సెన్స్‌ లేకుండా 'రామోజీ' నాన్సెన్స్‌ రాతలు

వలంటీర్లు వేగులు కాదు.. ప్రభుత్వ సేవకులు, మాన‌వ‌తావాదులు

చంద్ర‌బాబు బుర్ర తక్కువ పాలన అమోఘం, అద్భుతంలా మీకు కనిపించిందా..?

సేవే పరమావధిగా పనిచేస్తున్న వలంటీర్లపై దుష్ప్రచారం తగదు రామోజీ

సేవా దృక్పథంతో పనిచేస్తున్న వలంటీర్ల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయొద్దు

కోవిడ్‌ సమయంలో ప్రాణాలు లెక్క‌చేయ‌కుండా ప‌నిచేసిన వారిపై విమర్శలా..?

ఈనాడు దుష్ప్ర‌చారంపై మంత్రి ఆదిమూల‌పు సురేష్ ఆగ్ర‌హం

తాడేప‌ల్లి: ప్రజలకు సేవలందిస్తున్న వలంటీర్ల వ్యవస్థను కించపరిచే విధంగా రామోజీరావు ఈనాడు పత్రికలో తప్పుడు రాతలు రాయిస్తున్నాడని మున్సిపల్‌ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ధ్వజమెత్తారు. సెన్స్, కామన్‌సెన్స్‌ లేకుండా అంతా నాన్సెన్స్‌ రాతలు రాస్తున్నారని ధ్వజమెత్తారు. అబద్ధాలు, అవాస్తవాలను ప్రచురించి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కుట్రపూరితంగా ఈనాడు కథనాలు రాస్తోందని దుయ్యబట్టారు. కోవిడ్‌ సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలకు సేవలందించిన వలంటీర్లపై దుష్ప్రచారం చేయడం హేయమని మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి ఆదిమూలపు సురేష్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఏం మాట్లాడారంటే..
ఒక అబద్దాన్ని, అవాస్తలను రంగరించి.. ఒక పార్టీని అధికారంలోకి తీసుకురావాలని, అధికారంలో ఉన్న ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తోంది ఈనాడు పత్రిక. రాష్ట్రంలో సేవా దృక్పథంతో 2.65 లక్షల మంది వలంటీర్లు పనిచేస్తున్న ఈ వ్యవస్థలో వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం ఇది. ప్రభుత్వానికి, సంక్షేమ పథకాలు అందుకుంటున్న ప్రజలకు మధ్య వారధిగా... ఎన్ని అడ్డంకులు వచ్చినా కేవలం గౌరవ వేతనంతో పనిచేస్తున్న వారిపై ఇలాంటి దుష్ప్రచారం దురదృష్టకరం. ఈనాడు రామోజీరావు వాస్తవాలు తెలుసుకోకుండా, చంద్రబాబుకు అనుకూలంగా వార్తలు రాస్తున్నాడు. వలంటీర్ల విషయంలో కుట్రపూరితంగా ఎన్నో అవాస్తవాలు వండివార్చారు. 

జన్మభూమి కమిటీల దోపిడీ అంతా ఇంతా కాదు.. 
వేగులంటూ సెన్స్‌ లేకుండా, కామన్‌ సెన్స్‌ లేకుండా అంతా నాన్సెన్స్‌ రాతలు రాస్తున్నారు. మూడున్నరేళ్లుగా పనిచేస్తున్న ఈ వ్యవస్థపై కేవలం పిచ్చి రాతలు రాస్తూ ప్రభుత్వానికి కళంకం తీసుకువచ్చే ప్రయత్నం చేయడం దురదృష్టకరం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా నాయకుడు వైయ‌స్‌ జగన్‌ నవరత్నాలను ఇంటింటికి పారదర్శకంగా అమలు చేయాలని వలంటీర్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. గతంలో జన్మభూమి కమిటీల వల్ల ఈ రాష్ట్ర ప్రజలు అనుభవించిన అవస్థలు అనీ ఇన్నీ కావు. పింఛన్ల కోసం క్యూ లైన్లల్లో పడిగాపులు కాసి ప్రాణాలు కోల్పోయిన అవ్వా తాతలు ఎంతో మంది ఉన్నారు.

సేవా దృక్పథంతో వచ్చిన వారే వలంటీర్లు 
జీవో నెంబర్‌ 104, జీవో నెంబర్‌ 201లను జూన్‌ 2019లో జారీ చేస్తూ గ్రామ, వార్డు వలంటీర్లను ఏర్పాటు చేశాము. దానిలో విధివిధానాలు, వలంటీర్లకు కావాల్సిన అర్హతలు స్పష్టంగా నిర్ధేశించాం. 2,65,979 మంది వలంటీర్లను నియామకం చేపట్టాం. మానవతా దృక్పథంతో ఎవరైనా సరే.. సేవ చేయాలని ముందుకు వచ్చిన వారికి అవకాశం కల్పిస్తున్నాం. ప్రతి పదిహేను రోజులకు ఒక సారి మండల స్థాయిలో కాళీలను భర్తీ చేస్తున్నాం. దీంట్లో 50 శాతం మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నాం. రామోజీరావు ఈ వలంటీర్‌ వ్యవస్థపై దేశమంతా ఏమనుకుంటుంది అనేది చూసినట్లు లేదు. గడప గడపకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందిస్తున్న వ్యవస్థ వలంటీర్‌ వ్యవస్థ అని, దాన్ని ప్రవేశపెట్టిన వైఎస్సార్‌ ప్రభుత్వం మాదని మేం గర్వంగా చెప్పుకోగలగుతున్నాం. వలంటీర్లను రాష్ట్ర ప్రజలు తమ సొంత కుటుంబంలో సభ్యులుగా చేసుకుంటున్న పరిస్థితి వీరికి కనిపించడం లేదా..? గతంలో చంద్రబాబు చేసిన ఆరోపణలనే ఈనాడు పత్రిక మళ్లీ వంతపాడుతోంది. ఈ వ్యవస్థ ఎంత ముఖ్యమో, ప్రతి యాభై కుటుంబాలకు ఈ వ్యవస్థ ఎంత అవసరమో ప్రజలకు తెలుసు.

"జన్మభూమి"లో నేతల మేత.. అని రాసింది మరిచారా రామోజీ?
టీడీపీ అధికారంలో ఉన్నపుడు సంక్షేమ కార్యక్రమాలు లేవు.. పారదర్శకత అంతకన్నా లేదు. లంచం లేకుండా ఏ పథకం అమలయ్యిందో వాళ్లే చెప్పాలి. 2017 ఆగస్టు 15న జన్మభూమిలో నేతల మేత అంటూ ఇదే ఈనాడు పత్రిక వార్తలు రాసింది. ఏ ఏ పనికి ఎంతెంత సమర్పించుకోవాలో కూడా ఇదే పత్రిక ధరల పట్టికను ప్రచురించింది.

- "జన్మభూమిలో నేతల మేత" అంటూ 2017 ఆగస్టు 11న ఈనాడు ఫస్ట్ పేజీలో స్టోరీ..
- జన్మభూమి కమిటీలు చెప్పినవారే అర్హులు
- గ్రామసభలుండవు... సిఫారసులుండవు.. 
- రుణాలకు లంచాల రేట్లు.. జన్మభూమి కమిటీల ఇష్టారాజ్యం
- ఎక్కడ చూసినా లంచం.. లంచం..
- పింఛనుకు రూ. 3 వేలు నుంచి 5 వేలు
-రుణం కావాలంటే రూ. 15 వేలు
-ఇల్లు మంజూరు కావాలంటే రూ. 15 వేలు
- కార్పొరేషన్ల నుంచి రుణం పొందాలంటే: రూ. 25 వేలు నుంచి 37 వేలు
-మరుగుదొడ్డి మంజూరు కావాలంటే: రూ. 1500
-ఎన్టీఆర్ గృహ పథకం ఎంపిక కావాలంటే: రూ. 20 వేలు
- బీసీ కార్పొరేషన్ రుణం పొందాలంటే: రూ. 10 వేలు 

కుప్పంతో సహా రాష్ట్రంలో అన్ని చోట్లా నవరత్నాలు అమలవుతున్నాయని, ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌ కి మంచిపేరు వస్తుందని ఇలాంటి విషపు రాతలు రాస్తున్నారు. వలంటీర్‌ వ్యవస్థను మేం పార్టీ ప్రయోజనాలకు వాడుకోవాల్సిన అవసరం ఏముంది..? గత పదేళ్లలో క్షేత్ర స్థాయిలో మా పార్టీ బలోపేతంగా ఉంది. మా నాయకుడు వైయ‌స్‌ జగన్‌ పార్టీని అలా తీర్చిదిద్దారు. ప్రతి బూత్‌ స్థాయి నుంచి గ్రామ, మండల స్థాయి వరకూ మాకు శాస్త్రీయంగా ప్రతినిధులు ఉన్నారు. దానికి నిదర్శనమే మొన్నటి ఎన్నికల ఫలితాలు. పార్టీ బలోపేతానికి ఎప్పటికప్పుడు మా నాయకుడు వైయ‌స్‌ జగన్‌ దిశానిర్ధేశం చేస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని పార్టీ వాడుకోవాల్సిన అవసరం మాకు లేదు. చంద్రబాబు నాయుడు తన పార్టీ కోసం వాడుకున్నంతగా ఈ దేశంలో ఎవరూ వాడుకుని ఉండరు. బాబు హయాంలో ఒక మహిళా ఎమ్మార్వో ఇసుక మాఫియాని ఆపాలని చూస్తే ఆమెను జుట్టు పట్టుకుని ఈడ్చిన ఘనత వీళ్లది. అన్ని అర్హతలు ఉన్నా జన్మభూమి కమిటీలకు లంచాలు ఇచ్చుకోవాల్సిన దుస్థితి చంద్రబాబు హయాంలో ఉండేది. జిల్లా కలెక్టర్లకు సైతం చూసీ చూడనట్లు పోవాలంటూ ఆదేశాలు ఇచ్చిన దిక్కుమాలిన పాలన చంద్రబాబుది. వికేంద్రీకరణలో భాగంగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం, దానికి అనుబంధంగా వలంటీర్లను ఏర్పాటు చేసుకుని గడప వద్దకు మేం పాలన అందిస్తున్నాం. 50 ఇళ్లకు ఇద్దరు చొప్పున గృహ సారథులను ఏర్పాటు చేయాలని మా నాయకుడు వైయ‌స్‌ జగన్‌ మొన్ననే చెప్పారు. ప్రతి ఒక్క  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ కార్యకర్త ఒక సైనికుడిలా, జగనన్న వదిలిన బాణంలా పార్టీ బలోపేతానికి పనిచేస్తాం తప్ప ఒకరిని వినియోగించుకోవాల్సిన అవసరం లేదు. 

కోవిడ్‌ సమయంలో ప్రాణాలను లెక్కచేయకుండా
ఆ రోజు మీరిచ్చిన వెయ్యి రూపాయల పింఛన్లు ఎక్కడా..? మేం ఇప్పుడు ఇస్తున్న 2500 పింఛన్లు ఎక్కడా..?. మీరు ఇచ్చిన 39 లక్షల పింఛన్లు ఎక్కడ.. మేము ఇస్తున్న 62.7 లక్షలు ఎక్కడ..?. పింఛన్ల పంపిణీతో పాటు వలంటీర్లు ప్రజల్లో అవగాహనను నింపి, లబ్ధిదారుల సమస్యలను పరిష్కరించడానికి వారు విశేషంగా కృషి చేస్తున్నారు. కోవిడ్‌ సమయంలో కంటైన్‌మెంట్‌ ప్రాంతాల్లో వారు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అందించిన సేవలు దేశమంతా చూసింది. చివరికి కోవిడ్‌తో ఎవరైనా అనాధలు చనిపోతే వారి మృతదేహాలను సైతం దహనసంస్కారాలు చేయడానికి ముందుకు వచ్చిన వారు వలంటీర్లు. రియల్‌ టైం గవర్నెన్స్‌ అంటే ఏంటో గ్రామ వార్డు వలంటీర్లు, సచివాలయ వ్యవస్థ ద్వారా నేడు చేసి చూపిస్తున్నాం.టీడీపీ వారు సంక్షేమ పథకాలే అమలు చేయలేదు కాబట్టి..ఇలాంటి వలంటీర్ల వ్యవస్థ వారికి అవసరమే లేదు. కేవలం జన్మభూమి కమిటీలతో దండుకోవడమే వాళ్లు చేసిన పని. అమ్మ ఒడి లాంటి గొప్ప సంక్షేమ పథకాన్ని టీడీపీ వారు ఒకటైనా చెప్పగలరా..?

సూర్యోదయానికి ముందే అవ్వాతాతలకు పింఛన్‌ చేరుస్తుంది ఆ వలంటీర్లే:
నెలకు టీడీపీ 400 కోట్లు పింఛన్ల కోసం ఖర్చు చేస్తే మేం 1600 కోట్లు ఖర్చు చేస్తున్నాం. టీడీపీ హయాంలో 39 లక్షల మందికి పింఛన్లు ఇస్తే, ఈరోజు మనందరి ప్రభుత్వం 62.70 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నాం. మేం ఏటా సుమారు 18వేల కోట్లు కేవలం పింఛన్లపైనే ఖర్చు చేస్తున్నాం.సూర్యోదయానికి ముందే ఈ పింఛన్లను గడప గడపకు చేరుస్తున్నది వలంటీర్లే. బాబు బుర్ర తక్కువ పరిపాలన అమోఘం, అద్భుతం అంటూ బుర్రకథలు చెప్పడానికి ఇలాంటి వికృత రాతలు రాస్తున్నారు. వలంటీర్‌ వ్యవస్థలో అన్ని పార్టీల వారున్నారు. కేవలం సేవా దృక్పథంతో పనిచేసే వారిని మాత్రమే మేం ఎంపిక చేస్తున్నాం. మీరు ఎన్ని పిచ్చి రాతలు రాసినా ఆ పచ్చ పార్టీ అధికారంలోకి రావడం కలేనని మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు.

తాజా వీడియోలు

Back to Top