తాడేపల్లి: ముఖ్యమంత్రిగా పాలనలో తన అరాచకాలను ఆపకపోతే నియంతలు ముస్సోలినీ, గడాఫీలకు పట్టిన గతే చంద్రబాబుకి పడుతుందని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ హెచ్చరించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పాలనను గాలికి వదిలి అధికార దుర్వినియోగంతో దౌర్జన్యాలు, దాడులతో సమాజంలో భయాందోళనలు పెంచేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అవినీతి, అక్రమాలే ఊపిరిగా చంద్రబాబు పాలన సాగుతోందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతోనే రాష్ట్రంలో అత్యాచారాలు, హత్యలు, దోపిడీలు, దౌర్జన్యాలు పెరిగిపోయాయి. అతి తక్కువ కాలంలోనే ఇంత చెడ్డపేరు తెచ్చుకున్న ప్రభుత్వం భారతదేశ చరిత్రలోనే లేదు. అందుకే సోషల్ మీడియాలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వారిని కేసులతో ఈ ప్రభుత్వం వేధిస్తున్నది. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపుతప్పాయి. ప్రజలెవరూ ప్రశాంతంగా బతకలేని పరిస్థితులు నెలకొన్నాయి. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై ఒక్కొక్కరిపై పదేసి కేసులు పెట్టి ఇప్పటికే వంద మందికి పైగా సోషల్ మీడియా యాక్టివీస్ట్ లను వేధిస్తున్నారు. మహిళలు అని కూడా చూడకుండా లాఠీలతో చావబాదిన ఘటనలున్నాయి. పెంచడానికి, ముంచడానికి, చంపడానికే చంద్రబాబు అధికారంలోకి వచ్చినట్టుంది. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకపోగా విద్యుత్ చార్జీలు, మద్యం ధరలు పెంచాడు. మిర్చి, ధాన్యంకి గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా రైతులను ముంచేశాడు. పబ్లిసిటీ పిచ్చితో తిరుపతి తొక్కిసలాటలో భక్తుల మరణానికి కారణమయ్యాడు. రాక్షసరాజ్యంగా చంద్రబాబు పాలన మొన్నటిదాకా ఎమ్మెల్యేలుగా పనిచేసిన తాడిపత్రి లో పెద్దారెడ్డి, మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిలను నియోజకవర్గంలో అడుగుపెట్టకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. పెద్దారెడ్డిని రామగిరి మండలంపైపు పోలీసుల అనుమతి లేకుండా వెళ్లడానికి వీల్లేదని ఆంక్షలు విధిస్తున్నారు. ఎందుకని అడిగితే పరిటాల కుటుంబం నుంచి నీ ప్రాణాలకు హాని ఉందంటూ సాకులు చెబుతున్నారు. రామగిరి ఏమైనా పాకిస్థాన్ బోర్డర్‌లో ఉందా? దాడులు చేస్తారని తెలిసీ పరిటాల కుటుంబాన్ని అదుపులోకి తీసుకోకుండా పెద్దారెడ్డిని నియంత్రించే దయనీయ పరిస్థితుల్లో పోలీసులు పనిచేస్తున్నారు. పల్నాడులో బుల్డోజర్లతో పోలీసుల సమక్షంలోనే ఇళ్లను కూల్చేస్తున్నారు. ఈ మధ్య కాలంలోనే కర్నూలు జిల్లాలో హరికెర గ్రామంలో ఈరన్న అనే ఫీల్డ్ అసిస్టెంట్ ను తన ఉద్యోగం వదులుకోవాలంటూ కూటమి నాయకుల బెదిరించారు. దీనికి ఈరన్న లొంగకపోవడంతో అత్యంత పాశవికంగా కళ్లల్లో కారం కొట్టి కొడవళ్లతో నరికి చంపారు. రాష్ట్రంలో రౌడీ రాజ్యం, దోపిడీ పాలన నడుస్తున్న నేపథ్యంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామిక వేత్తలు కూడా వెనకడుగు వేస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ రూ.30 కోట్లు పెట్టి దావోస్ వెళ్లినా రూపాయి పెట్టుబడి తేలేకపోయారంటే దానికి కారణం రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పడమేనని గ్రహించాలి. రెడ్ బుక్ పాలన చూసి పారిశ్రామికవేత్తలు ఏపీ మొహం చూడ్డానికే ఇష్టపడటం లేదు. రాబోయే రోజుల్లో మళ్లీ వైస్ జగన్ నేతృత్వంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం ఖాయం. వచ్చాక గుడ్ బుక్ ప్రకారం చంద్రబాబు అరాచకాలకు తగిన శిక్షలు విధించడం జరుగుతుంది.