నిజం గెలుస్తోంది.. అందుకే బాబు జైలుకెళ్లాడు

40 ఏళ్లుగా నిజాన్ని సమాధి చేసిన బాబుపై నేడు నిజం గెలుస్తుంది

నిజం గెలవాల్సింది న్యాయస్థానాల్లో కానీ.. రోడ్ల మీద కాదు

బాబు అరెస్ట్ అయితే గుండెలు పగిలి మరణించారా..? ఇదో పెద్ద జోక్

అవినీతి చంద్ర‌బాబును అరెస్టు చేస్తే ఎక్కడైనా గుండెలు పగులుతాయా..?

జైల్లో బాబు భద్రతకు వచ్చిన ప్రమాదమేమీ లేదు.

చంద్రబాబు దొరికిన దొంగ.. చట్టానికి అతీతుడేం కాదు

బాలకృష్ణ పరామర్శిస్తానంటే.. భువనేశ్వరి ఎందుకు తెరపైకి వచ్చారు..?

నందమూరి వారసుల్ని నారా వారు ఇంకా తొక్కుతూనే ఉన్నారన్నది నిజం కాదా..?

నారా కుటుంబం భవిష్యత్తుకే గ్యారంటీ లేదు.. టీడీపీకి పట్టిన శని లోకేష్

ఇరిగేష‌న్ శాఖ మంత్రి అంబ‌టి రాంబాబు ధ్వ‌జం

తాడేప‌ల్లి: చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి నిజాలను పాతాళంలోకి తొక్కేశారని, ఇప్పుడు నిజం గెలుస్తున్నందునే చంద్రబాబు జైల్లో ఉన్నారని ఇరిగేష‌న్ శాఖ మంత్రి అంబ‌టి రాంబాబు అన్నారు. నిజం గెలవాలని కోరుకునేవారు 17A పట్టుకునే ఎందుకు తిరుగుతున్నారని ప్ర‌శ్నించారు.  నిజాన్ని ఓడించాలనే టీడీపీ ప్రయత్నం ఓడిపోతూనే ఉందని స్ప‌ష్టం చేశారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మంత్రి అంబ‌టి రాంబాబు విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి `నిజం గెలవాలి` పేరుతో యాత్ర చేయబోతున్నట్లు.. వారి కుమారుడు లోకేశ్‌ యువగళం యాత్ర ఆపేసి భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని కొనసాగిస్తారనే ప్రకటనలు చేశార‌ని, ఈ సంద‌ర్భంలో కొన్ని నిజాల్ని రాష్ట్ర ప్రజలతో పంచుకోవాల్సి ఉందని, నిజం గెలవాల్సిందేన‌ని మంత్రి అంబ‌టి రాంబాబు అన్నారు. 

మంత్రి అంబ‌టి ఇంకా ఏం మాట్లాడారంటే..
ఏనాటికైనా నిజం గెలవాలని రాష్ట్రం మొత్తం కోరుకుంటుంది. చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర్నుంచి ఇప్పటికీ.. అంటే, దాదాపు 40 ఏళ్లుగా జరుగుతున్న నిజం అందరూ తెలుసుకోవాలి. కాంగ్రెస్‌ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఎంటరై.. నిజాల్ని సాధ్యమైనంతవరకు అధఃపాతాళానికి తొక్కేసి- పాతేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి గద్దెదింపి పార్టీని లాక్కున్న తర్వాత అన్ని వ్యవస్థల్లోకి తన మనుషులను తెలివిగా చొప్పించి మేనేజ్‌ చేసి నిజాల్ని తొక్కేసే కార్యక్రమాన్ని చేపట్టాడు. ఇంతటి రాజకీయ మేనేజ్ మెంటులో సిద్ధహస్తుడు  ఎదుట ఇవాళ  నిజం గెలిచి చూపిస్తోంది. కాబట్టే.. ఆయన జైల్లోకి వెళ్లారు. 

17ఏ పట్టుకుని ఎందుకు వేలాడుతున్నారు
చంద్రబాబు ఇన్నాళ్లూ తొక్కేసిన నిజాలు ఇవాళ గెలుపు దిశగా పయనిస్తున్నాయి. కాబట్టే.. ఏసీబీ కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టులో నిజం గెలుస్తోంది. చంద్రబాబుకు సంబంధించిన ఏ పిటీషన్‌ వేసినా ఆయా కోర్టుల్లో ఫలితంలేకుండా పోతున్నాయి. నిజం గెలవాలని కోరుకునేవాళ్లు పీసీయాక్ట్‌ 17ఏ ని పట్టుకుని ఎందుకు వేలాడుతున్నారు..? అది నిజం కాదుకదా..? అదొక సాంకేతిక పాయింట్‌నే కదా..? ఎందుకు ఆ పాయింట్‌ మీదనే పోరాడుతున్నారు..? నిజాల్ని ఓడించాలనే మీ ప్రయత్నం ఏ కోర్టుకెళ్లినా.. ఎక్కడకెళ్లినా విఫలమవుతోంది తప్ప గెలిచే ప్రసక్తేలేదని చెబుతున్నాను. 

అది పెద్ద జోక్
విచిత్రమైన విషయమేమంటే, చంద్రబాబు అరెస్టయితే గుండెలు పగిలి కొందరు మరణించారంట. వారెవ్వా.. ఇది సాధ్యమా..? ఇదెంత జోక్‌. మోసాలు, దుర్మార్గాలు చేసి క్రైమ్స్‌కు పాల్పడే స్కామ్ స్టర్ నారా చంద్రబాబు అనే మనిషి అరెస్టైతే.. 105 మంది గుండెలు పగిలి చనిపోయారంటూ.. ఈనాడు, ఆంధ్రజ్యోతితో పాటు సో కాల్డ్‌ పచ్చమీడియా కట్టుకథలల్లి ఎమోషన్‌ క్రియేట్‌ చేసే ప్రయత్నాలకు పాల్పడుతున్నారు. అయితే, ఎక్కడా ఏమాత్రం ప్రజలు పచ్చమీడియా కోరుకునే విధంగా ఎవరూ భావోద్వేగానికి గురికావడం లేదు. 

బాబు అరెస్టుతో ఎన్నో ఆత్మలకు శాంతి
నిజం గెలవడం ప్రారంభమైన తర్వాత.. నారా చంద్రబాబు నాయుడు అరెస్టయిన తర్వాత చనిపోయినటువంటి ఆత్మలు శాంతిస్తున్నాయి. నందమూరి తారకరామారావు, నందమూరి హరికృష్ణ ఆత్మలతో పాటు వంగవీటి మోహనరంగా, పింగళి దశరథ్‌ రామ్ ఆత్మలు శాంతిస్తున్నాయి. గోదావరి పుష్కరాల్లో మరణించిన 29 మంది ఆత్మలు శాంతిస్తున్నాయి. నీ అధికార దుర్వినియోగం కోసం పాకులాడేక్రమంలో కందుకూరులో తొక్కిసలాటకు గురై చనిపోయిన 8 మంది ఆత్మలు శాంతిస్తున్నాయి. గుంటూరులో చనిపోయిన వారి ఆత్మలకు శాంతి లభిస్తుంది. ఒక నీచుడు, దుర్మార్గుడు దొంగలా జైలుకెళ్తే అతని నీచత్వానికి బలైన వారి ఆత్మలు శాంతిస్తాయి తప్ప ఏ ఒక్కరికీ గుండెలు పగలవని గుర్తెరగాలని కోరుతున్నాను. 

‘నందమూరి’పై ‘నారా’వారి కుట్ర అంతరార్థమిది
చంద్రబాబు జైల్లో కూర్చొని కుట్రలు చేస్తున్నాడు. ప్రముఖ చలనచిత్ర నటుడు, బాబు బావమరిది నందమూరి బాలకృష్ణ రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో ములాఖాత్‌ అయి బయటకు రాగానే ఏమన్నాడో మీ అందరికీ తెలుసు కదా..? బాబు అరెస్టుతో మరణించిన వారి కుటుంబాలన్నింటినీ, తాను వ్యక్తిగతంగా కలిసి పరామర్శిస్తానని ప్రకటించాడు. మరి, ఆయనెందుకు పరామర్శ యాత్రకు బయల్దేరడంలేదు. నారా భువనేశ్వరి ఎందుకు పరామర్శిస్తానని చెబుతున్నారు..? ఇది ములాఖాత్‌లో జరిగిన కుట్ర కాదా..? బాలకృష్ణ పలకలరించడం మొదలుపెడితే, నారా వారి చేతుల్లోని తెలుగుదేశం పార్టీ నందమూరి వారికి హస్తగతమౌతుందనే భయంతో చంద్రబాబు, భువనేశ్వరి కలిసి చేసిన కుట్ర కాదా..? అని ప్రశ్నిస్తున్నాను.

బాబు జీవితమంతా కుట్రలమయం
నిజం నిప్పులాంటిది. దాన్ని ఎన్నాళ్లూ అణచాలని ప్రయత్నిస్తే.. మనం అణచలేం. చంద్రబాబు జీవితమంతా కుట్రలమయమే. ఎన్టీరామారావు వెన్నుపోటు దగ్గర్నుంచి ఆయన మరణం వరకు ఆయన కుట్రల కొనసాగింపు జరిగింది. ఎన్టీఆర్ మరణం  తర్వాత నందమూరి హరికృష్ణ బతికున్నప్పుడు ఆయన్ను భుజానికెత్తుకున్నాడు. ఆయన మంత్రి అయ్యాడు. హిందూపురంలో గెలిచిన తర్వాత ఆయన మంత్రి పదవి తీసేశాడు. అంటే, అవసరం తీరినతర్వాత ఎవర్నైనా పక్కకు తోసేసే రకం చంద్రబాబు. కనుక, ఇప్పుడు బాబు అరెస్టుతో నందమూరి హరికృష్ణ ఆత్మకూ శాంతి లభిస్తుంది. 

రక్తికట్టని బాబు సింపతీ డ్రామాలు 
బాబు ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు ఆవేదన, ఆందోళన అంతా ఒక నాటకం- బూటకం. నిజానికి ఆయన సంపూర్తిగా ఆరోగ్యంగా ఉన్నట్లు ఈరోజు ఏసీబీ కోర్టు ఎదుట హాజరుపరిచిన క్రమంలో వెల్లడైన వాస్తవం. ఆయన్ను జడ్జి కూడా ఆరోగ్యం గురించి అడిగారు. అయితే, తనకు పాతిక,ముఫ్పై ఏళ్లుగా ఆరోగ్య సమస్యలున్నాయని మాత్రమే చెప్పారు తప్ప కొత్తగా అనారోగ్యమేదీలేదన్నారు. ఆయన అరెస్టయిన మొదట్నుంచీ వారి పార్టీ నేతలు, కుటుంబ సభ్యులు కలిసి చాలా సింపతీ డ్రామాలకు ప్రయత్నించారు. సెక్యూరిటీ లేదన్నారు. దోమలన్నారు. స్కిన్‌అలెర్జీ ...అంటూ నానా రచ్చ చేశారు. ఏది చేసినా వారి సింపతీడ్రామాలు మాత్రం రక్తికట్టడం లేదు. ఎందుకంటే, వాస్తవాల్ని ప్రజలు గమనిస్తున్నారు. నిజం ఏనాటికైనా గెలుస్తుంది కాబట్టి.. మీ దుర్మార్గమైన ఆలోచనలు, కుట్రల్ని కట్టిపెట్టాలని మనవి చేస్తున్నాను.

మీకే భవిష్యత్తు లేదు.. మీరెవరికి గ్యారంటీ ఇస్తారు? 
చంద్రబాబు జైలు నుంచి విడుదలయ్యే పరిస్థితులు కనుచూపు మేరలో కనిపించడంలేదని మేధావులు, న్యాయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే, ఆయన అవినీతికి సంబంధించిన ఆధారాలు అంత పకడ్బందీగా ఉన్నట్లు వారంతా తేల్చి ప్రజలకు కళ్లకు కట్టినట్లు డిబేట్ల ద్వారా వివరిస్తున్నారు. ఈక్రమంలో రూ.కోటాను కోట్లు తీసుకున్న ఢిల్లీ న్యాయవాదులు సైతం బహుశా నారా లోకేశ్‌కు తన తండ్రి భవిష్యత్తు గురించి చెప్పి ఉంటారనుకుంటాను. అందుకనే, రాజకీయాల్లో భవిష్యత్తు లేని నారా లోకేశ్‌ భవిష్యత్‌కు గ్యారెంటీ అని తాపత్రయపడుతున్నారు. ఇన్నాళ్లూ యువగళం అంటూ యాత్ర చేసిన ఆయన  ఇప్పుడు భవిష్యత్తుకు గ్యారంటీ అని ఆరాటపడటంలో అర్ధమేమీలేదు. ఆయన ఆరాటం, పోరాటం ప్రజాక్షేత్రంలో అభాసుపాలవడం ఖాయం.  

ప్రభుత్వంపై నిందలేయడం మర్యాద కాదు
న్యాయస్థానాల్లో విన్నవించాల్సిన విషయాల్ని అక్కడ వాదించకుండా.. రాజమండ్రి సెంట్రల్‌ జైలు వద్ద ప్రస్తావిస్తూ టీడీపీ నేతలు, చంద్రబాబు కుటుంబ సభ్యులు గందరగోళపరుస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఇష్టానుసారంగా నోరుపారేసుకుంటున్నారు. ఇప్పటికైనా వారు నిజాల్ని గ్రహించకుంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాను. చంద్రబాబు ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో జ్యుడీషరీ కస్టడీలో ఉన్నారు. జైళ్ల అధికారులకు కోర్టుల నుంచి అందే ఆదేశాల మేరకే చంద్రబాబు విషయంలో బాధ్యతగా ఉంటారు మినహా ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండదు. ముఖ్యమంత్రి, హోంమంత్రి ఆదేశాలతో జైళ్లశాఖ అధికారులు నడుచుకునే పరిస్థితి ఉండదని తెలుసుకోవాలని మనవిచేస్తున్నాను. మీ పార్టీకి పట్టిన శని లోకేశ్‌.. కనుక, టీడీపీ నాయకులు ఇప్పటికైనా జాగ్రత్తపడాలని కోరుతున్నాను. 

Back to Top