తాడేపల్లి: రాష్ట్రంలో సోషల్ మీడియా యాక్టివీస్ట్‌లపై కూటమి ప్రభుత్వం రెండోదశ వేధింపుల కార్యక్రమాన్ని ప్రారంభించిందని, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులకు తెగబడుతోందని వైయస్ఆర్‌సీపీ లీగల్ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ జె.సుదర్శన్‌రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా మాజీ సీఎం వైయస్ జగన్, ప్రముఖ నటుడు చిరంజీవిపై నోరుపారేసుకున్న ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో స్పందిస్తున్న వారిపై తప్పుడు కేసులు పెట్టేందుకు ప్రభుత్వం సిద్దమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగం పౌరులకు కల్పించిన భావప్రకటన స్వేచ్ఛను ఉక్కుపాదంతో అణచివేస్తున్న దుర్మార్గపు పాలన రాష్ట్రంలో కొనసాగుతోందని ధ్వజమెత్తారు. న్యాయస్థానాల ద్వారా ఈ దుర్మార్గపు చర్యలను తిప్పికొడతామని, చట్ట విరుద్దంగా అధికారపార్టీ కోసం పని చేసే పోలీసులు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇంకా ఆయనేమన్నారంటే... కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత జరిగిన దారుణాలు, దుర్మార్గాలు, దొమ్మీలు మరే రాష్ట్రంలోనూ జరగలేదు. అధికారం చేపట్టిన తరువాత ప్రభుత్వం అన్నిరకాలుగా వైఫల్యం చెందింది. ప్రశ్నించే ప్రజల గొంతును నొక్కే క్రమంలో సోషల్ మీడియాపై దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండు నెలల్లోనే దాదాపు ఏడు వందల కేసులు నమోదయ్యాయి. దాదాపు యాబై మంది సోషల్ మీడియా యాక్టివీస్ట్‌లను అరెస్ట్ చేసి, ఒకటి కంటేఎక్కువ కేసులు పెట్టి, అనేక విధాలుగా వారిని వేధించారు. చట్ట విరుద్దంగా పోలీసులను ఉపయోగించుకుని ఈ ప్రభుత్వం చేసిన దారుణలపై న్యాయస్థానాలు పలుసార్లు మొట్టికాయలు వేశాయి. అయినా కూడా ఈ ప్రభుత్వ దోరణిలో ఎటువంటి మార్పు కనిపించడం లేదు. భావవ్యక్తీకరణ స్వేచ్ఛను హరిస్తున్నారు కోవిడ్ మొదటి వేవ్ తరువాత రెండో వేవ్ ఎలా వచ్చిందో, అలాగే సోషల్ మీడియా యాక్టివీస్ట్‌లపై అక్రమ కేసుల బనాయింపు రెండోదశ కొనసాగుతోంది. రెండు రోజుల కిందట అసెంబ్లీ సాక్షిగా ఒక ఎమ్మెల్యే అత్యంత అహంకారంతో, నోటిదురుసుతో మాట్లాడారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తప్పు అంటూ సోషల్ మీడియాలో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని జిల్లాల్లోనూ అలా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసిన వారిపై కేసులు బనాయించారు. అంటే ప్రజల భావవ్యక్తీకరణ స్వేచ్ఛను ఉక్కుపాదంతో అణిచివేసేందుకు ఈ ప్రభుత్వం తెగబడింది. చివరికి న్యాయస్థానాలే ఈ రాష్ట్రంలో ప్రజల హక్కులను కాపాడే ఏకైక మార్గం. తమ చేతుల్లో అధికారం ఉంది, పోలీసులు చెప్పినట్లుగా ఎటువంటి తప్పుడు కేసు అయినా నమోదు చేస్తారనే ధీమాతో ఈ ప్రభుత్వం ఉంది. ఇటువంటి చట్ట వ్యతిరేక చర్యలను కోర్ట్‌లు చూస్తూ ఊరుకోవు. రాజకీయ కక్షసాధింపులకు పోలీసులు ఒక సాధనంగా మారిపోయారు. సివిల్ కేసుల్లోనూ అధికార పార్టీ కోసం జోక్యం చేసుకుంటున్నారు. తమకు సంబంధం లేని అంశాల్లో సైతం కూటమి పార్టీల నేతలు చెప్పినట్లుగా బెదిరింపులకు దిగుతున్నారు. పోలీసులు చట్టాలను అపహాస్యం చేస్తూ సాగిస్తున్న ఈ దాష్టీకాలకు న్యాయస్థానాల ముందు జవాబు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. గంజాయి కేసులు పెడతామంటూ బెదిరింపులు రాజకీయ కక్షతో అక్రమంగా నిర్బందంలోకి తీసుకున్న సందర్భాలు, మానవ హక్కులను ఉల్లంఘన ఘటనలు, సోషల్ మీడియా యాక్టివీస్ట్‌లపై గంజాయి కేసులు పెట్టడం వంటి చర్యలను కోర్ట్‌లు ఇప్పటికే పలు సందర్భాల్లో ఆక్షేపించాయి. తాజాగా సవీంద్రారెడ్డి అనే సోషల్ మీడియా యాక్టివీస్ట్‌ను పోలీసులు సివిల్ డ్రస్‌లో వచ్చి, అదుపులోకి తీసుకున్నారు. తన భర్తను పోలీసులుగా చెబుతున్న వారు బలవంతంగా తీసుకువెళ్ళారు, ఎటువంటి సమాచారం ఇవ్వలేదని ఆయన భార్య తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆయన పోలీసుల అదుపులో లేరని పోలీసులు చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు. చివరికి ఆమె హెబియస్ కార్పస్ పిటీషన్‌ను కోర్ట్‌లో దాఖలు చేసిన తరువాత కానీ పోలీసులు స్పందించి, తమ అదుపులోనే ఉన్నారని అంగీకరించారు. తక్షణం అతడిని కోర్ట్‌లో హాజరుపరచాలని ఆదేశిస్తే, దానిని గౌరవించకుండా, గంజాయి కేసులో వేరే మేజిస్ట్రేట్ కోర్ట్‌లో హాజరుపరిచారు. తాము చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు అనేక తప్పులు చేసి, న్యాయస్థానం ముందు దోషులుగా పోలీస్ అధికారులు తల దించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరికి దీనిపై సీబీఐతో దర్యాప్తు చేయాలని హైకోర్ట్ ఆదేశించే స్థాయిలో ఇక్కడి పోలీసుల వ్యవహారశైలి ఉంది. ఈ రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుకు ఈ కేసు ఒక నిదర్శనం. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది అమాయకుల పట్ల పోలీసులు ఇలాగే దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. నిస్పక్షపాతంగా వ్యవహరించాల్సిన పోలీస్ వ్యవస్థను కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేస్తోంది. పోలీస్ అధికారులు సైతం తాము చట్టాల ప్రకారం పనిచేయాలే తప్ప, అధికారంలో ఉన్న వారు చెప్పినట్లు చేయడానికి లేమనే స్పృహతో పనిచేయాలి. రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన హక్కులను కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. కానీ వారే న్యాయనిర్ణేతలుగా మారి, తామే తీర్పులు ఇస్తామనే దోరణితో పనిచేస్తే, భవిష్యత్తులో వారు మూల్యం చెల్లించుకోకతప్పదు. ఎమ్మెల్యే బాలకృష్ణ అసెంబ్లీలో మాట్లాడిన మాటలు తప్పు కాకపోతే, దానిపై స్పందించిన సోషల్ మీడియా యాక్టివీస్ట్‌లది తప్పు ఎలా అవుతుంది. ఒక మాజీ సీఎంను సైకో అంటూ, ప్రముఖ నటుడు చిరంజీవిని 'వాడు-వీడు' అంటూ కించపరిచేలా మాట్లాడిన బాలకృష్ణపై ఈ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోదు?