హైదరాబాద్: కూటమి సర్కార్ పాలనలో కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. అక్రమ కేసుల్లో భాగంగా తాజాగా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు.. హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. నాటకీయ పరిణామాల మధ్య వంశీని విజయవాడకు తరలిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైయస్ఆర్‌సీపీ నేతలను టార్గెట్ చేసి అక్రమ కేసులు బనాయించింది. ఇందులో భాగంగానే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కూడా కేసులు పెట్టింది. దీంతో, ఆయనను అరెస్ట్ చేసేందుకు విజయవాడ పడమట పోలీసులు ప్లాన్ ప్రకారం హైదరాబాద్‌కు వచ్చారు. ఈ క్రమంలో గురువారం ఉదయం గచ్చిబౌలిలోని వంశీ ఇంటికి చేరుకుని నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా బీఎన్‌ఎస్ సెక్షన్ 140(1), 308, 351(3) రెడ్‌విత్ 3(5) కింద కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. అలాగే, వంశీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు సైతం పోలీసులు నమోదు చేశారు. ఇదే సమయంలో కిడ్నాప్, దాడి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో అరెస్ట్ చేస్తున్నట్టు వంశీ భార్యకు పోలీసులు నోటీసుల్లో తెలిపారు. అనంతరం, వంశీని అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తున్నారు. కక్షగట్టి మరో కేసు నమోదు: గన్నవరం టీడీపీ ఆఫీస్ దాడి కేసులో వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్‌పై ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఫిర్యాదుదారుడు సత్యవర్థన్ తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసుల కుట్రను మేజిస్ట్రేట్ ముందు సత్యవర్ధన్ బట్టబయలు చేశారు. ఈ నేపథ్యంలో వంశీని పోలీసులు టార్గెట్ చేశారు. కక్ష గట్టి మరో కేసు నమోదు చేశారు. సత్యవర్ధన్ ఫిర్యాదు వెనక్కి తీసుకున్న అనంతరం మరో అక్రమ కేసు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారు. ‘చంద్రబాబు, లోకేష్ ప్రతీకారంలో భాగమే వంశీ అరెస్ట్’ కూటమి సర్కార్ పాలనలో ప్రతీకారంతోనే వైయస్ఆర్‌సీపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారని పార్టీ నాయకులు మండిపడ్డారు. ఈ క్రమంలోనే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్‌ను వైయస్ఆర్‌సీపీ నేతలు ఖండించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు సంయమనంతో ఉండాలని కోరారు. ఉపసంహరించుకున్న కేసులో అరెస్టు ఏంటి?: బోత్స సత్యనారాయణ ఏపీలో కూటమి పాలనలో ఇష్టారీతిన అక్రమ కేసులు పెడుతున్నారు. ఉపసంహరించుకున్న కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్టు చేయడం ఏంటి? . వంశీ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం. కక్షపూరిత రాజకీయాలు ఉండకూడదు. ఇటువంటి రాజకీయాలు మంచిది కాదు. ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకూడదు. కక్ష సాధింపులో భాగంగానే వంశీ అరెస్ట్ : భూమన ‘వల్లభనేని వంశీ అరెస్టును ఖండిస్తున్నా. కక్ష సాధింపులో భాగంగానే అరెస్ట్ చేశారు. చంద్రబాబు, లోకేష్ ప్రతీకారంతోనే అరెస్ట్‌లు చేస్తున్నారు. వంశీ మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి సంతోషపడుతున్నారు. వైయస్ఆర్‌సీపీ నేతలందరిపై ప్రతీకార చర్యలకు దిగుతున్నారు. కార్యకర్తలు అందరూ సంయమనంతో ఉండాలి` అని భూమన కరుణాకర్‌రెడ్డి కోరారు. న్యాయపోరాటం చేస్తాం: దేవినేని అవినాష్ `కక్షపూరితంగా వంశీని అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోంది. కోర్టు వ్యాఖ్యలను కూడా కూటమి సర్కార్ పట్టించుకోవడం లేదు. కేవలం కక్ష సాధింపు కోసమే ఇలా ఇబ్బందులు పెడుతున్నారు. తప్పుడు కేసులపై కోర్టులు న్యాయం చేయాలి. భవిష్యత్ కాలంలో వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు ఎవరైన తప్పుడు కేసులు పెట్టారో వారిపై చట్టపరంగా ముందుకు వెళ్లడం జరుగుతుంది. వారికి శిక్ష తప్పదు అంటూ ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ హెచ్చరించారు.