వైయ‌స్ జగన్‌ పేరెత్తకుండా చంద్రబాబుకు రోజు గడవడం లేదు..

స్వాతంత్య్ర వేడుకల్లోనూ పదే పదే వైయ‌స్ జగన్‌ నామస్మరణ..

కళ్లార్పకుండా పదే పదే అబద్ధాలు చెప్పడమే సరిపోయింది..

చంద్రబాబు తీరుపై సాకె శైలజానాథ్‌ ఆగ్రహం

అనంతపురం లోని పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి, శింగనమల నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ సమన్వయకర్త సాకె శైలజానాథ్‌.

హామీలు నెరవేర్చాలన్న ఆలోచన చంద్రబాబులో కనిపించడం లేదు..

సూపర్‌ సిక్స్‌ హామీలన్నీ అమలు చేసేశానని చెప్పుకోవడం సిగ్గుచేటు..

చంద్రబాబు ఏం మేలు చేశారని టీడీపీకి ప్రజలు ఓటేస్తారు..?  

అధికారం అండతో రిగ్గింగ్‌ చేసి పులివెందుల్లో టీడీపీ గెలిచింది..

ప్రెస్‌మీట్‌లో మాజీ మంత్రి సాకె శైలజానాథ్‌ స్పష్టీకరణ

అనంతపురం: స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో కూడా పచ్చి అబద్దాలు చెప్పిన చంద్రబాబుకి పొద్దస్తమానం జగన్‌ పేరు తలవకుండా రోజు గడవడం లేదని మాజీ మంత్రి, శింగనమల నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ సమన్వయకర్త సాకె శైలజానాథ్‌ ఎద్దేవా చేశారు. 
    అనంతపురం లోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వారం వారం అప్పులు, అబద్దాలతో సీఎం చంద్రబాబు ఏపీ బ్రాండ్‌ ఇమేజ్‌ని దెబ్బ తీస్తున్నారని ఆక్షేపించారు. అధికారంలోకి వచ్చిన 15 నెలల తర్వాత కూడా గత ప్రభుత్వం అంటూ మాపై బురద జల్లడం తప్ప, హామీల అమలుపై చంద్రబాబు ఆలోచన చేయకపోవడం ప్రజలను వంచించడమే అవుతుందని అన్నారు. అలాంటి టీడీపీకి ప్రజలు ఎలా ఓట్లు వేస్తారని ప్రశ్నించిన శైలజానాథ్, అధికారాన్ని అడ్డం పెట్టుకుని రిగ్గింగ్‌ చేసి పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిందని స్పష్టం చేశారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే..:

ఏపీ బ్రాండ్‌ని చంద్రబాబు నాశనం చేస్తున్నారు:

స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలోనైనా సీఎం చంద్రబాబు ఏదైనా ప్రజలకు ఉపయోగపడే కొత్త అంశాలు చెబుతాడని భావిస్తే గత ప్రభుత్వం అంటూ అవే పాత ఆవు కథలు చెప్పాడు. దీంతోపాటు సూపర్‌ సిక్స్‌ అమలు చేశానని ప్రకటించుకోవడం విడ్డూరంగా ఉంది. ఆఖరుకి స్వాతంత్య్ర వేడుకల్లో నాణ్యమైన మద్యం ఇస్తానని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటు. ఇదంతా చూస్తుంటే మా నాయకులు వైయస్‌ జగన్‌ చెప్పినట్టు ఇవే తనకి ఆఖరి ఎన్నికలనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చాడనిపిస్తుంది. ఆయన ఇప్పటికైనా మారకుండా ఇలాగే అబద్ధాలు చెబుతూ పోతుంటే గూగుల్‌లో చంద్రబాబు పేరు కొడితే మోసం, వెన్నుపోటు అని వస్తుందేమో.

ఇండిపెండెన్స్‌ డే రోజున అమలు చేస్తున్నట్టు బాకా ఊదుకున్న ఫ్రీ బస్సు పథకం పేరుతో మహిళలను మరోసారి వంచించాడు. ఎన్నికల్లో ఇచ్చిన హామీకి ఇప్పుడు అమలు చేస్తున్న విధానానికి ఏమాత్రం పొంతన కుదరడం లేదు. 15 నెలల పాలన చూస్తే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం జగన్‌ పేరు తలవడంతోనే చంద్రబాబుకి సరిపోయింది తప్ప ప్రజలకు చేసిన మేలు ఒక్కటీ లేదు. అప్పులు, అబద్దాలతో ఆంధ్రప్రదేశ్‌ బ్రాండ్‌ని చంద్రబాబు నాశనం చేస్తున్నాడు. 

తెచ్చిన అప్పులన్నీ ఏం చేస్తున్నారు?:

దాదాపు రూ.2 లక్షల కోట్లు అప్పు చేసి కూడా సూపర్‌ సిక్స్‌ లో ఏ ఒక్కహామీని సక్రమంగా అమలు చేయని చంద్రబాబు, అన్నీ చేశానని పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు. ఆయన చెప్పేది నిజమైతే, సీఎం చంద్రబాబు నాతోపాటూ వస్తే శింగనమల నియోజకవర్గంలో తిరుగుతాం. హామీలు ఎక్కడెక్కడ అమలయ్యాయ్యో రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకుంటారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆడబిడ్డ నిధి పథకం కింద నెలకు రూ.1500 ఎంతమందికి ఇచ్చారు..? రూ.32 వేల కోట్లు కేటాయించాల్సిన ఈ పథకానికి బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. చదువు పూర్తి చేసుకున్న 20 లక్షల మంది యువతకు నిరుద్యోగ భృతి ఎగ్గొట్టారు. మూడు గ్యాస్‌ సిలిండర్లు ఎంతమందికి ఇచ్చారో చెప్పాలి. 1.59 కోట్ల గ్యాస్‌ కనెక్షన్లకు మూడు ఉచిత సిలిండర్లు ఇవ్వాలంటే రూ. 4 వేల కోట్లు కావాలి. కానీ బడ్జెట్‌లో అందులో నాలుగోవంతు కూడా కేటాయించలేదు. ఉచిత ఇసుక అని చెప్పుకోవడమే కానీ, గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం కన్నా డబుల్‌ ధరలకు ఇసుకను విక్రయిస్తున్నారు. అది కూడా రాష్ట్ర ఖజానాకు చేరకుండా టీడీపీ నాయకులు జేబులు నింపుకుంటున్నారు.
    పెన్షన్‌ వెయ్యి రూపాయలు పెంచామని గొప్పలు చెప్పుకుంటూనే దాదాపు 5 లక్షలకు పైన పింఛన్లు ఊడపెరికేశారు. తల్లికి వందనం పథకానికి రూ.13 వేల కోట్లు కావాల్సి ఉంటే కేవలం రూ.8 వేల కోట్లు కేటాయించి 30 లక్షల మంది పిల్లలకు ఎగనామం పెట్టారు. అన్నదాత సుఖీభవ ఇవ్వకుండా చంద్రబాబు మరోసారి రైతు వ్యతిరేకి అని నిరూపించుకున్నాడు. రైతులకు ఎగ్గొట్టిన సాయం విలువ రూ.10 వేల కోట్లు పైనే ఉంటుంది. రైతులను ఆదుకోవాల్సింది పోయి ఉచిత పంటల బీమాను ఎత్తేశాడు. కోత పెట్టడమే తప్ప ప్రజలకు పెట్టే బుద్ధి చంద్రబాబుకి లేదు. కాబట్టే ప్రతిదాన్లో లబ్ధిదారులకు కోత పెడుతున్నాడు. ప్రజల విషయంలో కోతలు పెట్టే చంద్రబాబు, కార్పొరేట్లకు మాత్రం రాష్ట్రంలోని విలువైన భూములు ఎకరా రూపాయికే అప్పనంగా కట్టబెట్టేస్తున్నాడు. ఏడాదిలో కనీసం రోడ్లకు గుంతలు కూడా పూడ్చినట్టు కనిపించడం లేదు. 

రిగ్గింగ్‌తోనే పులివెందుల్లో టీడీపీ గెలిచింది:

ప్రజలకు మేలు చేయడంలో వైయస్‌ జగన్‌ని మించిన నాయకుడు దేశంలోనే లేరు. ఆయన కష్టపడి అనుమతులు తీసుకొచ్చి వ్యయప్రయాసల కోర్చి మెడికల్‌ కాలేజీలు నిర్మిస్తే, చంద్రబాబు వాటిని ప్రైవేటుపరం చేయడానికి తాత్కాలికంగా సేఫ్‌ క్లోజ్‌ చేయడం వైద్య విద్య చదవాలన్న పేద విద్యార్ధుల ఆశలపై నీళ్లు చల్లడమే. చంద్రబాబు ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు బకాయిలు పెట్టాడు. 
    అమరావతి పేరుతో చేస్తున్న అవినీతి దేశ చరిత్రలో నిలిచిపోతుంది. చదరపు అడుగు నిర్మాణానికి రూ.10 వేలు ఖర్చు చేస్తున్నారంటే ఇంతకన్నా మించిన అవినీతి ఉంటుందా? అధికారంలోకి వచ్చింది మొదలు అడుగడుగునా ఇన్ని అన్యాయాలు చేస్తే ఈ ప్రభుత్వానికి ఎవరైనా ఓటేస్తారా? అధికారం అండతో వ్యవస్థలను మేనేజ్‌ చేసి రిగ్గింగ్‌ తో గెలిచిందికాక, పులివెందుల్లో గెలిచామని సంబరాలు చేసుకుంటున్నారంటే చంద్రబాబుని మించిన అవివేకి ఇంకొకరు లేరనే అనుకోవాలి.

రాజధాని నిర్మాణానికి ఆ ప్రాంతం పనికి రాదని నిపుణులు చెప్పినా వినకుండా కమీషన్ల కోసం కక్కుర్తి పడి రాజధాని అమరావతిలోనే ఉండాలని చంద్రబాబు మూర్ఖంగా ముందుకెళ్లి అప్పులు తెచ్చిన సొమ్మునంతా వృథాగా నీటిపాలు చేస్తున్నాడు. అధికారంలోకి వచ్చి 15 నెలలవుతోంది. గత ప్రభుత్వం అంటూ మాపై నిందలు మోపి టైంపాస్‌ చేయడం చంద్రబాబుకు అలవాటుగా మారింది. అందుకే తెలుగుదేశం పార్టీని ప్రజలు భూస్థాపితం చేయడం ఖాయమని సాకె శైలజానాథ్‌ తేల్చి చెప్పారు.

<iframe width="914" height="514" src="https://www.youtube.com/embed/YwIQNu9ltaw" title="LIVE: Former Minister Sri Sake Sailajanath Press Meet" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>

Back to Top