తాడేపల్లి: రాష్ట్రంలో కార్మిక శ్రేయస్సుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అవిశ్రాంత కృషి చేస్తున్నారని వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని కార్మికులందరికీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి తరఫున సజ్జల రామకృష్ణారెడ్డి మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్(యువజన, శ్రామిక, రైతు) పార్టీ పేరులోనే శ్రామికులున్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి కార్మిక శ్రేయస్సు కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు.శ్రమను గుర్తించి గౌరవించడంతో పాటు శ్రామిక సంక్షేమ జగతిలోనే సమాజ ప్రగతి - ఆర్థిక పురోగతి సాధ్యమౌతుందని ఆయన బలంగా విశ్వసిస్తున్నారు. కార్మికుల సంక్షేమం కోసం సీఎం శ్రీ వైయస్ జగన్ పలు ప్రత్యేక పధకాలు ప్రవేశపెట్టడంతో పాటు వారికి ఆర్ధిక చేయూత కూడా అందిస్తున్నారు. నిజానికి ఈ క్రమంలో వచ్చిన కార్మిక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాల్సి ఉంది. కానీ, కరోనా కారణంగా.. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ఈ ఏడాది మేడే వేడుకలను జరుపలేక పోతున్నాం. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. మేడే వేడుకలు నిర్వహించుకోవాలని సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు.