పెనుమాకలో తాగునీటి స‌మ‌స్య‌కు శాశ్వ‌త ప‌రిష్కారం

గుంటూరు:  పెనుమాక గ్రామంలో తాగునీటి స‌మ‌స్య‌కు శాశ్వ‌త ప‌రిష్కారం చూపుతున్నట్లు మంగ‌ళ‌గిరి వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి(ఆర్కే) తెలిపారు. పెనుమాక గ్రామ ప్రజల తాగునీటి కష్టాలను తీర్చడానికి పూర్తిస్థాయిలో కృషి చేస్తున్న‌ట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థ పరిధిలో పెనుమాక గ్రామంలో నూతన ప్రెషర్ శాండ్ ఫిల్టర్ ను నిర్మించేందుకు  శుక్ర‌వారం ఉద‌యం కార్పొరేషన్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే స్థ‌లాన్ని ప‌రిశీలించారు. పెనుమాకలో 1.5 ఎంఎల్‌డీ  ప్రెషర్ శాండ్ ఫిల్టర్ నిర్మాణం కోసం పెనుమాక - కృష్ణాయపాలెం రోడ్డులో కొండవీటి వాగు వద్ద , ఉండవల్లి గుహల‌కు ఎదురుగా కొండవీటి వాగు వద్ద అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఆర్కే స్థలాన్ని ప‌రిశీలించారు. ప్రతిరోజు పెనుమాక ప్ర‌జ‌ల‌కు ఉదయం, సాయంత్రం తాగునీరు అందించడానికి ప్రతిపాదన సిద్ధం చేయాల‌ని కార్పొరేషన్ అధికారులను ఎమ్మెల్యే ఆర్కే ఆదేశించారు. 

ఎన్న‌డూ లేని అభివృద్ధి
మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో గ‌తంలో ఎన్న‌డూ..ఎవ‌రూ చేయ‌ని అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ నేతృత్వంలో చేప‌డుతున్నామ‌ని ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి తెలిపారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ తరుఫున తాను గెలిచాననే అక్కసుతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్‌లు నియోజకవర్గ అభివృద్ధిని టీడీపీ ఐదేళ్ల పాల‌న‌లో గాలికొదిలేశార‌ని విమ‌ర్శించారు. అందుకే 2019 ఎన్నికలలో మాజీ ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్‌ పోటీ చేసినా నియోజకవర్గ ప్రజలు నమ్మకం లేక నన్నే గెలిపించార‌ని తెలిపారు. ఐదేళ్లుగా ఉండవల్లిలో నివాసముంటున్న చంద్రబాబు, ఆయన కుమారుడు ఏ ఒక్క రోజు మున్సిపాలిటీల అభివృద్ధిపై కనీసం సమీక్ష చేయలేద‌న్నారు. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే  ప‌లుసార్లు మున్సిపాలిటీల అభివృద్ధిపై సమీక్ష చేశారు. రూ.1500 కోట్ల అభివృద్ధి పనులకు సైతం ఆమోదం తెలిపార‌ని చెప్పారు. పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని చెప్పడంతో పాటు  నిధులు మంజూరుకు సీఎం అంగీకరించడం అభినందనీయమ‌న్నారు. రూ.670 కోట్లతో తాడేపల్లి, రూ.800 కోట్లతో మంగళగిరిని అభివృద్ధిపర్చేందుకు   ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారంటే నియోజకవర్గ అభివృద్ధిపై వైయ‌స్ జ‌గ‌న్‌కు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు అని ఎమ్మెల్యే ఆర్కే అన్నారు. 

Back to Top