తాడేపల్లి: చంద్రబాబునాయుడు ఇప్పటికీ, ఎప్పటికీ మాజీ సీఎంగానే ఉంటాడని, మళ్లీ సీఎం కాలేడని, బాబుకున్న అధికార పిచ్చి, కుల పిచ్చి కరోనా కంటే ప్రమాదకరమని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఉమ్మడి, విభజిత ఆంధ్రప్రదేశ్‌కు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి.. రాయలసీమకు నువ్వు చేసిందేంటీ..? అని చంద్రబాబును ప్రశ్నించారు. రాయలసీమ వాసులు పౌరుషవంతులు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవారనే నానుడి ఉందని, అలాంటి సీమలో గుంటనక్క లాంటి చంద్రబాబు ఎట్లా పుట్టాడో అర్థం కావడం లేదన్నారు. చంద్రబాబు రాజ్యసభ సీట్లు ఇచ్చాడో.. అమ్ముకున్నాడో టీజీ వెంకటేష్‌ను అడిగితే తెలిసిపోతుందన్నారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి అంబటి రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. మంత్రి అంబటి రాంబాబు ఏం మాట్లాడారంటే.. చంద్రబాబు 14 ఏళ్లు రాష్ట్రాన్ని పరిపాలించి ఏం చేశాడో కూడా చెప్పుకోలేడు. సీఎం వైయస్ జగన్ సుపరిపాలన చూసి చిందులు, ఓర్వలేనితనం, దూషించడం చేస్తున్నాడు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీబీఐ గురించి ఏమన్నాడో.. ఆయన మర్చిపోయినా.. ప్రజలు మర్చిపోరు. సీబీఐ, ఈడీలు ఈ రాష్ట్రానికి ప్రవేశించడానికి వీల్లేదు.. వారు వస్తే మాపై దండయాత్ర చేసినట్టు మాట్లాడిన చంద్రబాబు.. ఆ సంస్థల గురించి ఈరోజు గొప్పగా మాట్లాడుతున్నాడు. రెండు నాల్కల ధోరణితో ఊసరవెల్లిలా మాట్లాడుతున్నాడు. అధికారం రాదని తెలిసి కూడా రాయలసీమకు వెళ్లి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు. రాజ్యసభ సీట్లను అమ్ముకున్నారని, పక్క రాష్ట్రంవాళ్లకు ఇచ్చారని ఆరోపిస్తున్నాడు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రాజ్యసభ సీట్లు ఏం చేశావ్.. టీజీ వెంకటేష్‌కు సీటు ఇచ్చావా.. అమ్మావా..? ఎంత తీసుకొని టీజీ వెంకటేష్‌కు సీటు ఇచ్చాడో పక్కకు పిలిచి అడిగితే చెబుతాడు. నీ హయంలో సురేష్‌ప్రభు, నిర్మలా సీతారామన్‌కు ఎలా ఇచ్చావ్..? నువ్వు చేస్తే రైటా..? మేము చేస్తే తప్పా..? సుజనా చౌదరి, సీఎం రమేష్ ఎంత మేధావులు అని సీట్లు ఇచ్చావ్..? డబ్బు సంచులు మోశారనే ఇచ్చావా..? మేము బీసీ జాతీయ నాయకుడిగా గుర్తించి కృష్ణయ్యకు ఇచ్చాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు బాగుపడాలని సీఎం వైయస్ జగన్ సీట్లు ఇస్తుంటే చంద్రబాబుకు కడుపుమంట. సీట్లు అమ్ముకునే లక్షణం మాకు లేదు. చంద్రబాబు అమ్మగలడు.. కొనగలడు.. తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో పచ్చిగా దొరికిపోయావే.. దానికి భయపడి నీ పార్టీని బీజేపీకి కొన్నాళ్లు తాకట్టుపెట్టిన ప్రబుద్ధుడివి. సీఎం గురించి మాట్లాడే నైతిక అర్హత చంద్రబాబుకు లేదు. సీఎం వైయస్ జగన్ సత్తా గురించి చంద్రబాబు మాట్లాడుతున్నాడు. నీ కుమారుడికి, నీ దత్త పుత్రుడికి, నీకు సత్తా లేదు. సీఎం వైయస్ జగన్‌కు అద్భుతమైన సత్తా ఉంది కాబట్టే ఒంటి చేత్తోనే తుక్కుతుక్కుగా నిన్ను ఓడించాడు. సత్తా కలిగిన నాయకుడు కాబట్టే ఇవాళ కూడా ఒక్కడినే పోటీ చేస్తాను రండీ అని సవాల్ చేస్తుంటే.. పొత్తుల కోసం నువ్వు పాకులాడుతున్నావ్. కర్నూలు వెళ్లి రాజధాని గురించి మాట్లాడుతున్నాడు. నేనే రాజధాని రాకుండా కుళ్లు, కుతంత్రాలు చేసి ఆపేశానని చెప్పకుండా.. వచ్చిందా అని ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నాడు. మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలని సీఎం వైయస్ జగన్ మూడు రాజధానులను ప్రకటిస్తే.. అమరావతి కోసం గుంటనక్క చేష్టలు చేసి చంద్రబాబు అడ్డుకున్నాడు. కుప్పంలో చంద్రబాబు ఇల్లు కట్టుకునే ఆలోచన కల్పించింది సీఎం వైయస్ జగన్. చంద్రబాబును కుప్పం ప్రజలు కూడా విశ్వసించని పరిస్థితి వచ్చిందంటే.. సీఎం వైయస్ జగన్ సుపరిపాలన వల్లనే. రాయలసీమలో శంకుస్థాపన చేసి ప్రారంభించిన ఒక్క ప్రాజెక్టు పేరు చంద్రబాబు చెప్పగలడా..? రాయలసీమకు వెళ్లి మంత్రి బుగ్గన గురించి చంద్రబాబు మాట్లాడుతున్నాడు.. బుగ్గనకు మొగుడ్ని తెచ్చాడంట.. పెళ్లాల భాష మాట్లాడుతాడు.. మేము మాట్లాడితే.. బావురుబావురుమని ఏడుస్తాడు. సీఎం వైయస్ జగన్ కరోనా కంటే ప్రమాదకరమైన పాలన చేస్తున్నాడంట.. చంద్రబాబుకున్న అధికార పిచ్చి, కుల పిచ్చి కరోనా కంటే ప్రమాదకరమని గమనించే ప్రజలు అవమానకరమైన ఓటమిని రుచి చూపించారు. చంద్రబాబు మాజీనే.. మళ్లీ సీఎం కాలేడు’ అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.