తాడేపల్లి: కవి కోకిల గుర్రం జాషువా జయంతి కార్యక్రమం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జాషువా విగ్రహానికి రాష్ట్ర మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జున, ఎంపీ నందిగం సురేష్ఎం ఎల్ సి లేళ్ళ అప్పిరెడ్డి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. గుఱ్ఱం జాషువా సమాజాన్ని మేల్కొలిపే విధంగా తన రచనలు చేశారని నేతలు కొనియాడారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ..గుఱ్ఱం జాషువా జయంతిని రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారికంగా చేపట్టాలని నిర్ణయించినందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నామని అన్నారు. సమాజంలో అనేక అవమానాలు,వివక్షను ఎదుర్కొని ఎదిగిన మహాకవి జాషువా అని అన్నారు. గుఱ్ఱంజాషువా ఆశయాలు, స్ఫూర్తిని వైయస్ జగన్ ప్రభుత్వం ముందుకు తీసుకుని వెళుతోందని అన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. గుఱ్ఱం జాషువా ను ఇవాళ అందరం స్మరించుకుంటున్నామంటే అందుకు కారణం సమాజంలో ఉన్న అసమానతలను తన కవిత్వం ద్వారా ఎత్తి చూపిన గొప్ప కవి ఆయన అన్నారు. ఆయన రచించిన ఉన్నతమైన రచనలు గబ్బిలం, క్రీస్తు చరిత్ర, ఫిరదౌసి వంటి గొప్ప గ్రంధాలను అన్ని భాషల్లో అనువాదం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దళిత వర్గాలకు ముఖ్యమంత్రి అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి అందరికీ ఆదర్శనీయమని అన్నారు. వైయస్ జగన్ ప్రభుత్వానికి అందరం అండగా నిలబడాల్సిన సమయం ఇది అని అన్నారు. పార్లమెంట్ సభ్యులు నందిగం సురేష్ మాట్లాడుతూ.... అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యం కల్పించేవిధంగా సమాజం ఉండాలని నిరంతరం తపించిన వ్యక్తి గుఱ్ఱం జాషువా అని అన్నారు.వివక్షతకు వ్యతిరేకంగా తనదైన శైలిలో సమాజాన్ని మేల్కొలిపిన మహనీయుడు జాషువా అని అన్నారు. లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ..గుఱ్ఱం జాషువా చూపిన మార్గం అందరికి అనుసరణీయం అని అన్నారు.కులం,మతం,ప్రాంతం,పేద,ధనిక బేధం లేకుండా అందరికి సమాన ప్రాధాన్యత ఉండేలా వైయస్ జగన్ పరిపాలన సాగుతుందని తెలియచేశారు.జాషువా ఏదైతే కోరుకున్నారో అదే పరిస్దితి ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొందన్నారు. కార్యక్రమంలో పలు కార్పోరేషన్ల ఛైర్మన్లు,డైరక్టర్లు,పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు.