నాదెండ్ల మనోహర్‌కు బ్రోకరిజం తప్ప ఏమీ తెలియదు

పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తాం

41.15 మీటర్లకే అంటూ నాదెండ్ల అజ్ఞానంతో మాట్లాడుతున్నాడు

పవన్‌ త్వరలోనే బీజేపీతో విడాకులు తీసుకొని మళ్లీ చంద్రబాబు పార్టీని పెళ్లి చేసుకుంటాడు 

చంద్రబాబు, పవన్‌ దంపతులుగా కలిసి వచ్చినా చిత్తుగా ఓడిస్తాం..

ఇరిగేషన్‌ శాఖ మంత్రి అంబటి రాంబాబు

తాడేపల్లి: వైయస్‌ జగన్‌ను ఎదుర్కోవడానికి చంద్రబాబు, లోకేష్, పవన్‌ కల్యాణ్, ఎల్లో మీడియా ఎన్ని ఎత్తులు, జిత్తులు, పొత్తులు ఏమి చేసినా మీకు అధికారం దక్కే అవకాశమే లేదని, సీఎం వైయస్‌ జగన్‌కు వణుకుపుట్టించే దమ్ము, ధైర్యం తండ్రీకొడుకులు, దత్తపుత్రుడికి లేదని ఇరిగేషన్‌ శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు సూచనల మేరకే పవన్‌ కల్యాణ్‌ ఢిల్లీ వెళ్లాడని, ఎందుకు పార్టీ పెట్టావంటే ఓట్లు చీలకుండా ఉండేందుకు పార్టీ పెట్టాననే స్థాయికి దిగజారిపోయిన పవన్‌కు సిగ్గుగా లేదా..? ఏ రాజకీయ పార్టీ అయినా ఇలా చేస్తుందా..? అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుపై నాదెండ్ల మనోహర్‌ అజ్ఞానంతో మాట్లాడుతున్నాడని, పోలవరం ఎత్తు తగ్గించే ప్రసక్తే లేదన్నారు. 41.15 మీటర్లకే ప్రభుత్వ అధికారులు సంతకం పెట్టారని పచ్చి అబద్ధాన్ని నాదెండ్ల మనోహర్‌ ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తామని స్పష్టం చేశారు. 

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి అంబటి రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. పోలవరం ఎత్తు తగ్గిస్తున్నట్టుగా నాదెండ్ల మనోహర్‌ నిరూపించగలడా..? అని సవాల్‌ విసిరారు. పోలవరం ఎత్తు తగ్గించే ప్రసక్తే లేదని శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్, ఇరిగేషన్‌ మంత్రిగా తాను స్పష్టంగా చెప్పామన్నారు. ప్రజల్లో గందరగోళం సృష్టించాలనే దుర్బుద్ధితోనే జనసేన తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. 

మంత్రి అంబటి రాంబాబు ఇంకా ఏం మాట్లాడారంటే..
‘‘టీడీపీ నాయకుల్లో పడిపోయిన టీడీపీ కాన్ఫిడెన్స్‌ను కల్పించడం కోసం బాబుకొడుకులిద్దరూ ఆపసోపాలు పడుతున్నారు. యువగళం అనేది గుర్తింపులేని దశకు వెళ్లిపోయింది. చంద్రబాబు రంకెలేసుకుంటూ తిరుగుతున్నాడు. అయ్యా చంద్రబాబూ నువ్వు 175 స్థానాల్లో పోటీ చేసేదమ్ముందా చెప్పగలవా అంటే నేను ఎందుకు చెప్పాలి అని దబాయిస్తున్నాడు. 175 స్థానాల్లో ఒక్కడివే పోటీచేసే ధైర్యముందా అంటే ఎందుకుచెప్పాలని అంటున్నాడంటే.. ఆ ధైర్యం లేదని అర్థమైపోయింది. పిరికిమాటలు తప్ప సీఎం వైయస్‌ జగన్‌ను ధైర్యంగా ఎదుర్కొలేడని చెప్పకనే చెబుతున్నాడు. 

పవన్‌ ఢిల్లీ టూర్‌ సింగడు అద్దంకి వెళ్లివచ్చినట్టు ఉంది యవ్వారం. చంద్రబాబు వెళ్లమంటే ఢిల్లీ వెళ్లాడు ఇది అందరికీ తెలిసిన సత్యమే. నేను బీజేపీతో కలిసి ఉన్నానని చెబుతున్నాడు. బీజేపీతో విడాకులు తీసుకోవడానికి వెళ్లావా..? లేక బీజేపీతో సంసారం కొనసాగించడానికి వెళ్లావా అంటే ప్రశ్నకు సమాధానం ఏంటంటే.. బీజేపీతో విడాకులు తీసుకొని రండీ.. నాతో మరో వివాహం చేసుకుందురు అని చంద్రబాబు పవన్‌ను ఢిల్లీ పంపించాడు. ఢిల్లీ వెళ్లి నడ్డా, మురళీధర్, కేంద్రమంత్రి షెకావత్‌ను కలిసి బయటకువచ్చి ఏదేదో పిచ్చిమాటలు మాట్లాడుతున్నారు. ఓటును చీలకుండా ఉండేందుకు చర్చించామంటున్నాడు. 

ఎందుకు పార్టీ పెట్టావంటే ఓట్లు చీలకుండా ఉండేందుకు పార్టీ పెట్టాననే స్థాయికి దిగజారిపోయిన పవన్‌కు సిగ్గుగా లేదా..? ఏ రాజకీయ పార్టీ అయినా ఇలా చేస్తుందా..? చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికే రాజకీయాలు చేస్తానని తీరుకు చేరారు. అలాంటప్పుడు బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నావ్‌..? అసలు జనసేన సిద్ధాంతం ఏంటీ.. రాజకీయం ఏంటీ.. ఇంత అజ్ఞానంగా ప్రవర్తిస్తున్న పవన్‌కు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. చంద్రబాబుకు ఏం కావాలో పవన్‌ కల్యాణ్‌ దగ్గర ఉంది. పవన్‌ కల్యాణ్‌ వేరేదానికి కక్కుర్తిపడి కులాన్ని మొత్తం తాకట్టుపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. చంద్రబాబు పల్లకీ మోయడానికే మనోహర్‌ నాయకత్వంలో జరుగుతుందని చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమైపోయింది. మీకు శృంగభంగం తప్పదు. 

పోలవరం గురించి అజ్ఞానంతో మాట్లాడుతున్నారు. పోలవరం ఎత్తును 41.15 మీటర్లకు అంగీకరిస్తూ అధికారులు సంతకం పెట్టారనే మాట ఆన్‌రికార్డ్‌ మాట్లాడాడు. తెలియకపోతే మాకు తెలియదు అని చెప్పాలి.. అంతేగానీ 45.72 ఎత్తుకు డిజైన్‌ చేయబడిన పోలవరం ప్రాజెక్టు ఎత్తును 41.15కు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సంతకం పెట్టారనే పచ్చి అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు. బుద్ధి, జ్ఞానం ఉండే మాట్లాడుతున్నారా నాదెండ్ల మనోహర్‌..? 

ఇరిగేషన్‌ మంత్రిగా సవాల్‌ చేస్తున్నా.. పోలవరం ఎత్తు తగ్గిస్తున్నట్టు నిరూపించగలరా..? పోలవరం ఎత్తు ఇంచు కూడా తగ్గదని శాసనసభలో ఇరిగేషన్‌ మంత్రిగా నేను చెప్పా.. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ కూడా చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన స్క్రిప్టును నాదెండ్ల మనోహర్‌ చదివారు.. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా జనసేన నాయకులు మాట్లాడుతున్నారు. పోలవరం అనే అద్బుతమైన ప్రాజెక్టు మీద అవాకులు, చవాకులు పేలుతున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టును సర్వనాశనం చేయడానికి ప్రయత్నించిందని అక్షరాల నిరూపించాం. 

పవన్‌కు సర్వహృదయం నాదెండ్ల మనోహర్‌కు పోలవరం గురించి అసలు తెలియదు. ఆయనకు తెలిసిందల్లా చంద్రబాబు మాట్లాడి ప్యాకేజీ ఇప్పించడం, బ్రోకరిజం చేయడం తప్ప ఏమీ తెలియదు. మరోసారి చెబుతున్నా.. 41.15 అనే ప్రచారం పచ్చి అబద్ధం. పోలవరం ప్రాజెక్టు ఎత్తు 45.72 వరకు ఉంది దాని వరకు నిర్మాణం జరుగుతుంది. తెలియకపోతే అడగండి పూర్తి సమాచారం ఇస్తాను. ప్రజలను తప్పుదోవ పట్టించేలా టీడీపీ, జనసేన మాట్లాడొద్దు. రాష్ట్రానికి జీవనాడి పోలవరం ప్రాజెక్టు. పోలవరం నిర్మాణం ఆలస్యం కావడానికి టీడీపీ చేసిన తొందరపాటు చర్యలు కారణం. తొందరలోనే బీజేపీతో పవన్‌ కల్యాణ్‌ విడాకులు తీసుకొని చంద్రబాబుతో మరో పెళ్లి చేసుకుంటాడు. ఇది జగమెరిగిన సత్యం. వారిద్దరూ కలిసి వచ్చినా చిత్తుగా ఓడించి పంపిస్తాం. 
 

Back to Top