బాబూ.. రాజకీయ సన్యాసమా లేక సన్నాసి రాజకీయమా..?

చంద్రబాబుకు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు సూటి ప్రశ్న 

 సింగిల్ గా పోటే చేసే దమ్ము లేకే బాబు పొత్తుల ఎత్తులు 

 ప్రజలు మెచ్చిన జగన్ గారి ప్రభుత్వాన్ని ఎంతమంది కట్టకట్టుకుని వచ్చినా దించలేరు 

 విద్యుత్ చార్జీలు ఏపీ కన్నా కర్ణాటకలో ఎక్కువ.. ఆర్టీసీ చార్జీలు మహారాష్ట్రలో ఎక్కువః మరి, రాజకీయ సన్యాసం ఎప్పుడు చేస్తావు బాబూ..?*

  రాజకీయ సన్యాసం చేస్తావా లేక ఇంకా సన్నాసి రాజకీయాలు చేస్తావా చంద్రబాబూ..?*

 బాబూ.. క్విట్ ఏపీ అని ప్రజలు అంటున్నారు*

 బాబు చెబితే ప్రజా ఉద్యమం వస్తుందా..?.. బాబు ఇక సీఎం కాలేడు..*

 5 ఏళ్ళ బాబు పరిపాలన కన్నా.. 3 ఏళ్ళ జగన్ గారి పరిపాలన వెయ్యిరెట్లు గొప్పగా ఉంది.*

 రూ.1.39 లక్షల కోట్లు డీబీటీ ద్వారా ప్రజల ఖాతాల్లో వేసిన సీఎం జగన్ క్విట్ అవ్వాలా...!?*

 ఇంగ్లీషు మీడియం చదివితే మొద్దు అబ్బాయిలు అవుతారా! ఇంకానయం, లోకేష్ లా తయారవుతారనలేదు!! 

  జనసేనకు దశ, దిశ లేదు.. అంగడిలో వస్తువులా ఎవరు కొంటారా! అని రెడీగా ఉంటుంది 
 
జనసేన చంద్రబాబుకు మాత్రమే అమ్ముడుపోతుంది 

 బాబు నాన్నకు బుడ్డి ఇస్తే.. జగన్ గారు అమ్మ ఒడి ఇచ్చారు 

తాడేప‌ల్లి: రాజకీయ సన్యాసమా లేక సన్నాసి రాజకీయమా..? అంటూ చంద్రబాబును రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు సూటిగా ప్ర‌శ్నించారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు శ‌నివారం తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడారు.    

 
 బాబు వింత ప్రవర్తన.. 
        ప్రధాన ప్రతిపక్ష నాయకులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మూడు రోజుల జిల్లాల పర్యటనలో మాట్లాడిన మాటలు, ఆయన బాడీ లాంగ్వేజ్‌, ఆయన ప్రవర్తన చూసినప్పుడు చాలా ఆశ్చర్యాన్ని, చిత్ర విచిత్రాల్ని కలిగించింది. నవ రసాల్లో ఉన్న ఆవేశం, రౌద్రం, హాస్యం, జాలి, బాధ ఇవన్నీ చంద్రబాబు చూపించే ప్రయత్నం చేశారు. దానితో పాటు పతనం అయిపోతున్న తన పార్టీ, రాజకీయాల్లో పడిపోతున్న తన గ్రాఫ్, తన ఉనికిని చాటుకోవడానికి జనాన్ని సమీకరించి మీటింగులు పెట్టే కార్యక్రమం చేశారు. కానీ జన సముహాలు ఎక్కడా కనిపించలేదు. అయితే ఆంధ్రజ్యోతి, ఈనాడు దినపత్రికలకు, ఎల్లో మీడియాకు మాత్రం జనాలు తండోపతండాలుగా వచ్చినట్లు కనిపించాయి, అందుకు సంబంధించిన అద్భుతమైన ప్రజాదరణ, ఇసుకవేస్తే రాలని జనం అంటూ బ్యానర్ హెడ్డింగ్‌లు పెట్టి... రాజకీయంగా అంపశయ్య మీద ఉన్న చంద్రబాబు నాయుడుకు, ఆయన పార్టీకి ఊపిరి పోయాలని, ఆ పార్టీని బతికించాలని తాపత్రయం పడుతున్నట్లు కనిపించింది.

*మరి, రాజకీయ సన్యాసం ఎప్పుడు చేస్తారు బాబూ..?*
    చంద్రబాబు చేసిన సవాల్‌ చిత్రంగా ఉంది. రాజకీయ సన్యాసం తీసుకుంటారట. ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా మన రాష్ట్రంకన్నా ఎక్కువ టారిఫ్‌, ఎక్కువ ధరలు ఉంటే చూపిస్తే, తాను రాజకీయ సన్యాసం చేస్తామని సవాల్‌ చేశారు. ఏఏ రాష్ట్రాల్లో ఎలాంటి టారిఫ్‌లు ఉన్నాయో అందిన సమాచారం మీడియా ముందు ఉంచుతున్నాను. 
    1. విద్యుత్ టారిఫ్‌ చూస్తే.. మన రాష్ట్రం కన్నా కర్ణాటక రాష్ట్రం ఎక్కువ వసూలు చేస్తోంది. వారికన్నా తక్కువ మనం వసూలు చేస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత సవాల్‌ చేశారు కాబట్టి వివరాలు మీడియా ముఖంగా చెబుతున్నాను. గృహాలకు 51 యూనిట్లు లోపు వాడితే మన రాష్ట్రంలో 120 రూపాయిలు వసూలు చేస్తాం, అదే కర్ణాటక రాష్ట్రంలో 207 వసూలు చేస్తున్నారు. 60 యూనిట్ల లోపు వాడితే ఏపీలో 147 రూపాయిలు, అదే కర్ణాటకలో రూ.255 వసూలు చేస్తున్నారు. అదే 70 యూనిట్లు అయితే ఇక్కడ రూ.177, కర్ణాటకలో రూ.308 వసూలు చేస్తున్నారు. అలాగే 80,90,100, 101,120,130,140,150 యూనిట్లు ఇలా చూసినా..  ప్రతి టారిఫ్ లో చూసినా, విద్యుత్‌ ఛార్జీలు మనకన్నా పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలో ఎక్కువ వసూలు చేస్తున్నారు. మరి దీన్ని ఏమంటారు చంద్రబాబుగారూ.?

    2. ఆర్టీసీ ఛార్జీలు చూస్తే... మన రాష్ట్రంలో ఉన్న చార్జీలు, పక్కనున్న మహారాష్ట్రలో ఉన్న ఛార్జీలు పోల్చినప్పుడు.. ఏపీలో 5కిలోమీటర్ల లోపు 83పైసలు ఉంటే, అదే మహారాష్ట్రలో 6కి.మీ.లోపు 145 పైసలు వసూలు చేస్తారు. ఎక్స్‌ప్రెస్‌ చార్జీలు మన దగ్గర 107పైసలు ఉంటే,  మహారాష్ట్రలో 145 పైసలు వసూలు చేస్తారు. సూపర్‌ లగ్జరీలో మనం 136 పైసలు వసూలు చేస్తే, మహారాష్ట్ర 197.5పైసలు వసూలు చేస్తున్నారు. ఇంద్ర, సెమీ లగ్జరీలలో మనం 166పైసలు వసూలు చేస్తే, మహారాష్ట్రలో 205 పైసలు వసూలు చేస్తారు. అలాగే గరుడ బస్సులో మనం 191పైసలు వసూలు చేస్తే, మహారాష్ట్రలో 308 పైసలు వసూలు చేస్తారు. 

- చంద్రబాబు సవాల్‌ చేశారు కాబట్టే ఈ రెండు ఉదాహరణలు చెప్పాం. మరి ఇప్పుడు చంద్రబాబు రాజకీయ సన్యాసం చేస్తారా? సన్నాసి రాజకీయం చేస్తారా? అనేది ఆయనే తేల్చుకోవాలి. సవాల్‌ చేయడం కాదు, సవాల్‌కు సమాధానం చెప్పినప్పుడు దానికి మీ నుంచి ప్రతిస్పందన ఆశిస్తున్నాం. దీనికి సమాధానం చెప్పాలని చంద్రబాబును డిమాండ్‌ చేస్తున్నాం. అలా కాకుండా జిల్లాల పర్యటనల పేరుతో నోటికొచ్చినట్లు అవాకులు చెవాకులు పేలితే ప్రజలు చూస్తూ ఊరుకోరు. పదిమందిలో మీరు చేసిన సవాల్‌కు మేం సమాధానం చెప్పాం. ఆ సవాల్‌ను స్వీకరించి రాజకీయ సన్యాసం చేస్తావో, లేకుంటే సన్నాసి రాజకీయం చేస్తావో తేల్చుకుంటే మంచిది. 

*దశ, దిశ లేని పార్టీ జనసేన*
     ప్రజా ఉద్యమాలు రావాలని, తన పర్యటన బాగా విజయవంతం అయిందని చంద్రబాబే తనకు తానే ట్వీట్‌ చేసుకుని చెప్పుకుంటున్నాడు. ఆంధ్రజ్యోతి, ఈనాడు, చంద్రబాబు చెప్పుకోవడమే తప్ప విజయవంతం అయిందని జనమేమీ చెప్పుకోవడం లేదు. మీరు చెప్పినట్టు, మా ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటే.. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఒక్కడే ఎందుకు పోటీ చేయరు? అందరూ కలిసి రావాలట. ప్రజా ఉద్యమం రావాలట. చంద్రబాబు చెబితే ప్రజా ఉద్యమం వస్తుందా? ప్రజలకు బాధ కలిగినప్పుడు ప్రజా ఉద్యమం వస్తుంది. చంద్రబాబు చెబితే ప్రజా ఉద్యమాలు రావు.
        
- రాష్ట్రంలో చక్కటి సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నప్పుడు ప్రజలకు ఉద్యమాలు చేసే అవసరం లేదు. అయితే ఏదోవిధంగా ప్రజలను రెచ్చగొట్టి ఉద్యమాలు చేసి అశాంతిని సృష్టించాలనే తాపత్రయమే చంద్రబాబులో కనిపిస్తోంది తప్ప ఎక్కడా కూడా ప్రజాస్వామ్య యుతంగా ప్రవర్తించాలనేది ఏ కోశానా కనిపించడం లేదు. అందరూ కలిసి రావాలి, ప్రతిపక్షాలు కలిసి కట్టుగా ఉంటే, దానికి చంద్రబాబు నాయకత్వం వహిస్తానని, వాళ్ల భుజాలమీదకు ఎక్కి అధికారంలోకి వస్తానని చంద్రబాబు పిలుపునిస్తాడు. చంద్రబాబు పిలుపు ఇవ్వగానే... జనసేనకు చెందిన నాదెండ్ల మనోహర్‌ వెంటనే స్పందిస్తూ... ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు మేము బాధ్యత స్వీకరించామని చెప్పారు. అయితే పొత్తుల విషయం మాత్రం పవన్‌ కల్యాణ్‌ మాట్లాడతారని చెప్పడం చూస్తే.. అసలు జనసేన కథేంటి అనేది అర్థం కావడం లేదు. జనసేన ఒక రాజకీయ పార్టీ. దానికి దిశ, దశ లేదు. ఆశయాలు, ఆశలు లేవు. ఎందుకు ఆవిర్భవించిందో, ఎవరి కోసం పనిచేస్తుందో తెలియదు. ఎవడు కొంటాడా... అమ్ముదామా అనేలా, అంగడిలో వస్తువులాగా రెడీగా ఉంటుంది. అయితే ఒక షరతు కూడా ఉంటుంది. చంద్రబాబు నాయుడుకు మాత్రమే అమ్ముడుపోతాం అనేది.  మేము రెడీగా ఉన్నాం అమ్ముడుపోవడానికి అంటూ జనసేన ఇవాళ రాష్ట్రంలో ఒక వేదికను తయారు చేసుకుంటోంది.

- మొన్నటి ఎన్నికల్లో విడి విడిగా పోటీ చేశారు కదా? ఇప్పుడు కలిసి పోటీచేసేందుకు  ఒక వేదికను తయారు చేసుకునే కార్యక్రమంలో భాగంగా ఓవైపు చంద్రబాబు ప్రజా ఉద్యమాలు రావాలంటూ ఉపన్యాసాలు ఇస్తుంటే.. మరోవైపు ఎస్‌, ప్రజా ఉద్యమానికి సిద్ధంగా ఉన్నాం, మీతో కలిసి పని చేస్తాం.. మీతో ప్యాకేజీ తీసుకుని 175 సీట్లకు కలిసి పోటీ చేద్దామనే భావనలో జనసేన ఉంది.

*సింగిల్ గా పోటే చేసే దమ్ము లేదా..?*
    ఎన్నికల్లో సింగిల్‌గా పోటీ చేసే దమ్ము, ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకీ లేదంటే దాని అర్థం ఏంటి? జగన్‌ మోహన్‌ రెడ్డిగారికి అద్భుతమైన ప్రజాదరణ ఉంది కాబట్టి, ప్రజా వ్యతిరేకత లేదు కాబట్టి మీరు సింగిల్‌గా పోటీ చేసే లక్షణం మీదగ్గర ఉండదు కాబట్టి.. జగన్‌గారిని ఎదుర్కోవడం కోసం అందరూ కలిసి పోటీ చేయాలని చూడటం చాలా దురదృష్టకరమైన పరిణామం.

- కొన్ని కొన్ని సందర్భాల్లో చంద్రబాబు నాయుడు నలుగురితో కూర్చుని మాట్లాడేటప్పుడు చాలా చిత్రంగా జై జగన్‌, జై జగన్‌ అనే నినాదాలు కూడా వినిపించాయి. ఈ వీడియోలను సోషల్ మీడియాలో చూశాను. ఇంగ్లీష్‌ మీడియం చదివితే.. మొద్దబ్బాయిలు అయిపోతారట. మొద్దబ్బాయిలు అంటే జనాలకు ఎవరికీ అర్థం కాదు. ఇంకా నయం, మీ అబ్బాయి లోకేష్ లా తయరయిపోతారని చెబితే ప్రజలకు బాగా అర్థం అయ్యేది. ఇంగ్లీష్‌ మీడియం చదివితే మొద్దబ్బాయిలు అవుతారని చంద్రబాబు చెబుతుండగానే ఇంతలో జనంలో నుంచి ఎవరో జై జగన్‌.. జై జగన్‌ అంటే.. ఆగండాగండంటూ బాబు కంగారు పడ్డారు. దీనిబట్టి అర్థం అవుతున్నదేమిటంటే.. చంద్రబాబు పర్యటనలోనూ జై జగనే... పవన్‌ కల్యాణ్‌ పర్యటనలోనూ జై జగనే. రాష్ట్రమంతా జై జగన్‌ అని పరిగెత్తుతుంటే.. ఏదోవిధంగా తాను ఉన్నాను అని చూపించుకునే ప్రయత్నం చంద్రబాబు తన పర్యటనలో చేశారు. 

*5 ఏళ్ళూ ప్రజల్ని షేవ్ చేయబట్టే బాబు క్విట్..*
        చంద్రబాబు చాలా ఆవేశంగా మాట్లాడుతూ "క్విట్‌ జగన్‌... సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌" అన్నారు. ఎందుకు జగన్‌ క్విట్‌ అవ్వాలి? ఆంధ్రప్రదేశ్‌కు ఏమైంది, సేవ్‌ చేయాల్సిన ఆవశ్యకత ఏమొచ్చింది.  ఇవాళ ఆంధ్రప్రదేశ్‌ సేవ్‌గా లేదా? మీరు అధికారంలో ఉన్న అయిదేళ్ల కాలంలో మీరు అన్నివిధాలా ప్రజల్ని షేవ్ చేయడంతోనే ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారు..? అందుకే మిమ్మల్ని జనం క్విట్‌ అవ్వమన్నారు. 2019లో మీరు క్విట్‌ అయ్యారు. మిమ్మల్ని జనం చిత్తు చిత్తుగా ఓడించి 23 సీట్లుకే పరిమితం చేశారు. జగన్‌ గారు అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ జగన్ మోహన్ రెడ్డిగారికే ప్రజలు అఖండ విజయాలు ఇచ్చారు. అలాంటి చంద్రబాబుకు, జగన్‌ మోహన్‌ రెడ్డిగారి గురించి మాట్లాడే అర్హత ఎక్కడ ఉంది?

- కేవలం 35 నెలల్లోనే ఒక లక్షా 39వేల కోట్ల రూపాయిలు డీబీటీ ద్వారా ప్రజలకు నేరుగా ఇచ్చిన ముఖ్యమంత్రిని క్విట్‌ అనే హక్కు చంద్రబాబుకు ఎక్కడిది? మీ దత్తపుత్రుడికి కూడా లేదు. అధికారం లేకపోయే సరికి చంద్రబాబు బతకలేకపోతున్నాడు. ఎప్పుడు అధికారంలోకి ఎక్కుదామా అని చూస్తున్నారు. అధికారానికి అలవాటు పడిన జీవి బాబు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిగారి చేతిలో రెండుసార్లు ఓటమి పాలైన వ్యక్తి. మళ్లీ జగన్‌ మోహన్‌ రెడ్డిగారి చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయి మళ్లీ అధికారంలోకి రాలేమనే ఫ్రస్టేషన్‌లో  చాలా గందరగోళంగా మాట్లాడుతున్నారు.

*మీరు పన్నులు వేయకుండా పాలన చేశారా బాబూ..?*
    చంద్రబాబు మొన్నటివరకూ హైదరాబాద్‌లో సైబర్‌ టవర్‌ కట్టించింది తానే అన్నాడు. ఇవాళ ఏపీలో మరుగుదొడ్లు కట్టించింది తానే అయితే దానిపై పన్ను వేస్తున్నారని అంటున్నారు. పన్నులు వేయరా? పన్నులు వేయకుండానే ప్రభుత్వాలు నడుస్తాయా? చంద్రబాబు పరిపాలన చేసినప్పుడు పన్నులే వేయలేదా? వీళ్ల ఉద్దేశం ఏంటంటే.. ప్రభుత్వానికి ఆదాయం రాకూడదు. అప్పులు పుట్టకూడదు. ప్రజలకు అందుతున్న అద్భుతమైన నవ రత్నాలు అమలు కాకూడదు. ఇదంతా చంద్రబాబు, ఎల్లో మీడియా కలిసి చేస్తున్న కుట్ర. పైపెచ్చు, రిటైర్డ్‌ అయిన ఐఏఎస్‌ అధికారులతో కూడా స్టేట్‌మెంట్లు ఇప్పించి ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమాలు అమలు కాకుండా చూడాలని, ప్రభుత్వాన్ని దివాళా తీయించాలనే ఉద్దేశంతో చంద్రబాబు, ఆయనకు రాజకీయ పక్షాలు కుట్రలు చేస్తున్నాయి. వీటిని ఎదుర్కోవడానికి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సిద్ధంగా ఉంది. దేశంలో ఎక్కడా అమలు కానటువంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ మాత్రమే. అమ్మ ఒడి, రైతు భరోసా, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, కాపు నేస్తం పథకాల ద్వారా రూ. 1.39 లక్షల కోట్లు నగదు నేరుగా లబ్ధిదారులకు అందించిన ఘనత మా ప్రభుత్వానిదే. మా ప్రభుత్వాన్ని ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారనేది ప్రజలు గమనించాలి.

*మాట తప్పింది మీరా.. మేమా..?*
    మాజీ ఇరిగేషన్‌ మంత్రి దేవినేని ఉమా నిన్న ప్రెస్‌మీట్‌ పెట్టి పోలవరం ప్రాజెక్ట్‌ గురించి, డయాఫ్రం వాల్ గురించి ఇంకా అబద్ధాలు చెబుతున్నాడు. డయాఫ్రం వాల్‌ దెబ్బతిన్నదని ఇప్పటికైనా అంగీకరించారు సంతోషం. గతంలో ఈ పెద్దమనిషే డయాఫ్రం వాల్‌ ఎక్కడ దెబ్బతిన్నదని మాట్లాడారు. 72శాతం ప్రాజెక్ట్‌ పూర్తి చేశామని చెబుతున్న మీరు.. ఎన్నికలకు ముందు ఏమన్నారో గుర్తు చేసుకుంటే మంచిది. పోలవరం పూర్తి చేసి, మేమే ప్రారంభించి, ఎన్నికలకు వెళతామని రాసుకో... రాసుకో అంటూ దేవినేని ఉమా అసెంబ్లీలో బల్లలు గుద్ది మరీ  2018లో చెప్పారే? మరి ఇప్పుడేమి అంటాడు. మీరు మాట తప్పారా, లేదా? మాట తప్పినందుకు ఇప్పటికే శిక్ష అనుభవిస్తున్నారు? ఇంకా అనుభవిస్తారు కూడా.

- డయాఫ్రం వాల్‌ ఎందుకు దెబ్బతిన్నది? దానికీ, జగన్‌గారికి ఏమి సంబంధం..? చంద్రబాబు నాయుడు, దేవినేని ఉమాలను సూటిగా అడుగుతున్నాను. దానికి సమాధానం చెబితే వారి పాదాలకు నమస్కరిస్తా. డయాఫ్రం వాల్‌ పూర్తి చేశారు. మరి కాఫర్‌ డ్యామ్‌ ను ఎందుకు పూర్తి చేయలేదు? కాఫర్‌ డ్యామ్‌ పూర్తి చేయకుండా డయాఫ్రం వాల్‌ కట్టడం సరైనదేనా? సైంటిఫిక్‌గా సరైంది కాదు. ముందుగా కాఫర్‌ డ్యామ్‌ పూర్తి చేశాకే, డయాఫ్రం వాల్‌ నిర్మాణం చేపట్టాలి. ఇది సైంటిఫిక్‌గా అందరికీ తెలిసిన విషయం. కానీ మీరు డయాఫ్రం వాల్‌ పూర్తి చేసి కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణం పూర్తి చేయకుండా మధ్యలో వదిలేసి పారిపోయారు. మీరు పారిపోవడం వల్లే ఈ అనర్థం జరిగింది. దీనికి బాధ్యులు మీరు తప్ప మేము కాదు. ఈ నెపాన్ని దయచేసి మా మీద రుద్దాలనే ప్రయత్నం చేయవద్దు. నాకు ఇగిరేషన్‌ మంత్రిగా అవగాహన లేకపోవచ్చు. నేను బాధ్యతలు చేపట్టి నెలరోజులు మాత్రమే అయింది. అదే అయిదేళ్లు నువ్వు మంత్రిగా చేశావుగా, నీకుందా అవగాహన?

- అయిదేళ్లు మంత్రిగా వెలగబెట్టిన ఉమకు అవగాహన లేకపోతే.. ఏ బావిలో దూకుతాడని అడుగుతున్నాం. ఎక్కడ ఏం పనులు జరుగుతున్నాయో, ఎక్కడ కమిషన్లు తీసుకోవాలో, చంద్రబాబుకు ఎన్ని సంచులు నువ్వు మోశావో వాటిపైనే నీకు అవగాహన ఉంది తప్ప ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలనే జిజ్ఞాస కానీ, పోలవరం పూర్తి చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి కానీ మీకు లేదు. . మేము చేసేది ఆరోపణలు కాదు వాస్తవమనే విషయాన్ని ప్రజలు గమనించాలి.

*చేతులు, కాళ్ళు ఎత్తేసింది మీరే..*
- పైపెచ్చు మంత్రి అంబటి రాంబాబు చేతులెత్తేశాడంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎవరు చేతులు ఎత్తేసింది? 2018కి పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తి చేస్తామని చేతులు, కాళ్లు ఎత్తింది మీరు. మీరు చేసిన పాపాన్ని పరిష్కారం వైపు తీసుకెళ్ళే ప్రయత్నం మేం చేస్తున్నాం. ఏం చేయాలన్నా సీడబ్ల్యూసీ, పీపీఏ మార్గదర్శకాలు ఉండాలి. దాని ప్రకారమే వెళ్లాలి తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు వెళ్లడానికి వీల్లేదు. ఇది కేంద్ర ప్రభుత్వం నిధులతో జరుగుతున్న జాతీయ ప్రాజెక్ట్‌. దీనికి చేతులు, కాళ్లు ఎత్తేశారని, ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శలు చేయడం సరికాదు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత చిత్తశుద్ధితో చేస్తున్న ప్రాజెక్ట్‌. దీనిలో సంశయించవలసిన అవసరమే లేదు. చంద్రబాబు నాయుడు, దేవినేని ఉమాలు చేసిన తప్పిదాల వల్లే ఇవాళ పోలవరం ప్రాజెక్ట్‌ ట్రబుల్‌లో పడింది. దాన్ని సెట్‌రైట్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. అంతేకాని తప్పిదాన్ని మామీద రుద్దాలని ప్రయత్నం చేయడం సరికాదు.

విలేకరుల ప్రశ్నలకు సమాధానమిస్తూ...
- ముఖ్యమంత్రి పదవి వద్దన్నాడని అన్నారంటే చంద్రబాబు గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది. ఆయన బతుకుతున్నదే ముఖ్యమంత్రి పదవి కోసం.  ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే  ఎన్నికల్లో ఒంటరిగా ఎందుకు పోటీ చేయవు. అందరూ కలిసి కట్ట కట్టుకుని రావాలని పిలుపు ఎందుకు ఇస‍్తున్నావ్‌. అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదనే కదా? ఇది చంద్రబాబు నాయుడు మాటలను బట్టే అర్థం అవుతుంది కదా? జగన్ గారి మూడేళ్ల పాలన చూసిన తర్వాత ప్రజలు సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు అయిదేళ్ల పాలన కంటే జగన్ గారి మూడేళ్ళ పాలన వెయ్యిరెట్లు గొప్పగా సాగుతుందని ప్రజలు అంటున్నారు.

- ఎన్టీఆర్‌గారు నాన్న బుడ్డి తీసేస్తే... చంద్రబాబు నాయుడు కాదా నాన్నకు బుడ్డీ తీసుకువచ్చింది? చంద్రబాబు నాన్నకు బుడ్డి ఇస్తే... జగన్‌ గారు అమ్మ ఒడి ఇచ్చారు. ఎవరు గొప్ప?

- అమ్మ ఒడి తీసుకునే ప్రతి విద్యార్థి తండ్రి మద్యం తాగుతున్నట్లు ప్రచారం చేస్తూ.. చంద్రబాబు నీచానికి ఒడిగడుతున్నారు. రాజకీయం చేసుకునేవాడు రాజకీయం చేసుకుంటే మంచిది. అమ్మ ఒడి... నాన్న బుడ్డి అంటూ ప్రాస కలిసిందని వాడేయటమేనా?

- రాష్ట్రంలో ప్రజలు బాగుపడాలని, అర్హులకు సంక్షేమ కార్యక్రమాలు అందాలని మా ప్రభుత్వం పనిచేస్తోంది. ఏ రాష్ట్రంలో జరగని అద్భుత పథకాలు ఇక్కడ అమలు జరుగుతున్నాయి. చంద్రబాబు ఎంతమందికి ఐటీ ఉద్యోగాలు ఇచ్చారు? వాలంటీర్ ఉద్యోగం ఇస్తే తక్కువ అని మాట్లాడతాడా..? సచివాలయాల ద్వారా చక్కని వ్యవస్థను తీసుకువస్తే దానిపై పడి ఆరోపణలు చేయడమా? 

- ఎంతమంది కట్టకట్టుకుని వచ్చినా మా ప్రభుత్వాన్ని క్విట్‌ చేయలేరు. ఎందుకంటే చిత్తశుద్ధితో పరిపాలన చేస్తున్నాం.  ఆవేశంతో చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తున్న చంద్రబాబును చూస్తే జాలేస్తోంది. మీ శపథం నెరవేరదు చంద్రబాబూ. మీరు ఇక శాసనసభకు రాలేరు. కుప్పానికే పరిమితం అవుతారు అనుకున్నా అ‍క్కడ కూడా గెలిచే అవకాశం లేదు.

- అధికారం కోసం మామను చంపిన మీరు, జగన్ గారిపై విమర్శలేంటి..? అధికారం కోసం హత్యలు చేయించినది చంద్రబాబు. జగన్‌గారిని దుర్మార్గుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ.. ఆరోపణలు చేసినవారంతా కాలగర్భంలో కలవక తప్పదు. మీ రాజకీయ పార్టీ ఇప్పటికే వెంటిలేటర్‌ మీద ఉంది. ఎన్నికల తర్వాత మీ పార్టీ ఉండదనేది రాసుకోండి. చంద్రబాబు రికార్డులను ఎవరూ బ్రేక్‌ చేయగలరు. 23 సీట్లు వచ్చిన పార్టీ ఉందా? చంద్రబాబు సొంత నియోజకవర్గం అయిన కుప్పంలో ఒక మండలం, మున్సిపాల్టీ కూడా గెలవలేదు. దీన్ని బ్రేక్‌ చేయడం ఎవరివల్ల అయినా అవుతుందా? అంబ‌టి రాంబాబు వ్యాఖ్యానించారు.

Back to Top