ఉప ఎన్నిక తర్వాత టీడీపీకి శంకరగిరి మాన్యాలే..

పచ్చ మీడియాలో తప్ప టీడీపీకి ఎక్కడా సానుభూతి లేదు

టీడీపీలో ఉన్న ఏ నాయకుడికీ సీఎం వైయస్‌ జగన్‌ను విమర్శించే అర్హత లేదు

5 లక్షల మెజార్టీతో గురుమూర్తి గెలుపు ఖాయం

ప్రభుత్వ విప్‌ కొరుముట్ల శ్రీనివాసులు

తిరుపతి: తిరుపతి లోక్‌సభను 5 లక్షల మెజార్టీతో కైవసం చేసుకుంటామని,  గురుమూర్తి గెలుపును సీఎం వైయస్‌ జగన్‌కు తిరుపతి ప్రజలు కానుకగా ఇస్తారనే నమ్మకంతో ఉన్నామని ప్రభుత్వ విప్‌ కొరుముట్ల శ్రీనివాసులు అన్నారు. తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అవ్వడానికి తిరుపతి ఉప ఎన్నిక ఒక్కటే మిగిలి ఉందన్నారు. ఆ తరువాత శంకరగిరి మాన్యాలేనని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీలో దొంగ లీడర్ల వ్యవహారం అంతా బయటపడిందని, అవినీతి సొమ్ముతో లోకేష్‌ నడిపే వ్యవహారాలు అన్నీ బట్టబయలయ్యాయన్నారు. పచ్చ మీడియాలో తప్ప టీడీపీకి ఎక్కడా సానుభూతి లేదన్నారు. 

తిరుపతిలో ప్రభుత్వ విప్‌ కొరుముట్ల శ్రీనివాసులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనాకు భయపడి తండ్రీకొడుకులు హైదరాబాద్‌కు పారిపోయి జూమ్‌లో బతికారన్నారు. పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో సీఎం వైయస్‌ జగన్‌ ప్రచారం చేయకుండా, ప్రెస్‌మీట్‌ కూడా పెట్టకుండా 90 శాతం స్థానాల్లో విజయం సాధించామన్నారు. ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని తిరుపతి ప్రచార సభను కూడా సీఎం వైయస్‌ జగన్‌ రద్దు చేసుకున్నారని చెప్పారు.  

ఐదు సంవత్సరాలు బీజేపీతో అంటకాగిన చంద్రబాబు.. ఆంధ్రుల హక్కు అయిన ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టుపెట్టాడని ఎమ్మెల్యే కొరుముట్ల మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న ఏ ఒక్క నాయకుడికి కూడా సీఎం వైయస్‌ జగన్‌ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. తనకు తానుగా రాళ్లు వేయించుకొని నాలుగు ఓట్లు సంపాదించుకోవాలని చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నాడని మండిపడ్డారు. చచ్చిపోయిన పార్టీపై రాళ్లు వేసే అవసరం మాకేంటని ప్రశ్నించారు. తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ నేతలు కూడా డ్రామాలు ఆడుతున్నారని, గురుమూర్తి మతం, కులం గురించి ప్రజలందరికీ తెలుసన్నారు. దయచేసి నీచ రాజకీయాలు మానుకోవాలని టీడీపీ, బీజేపీ నేతలకు సూచించారు.
 

Back to Top