ఓ పార్టీ కార్యకర్త ఫిర్యాదు చేస్తే రాత్రికి రాత్రే అరెస్టా?

పోసాని అక్ర‌మ అరెస్టు మంచిది కాదు

కూట‌మి పాల‌న‌లో పరాకాష్టకు చేరిన కక్షసాధింపు చర్యలు

అనంత‌పురం జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంక‌ట్రామిరెడ్డి ఫైర్‌

అనంతపురం :  ఓ రాజకీయ పార్టీ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కనీసం ప్రాథమిక విచారణ చేయడాకుండా రాత్రికి రాత్రే పోసాని కృష్ణ‌ముర‌ళిని అరెస్ట్‌ చేయడం ఏంటని అనంత‌పురం జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంక‌ట్రామిరెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని.. కక్షసాధింపుల్లో మాత్రం సఫలం అవుతోందని మండిప‌డ్డారు. సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్‌పై ఆయన స్పందించారు. గురువారం తన స్వగృహంలో మీడియాతో మాట్లాడారు.

 ఓ రాజకీయ పార్టీ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కనీసం ప్రాథమిక విచారణ చేయడాకుండా రాత్రికి రాత్రే పోసానిని అరెస్ట్‌ చేయడం ఏంటని ప్రశ్నించారు. 26వ తేదీ రాత్రి అరెస్ట్‌ చేసి నోటీసులో మాత్రం 27వ తేదీ రాత్రి అరెస్ట్‌ చేసినట్లు ఎలా పేర్కొంటారన్నారు. కూటమి ప్రభుత్వం తన కక్షసాధింపుల కోసం వ్యవస్థలను వాడుకుంటోందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు మంచిది కాదన్నారు. పోలీసుల తీరుపై సాక్షాత్తూ హైకోర్టు మొట్టికాయలు వేస్తున్నా వారిలో మార్పు రాకపోవడం బాధాకరమని తెలిపారు. 

9 నెలలుగా పాలనలో వైఫల్యం చెందుతున్న కూటమి ప్రభుత్వం డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తోందన్నారు. కూటమిలోని పార్టీలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా తప్పుడు కేసులు నమోదు చేస్తూ.. ప్రశ్నించే గొంతులను అణగదొక్కుతూ కక్షసాధింపు చర్యలకు పరాకాష్టకు చేరుస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పోలీస్‌ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని తెలిపారు. లోకేష్‌ రెడ్‌ బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేయడానికే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ పరిమితం అవుతున్నారని విమర్శించారు. ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడుతున్నాయని అనంత వెంక‌ట్రామిరెడ్డి హెచ్చరించారు.
 

Back to Top