తప్పు ఎవరు చేసినా, ఎంతటివారైనా ఉపేక్షించేది లేదు

తాడేపల్లిలో మైనర్‌ బాలిక హత్య కేసులో నిందితుడిని గంటలోపే అరెస్టు చేశాం

అది గంజాయి మత్తు కాదు.. మద్యం మత్తులో వ్యక్తిగత గొడవతో జరిగిన హత్య

బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున 10 లక్షల పరిహారం ప్రకటించాం

గంజాయిపై మా ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది

‘ఆపరేషన్‌ పరివర్తన్‌’తో గంజాయిని నిర్మూలించి..సాగుదారుల్లో మార్పు తీసుకొచ్చాం

గత చంద్రబాబు ప్రభుత్వ నిందితుల పక్షాన నిలబడి బాధితులకు అన్యాయం చేసింది

ఎమ్మార్వో వనజాక్షి ఘటనలో మధ్యవర్తిత్వం చేసింది చంద్రబాబు కాదా..?

పుష్కరాల్లో 29 మందిని పొట్టనబెట్టుకున్నప్పుడు ఎందుకు రాజీనామా చేయలేదు..?

ఇటీవల 11 మందిని పొట్టనబెట్టుకొని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదేం..?

ప్రతిపక్షాల తప్పుడు ప్రచారంపై హోంశాఖ మంత్రి తానేటి వనిత ఫైర్‌

సచివాలయం: తప్పు ఎవరు చేసినా ఉపేక్షించే పరిస్థితి లేదని, ఎంతటివారైనా కఠిన చర్యలు తప్పవని, 12వ తేదీ అర్ధరాత్రి తాడేపల్లిలో బాలికను హింసించి హతమార్చిన నిందితుడిని గంటలోపే పోలీసులు అరెస్టు చేశారని రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత చెప్పారు. గంజాయి మత్తులో ఆ వ్యక్తి మైనర్‌ బాలికను హత్య చేశాడని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయని, అది గంజాయి మత్తు కాదు, మద్యం మత్తులో హత్య చేశాడని హోంమంత్రి స్పష్టం చేశారు. వారికున్న వ్యక్తిగత గొడవలతో మద్యం మత్తులో వచ్చి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టి, గొడవ చేసి హత్య చేశాడని, హత్య జరిగిన గంటలోపే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వివరించారు. మైనర్‌ బాలిక హత్యకు గురవ్వడం బాధాకరమన్నారు. ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారాన్ని సీఎం వైయస్‌ జగన్‌ ప్రకటించారని చెప్పారు. నేరాలు తగ్గించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. సచివాలయంలో హోంమంత్రి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. 

హోంమంత్రి తానేటి వనిత ఇంకా ఏం మాట్లాడారంటే..
'గతంలో చంద్రబాబు ప్రభుత్వం బాధితుల పక్షాన కాకుండా.. నిందితులను కాపాడేందుకు పనిచేసేది. కానీ, మా ప్రభుత్వం తప్పు చేసినవారు ఎవరైనా, ఎంతటివారైనా అరెస్టు చేసి కఠినంగా శిక్షిస్తోంది. గతంలో వనజాక్షి అనే ఎమ్మార్వోను చింతమనేని ప్రభాకర్‌ జుట్టుపట్టుకొని కొడితే.. ఆ విషయంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు పంచాయితీ చేసి చింతమనేనిపై ఎలాంటి యాక్షన్‌ లేకుండా చేశారు. 

ఈ రోజున జగనన్న ప్రభుత్వంలో తప్పు ఎవరు చేసినా, ఎలాంటివాడు చేసినా వెంటనే చర్యలు తీసుకుంటున్నాం. తప్పుచేసిన వారిని సమర్థించే ప్రసక్తే లేదు. వారు చేసిన తప్పులను బట్టి కఠిన శిక్షలు విధించేలా చర్యలు తీసుకుంటున్నాం. 12వ తేదీన అర్ధరాత్రి తాడేపల్లిలో మైనర్‌ బాలికపై దాడిచేసి ఆ అమ్మాయిని హత్య చేసిన వ్యక్తిని గంటలోపే అరెస్టు చేశాం. 

నేరం చేసినవారిని 24 గంటల్లోనే అదుపులోకి తీసుకుంటున్నాం. పోలీస్‌ శాఖ ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందో చెప్పడానికి ఈ  అరెస్టులు నిదర్శనం. ప్రజా క్షేమం, శాంతిభద్రత కోసం, మహిళల భద్రత కోసం జగనన్న ప్రభుత్వం పనిచేస్తుంది. గుంటూరు జిల్లాకు చెందిన రమ్య అనే అమ్మాయి విషయంలో జిల్లా కోర్టు ఏ విధంగా తీర్పు ఇచ్చిందో అందరికీ తెలుసు. తప్పు చేసిన నేరస్తుడికి ఉరిశిక్ష వేశారు. తప్పు చేసినవారిని ఎప్పుడూ మా ప్రభుత్వం ఉపేక్షించదు. 

ఎవరైనా ఇబ్బందిపడితే వెంటనే రెస్పాండ్‌ అయిన పరిస్థితులు గత ప్రభుత్వంలో చూడలేదు. అంతేకాకుండా బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందించిన దాఖలాలు కూడా లిమిటెడ్‌గానే ఉండేవి. తాడేపల్లికి చెందిన మైనర్‌ బాలిక హత్యకు గురవ్వడం బాధాకరం. ఎవ్వరికీ ఇలాంటి పరిస్థితి జరగకూడదు. ప్రభుత్వం తరఫున ఆ కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం సీఎం వైయస్‌ జగన్‌ ప్రకటించారు. నేరస్తుడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు అతని అరెస్టును చూపించి రిమాండ్‌కు పంపిస్తారు. ప్రతిపక్షాల మాపై నిందలు వేయడం కరెక్ట్‌ కాదు. మా ప్రభుత్వం గురించి, సీఎం వైయస్‌ జగన్‌ గురించి మాట్లాడే అర్హత ప్రతిపక్షాలకు లేదు. 

గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు.. నిందితుల పక్షాన నిలబడి పంచాయితీలు చేశారు. ఎప్పుడూ బాధితుల పక్షాన గత ప్రభుత్వం నిలబడలేదు. అలాంటివారు ఈ రోజున మీడియా ముందుకు వచ్చి కావాలని మా ప్రభుత్వంపై ∙నిందలు వేస్తున్నారు. వైయస్‌ జగన్‌ ప్రభుత్వం గంజాయి మీద ఉక్కుపాదం మోపింది. ఎప్పుడూ లేనివిధంగా 2 లక్షల కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఏజెన్సీలో గంజాయి సాగును ధ్వంసం చేశారు. గంజాయి పండించేవారికి ప్రత్యామ్నాయ పంటలు పండించేలా పోలీసులు వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వం తరఫున వారికి ఉచితంగా విత్తనాలు కూడా పంపిణీ చేశాం. ఆపరేషన్‌ పరివర్తన్‌ కార్యక్రమంతో వారందరికీ మార్పు తీసుకువచ్చాం. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాం. సీఎం వైయస్‌ జగన్‌ నాయకత్వంలో పోలీస్‌ శాఖ సమర్థవంతంగా పనిచేస్తుంటే.. కావాలనే ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద నిందలు వేయడానికి ఏదో ఒక రాతలు రాయడం, మాటలు మాట్లాడటం కరెక్ట్‌ కాదు. 

రాజమండ్రిలో పుష్కరాల షూటింగ్‌కు వెళ్లి 29 మందిని పొట్టనబెట్టుకున్నప్పుడు చంద్రబాబు ఎందుకు రాజీనామా చేయలేదు. ఇటీవల కందుకూరు, గుంటూరులో 11 మందిని పొట్టనబెట్టుకున్న చంద్రబాబు తన ఎమ్మెల్యే పదవికి ఎందుకు రాజీనామా చేయలేదు. క్రైమ్‌రేట్‌ తగ్గించడానికి వైయస్‌ జగన్‌ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ప్రతిపక్షం తెలుసుకోవాలి. అవేవీ లేకుండా ఎంతసేపూ రాజకీయం, ప్రభుత్వం మీద బురదజల్లాలని చూడటం చాలా తప్పు. ప్రతిపక్షంలో ఉన్నాం కదా అని ఏదిపడితే అది మాట్లాడటం మంచిది కాదు’ అని హోంమంత్రి తానేటి వనిత హెచ్చరించారు. 
 

తాజా వీడియోలు

Back to Top