బూతులు మాట్లాడే వ్యక్తి స్పీకర్ అయితే విపక్షాలకు న్యాయం జరుగుతుందా?

మాజీ మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు

ఒక్కరోజైనా బూతులు మాట్లాడకుండా అయ్యన్నపాత్రుడు  మాట్లాడారా?

వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డిగారిని ఓడిపోయాడు కానీ చనిపోలేదని దారుణంగా మాట్లాడారు

ఇలాంటి వ్యక్తి గౌరవ స్పీకర్ స్ధానంలో ఉంటే విపక్షాలకు న్యాయం జరుగుతుందా? 

ప్రజల గొంతు వినిపించడానికి అవకాశం ఇస్తారని ఎలా భావిస్తాం?

అధికార తెలుగుదేశం పార్టీ తీరుపై మాజీమంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ధ్వజం.

 శ్రీకాకుళం: బూతులు మాట్లాడే వ్యక్తి స్పీకర్ అయితే విపక్షాలకు న్యాయం జరుగుతుందా? అని వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుడు, మాజీ మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు ప్ర‌శ్నించారు.  స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు ఎన్నికైన నేపథ్యంలో వైయస్ఆర్‌సీపీ హాజరు కాలేదని ఆరోపిస్తున్నారని, అయ్యన్న పాత్రుడు గత ఐదేళ్లుగా మాట్లాడిన మాటలు గుర్తు తెచ్చుకోవాలని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ నేత డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. ఏ ఒక్కరోజైనా బూతులు మాట్లాడకుండా ఆయన మాట్లాడారా? అని నిలదీశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన రోజే అయ్యన్న పాత్రుడు మాట్లాడిన మాటలు ఈ సందర్భంగా అప్పలరాజు మీడియాకు ప్రదర్శించారు. ఇలాంటి వ్యక్తిని తీసుకొచ్చి స్పీకర్ ను చేస్తుంటేఅసెంబ్లీకి వచ్చిన అన్ని పార్టీల వారికీ న్యాయం జరుగుతుందనుకోగలమా?  ఓడిపోయాడు గానీ చావలేదు అన్న వ్యక్తి చేతిలో పెత్తనం పెడితే ఆయన ఇదే జగన్ మోహన్ రెడ్డి గారికి ప్రజల తరఫున గొంతు వినిపించడానికి అవకాశం కల్పిస్తారని ఎలా అనుకుంటాం? అని ప్రశ్నించారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు సైతం పార్టీలను అంటగట్టి పేపర్లో రాయడం ఎప్పుడైనా ఇప్పుడే చూస్తున్నామని, ప్రజలు, ప్రజాస్వామ్య వాదులు, మేధావులంతా గమనించాలని కోరారు.

ప్రమాణ స్వీకారం చేసిన రెండు వారాల్లోనే సీఎం చంద్రబాబు విధ్వంస పాలనకు నాంది పలికారని మాజీ మంత్రి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత డాక్టర్  సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు, ప్రభుత్వ ఆస్తులు, ఆర్బీకేలు ధ్వంసం చేయడం టీడీపీ చేస్తున్న కక్ష సాధింపు రాజకీయాలకు పరాకాష్టగా మారిందన్నారు. శ‌నివారం సీదిరి అప్ప‌ల‌రాజు మీడియాతో మాట్లాడారు.

 
చీకటి అధ్యాయానికి తెరతీశారు
’’ఏపీ చరిత్రలో జరిగిన రెండు సంఘటనలు చీకటి అధ్యాయానికి తెరలేపాయి. అందులో మొదటిది తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయడం, రెండోది ఏపీ శాసనసభ గౌరవ స్పీకర్ గా అయ్యన్న పాత్రుడును ఎంపిక చేయడం. అధికారంలోకి వచ్చిన పార్టీ ఏదైనా సరే ప్రజలు ఏ ఉద్దేశంతో అధికారాన్ని ఇచ్చారన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని పరిపాలన చేయాలి. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసి రెండు వారాలు కావస్తోంది. సూపర్ సిక్స్ హామీలు గతంలో ఇంటింటికీ వెళ్లి గ్యారెంటీ పత్రం కింద ఇచ్చారు. ఒక్క హామీ గురించి అయినా ఈరోజు ఎక్కడైనా మాట్లాడుతున్నారా?’’ అని అప్పలరాజు ప్రశ్నించారు.

బాబువి తేనెపూసిన మాటలు
అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు మాట్లాడిన కొన్ని సాత్విక మాటలు, తేనె పూసిన మాటలు గుర్తు తెచ్చుకోవాలని అప్పలరాజు అన్నారు. కక్షా రాజకీయాలకు అవకాశం లేని పరిపాలన చేద్దామని ఆయన అంటాడని, మంత్రులు కూడా తాము ఏ రకమైన రాజకీయ కక్షలకు, విధ్వంసాలకు పాల్పడబోమంటూ మసిపూసిన మాటలు మాట్లాడుతున్నారన్నారు. కానీ పేపర్ చూస్తే చాలు.. ఏ టీవీ అయినా, చివరకు ఈటీవీ చూసినా ఫలానా దగ్గర సచివాలయాన్ని, రైతు భరోసా కేంద్రాన్ని ధ్వంసం చేశారన్న వార్తలు వస్తున్నాయన్నారు. చంద్రబాబు హయాంలో గంటలతరబడి క్యూల్లో నిలబడాల్సిన దుస్థితి ఉంటే.. జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి రైతు ఇంటి వద్దకే విత్తనాలు, ఎరువులు అందించాలని సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు తెచ్చారని గుర్తు చేశారు. 

బీహార్ లో, ఉత్తర ప్రదేశ్ లో టీవీల్లో ఇలాంటి ఘటనలను చూసేవాళ్లమని, ఈరోజు అలాంటి విధ్వంసం ఆంధ్రప్రదేశ్ లో దాపురించాయని జాతీయ మీడియా కోడై కూస్తోందన్నారు. ఇది విజనరీనా, విధ్వంసమా? అని ప్రశ్నించారు.

పార్టీ కార్యాలయాలు కట్టుకోవచ్చని జీవో తెచ్చిందెవరు?
’’హైకోర్టు ఆదేశాలను లెక్క చేయకుండా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చేస్తారా? ఇది విధ్వంసం కాదా? వినాశనం కాదా? వైజాగ్, అనకాపల్లిలో వైయస్సార్ సీపీ కార్యాలయాలకు నోటీసులిచ్చారు. పార్టీ కార్యాలయాలు కట్టుకోవచ్చని జీవో ఇచ్చింది ఎవరు? చంద్రబాబు గారి హయాంలోనే కదా? మీరే జీవో తీసుకొచ్చి పార్టీ కార్యాలయాలు కట్టారు కదా. శ్రీకాకుళం, మంగళగిరిలో కట్టిన టీడీపీ కార్యాలయాలు వివాదంలో లేవా? రాష్ట్రంలో రాజ్యాంగం మారిపోయిందా? ఐపీసీ స్థానంలో ఎల్లో పీసీ వచ్చేసిందా? ఎవరైనా మాట్లాడితే వెంటనే కేసులు ఫైల్ చేస్తున్నారు. మొన్ననే నామీద ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అంటే నేను ఇక మీదట మాట్లాడకూడదని లెక్క. రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండకూడదు. ఎవరూ మాట్లాడకూడదు. ఎంతకాలం ఇలా.. ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి. ఎక్కడైతే కూల్చివేత మొదలవుతోందో అక్కడే పునర్మిర్మాణం జరుగుతుందన్నది గుర్తు పెట్టుకోవాలి.’’ అని సీదిరి అప్పలరాజు వ్యాఖ్యానించారు. 

ఏది విధ్వంసం? ఏది అభివృద్ధి?
’’రుషికొండలో 9 ఎకరాల్లో ప్రభుత్వ భవన నిర్మాణాలు అన్ని అనుమతులతో చేపడితే అదే మీకు విధ్వంసమా? 33 వేల ఎకరాల పచ్చని పైరు పండే భూమిని ధ్వంసం చేసినది విధ్వంసం కాదా? రామోజీ ఫిల్మ్ సిటీ, రామానాయుడు ఫిల్మ్ సిటీ, వైజాగ్ పోర్టు కట్టినప్పుడు విధ్వంసం, పర్యావరణ హాని కలగలేదా? రూ.500 కోట్లతో ప్రభుత్వ భవనాలు కడితే అది వృధా అంటున్నారు. అమరావతిలో లక్ష కోట్లతో క్యాపిటల్ నిర్మాణం జరిగితే అది వృధా కాదా? జీతాలు, పెన్షన్ల కోసం అప్పుడే అప్పులకు వెళ్లారు. అంటే ఈరోజు శ్రీలంక అయిపోవడం లేదా? సింగపూర్ అయిపోయిందా? జగన్ మోహన్ రెడ్డి గారి హయాంలో జీతాలివ్వడానికో, ఇంకో దానికో నిధుల సమీకరణ కోసం ఆర్బీఐ వేలానికి వెళ్తే అప్పు పుట్టనిదే జీతాలివ్వలేని పరిస్థితి, పథకాలు అమలు చేయలేని పరిస్థితి అని రాసే మీడియా.. ఈరోజు నిధుల సమీకరణలో అధికారులు.. ఒకటో తేదీకే పెన్షన్లు, జీతాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశాలు అంటూ రాతలు రాస్తున్నారు. ప్రజలు, మేధావులు ఇది గమనించాలి. 
జగన్ మోహన్ రెడ్డి గారు అవలంభించిన విధానాల వల్ల స్టేట్ షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్స్ రూ.5,340 కోట్లు అప్పుడే రాష్ట్రానికి వచ్చేసింది.’’ అని సీదిరి అప్పలరాజు స్పష్టం చేశారు.

Back to Top