పరీక్షలు లేకుండా పైక్లాస్‌కు ప్రమోట్‌

కరోనా నేపథ్యంలో 6 నుంచి 9వ తరగతి వార్షిక పరీక్షలు రద్దు

వలంటీర్ల ద్వారా విద్యార్థుల ఇంటికే జగనన్న గోరుముద్ద

 చిక్కీలు, గోధుమలు, గుడ్లు, బియ్యం అందజేస్తాం

'బోధ్‌' యాప్‌ ద్వారా టీచర్లకు 'ఇంగ్లిష్‌' ట్రైనింగ్‌

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

తాడేపల్లి: కరోనా వైరస్‌ కబలిస్తున్న నేపథ్యంలో విద్యాశాఖకు సంబంధించి సీఎం వైయస్‌ జగన్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖపై సీఎం సమీక్ష అనంతరం మంత్రి సురేష్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే పాఠశాలలకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో విద్యార్థులకు అందించాల్సిన జగనన్న గోరుముద్ద వలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగుల ద్వారా నేరుగా వారి ఇంటికే అందిస్తున్నామని తెలిపారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో  మధ్యాహ్న భోజనం కింద నేరుగా విద్యార్థుల ఇంటికి డ్రై రేషన్‌ అందించాలని సీఎం సూచించారన్నారు. మార్చి 19వ తేదీ నుంచి సెలవులు ప్రకటించామని, పది రోజులకు సరిపడా చిక్కీలు, కోడిగుడ్లు, గోధుమలు, బియ్యం ప్రతి విద్యార్థి ఇంటికి అందిస్తున్నామన్నారు. 

ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పది రోజులకు కేజీ బియ్యం, అప్పర్‌ ప్రైమరీ, హైస్కూల్‌లో చదువుతున్న విద్యార్థులకు ఒకటిన్నర కేజీ బియ్యం, ఎనిమిది గుడ్లు, నాలుగు చిక్కీలు ప్రతి  విద్యార్థికి నేరుగా ఇవ్వాలని సీఎం ఆదేశించారని చెప్పారు. ఇప్పటికే రేషన్‌ పంపకాలు మొదలయ్యాయన్నారు. ఏప్రిల్‌ 14వ తేదీ వరకు డ్రైరేషన్‌ పంపిణీ పొడిగించాలని సూచించారని మంత్రి వివరించారు.  
ఇప్పటికే ఒకటి నుంచి 5వ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు పూర్తయ్యాయని మంత్రి చెప్పారు. మిగిలిన 6 నుంచి 9వ తరగతులకు జరగాల్సిన వార్షిక పరీక్షలను కరోనా నేపథ్యంలో రద్దు చేస్తున్నట్లు చెప్పారు. 6 నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులను హాజరుశాతం ఆధారంగా పైక్లాస్‌లకు ప్రమోట్‌ చేయాలని సీఎం నిర్ణయించారన్నారు. జూన్‌ రెండో వారంలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. 

అదేవిధంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టనున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్‌ వివరించారు. కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా టీచర్స్‌ ట్రైనింగ్‌ నిలిపివేయడం జరిగిందని, వారందరికీ ఆన్‌లైన్‌లో ట్రైనింగ్‌ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. రాబోయే పది పదిహేను రోజుల్లో 'బోధ్‌' యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తామన్నారు.  

Back to Top