మహిళలను అడ్డం పెట్టి టీడీపీ శాడిస్టు సైకాలజీ ప్రదర్శిస్తోంది 

రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత 

 మాధవ్ తప్పు చేసినట్లు నిరూపణ అయితే చర్యలు తీసుకుంటాం 

 ఇందులో రాజకీయ కుట్ర దాగి ఉన్నా దానిపైనా చర్యలుంటాయ్ 

 బాధిత మహిళ ఎవరూ బయటకు వచ్చి ఫిర్యాదు చేయలేదు. 

  అయినా, సోషల్ మీడియా లో వచ్చిన వీడియో ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం 

 ఫోరెన్సిక్ నివేదిక వచ్చాక వాస్తవాలు వెలుగుచూస్తాయి 

హోం మంత్రి తానేటి వనిత

రాజ‌మండ్రి:     మహిళలను అడ్డం పెట్టుకుని టీడీపీ శాడిస్టు సైకాలజీని ప్రదర్శిస్తోందని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత మండిపడ్డారు. ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంలో.. తప్పు చేసినట్టు నిరూపణ అయితే కచ్చితంగా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వచ్చిన ఆ వీడియో అసలో, కాదో.. అన్నదానిపై ఫోరెన్సిక్ పరీక్షలకు పంపామని, ఆ నివేదిక వచ్చిన తర్వాత వాస్తవాలు వెలుగు చూస్తాయన్నారు. తప్పు ఎవరు చేసినా, తన, మన అన్న తారతమ్యం లేకుండా, తప్పును తప్పుగానే చూస్తామని చెప్పారు. ఒకవేళ ప్రభుత్వంపై బురదజల్లేందుకు, రాజకీయ కుట్ర కోణంలో భాగంగా, ఇటువంటి చర్యకు ఎవరైనా పాల్పడినట్టు తేలితే.. వారిపైన కూడా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఆ వీడియో వ్యవహారంలో బాధిత మహిళల ఎవరూ ఫిర్యాదు చేయలేదని, అయినా సోషల్ మీడియాలో వచ్చిన వీడియో ఆధారంగా, ఎంపీ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతోందని చెప్పారు.  

 
 టీడీపీది జుగుప్సాకరమైన రాజకీయం 
        రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని, మహిళలపై అరాచకాలు జరుగుతున్నాయంటూ.. టీడీపీ మహిళా నేతలు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం హాస్యాస్పదం. కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకుని ప్రభుత్వం మీద బురదజల్లే కార్యక్రమం చేస్తున్నారు. మా ప్రభుత్వం ఎంపీని కాపాడుతున్నట్టు, బాధిత మహిళకు అన్యాయం చేస్తున్నట్లుగా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రిగారి మీద నోరు పారేసుకుంటున్న మహిళలు వాడుతున్న భాష,  వారి బాడీ లాంగ్వేజ్... రాష్ట్రంలోని మహిళలంతా సిగ్గుపడే విధంగా ఉంది. 

- ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతిగా.. రాష్ట్రంలో మహిళలకు ఎక్కడ ఏ ఇబ్బంది రాకుండా, మహిళల భద్రత, మహిళల రాజకీయ, సామాజిక, ఆర్థిక అభివృద్ధికి, మహిళా సాధికారత కోసం.. నిరంతరం తపిస్తూ, చక్కటి పరిపాలనను అందిస్తుంటే.. చూసి ఓర్వలేక టీడీపీ ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వంపై బురదచల్లే కార్యక్రమం చేస్తుంది. మూడేళ్ళుగా ముఖ్యమంత్రి జగన్ గారి పరిపాలనపై గానీ, ఈరోజు అన్ని రంగాల్లో మహిళలకు పెద్దపీట వేస్తున్న జగన్ మోహన్ రెడ్డిగారి ప్రభుత్వంపైగానీ విమర్శలు చేయడానికి ఏ అంశాలు లేవు కాబట్టే, ఇటువంటి చౌకబారు వీడియోలను పట్టుకుని, మహిళలను అడ్డు పెట్టుకుని జుగుప్సాకరమైన రాజకీయాలకు టీడీపీ తెరలేపింది. వ్యక్తులుగా జరిగిన చిన్న విషయాలను పట్టుకుని నానా యాగీ చేస్తున్నారు. 

- వీడియోపై సంబంధిత ఎంపీనే కంప్లైంట్ చేశాడు. అది మార్ఫింగ్ వీడియో అని. ఇన్వెస్టిగేషన్ ప్రారంభించాం. అతను తప్పు చేశాడు అని నిర్థారణ అయితే కచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి. 
- మహిళలకు న్యాయం చేయటానికి, మహిళల గౌరవం కాపాడటానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారు ఎప్పుడూ ముందు ఉంటారు. అందులో ఎవరూ సందేహపడాల్సిన పనిలేదు. 

 వీటికి సమాధానం  చెప్పండి.. 
        ఈ సందర్భంగా గొంతలు చించుకుంటున్న తెలుగుదేశం మహిళా నాయకురాళ్ళకు సూటిగా కొన్ని ప్రశ్నలు వేస్తున్నాను. వాటికి సమాధానం చెప్పండి. 
    1- టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు ఒక మహిళా ఎమ్మార్వోను జుట్టు పట్టుకుని ఈడ్చి కొడితే.. స్వయంగా ఆమె అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తే.. ఆమెకు ఎందుకు న్యాయం  చేయలేదు. న్యాయం చేయలేదు సరికదా.. చింతమనేనికి మరిన్ని అధికారాలు ఇచ్చి, తన పక్కన కూర్చోపెట్టుకున్నది వాస్తవం కాదా..?
    2- టీడీపీ హయాంలో మంత్రిగా  పనిచేసిన రావెల కిషోర్ బాబు.. ఒక ముస్లిం మహిళా ప్రజా ప్రతినిధిని నోటికొచ్చినట్లు మాట్లాడితే,  మీడియా ముందుకు వచ్చి ఏడిస్తే.. ఆరోజున చంద్రబాబు ఏమి చర్యలు తీసుకున్నారు?
    3- విజయవాడ నగరంలో కాల్ మనీ సెక్స్ రాకెట్ వ్యవహారంలో.. మహిళలకు అప్పులిచ్చి, తీర్చలేని మహిళల్ని లైంగికంగా వేధింపులకు గురి, వీడియోలు తీస్తే.. అప్పడు ఆరోపణలు వచ్చిన బుద్దా వెంకన్న తదితరులపై మీరు ఏమి చర్యలు తీసుకున్నారు.? 
- ఇలా చెప్పుకుంటూ పోతే.. టీడీపీ హయాంలో మహిళలపై జరిగిన అరాచకాలకు అంతే లేదు. 

 మా పార్టీ ఎంపీ అయినా.. తప్పు చేస్తే చర్యలు ఉంటాయ్ 
        గోరంట్ల మాధవ్.. మా ఎంపీ కావొచ్చు, ఏ పార్టీ అయినా,  ఎవరైనా సరే.. తప్పు చేసింది ఎవరైనా సరే.. ఈ ముఖ్యమంత్రి గారు తప్పు చేసిన వారిని కాపాడే పరిస్థితే లేదు. కచ్చితంగానే కఠిన చర్యలు ఉంటాయి. ఎటువంటి డౌట్ లేదు. ఇదే విషయాన్ని ప్రభుత్వపరంగా, పార్టీ పరంగా ఇప్పటికే పెద్దలు స్పష్టం చేసినా, ఇంకా టీడీపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారు. ఒకటికి పదిసార్లు  చెప్పిన విషయాన్నే మాట్లాడితే.. అది నిజం అయిపోతుంది అన్నది వారి నమ్మకం. అలానే, ఏదో ఒకటి తీసుకొచ్చి.. పది మంది కలిసి, గట్టిగట్టిగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే.. అది నిజం అవుతుందని వారు భావిస్తున్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చిన తర్వాత కూడా.. ఇంకా  తెలుగుదేశం నేతలు.. వారి శాడిజాన్ని ప్రదర్శించడం బాధాకరం.  అలాంటి వీడియోలను ఎంకరేజ్ చేసే పరిస్థితిలో సమాజంగానీ, ప్రభుత్వం గానీ లేదు. ఒకవేళ ఇదేదో రాజకీయ కుట్రలో భాగంగా, ప్రభుత్వం మీద బురదజల్లే విధంగా ఎంపీని వాడుకున్నట్లు నిరూపణ అయినా,  వాళ్ళను కూడా ఉపేక్షించేది లేదు. వారిపై కూడా కఠిన చర్యలు ఉంటాయి. 
- రాష్ట్రంలో మహిళలకు ఏ ఇబ్బందీ లేదు.  మహిళలు ధైర్యంగా ఉండొచ్చు. ఏ ఇబ్బంది వచ్చినా.. మేము ఉన్నామని ముఖ్యమంత్రిగారు భరోసా ఇస్తున్నారు. 

 మహిళలకు అండగా ప్రభుత్వం 
        మహిళకు ఈ ప్రభుత్వం  ఏ విధంగా అండగా ఉంటుందనేది గత మూడేళ్ళుగా జగన్ గారి పరిపాలనను చూస్తే అర్థమవుతుంది. మహిళల భద్రత కోసం.. దిశ చట్టానికి రూపకల్పన చేశాం. దిశ యాప్ ను తెచ్చి, ప్రత్యేక పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేసి..  కాల్ చేసిన క్షణాల్లోనే వారికి భద్రత కల్పిస్తున్నాం.   రాష్ట్రంలోని మహిళలంతా.. తమ సొంత అన్న, తమ్ముడు, తనయుడు.. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి, తమకు భద్రత, భరోసా కల్పిస్తున్నారని భావించే పరిస్థితి ఉంద‌ని తానేటి వ‌నిత అన్నారు.

Back to Top