తాడేపల్లి: పంచాయతీ ఎన్నికల్లో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల్లో 81 శాతం మంది సర్పంచ్‌లుగా విజయం సాధించారని, సీఎం వైయస్ జగన్ సంక్షేమ పాలనకు మరోసారి పట్టం కట్టిన ప్రతి ఒక్క ఓటర్‌కు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నానని నీటిపారుదల శాఖ మంత్రి డాక్టర్ అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. నాలుగు విడతలుగా దాదాపు 13 వేల పైచిలుకు పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు జరిగితే 10,400 స్థానాలకు పైగా వైయస్‌ఆర్ సీపీ చేజిక్కించుకుందన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 16 శాతానికి పడిపోయిన తెలుగుదేశం పార్టీ.. పెద్ద విజయం సాధించామని చెప్పుకోవడం చంద్రబాబు దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. నాల్గవ విడతలో 41 శాతం సర్పంచ్‌లు గెలుచుకున్నామని చెప్పుకునే చంద్రబాబుకు దమ్మూ, ధైర్యం, సిగ్గు, ఎగ్గు ఏమైనా ఉంటే గెలిచిన టీడీపీ మద్దతుదారులకు కండువాలు కప్పి చూపించగలడా..? అని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం వైయస్ జగన్ పరిపాలన మీద ప్రజలకు విశ్వాసం రెట్టింపు అయ్యిందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తులు లేకపోయినా.. 81 శాతం వైయస్‌ఆర్ సీపీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించారంటే.. సీఎం వైయస్ జగన్ పాలనకు బ్రహ్మరథం పట్టారనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ‘చంద్రబాబు ప్రెస్‌మీట్ పెట్టి ప్రతి విడతకు అంచలంచెలుగా ఎదిగాం. టీడీపీ పుంజుకుంది.. వైయస్‌ఆర్ సీపీ పతనం మొదలైందని చెబుతున్నాడు. పంచాయతీ ఫలితాల్లో కేవలం 16 శాతం టీడీపీది. అది కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తే.. వైయస్‌ఆర్ సీపీకి చెందిన రెబల్స్ పోటీ చేయబట్టి ఆ 16 శాతం దక్కింది. లేదంటే సింగిల్ డిజిట్‌కు టీడీపీ పడిపోయేది. నాల్గవ విడతలో 41 శాతం కైవసం చేసుకున్నానని మాట్లాడేందుకు చంద్రబాబుకు సిగ్గుండాలి. ఎల్లో మీడియాను పెట్టుకొని ఇష్టానుసారంగా ప్రచారం చేసుకొని ప్రజల్లో అభూత కల్పన సృష్టించాలని చంద్రబాబు చూస్తున్నాడు. చంద్రబాబూ.. నీకు దమ్మూ, ధైర్యం, సిగ్గు, శరం ఏదైనా ఉంటే 41 శాతం అంటే 3200 సీట్లకు గాను 13 వందల సీట్లు వచ్చి ఉండాలి.. దమ్ముంటే విజయం సాధించిన 13 వందల మందికి టీడీపీ కండువా వేసి నిలబెట్టగలవా..? చంద్రబాబు పుట్టిన నియోజకవర్గం చంద్రగిరిలో 107 సర్పంచ్ స్థానాలకు టీడీపీ 3 గెలుచుకుంది. దాంట్లో 8 వార్డులు గెలుచుకున్నారని సంబరాలు చేసుకోవడానికి చంద్రబాబుకు సిగ్గుండాలి. పుట్టిన ఊరులో డిపాజిట్లు కోల్పోయినందుకు సిగ్గుపడాలి. వలసపోయిన కుప్పంలో 89 పంచాయతీలకు 74 వైయస్‌ఆర్ సీపీ మద్దతుదారులు గెలిచారు. స్వంత ఇలాకలోనే 20 శాతం సీట్లు సాధించలేని చంద్రబాబు.. నాల్గవ విడతలో 41 శాతం గెలిచాం అని చెప్పుకుంటున్నాడంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా..? సర్పంచ్ ఎన్నికల్లో 25 ప్రెస్‌మీట్లు పెట్టిన ఘనుడు మన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు. పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారని చంద్రబాబు మాట్లాడుతున్నాడు. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ఒకపక్క పోలీస్ యంత్రాంగం బాగా పనిచేసింది అని చెబుతున్నారు. చంద్రబాబు గతం గుర్తు చేసుకుంటే మంచిది. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టీడీపీ కార్పొరేటర్లు, మేయర్లు, జిల్లా పరిషత్ చైర్మన్‌లు ఏ విధంగా ప్రవర్తించారో గుర్తులేదా..? సాక్షాత్తు టీడీపీ శాసనసభ్యులు కలెక్టర్ల ముందున్న మైకులు తీసి విరగగొట్టిన సంఘటనలు చూశాం.. అది రావణకాష్టం, రౌడీ రాజ్యం.. అక్కడి నుంచి ఈ రోజు రామరాజ్యంలో వైయస్ జగన్ రాజ్యంలో సుభిక్షంగా దాదాపు 10,400 సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకుంటే.. ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకొని టీడీపీ పుంజుకుంది.. వైయస్‌ఆర్ సీపీ పతనం అయ్యిందని ప్రచారం చేయిస్తున్నాడు. కనీసం ఒక్క నియోజకవర్గంలోనైనా 50 శాతం సీట్లు సాధించాం.. అని చంద్రబాబు చెప్పుకోవడానికి ఎక్కడైనా ఉందా..? కుప్పంలో బాబును ఛీ కొట్టారు. త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లోనూ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు రిపీట్ అవుతాయి. చంద్రబాబు లాస్టుకు మతిస్థిమితం కోల్పోయి.. 2024కు బూతుల్లో మెజార్టీ వచ్చినా సంబరాలు చేసుకునే స్థాయికి వస్తాడు. తెలుగుదేశం పార్టీ.. అంపశయ్య మీది నుంచి చితిలో పడి తగలబడిపోయింది. కిందున్న పార్టీలన్నీ ప్రతిపక్షం మేమే అని చెప్పుకుంటున్నాయి. సెకండ్ ప్లేస్ కోసం కొట్టుకునే దిక్కుమాలిన స్థితిలో వారంతా ఉన్నారు. చంద్రబాబు ఏమీ చేయలేక స్వామీజీల మీద పడిపోయాడు. స్వరూపానందేంద్ర స్వామిపై దుష్ప్రచారాలు చేస్తున్నాడు. వెన్నుపోటు, క్షుద్రపూజలకు పేటెంట్ హక్కులు చంద్రబాబుకు మాత్రమే ఉన్నాయి. కొడుకును రాజకీయంగా పైకి తీసుకురావాలని.. దుర్గమ్మగుడిలో, శ్రీకాళహస్తిలో చంద్రబాబు క్షుద్రపూజలు చేయించడం అందరం చూశాం. దయచేసి చంద్రబాబుకు ఉన్న సర్వ హక్కులు (వెన్నుపోటు, అబద్ధాలు, క్షుద్రపూజలు) ఎవరికీ ఆపాదించవద్దని కోరుతున్నాం’ అని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు.