చెత్తప‌నులు చేసిన చంద్రబాబును ఈనాడు ప్రశ్నించదా..?

పోలవరం ఎవరివల్ల ఆలస్యమైంది..? ప్రాజెక్టును ఎవరు ఏటీఎంగా మార్చుకున్నారు..?

బాబు కమీషన్ల యావ వల్లే కాఫర్ డ్యామ్, డయాఫ్రంవాల్ లు దెబ్బతిన్నాయి

పోలవరం ప్రాజెక్టులో ఈజీగా పూర్తయ్యే పనులు చేసి, కమీషన్లు పుచ్చుకున్నది చంద్రబాబే

స్పిల్ వే పూర్తికాకుండానే కాఫర్ డ్యాం, డయాఫ్రంవాల్ కట్టింది బాబు కాదా..?

పోలవరం పూర్తిచేసేందుకు వైయ‌స్ఆర్ సీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది

పోలవరం, ఆర్టీసీ ఛార్జీలపై ఎల్లో మీడియావి దొంగ మాటలు-దొంగ రాతలు.

జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు

తాడేప‌ల్లి: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌, వైయ‌స్ఆర్ సీపీ ప్ర‌భుత్వంపై ఈనాడు ప‌త్రిక విషం కక్కుతోందని, ప్ర‌భుత్వంపై దుష్ప్ర‌చారం చేస్తూ.. ప్ర‌జ‌ల్లో నెమ్మ‌దిగా విషం ఎక్కించే ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని ఇరిగేష‌న్ శాఖ మంత్రి అంబటి రాంబాబు మండిప‌డ్డారు. వాస్తవాలు ఏంటో తెలుసుకుంటే మంచిదని హితవుపలికారు. చంద్ర‌బాబు కమీషన్ల యావ వల్లే కాఫర్ డ్యామ్, డయాఫ్రంవాల్ లు దెబ్బతిన్నాయ‌న్నారు. స్పిల్ వే పూర్తికాకుండానే కాఫర్ డ్యాం, డయాఫ్రంవాల్ కట్టింది బాబు కాదా..? అని ప్ర‌శ్నించారు. చంద్రబాబు చేసిన తప్పుడు పనుల వల్లే  రూ. 800కోట్లు మళ్లీ తిరిగి ఖర్చు పెట్టాల్సి వస్తుందన్నారు. చెత్త‌ప‌నులు, పిచ్చి ప‌నులు చేసిన చంద్ర‌బాబును ఈనాడు రామోజీరావు ప్ర‌శ్నించ‌రా..? అని నిల‌దీశారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మంత్రి అంబ‌టి రాంబాబు విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు.  

ఈ సంద‌ర్భంగా మంత్రి అంబటి రాంబాబు ఇంకా ఏమన్నారంటే..

ఈనాడు, దానికితోడు ఎల్లో మీడియాకు చెందిన కొన్ని పత్రికలు, టీవీ ఛానళ్ళు..  సందు దొరికినా, దొరకపోయినా వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌ మీద బురద చల్లాలనే ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగానే, ఇవాళ ఈనాడు దినపత్రిక పోలవరం పునరావాసం రెండు ముక్కలు.. అంటూ పెద్ద బ్యానర్‌ హెడ్డింగ్‌ పెట్టారు. అంతేకాకుండా పురగోతి 1.46 శాతం మాత్రమేనని, ఇసుక కోతకు, గుంతలు పూడ్చేందుకు, డ్రెజ్జింగ్‌ పరిష్కారంగా రూ.800 కోట్లు అదనంగా ఖర్చు పెట్టాల్సి వచ్చిందని ఈనాడు పత్రిక వ్యంగ్యంగా రాసింది. పోలవరం ప్రాజెక్ట్‌ పై విషం చిమ్మి, ప్రజల్లో ఒక గందరగోళం కల్పించే ప్రయత్నం ఈనాడు చేస్తుంది. స్లో పాయిజన్‌లా వార్తలు రాసి పోలవరం విషయంలో సీఎం వైయ‌స్ జగన్‌, వైయస్సార్‌ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పిదాలు చేస్తుందనే ఒక భావన ప్రజల్లో కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.

అదే చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం శరవేగంతో పోలవరం, ఒక్కరోజులోనే అద్భుతమైనటువంటి వేల లక్షల అడుగులు కాంక్రీటు వేసేశారంటూ వార్తలు రాశారు. వాస్తవాలను వాస్తవాలుగా చెప్పే ప్రయత్నం చేస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మా ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ నిత్యం ప్రాజెక్ట్‌ పనులను పర్యవేక్షిస్తున్నారు. వాస్తవానికి ప్రాజెక్టుకు సంబంధించి చాలా ఇబ్బందులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయాలి, ఇంకా సీడబ్ల్యూసీ క్లియరెన్స్‌ ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి అయిన పోలవరంపై బురదచల్లే ప్రయత్నాలు చేయవద్దని, వాటిని మానండని  ముఖ్యమంత్రి ఇటీవల శాసనసభలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు.

ప్రపంచంలో ఏ ప్రాజెక్టు అయినా దశలవారీగానే పూర్తి చేస్తారు
ఈ ప్రపంచంలో ఏ ప్రాజెక్ట్‌ నిర్మాణం చేపట్టినా కొన్ని దశలలో పూర్తి చేస్తారు. ఒక్కసారిగా ఏ ప్రాజెక్ట్‌ పూర్తికాదు. అలా చేస్తే ప్రమాదం కూడా. అనేక ప్రాజెక్టుల నిర్మాణం నాగార్జున సాగర్‌, శ్రీశైలం, సోమశిల ప్రాజెక్టులు దశలవారీగానే జరిగాయి. ఒక్కసారే ప్రాజెక్ట్‌ను నింపేస్తే ప్రమాదం జరుగుతుంది. దానికి ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి. కాబట్టి దశలవారీగా ప్రాజెక్ట్‌ నిర్మాణం జరుగుతుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కాదు. సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ తీసుకునే నిర్ణయం. అదేవిధంగా పీపీఏ (పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ కమిటీ) కూడా కలిసి ఒక నిర్ణయం ప్రకారం ప్రాజెక్టు పనులను చేస్తారు. సెంట్రల్ వాటర్ కమిషన్ వారు డ్యాం సెక్యూరిటీ అంశాలను దృష్టిలో పెట్టుకుని చేసిన సూచనలను ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది. 

పోలవరం ప్రాజెక్ట్‌ ను.. 45.72 మీటర్లు ఎత్తులో మొత్తం కెపాసిటీ నిండుతుంది. అంత కెపాసిటీలో ఒకేసారి నీళ్ళు నింపి పునరావాసం కల్పించడం సాధ్యం కాదు. కాబట్టి సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ రెండు దశలుగా డివైడ్‌ చేశారు. 41.15 మీటర్లకు ఏఏ గ్రామాలు అయితే ముంపునకు గురి అవుతాయో ముందుగా ఆ గ్రామాలకు పునరావాసం పూర్తి చేసి, 41.15 మీటర్ల వరకూ నీటిని నింపి ప్రాజెక్ట్‌ను పరీక్షిస్తారు. ఇది మినిమం డ్రా డౌన్‌ లెవల్‌ వరకూ నింపగలిగితే కుడి, ఎడమ కాల్వలకు నీరు సరఫరా అవుతుంది. అప్పుడు దానిలో ఏమైనా లోపాలు ఉంటే, వాటిని చూసిన తర్వాత, దాన్ని పెంచుకుంటూ వెళ్లి పూర్తి స్థాయిలో పునరావాసం కల్పిస్తారు. దీన్ని  చిత్రంగా ఈనాడు వాళ్లు పునరావాసం రెండు ముక్కలంటూ వ్యంగ్యంగా రాతలు రాశారు. ఏంటిది? ధర్మమేనా ఇది? 

రూ.800 కోట్లు ఖర్చు పెట్టడానికి కారకుడు చంద్రబాబే
ఒక అద్భుతమైన ప్రాజెక్ట్‌ను ప్రభుత్వం చిత్తశుద్ధితో పూర్తి చేస్తుంటే ప్రజల్లో ఏదో అలజడి కలిగించడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారని ప్రజలకు కూడా అర్థం అవుతోంది. చంద్రబాబు చేసిన తప్పుడు పనుల వల్లే  రూ. 800కోట్లు మళ్లీ తిరిగి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దీనికి కారకుడు చంద్రబాబే.  ఆ విషయాన్ని ఈనాడు ఎందుకు రాయడం లేదు?, ఎందుకు దాస్తున్నారు..?.  టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ళలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఏ క్రిటికల్‌ కాంపోనెంట్స్‌కు, క్లిష్టమైన పనులు చేయకుండా, కేవలం కమీషన్లు వచ్చే పనులు, సులువుగా పూర్తి అయ్యే పనులు మాత్రమే చేపట్టారు. ఎందుకంటే అవి తొందరగా అయిపోతే డబ్బులు వస్తే, తొందరగా కమిషన్లు కొట్టేసి, ఆ డబ్బులతో చంద్రబాబు కులకవచ్చు అనే ఉద్దేశమే ఇందుకు కారణం.

ఆ విషయాన్ని మాత్రం ఈనాడు రాయదు..
పోలవరం ప్రాజెక్ట్‌ను చంద్రబాబు నాయుడు ఏటీఎంగా ఉపయోగించుకున్నారని సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే అన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు రాబట్టడం,  కాంట్రాక్టర్లతో పనులు చేయించడం, అందులో కమిషన్లు తీసుకుని తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీ నాయకులకు ఆదాయ వనరుగా మార్చుకునేటటువంటి చెత్త పనులు చేశారు. టెక్నికల్‌గా ముందు చేయాల్సిన పనులు వెనక.. వెనక చేయాల్సిన పనులు ముందు చేయడం వల్లే ఇవాళ రూ. 800కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి బాధ్యులు తెలుగుదేశం ప్రభుత్వమే. ఆ విషయాన్ని మాత్రం ఈనాడు రాయదు. రామోజీరావుకి అది పట్టదు. సీఎం వైయ‌స్ జగన్ పరిపాలన దగ్గరకు వచ్చేసరికి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల డబ్బులు రూ. 800కోట్లు అదనంగా ఖర్చు పెట్టాల్సి వచ్చిందని రాస్తారు. ఇలా రాతలు రాయడం ఎంత దుర్మార్గం, ఇది ధర్మమేనా అని అడుగుతున్నాను. 

ఇక ఇసుక కోత, గుంతలు, డ్రెడ్జింగ్‌ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే.. భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా ఇసుక పొరలు ఎక్కువగా ఉండటంతో పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి నది డైరెక్షన్‌ మార్చి అక్కడొక స్పిల్‌వే కట్టి,  అక్కడ రిజర్వాయర్‌ డ్యామ్‌ కట్టి ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి, స్పిల్‌ వే పూర్తి చేసి, దానిద్వారా వాటర్‌ పంపించి, ఆ తర్వాత డ్రయాఫ్రమ్‌ వాల్ కట్టి అనంతరం కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణం చేయాలి. చంద్రబాబు నాయుడు ఏం చేశారంటే.. స్పిల్‌వే పట్టించుకోకుండా, కేవలం కాఫర్‌ డ్యామ్‌లు కట్టడం, బిల్లులు చేసుకోవడం, డబ్బులు తీసుకోవడం చేశారు.

రెండు గ్యాప్‌లు ఉండటం వల్ల.. గ్యాప్‌-1లో ప్లస్‌ 23 నుంచి మైనస్‌ 12 వరకూ దాదాపు 35మీటర్ల మందం కోతకు గురైంది. గ్యాప్‌-2లో ప్లస్‌ 8 నుంచి మైనస్‌ 12 వరకూ దాదాపు 20 మీటర్ల మందం దిగువ కాఫర్‌ డ్యామ్‌ మైనస్‌ 22.5 మీటర్ల వరకూ కోతకు గురైంది. దీంతో వాటి మరమ్మతుల నిమిత్తం అదనంగా 800కోట్లు ఖర్చు పెట్టాల్సిన అనివార్యమైన పరిస్థితి వస్తే .. ఈనాడు దినపత్రిక ఇవాళ మెయిన్‌ పేజీలో రెండు ముక్కలు.. మూడు ముక్కలు అని రాస్తారా?  చంద్రబాబు, వారి గెజిట్ పత్రిక అయిన ఈనాడు రామోజీరావు కలిసికట్టుగా చేసే కుట్రలను ప్రజలు అర్థం చేసుకోవాలి.

ప్రపంచంలోనే తొలిసారి ఇలా జరగడం..
కాఫర్‌ డ్యామ్‌లు నిర్మాణం చేసి, స్పిల్‌వే పూర్తికాకుండా ఉండటంతో విపరీతమైన వరదలు రావడం సహజం. 2019లో విపరీతమైన వరద నీరు రావడంతో ఒక్కసారిగా కాఫర్‌ డ్యామ్‌కు 14 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిపడింది. దాంతో డయాఫ్రమ్‌ వాల్ కొట్టుకుపోవడం, కాఫర్‌ డ్యామ్‌లు దెబ్బతినడంతో వాటిని మళ్లీ పునర్‌ నిర్మాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతవరకూ భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఇలాంటి ఘటన ఎక్కడా జరగలేదు. ప్రపంచంలోనే తొలిసారి ఇలా జరగడం.. ఈ ఘనత నారా చంద్రబాబు నాయుడుదే, తెలుగుదేశం పార్టీదే. దీనికి బాధ్యులు చంద్రబాబు కాదా? దాన్ని ఈనాడు, ఎల్లో మీడియా రాయదా? అదేదో మా బాధ్యత అన్నట్లు రాతలు రాస్తున్నారు.

చెత్త పనులు చేసిన బాబును రామోజీ ప్రశ్నించరు
ఇంత పిచ్చి, చెత్త పనులతో రాష్ట్రానికి, కేంద్రానికి నష్టం కలిగించిన చంద్రబాబును ఈనాడు రామోజీరావు ప్రశ్నించరా..? మీరు చెప్పేదొకటి.. అక్కడ జరిగింది ఒకటి. ఎంతసేపు సీఎం వైయ‌స్ జగన్‌ మీద, మా ప్రభుత్వం మీద నిందలు వేసి, ప్రజల్ని గందరగోళం చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వైయ‌స్‌ రాజశేఖర్‌ రెడ్డిప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్ట్‌ను చిత్తశుద్ధితో పూర్తి చేయాలని, రైతులకు నీరందేలా ప్రయత్నాలు చేస్తుంటే.. ఆయనపై  ప్రతిరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5.. కట్టు కథలు వండి వార్చి బురద చల్లే కార్యక్రమాలు చేస్తున్నాయి. 

పోలవరం ప్రాజెక్ట్‌ను ఇటీవలే కేంద్ర జలశక్తి మంత్రి, ముఖ్యమంత్రి సందర్శించారు. ఆర్‌అండ్‌ఆర్‌ పనులు జరుగుతున్న పునరావాస కాలనీలలో నిర్మాణం పనులు చాలా గొప్పగా జరుగుతున్నాయని జలశక్తి మంత్రి ప్రశంసించారు. నిరాశ్రయులకు ఇళ్లు కట్టించే కార్యక్రమంలో భాగంగా, డీబీటీ ద్వారా డైరెక్ట్‌గా వారి బ్యాంకు ఖాతాల్లోనే డబ్బులు వేసేలా కేంద్రాన్ని ముఖ్యమంత్రి ఒప్పించడం అనేది హర్షించదగ్గ విషయం. మీ మాదిరిగా డబ్బులు కాజేయాలనే ఉద్దేశం మాకు లేదు. మధ్యలో కాంట్రాక్టర్లు ఎవరూ ఉండరు. వారికి ఇవ్వాల్సిన డబ్బులు డీబీటీల ద్వారా లబ్ధిదారులకు నేరుగా వేయాలనే  తాపత్రయంతో కేంద్రాన్ని ముఖ్యమంత్రి ఒప్పించారు. 

కాఫర్‌ డ్యామ్‌ దెబ్బతినిపోయిన తర్వాత రీడిజైన్స్‌ తొందరగా చేయాలి. పగిలిపోయినదాన్ని మళ్లీ ఎలా చేయాలనే దానిపై ఇంజనీర్లు కూడా అధ్యయనం చేస్తున్నారు. కేంద్రంతో ముఖ్యమంత్రి మాట్లాడారు. సాధ్యమైనంత త్వరలో రీడిజైన్స్‌ తీసుకువచ్చే ప్రయత్నంలో ఉన్నాం. సమయం వచ్చినప్పుడు అన్నివిషయాలు మాట్లాడతాం. పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తి చేయడానికి మా ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోంది.

ఆర్టీసీ టికెట్లపై డీజిల్ సెస్ విధిస్తే రాద్ధాంతమా..?
ఆర్టీసీ ఛార్జీలు పెంచేశామని ఎల్లో మీడియాలో ఇష్టం వచ్చినట్టు కట్టు కథలు రాస్తున్నారు. అనివార్య పరిస్థితుల్లో కరెంట్‌ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు స్వల్పంగా పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం దాదాపు, ప్రతిరోజూ డీజిల్ ధరలు పెంచుకుంటూ పోతుంది. డీజిల్ ధర రూ. 67 నుంచి రూ. 107కు పెరిగిందని తెలుగుదేశం  పార్టీ ఛానళ్ళకు, పత్రికలకు తెలియదా..? అలా పెరిగినప్పుడు అంతో, ఇంతో సెస్ రూపంలోనో, మరో రూపంలోనో  కొంతమేరైనా భారం మోపడం తప్ప మరో మార్గం ఉండదు. దానికే మేమేదో ఆర్టీసీ ఛార్జీలను అడ్డగోలుగా పెంచేశామని, ప్రజలను లూటీ చేసేస్తున్నామని,  ప్రజల జేబులు కొట్టేస్తున్నామంటూ అడ్డగోలు రాతలు రాస్తూ చంద్రబాబుకు రాజకీయంగా మేలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అయినా ఇదే చేసింది. ఏ ప్రభుత్వం అయినా ఇంతే చేస్తుంది. ఈ సెస్ వల్ల వచ్చే ఆదాయం ప్రభుత్వ ఖజానాలోకి వెళితే, ఈనాడుకు బాధ ఎందుకో అర్థం కావడం లేదు. 

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా సీఎం వైయ‌స్‌ జగన్‌ అధికారంలోకి రాగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి, ప్రతి నెలా రూ. 3000 కోట్లు ఆర్టీసీ ఉద్యోగుల జీతభత్యాలకు ప్రభుత్వం ఇస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఈ పెరిగిన జీతాలన్నీ ప్రభుత్వమే ఇస్తున్నా, ప్రభుత్వానికి ఏ ఒక్క రూపాయి ఆదాయం పెరగరాదన్నది, అన్నివిధాలుగా ప్రభుత్వం నష్టపోవాలన్నది ఈనాడు రామోజీరావు విధానంగా ఉంది.  ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా..?. 

ప్రభుత్వంపై ఏదోవిధంగా విషం చిమ్మాలనేలా చంద్రబాబు, రామోజీరావు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లు కలిసికట్టుగా చేసే ప్రయత్నాలను ప్రజలు నమ్మరని, నమ్మవద్దని మనవి చేస్తున్నాం. రాష్ట్రంలో ప్రతినీటి బొట్టు రైతులకు అందచేయాలని, వైయ‌స్‌ రాజశేఖర్‌ రెడ్డి ప్రారంభించిన జలయజ్ఞాన్ని త్వరితగతిన పూర్తి చేసేలా ప్రయత్నాలు చేస్తున్న రాష్ట్రప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరుతున్నాం. తాగు, సాగునీటి ప్రాజెక్ట్‌లను త్వరితగతిన పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యం. 

పోరస్‌ అగ్నిప్రమాద ఘటనలో ప్రభుత్వం ఎంత వేగంగా స్పందించిందో, ఎంత వేగంగా చర్యలు చేపట్టింది అన్నది ఎవరైనా చూడాలి.  గతంలో ప్రమాదాలు జరిగినప్పుడు అప్పటి ప్రభుత్వాలు ఎలా స్పందించాయి? ఇప్పటి మా ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో అన్నది బేరిజు వేసుకుంటే తెలుస్తుంది. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులకు ప్రభుత్వం నుంచి రూ.25లక్షలు, ఫ్యాక్టరీ తరపున రూ.25 లక్షలు పరిహారం అందించింది. టీడీపీ హయాంలో ఇలా ఎప్పుడైనా పరిహారం అందిందా?. పోరస్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్నిప్రమాదంలో పలువురు చనిపోవడం బాధాకరం. ఇలా ప్రమాదాల్లో చనిపోయినవారి కుటుంబాలను ఆదుకోవడంలో మా ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోంది. గతంలో విశాఖలో జరిగిన ఎల్జీ పాలిమర్స్ ఘటన తీవ్రతను బట్టి, బాధిత కుటుంబాలకు కోటి రూపాయిలు పరిహారం అందించాం. టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇలా చేశారా? వీరిది ఎంతసేపటికీ బురదచల్లే కార్యక్రమమే తప్ప మరొకటి కాదు.

తాజా వీడియోలు

Back to Top