రూ.10 వేల కోట్లకు లెక్క చెప్పగలవా చంద్రబాబూ..?

నీ విజన్‌ ఏంటీ..? ఎక్కడుంది..? సంపద క్రియేటివిటీ ఏదీ..?

అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఆలోచన నీకు లేదా..?

రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల వెనకబాటుతనం కనిపించలేదా..?

ప్రాజెక్టులు, పరిశ్రమల కోసం భూములిచ్చిన వారు రైతులు కాదా..? 

మీ బినామీలు మాత్రమే రైతులు.. త్యాగధనులా..?

న్యాయస్థానం టు దేవస్థానం యాత్రలో వందల కోట్ల చందాలు ఎక్కడ నుంచి వచ్చాయి..?

రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసింది చంద్రబాబే

చంద్రబాబుపై ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజం

తాడేపల్లి: రాష్ట్ర ప్రయోజనాలే అజెండాగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీలో పర్యటించారని, ప్రధానితో పాటు కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. సీఎం ఢిల్లీ పర్యటన విజయవంతంగా కొనసాగుతుంటే.. అది చూసి ఓర్వలేక, తట్టుకోలేక డైవర్షన్‌ పాలిటిక్స్‌కు చంద్రబాబు తెరతీశాడని మండిపడ్డారు. తనను తాను విజనరీగా ప్రమోట్‌ చేసుకునే చంద్రబాబు.. ఐదేళ్లలో అమరావతిలో ఏ అభివృద్ధి చేశారో చెప్పగలరా..? అమరావతిలో ఖర్చు చేసిన రూ.10 వేల కోట్లకు లెక్క చెప్పగలడా..? అని ప్రశ్నించారు. అమరావతిలో చంద్రబాబు సొంతిల్లు కూడా లేదని, ప్రస్తుతం బాబు నివాసముంటున్న ఇంటి డ్రైనేజీ నీటిని కూడా కృష్ణా నదిలోకి వదులుతున్నాడని చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. 

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు చెబుతున్న అమరావతి అనేది అక్కడ లేదని, అది భ్రమరావతి మాత్రమేనన్నారు. అమరావతిలో శాశ్వతంగా ఎటువంటి నిర్మాణాలు జరగలేదని, కేవలం గ్రాఫిక్స్‌తోనే చంద్రబాబు టైమ్‌పాస్‌ చేశాడని దుయ్యబట్టారు. అమరావతిలో ఐకాన్‌ బ్రిడ్జిలు లేవు, ఇడ్లి పాత్ర లాంటి స్ట్రక్చర్స్‌ లేవు, కనీసం డ్రైనేజీ లేదు, తాగునీరు లేదు, ఐఏఎస్, ఐపీఎస్‌లకు నిర్మిస్తామన్న క్వార్టర్స్‌ నిర్మాణం కూడా కనీస దశకు తీసుకురాలేదన్నారు. 

గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే.. 

అమరావతిలో రూ.10 వేల కోట్లు ఖర్చు చేశామని చంద్రబాబు చెబుతున్నాడు.  రూ.10 వేల కోట్లకు లెక్కలు చెప్పగలవా..? ఒక్క బిల్డింగ్‌ పూర్తికాలేదు. రూ.10 వేల కోట్లు నీ బినామీల చందాలు కాదు.. ప్రజల డబ్బు ఖర్చు పెట్టావ్‌. ఆ రూ.10 వేల కోట్లతో చిన్న నిర్మాణం కూడా పూర్తికాలేదంటే.. చంద్రబాబును ఏమనాలి. మళ్లీ మాయమాటలు చెబుతున్నాడు. అమరావతిలో చంద్రబాబు సొంత ఇంటిని కూడా నిర్మించుకోలేకపోయాడు. బాబు నివాసముండే ఇంటికి డ్రైనేజీ కూడా లేదు. మురుగునీటిని కృష్ణా నదిలో వదులుతున్నాడు. 

పెద్ద విజన్‌ ఉన్న వ్యక్తినని చంద్రబాబు తనను తాను ఎల్లోమీడియాతో ప్రొజెక్ట్‌ చేసుకుంటున్నాడు. రూ.10వేల కోట్లలో కనీసం రూ.5వేల కోట్లు ఖర్చు చేసి ఉంటే బ్రహ్మాండమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో హైదరాబాద్‌కు దీటుగా విశాఖ తయారయ్యేది. మిగిలిన రూ.5వేల కోట్లలో రూ.2 వేల కోట్లతో ఎమ్మెల్యే క్వార్టర్స్‌ శాసన రాజధానిలో నిర్మించి ఉండొచ్చు. మిగిలిన డబ్బుతో హైకోర్టుతో సహా అన్నీ కంప్లీట్‌ చేసి ఉండొచ్చు. రూ.10 వేల కోట్లతో 80–90 శాతం మూడు రాజధానుల కంప్లీట్‌ చేసే అవకాశాన్ని చేజార్చి.. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసింది చంద్రబాబే. 

రాజధాని చెప్పుకోవడానికి లేదనే పరిస్థితిని క్రియేట్‌ చేసింది చంద్రబాబు. కేవలం మభ్యపెట్టే మాటలతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసిన చంద్రబాబుకు.. వైయస్‌ జగన్‌ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదు. న్యాయస్థానం టు దేవస్థానం అని ఓ యాత్ర చేసి.. వందల కోట్ల చందాలు వసూలు చేశారు. 

ఏ రైతు అయినా రైతే. రైతులను గౌరవించాలి. రోడ్లు, ప్రాజెక్టులు, పరిశ్రమల కోసం వేల ఎకరాల ఇచ్చేసిన వారు రైతులు కాదా..? వారు త్యాగధనులు కారా..? కేవలం మీకు సంబంధించిన వ్యక్తులు, బినామీలు మాత్రమే రైతులా..? పాదయాత్రలో వందల కోట్ల చందాలు ఎక్కడ నుంచి వస్తున్నాయి. కార్పొరేట్‌ పాలిటిక్స్‌ చేసి.. తప్పు అని సిగ్గుపడకుండా ఎదురుదాడి చేస్తున్నారు. 

చింతమనేని ప్రభాకర్‌ రాజధాని శంకుస్థాపన చేసిన చోటే పశువులను తీసుకువచ్చి పాక వేశాడంటే.. ఆయనకు తెలుసు కాబట్టే ఆ పనిచేశాడు. రూ.10 వేల కోట్లతో మూడు నగరాలను అభివృద్ధి చేసి ఉండొచ్చు. ప్రజాధనాన్ని ఎందుకు వృథా చేశావ్‌.. ఐదేళ్లలో రాష్ట్ర ప్రతిష్టను ఎందుకు నాశనం చేశావ్‌. 

రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల వెనకబాటు తనం కనిపించలేదా..? అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే ఆలోచన నీకు లేదా..? నీ విజన్‌ ఏంటీ..? ఎక్కడుంది..? అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తామంటే ఎందుకు నీ మనసు అంగీకరించడం లేదు..? ప్రజల మనోభావాలను పట్టించుకోవా..? విశాఖ ఎందుకు అభివృద్ధి చెందకూడదు. కృష్ణా నదిలో డబ్బులు వేసినట్టు రూ.10 వేల కోట్లు అమరావతిలో పెట్టావే.. అందులో అరభాగం డబ్బుతో ఒక సిటీని ఎంతో అభివృద్ధి చేయొచ్చు. 
 

Back to Top