కొంద‌రి ప్ర‌యోజ‌నాల కోస‌మే.. ల‌గ‌డ‌పాటి త‌ప్పుడు స‌ర్వేలు

వైయ‌స్ఆర్‌సీపీ విజ‌యం ఖాయం

వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి

హైదరాబాద్‌: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలినుంచి  ప్రజల పక్షాన చేస్తున్న పోరాటానికి ప్రజలు స్పష్టమైన తీర్పును ఇచ్చారని  వైయ‌స్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం వెల్లడైన ఎగ్జిట్‌ పోల్స్‌లో ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై సజ్జల మాట్లాడుతూ.. మే 23న మరింత మెరుగైన ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఫలితాలు హఠాత్తుగా వచ్చినవి కావని, ఐదేళ్ల కాలంలో వైఎస్‌ జగన్‌ పడ్డ కష్టానికి ప్రతిఫలమని అభిప్రాయపడ్డారు.

లగడపాటి సర్వేపై ఆయన స్పందిస్తూ.. ఆయన సర్వేలో ఎంత నిజముందో తెలంగాణ అసెంబ్లీ ఫలితాలప్పుడే ప్రజలందరికీ తెలిసిపోయిందని అన్నారు. కొందరి ప్రయోజనాల కోసమే లగడపాటి తప్పుడు సర్వేలు చేస్తున్నారని కొట్టిపారేశారు. ఆంధ్రా ఆక్టోపస్‌గా ఆయనను ఆయనే చిత్రీకరించుకున్నారని పేర్కొన్నారు. సర్వే విడుదలకు ముందు టీడీపీ నేతలతో చర్చించి వారికి అనుకూలంగా ఫలితాలను ఇస్తారని సజ్జల ఆరోపించారు. కేసులు, అక్రమాల నుంచి తప్పించుకోవడాకే చంద్రబాబు నాయుడు జాతీయ నేతల చుట్టూ తిరుగుతున్నారని అన్నారు.

ఓటమిని చంద్ర‌బాబు ముందే ఊహించార‌ని.. ఈవీఎంలపై, ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ ప్రజల భవిష్యత్తు, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరితోనైనా కలుస్తామని వైఎస్‌ జగన్‌ మొదటి నుంచి చెపుతూనే ఉన్నారని, కేసీఆర్‌తో భేటీలో రహస్యమేమీ లేదని స్పష్టం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం తమతో కలిసోచ్చే వారితో కలిసి ముందుకు సాగుతామని వైఎస్‌ జగన్‌ చెప్పిన మాటలను సజ్జల మరోసారి గుర్తుచేశారు.  

Back to Top