అవకతవకలు నిరూపిస్తే దేనికైనా సిద్ధం

ఏ విషయంపైనైనా సమాధానం చెప్పడానికి ప్రభుత్వం సిద్ధం

టెండర్‌ ఫైనలైజ్ కాకుండా కోడిగుడ్ల‌లో అవ‌క‌త‌వ‌క‌లు ఎలా జ‌రిగాయి..?

ప్రభుత్వంపై పనిగట్టుకొని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు

‘జగనన్న గోరుముద్ద’ ద్వారా విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం

శుచి, శుభ్ర‌త‌తో రోజుకో వెరైటీతో పిల్లలకు ఆహారం అందిస్తున్నాం

మధ్యాహ్న భోజన పథకం గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదు

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

సచివాలయం: తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా పిల్లలకు మధ్యాహ్న భోజనం ఎలా పెట్టారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని, మురిగిపోయిన కోడిగుడ్లు, నీళ్ల సాంబారు, పురుగుల అన్నం పెట్టిన టీడీపీ నేతలు.. ఈరోజు నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్న జగనన్న గోరుముద్ద పథకం గురించి మాట్లాడే అర్హత లేదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ధ్వజమెత్తారు. మధ్యాహ్న భోజనం బాగోలేదని 2018లో నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో పిల్లలు ఏ విధంగా రోడ్డు మీదకు వచ్చి ధర్నాలు, దీక్షలు చేశారో చంద్రబాబు అనుకూల మీడియానే చూపించిందన్నారు. విద్యార్థులకు రుచికరమైన పౌష్టికాహారం అందిస్తున్న వైయస్‌ జగన్‌ ప్రభుత్వంపై పనిగట్టుకొని ప్రతిపక్షం అవాస్తవాలు ప్రచారం చేస్తోందని మంత్రి ఆదిమూలపు సురేష్‌ మండిపడ్డారు. 

సచివాలయంలో మంత్రి ఆదిమూలపు సురేష్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జగనన్న గోరుముద్ద పథకం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నామన్నారు. మధ్యాహ్న భోజనంపై స్వయంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అధికారులతో కూర్చొని పిల్లలకు అందించే పౌష్టికాహార మెనూను తయారు చేశారని, పిల్లలకు అందించే ఆహారం పట్ల సీఎం వైయస్‌ జగన్‌కు ఉన్న శ్రద్ధను అర్థం చేసుకోవచ్చన్నారు. ప్రభుత్వంపై ప్రతిపక్షం అవాస్తవాలు ప్రచారం చేస్తోందని, రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పేందుకు మీడియా ముందుకు వచ్చినట్టు మంత్రి ఆదిమూలపు సురేష్‌ చెప్పారు. 

టీడీపీ నేత పట్టాభి కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని, కుక్కతోక పట్టుకొని గోదారి ఈదినట్టుగా ఆయన వైఖరి ఉందని మంత్రి ఆదిమూలపు సురేష్‌ ధ్వజమెత్తారు. చిక్కీల వ్యవహారంలో ప్రభుత్వం చాలా పారదర్శకంగా వ్యవహరించిందని, విద్యార్థులకు చిక్కీల కోసం రూ.350కోట్లు ఖర్చు చేశామని, రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ప్రజాధనం ఆదా చేశామని చెప్పారు. ఇందులో ఎలాంటి అవినీతికి ఆస్కారం లేదన్నారు. విద్యార్థుల సంఖ్య పెరగడంతో ఎక్కువ మొత్తంలో చిక్కీలు కొనుగోలు చేశామన్నారు. ఏ విషయంపైనైనా సమాధానం చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రతి విద్యార్థికి పౌష్టికాహారం రుచికరంగా అందించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, వెజిటేబుల్‌ బిర్యానీ, కిచిడీ, స్వీట్‌ పొంగల్, వారికి 5 గుడ్లు అందిస్తున్న అతితక్కువ రాష్ట్రాల్లో ఏపీ ఒకటన్నారు.  

బాలాజీ గ్రౌండ్‌నట్‌ ఆయిల్‌కు ఎలిజిబులిటీ ఉందా అని మాట్లాడుతున్నారని, బాలాజీ గ్రౌండ్‌నట్‌ రిజిస్ట్రేషన్, మ్యానిఫ్యాక్చరింగ్‌ 2015లో మొదలైందన్నారు. ప్రతి ఏడాది రూ.50 కోట్లకు పైబడి సప్లయ్‌ చేస్తోందన్నారు. మరో సంస్థకు సంబంధించి నిబంధనలు సడలించారని మాట్లాడుతున్నారని, మారుతి అనే లిమిటెడ్‌ కంపెనీకి సంబంధించి మూడు సంవత్సరాలు జీఎస్టీ రిటర్న్స్‌ ఉండాలి. ఈ ఏడాది తగ్గించారని మాట్లాడుతున్నారన్నారు. 2020–21, 2021–22 టెండర్‌ కండీషన్స్‌ను మంత్రి మీడియాకు చూపించారు. జీఎస్టీ మూడు సంవత్సరాలు అడగలేదని, జీఎస్టీ సర్టిఫికెట్‌ రిజిస్ట్రేషన్, ఇన్‌కం ట్యాక్స్‌ రిటర్న్స్‌ అడిగామన్నారు. ఎక్కడా ఏ నిబంధన సడలించలేదని మంత్రి ఆదిమూలపు సురేష్‌ స్పష్టంచేశారు. 

పౌల్ట్రీ రైతులను కాకుండా ట్రేడర్స్‌కు పెద్దపీట వేస్తూ టెండర్లు అప్పగించారని ప్రభుత్వంపై అభియోగం మోపారని, కోడిగుడ్లకు సంబంధించి ఇప్పటి వరకు టెండర్‌ ఫైనలైజ్‌ కాలేదని మంత్రి చెప్పారు. పార్లమెంట్‌ వారీగా టెండర్లు పిలిచామని,  పిల్లలకు అందించే పౌష్టికాహారంపై సీఎం ఎన్ని సమావేశాలు పెట్టారో అర్థం చేసుకోవాలన్నారు. కోడిగుడ్లలో ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని నిరూపిస్తే  దేనికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. కోడిగుడ్ల గురించి టీడీపీ వారికి మాట్లాడే అర్హత  లేదని, టీడీపీ హయాంలో కోడిగుడ్ల కాంట్రాక్ట్‌ ఏ విధంగా నడిచింది. వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం వచ్చాక పారదర్శకంగా డిస్ట్రిబ్యూట్‌ అయ్యి.. క్షేత్రస్థాయిలోకి వెళ్లిందో గమనించాలన్నారు. 2018లో విద్యార్థులకు అందించే కోడిగుడ్ల కోసం ఒకటే టెండర్‌ ఉండేదని, అలా ఒకటే టెండర్‌ ఎలా ఉంటుంది..? అని ప్రశ్నించారు.
 

Back to Top