒక విధానం రూపొందించాం. రాజీనామా చేసి రమ్మంటున్నాం. దానికే కట్టుబడి ఉంటున్నాం. 
బీజేపీ, జనసేన నాయకులు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదంటున్నారు. పవన్‌కు రాజకీయ అనుభవం లేదు, నటనలో ఆయనకు అనుభవం ఉండవచ్చు. అదే బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గతంలో మంత్రిగా పని చేశారు కదా? అప్పటికీ, ఇప్పటికీ తేడా ఏంటో చెప్పండి. ఈ ఎన్నికల్లో కనీసం 3 వేల నామినేషన్లు కూడా వేయలేకపోయారే? మీ నామినేషన్లు ఎవరైనా ఎత్తుకెళ్లారా? ఇంకో విషయం ఏదైనా ఉంటే మాట్లాడండి. టీడీపీ తానా అంటే బీజేపీ, జనసేన తందానా అంటున్నాయి. ఈ తానా తందానా మాటలు మానండి. వ్యవస్థలో మార్పులు చేసి రాజకీయంగా విలువ పెంచేందుకు వైయస్‌ జగన్‌ ఈ ఎన్నికల్లో కొత్త చట్టం చేశారు. మద్యం, డబ్బుల పంపిణీ జరుగకూడదని చెప్పాం. ఎవరు చేసినా శిక్షించాలని చెప్పాం. ఎక్కడైనా  ఇలాంటి సంఘటనలు ఉంటే ఫిర్యాదు చేయండి. ఎన్నికల్లో తుడిచి పెట్టుకుపోతామని టీడీపీ భయపడుతుందని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలవలేమనే చంద్రబాబు దుష్ర్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

 

Back to Top