అప్పులు తప్ప రాష్ట్రానికి చంద్రబాబు చేసిందేంటి?

మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్‌

మహానాడు అంతా ఆత్మస్తుతి, పరనింద

సైకిల్‌ గుర్తు ఎన్టీఆర్‌ సృష్టి

ఎన్టీఆర్‌ పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు హస్తం గుర్తు కింద ఉన్నాడు

వైయస్‌ జగన్‌ ధనిక సీఎం అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు

దేశంలో అత్యధిక ధనవంతుడైన రాజకీయ నాయకుడు చంద్రబాబు

 సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు ఏం సంపద సృష్టించారు?

తాడేపల్లి:  చంద్రబాబు పాలనలో ఐదేళ్లు అప్పులు తప్ప రాష్ట్రానికి చేసిందేమి లేదని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు, మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. మహానాడు పేరుతో అమాయకులను కూర్చోబెట్టి చంద్రబాబు సుత్తి కబుర్లు చెబుతున్నాడని మండిపడ్డారు. సీఎం వైయస్‌ జగన్‌పై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. దేశంలోనే అత్యంత ధనిక రాజకీయ నాయకుడు చంద్రబాబు అని చెప్పారు. అధికారం కోసం ఎలాంటి తప్పుడు మాటలైనా మాట్లాడే చంద్రబాబుకు ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదని పేర్ని నాని అన్నారు. శనివారం వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడారు.

మహానాడు అంతా ఆత్మస్తుతి, పరనిందః
రాజమండ్రిలో మహానాడు వేదికగా ఆత్మస్తుతి, పరనింద, చంద్రబాబు తన గొప్పలు చెప్పుకోవడానికి, జగన్‌ గారిపట్ల దూషణలు చేయడం..  తన డబ్బా కబుర్లు, మరొక్కసారి ఓట్లకోసం వల వేయడం లాంటి కార్యక్రమాలకు చంద్రబాబు శ్రీకారం చుట్టాడు. రాష్ట్రంలోని రోడ్లన్నీ రాజమండ్రి మీదుగా వస్తున్నాయంట. ఇలాంటి సుత్తికబుర్లతో చంద్రబాబు మహానాడులో వీరంగం చేస్తున్నాడు. సైకిల్‌కు కరెంట్‌ పెట్టాడంట. ఇక దూసుకుపోతాడంట. మామూలు సైకిల్‌కు కరెంట్‌ పెడితే ఏమవుతుందో సామాన్య జనాకి తెలియదా.. చక్రాలు ఊడిపోతాయని తెలుసుకో.. పోనీ, నీ పార్టీ గుర్తును మార్చుకున్నావా..? మోటారు సైకిల్‌ గుర్తు పెట్టుకుంటావా..? ఎన్టీఆర్‌ గారి దగ్గర దొంగతనం చేసిన అది దొంగ సైకిల్‌. చువ్వలు విరిగిపోతాయి జాగ్రత్త బాబూ..

ఎన్టీఆర్‌ దగ్గర దొంగలించిన సైకిల్‌ః
సైకిల్‌ గుర్తు ఎన్టీఆర్‌ సృష్టి అని బాబు చెబుతున్నాడు. దాంట్లో పేదవాడికి గుర్తుగా పూరిల్లు. రైతుకు గుర్తుగా నాగలి. యంత్రానికి గుర్తుగా చక్రం ఉందని బాబు ఈరోజు చెప్పినట్లు అది వందకు వందశాతం నిజమే. చంద్రబాబు జీవితంలో చెప్పిన ఏకైక నిజం ఇదే. మరి, టీడీపీ గుర్తును ఎన్టీఆర్‌ సృష్టించినప్పుడు చంద్రబాబు ఎక్కడున్నాడు..? హస్తం గుర్తు కింద కాంగ్రెస్‌ జెండా చుట్టుకుని ఉన్నాడు. అప్పట్లో రామారావును పొడిచేస్తానంటూ ప్రగల్భాలు పలికి సవాళ్లు విసురుకుంటూ కాంగ్రెస్‌ గూట్లో ఉన్నాడు.  లక్ష్మీపార్వతి గారిని అడ్డంపెట్టుకుని  రామోజీరావుతో కలిసి కుట్రలు, కుతంత్రాలు పన్నిన చంద్రబాబు తన స్వహస్తాలతో ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచాడు. ఈక్రమంలోనే ఎన్టీఆర్‌ స్థాపించిన టీడీపీ పార్టీని, ఆయన సృష్టించిన పార్టీ సైకిల్‌ గుర్తును లాగేసుకున్న నీచుడు ఈ చంద్రబాబు. వెన్నుపోటు పొడిచిన చేతులతోనే ఎన్టీఆర్‌ చిత్రపటానికి దండవేసి దండం పెట్టడానికి కూడా సిగ్గుపడకుండా ఉన్న చరిత్ర చంద్రబాబుకే చెల్లింది. 

చంద్రబాబు ఆస్తి రూ.1000 కోట్లుః
రాష్ట్రంలో ధనిక ముఖ్యమంత్రి జగన్‌ గారు అంటూ చంద్రబాబు తప్పుడు మాట మాట్లాడుతున్నారు. జగన్‌గారు డిక్లేర్‌ చేసిన ఆయన కుటుంబ ఆస్తి రూ.510 కోట్లు కాగా, ఈ దొంగ మాటలు మాట్లాడే చంద్రబాబు కుటుంబ సభ్యుల ఆస్తి మొత్తం రూ.1000(వెయ్యి) కోట్లు ఉంది. ఇదేదో మేం గాల్లో చెబుతున్న లెక్కలు కాదు. ఆయన ఎన్నికల డిక్లరేషన్, ఆయన కుటుంబ సభ్యుల ఐటీ రిటర్న్‌ల అధికారిక లెక్కలనే చెబుతున్నాం. బాబు, ఆయన భార్య, కొడుకు, కోడలు, మనువడి పేర్లతో ఉన్న ఆస్తులన్నీ కలిపి అంతస్థాయిలో ఉంటే.. ఈరోజు జగన్‌గారిపై తప్పుడు మాటలు మాట్లాడి బురదజల్లే రాజకీయం బాబుకు తగదని మేం హితవు చెబుతున్నాం. 

రెండెకరాల నుంచి రూ.1000 కోట్లు ఎలా గడించావుః
చంద్రబాబు ఒక విషయంపై నిజాయితీగా మాట్లాడాలి. అదేమంటే,  కర్జూరనాయుడు గారు, అమ్మణ్ణమ్మ కలిసి బాబుకు ఇచ్చిన ఆస్తి ఎంత..? మేం ఈ సందర్భంలో కిస్‌మిస్‌ నాయుడు గురించి మాట్లడటం లేదు. బాబు తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి ఎంత..? కేవలం రెండు ఎకరాల ఆస్తితో బయల్దేరి ఈరోజు రూ.1000 కోట్లదాకా ఎదిగావు కదా..? మరి, నువ్వేదో పక్కా నిఖార్సైన నీతిమంతుడైన రాజకీయనేతగా చెప్పుకుంటావా బాబూ..? అసలు, నువ్వు ఏం వ్యాపారం చేశావు.? 1992లో హెరిటేజ్‌ కంపెనీ రిజిస్ట్రర్‌ చేసి 1995–96లో హెరిటేజ్‌ ఫ్యాక్టరీ నిర్మాణం చేసేవరకు కూడా నువ్వేం వ్యాపారాలు చేశావు చంద్రబాబు..? సమాధానం చెప్పు. 
-హెరిటేజ్‌ కంపెనీ అనేదాన్ని నువ్వు ముఖ్యమంత్రి అయ్యేముందు ఏర్పాటు చేసి.. దాంట్లో పార్టనర్లుగా ఉన్న మోహన్‌బాబు లాంటి అనేకమందిని బయటకు సాగనంపావు కదా..? ఫ్యాక్టరీ ఏర్పాటు సమయంలో ముందుకు సాగని హెరిటేజ్‌ కంపెనీ బాబు ముఖ్యమంత్రి అయ్యాకనే ఎందుకు పరిగెత్తింది అనే విషయాన్ని ఆయన చెప్పగలడా..? ఈరోజు వేరేవాళ్లకు హెరిటేజ్‌ను ఎందుకు అంటగట్టాడు.. ఆయన ఇంట్లో వాళ్లు జీతాల కింద ఎంత తీసుకుంటున్నారు..? ఇందులో రహస్యమేంటి..? బాబు తప్పుడు పనులు, ప్రభుత్వ డైరీలను నిర్వీర్యం చేయడం అందరికీ తెలుసు కదా..? ఇవన్నీ బాబు దాస్తే దాగేవి కాదు.  

రూ.2.10 లక్షల కోట్లు డీబీటీ ద్వారా ఇస్తే.. అవినీతికి తావెక్కడ..?ః
చంద్రబాబు నోటివెంట వచ్చే ప్రతీ మాట అబద్ధమే. ఈ రాష్ట్రంలో రూ.2 లక్షల కోట్లు అవినీతి జరిగిందని ఆయన చెప్పడానికి నోరెలా వస్తుంది..? అసలు, రూ.2లక్షల చిల్లరగా ఉన్న ఈ రాష్ట్ర బడ్జెట్‌లో జీతాలకింద, అప్పులకు చెల్లిస్తున్న వడ్డీలు చంద్రబాబుకు తెలియవా..?.  గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌గారు నవరత్నాల కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలకు పథకాల ద్వారా డీబీటీ కింద పైసా లంచం లేకుండా నేరుగా ఇప్పటి వరకు జమ చేసిన మొత్తం అక్షరాలా రూ.2.10 లక్షల కోట్లు కాగా, ఎక్కడ అవినీతి జరిగిందని ఈరోజు చంద్రబాబు రంకెలేస్తున్నాడు..? ఆయన నోట్లో నుంచి మాటల్ని నిరూపించుకునే దమ్ముందా..? అని బాబును అడుగుతున్నాను. తప్పుడు మాటలతో, అసత్యప్రచారాన్ని పదిమార్లు చెబితే ప్రజల్ని నమ్మించవచ్చనే చంద్రబాబు దొంగ తెలివితేటలను ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. 

ఆషాడభూతి, నయవంచక శకుని వేషధారి చంద్రబాబేః
ఓట్లు అవసరం రాగానే జనం దగ్గర వేషాలేసే సంస్కృతి ఒక్క చంద్రబాబుకే ఉందనేది జగమెరిగిన సత్యం. ఎన్టీ రామారావు గారి దగ్గర ఆషాడభూతి వేషం వేసిందే చంద్రబాబు. ఆయనకు వెన్నుపోటు పొడిచి నయవంచకుడి వేషం వేసింది ఇదే చంద్రబాబు కాదా..? ఎన్టీఆర్‌ కుటుంబంలో చిచ్చుపెట్టి ముక్కలు ముక్కలు చేసిన శకుని పాత్రధారి ఎవరు..? చంద్రబాబే కదా..? రాజకీయాల్లో అందర్నీ వాడుకుని వదిలేసే తప్పుడు రాజకీయనేత వేషం కూడా చంద్రబాబుదే. ఎన్నికలు రాగానే ఓట్ల కోసం ప్రజల ముందు నక్కవినయాలు ప్రదర్శించే గుంటనక్క ఈ చంద్రబాబు. ఎండమావుల్లాంటి ఆశల్ని ఎరవేసి ఎన్నికల ముందు కార్యకర్తలే దేవుళ్లని.. ఎన్నికల తర్వాత వాళ్ల మొఖం చూడని తప్పుడు నాయకుడు చంద్రబాబు అని ఎవర్ని అడిగినా చెబుతారు. 

14 ఏళ్లు సీఎంగా ఉండి ఎంతమంది పేదల్ని కోటీశ్వరుల్ని చేశావ్ః
అధికారమే పరమావధిగా ప్రజల్ని మోసం చేయడమే లక్ష్యంగా పనిచేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని చెప్పుకోవచ్చు. 2024 ఎన్నికల్లో బాబుకు అధికారం ఇస్తే పేదల్ని కోటీశ్వరులుగా మారుస్తానంటూ ఈరోజు కొత్తపలుకులు పలుకుతున్నాడు. ఈ సందర్భంగా నేనొక ప్రశ్న వేస్తున్నాను. బాబు సమాధానమివ్వాలి. 1996 నుంచి 2004 దాకా బాబు అధికారంలో ఉన్నప్పుడు.. 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎంతమంది పేదవారిని కోటీశ్వరులుగా మార్చారో.. సమాధానం చెప్పండి..? అని నిలదీస్తున్నాను. సాంకేతికంగా బాబు పెద్ద తురుంఖాన్‌ అని చెబుతున్నాడు కదా..? మరి, ఎంతమంది నిరుపేదల్ని ఆయన అధికారంలో ఉన్నప్పుడు కోటీశ్వరుల్ని చేశాడో జాబితా ప్రింట్‌ తీసి చూపించమని అడుగుతున్నాను. 

మళ్లీ అధికారం కోరడానికి సిగ్గులేదా బాబూ..?
నువ్వు అధికారంలో ఉన్నప్పుడు చేయలేని పనిని రేపు అధికారం ఇస్తే చేస్తాననే మాట అనడానికి సిగ్గులేదా బాబూ..? మరి, నీహయాంలో పేదలు పేదలుగానే మిగిలారు తప్ప వాళ్లేవరూ కోటీశ్వరులు కాలేదు కదా..? అలాంటప్పుడు ఇంకా నీకు 2024లో పేదవర్గాల ఓటర్లు టీడీపీకి ఓట్లేసి నిన్ను ఎందుకు గెలిపించాలని నిలదీస్తున్నాను. అసలు బాబును ఎందుకు నమ్మాలి..? పేదల గురించి ఏ ఒక్క క్షణం ఆలోచించని ఆయన్ను రాజకీయాల్లో నుంచే పక్కనబెట్టాలని పేదవర్గాలు ఆలోచన చేయడంలో తప్పేం లేదుకదా..? అని చెబుతున్నాను. 

బాబు బతుకంతా తప్పుడు లెక్కలేః
మాట్లాడితే.. సంపద సృష్టించాను అని బాబు అంటాడు. ఇప్పటివరకు ఈ రాష్ట్రంలో బాబు సృష్టించిన సంపద ఎంత..? ఇచ్చాపురం నుంచి తడ దాకా అటు కర్నూలు నుంచి ఇటు బందరు దాకా బాబు అధికారంలో ఉన్నప్పుడు సృష్టించిన సంపద ఏంటని అడుగుతున్నాను. సమాధానం చెప్పగలరా..? 2014 నుంచి 2019 వరకు రాష్ట్ర ఆర్థిక పరిమితికి మించి రూ.26వేల కోట్లు మీ తప్పుడు లెక్కలతో అప్పులు చేసిన మాట వాస్తవం కాదా..? ఈ సత్యాన్ని మీ మంత్రి యనమల అప్పట్లో పబ్లిక్‌గానే చెప్పినసంగతి మరిచి పోయారా..? అని గుర్తుచేస్తున్నాను. జగన్‌ గారు సీఎం కాగానే, ప్రభుత్వ ఖజానాలో కేవలం రూ.100 కోట్లు మాత్రమే ఉన్నాయంటూ.. జీతాలిచ్చే పరిస్థితి కూడా లేదంటూ అప్పట్లో మీ రామోజీరావు తన ఈనాడు పత్రికలో రాసుకున్నది నిజం కాదా..? ఇదేకదా బాబు సృష్టించిన తప్పుడు సంపద అని వివరిస్తున్నాను. 

చంద్రబాబు 2019లో అధికారంలో నుంచి దిగేటప్పటికీ కాంట్రాక్టర్‌లకు బిల్లుల కింద చెల్లించాల్సినవి సుమారు రూ.40 వేల కోట్లు పైగానే ఉన్నాయి. ఆరోగ్యశ్రీ కింద రూ.650 కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి. రైతుల దగ్గర్నుంచి విత్తన సేకరణకు గానీ, వారికి అందించే ఇన్‌ఫుట్‌ సబ్సిడీ గానీ, ధాన్యం కొనుగోలు చేసిన దానికి రైతులకు చెల్లించాల్సినవి, వారికి ఉచితంగా అందించే పవర్‌ సబ్సిడీ .. ఇవన్నీ కలిపితే మొత్తం వేల కోట్లు బకాయిలు పెట్టి చంద్రబాబు దిగిపోయాడు. ఇది అనేక తప్పుడు విధానాలతో తప్పుడు పనులు చేసిన చంద్రబాబు బకాయిల బాగోతం. మరి ఆయన సృష్టించిన సంపద ఎక్కడ..? అని అడుగుతున్నాం. సమాధానం చెప్పే దమ్ముందా బాబూ..? జగన్‌ గారు ముఖ్యమంత్రి కాగానే ఆయనకు కనిపించిన బాబు తప్పుల అప్పుల కుప్పంతా రామోజీరావునే స్వయంగా వారి ఈనాడు పత్రికలో రాసుకున్నారు. 

 బాబుమార్కు పథకం ఒక్కటైనా ఉందా..?ః
పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలు గుర్తుంచుకోదగ్గ ఏ ఒక్క పథకాన్నైనా చంద్రబాబు అమలు చేశాడా..? అని ప్రశ్నిస్తున్నాను. బాబుకు- ఎన్టీఆర్, వైఎస్‌ఆర్, జగన్‌గారి పాలనలకు నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. కిలో రూ.2 బియ్యం పథకం ఎన్టీఆర్‌ తెస్తే.. ఆరోగ్యశ్రీ, ఫీజురీయింబర్స్‌మెంట్, ఉచిత విద్యుత్, 108 అంబులెన్స్‌లను  డ్వాక్రామహిళలకే పావలావడ్డీకే రుణాలు, శాచురేషన్‌ విధానంలో పింఛన్లు, ముస్లీంలకు 4శాతం రిజర్వేషన్‌ ప్రవేశపెట్టింది మహానేత వైఎస్‌ రాజశేఖరెడ్డి కాగా, అమ్మ ఒడి, 31 లక్షల మందికి ఇళ్లపట్టాలు, సచివాలయ వ్యవస్థ, రైతుభరోసాకేంద్రాలు తదితర నవరత్నాల పథకాలతో ఈరోజు జనరంజక పాలన అందజేస్తున్న జగన్‌గారు ప్రజలకు గుర్తుకువస్తుంటే.. బాబు పథకాల్లో ఏ ఒక్కటైనా జనానికి గుర్తుందా..? అని ప్రశ్నిస్తున్నాను. కాపులకు రిజర్వేషన్, మత్య్సకారులు, బోయ, రజకుల్ని ఎస్సీల్లో చేరుస్తాననే అబద్ధపు హామిలిచ్చి మొండిచేయి చూపిన నీచుడు ఈ చంద్రబాబు.  ఎన్టీఆర్, వైఎస్‌ఆర్, జగన్‌గార్ల పాలనలో ప్రజలకు సంక్షేమం అందితే.. బాబు హయాంలో మాత్రం ‘సమిక్షేమం’ అందజేశానని ఆయన చెప్పుకుంటాడు. 

తప్పుదోవలో సీబీఐ విచారణః
సీబీఐలో పనిచేస్తున్న కీలకమైన అధికారులు కొందరు రహస్య వ్యక్తుల ద్వారా ప్రేరేపించబడి ఉద్దేశపూర్వకంగా తప్పుదోవలో విచారణ చేస్తున్నారని మేం ముందునుంచి చెబుతూనే వస్తున్నాం. ఇవాళ హైకోర్టు బెంచి మీద నుంచి జడ్జి గారు కూడా ఇవే సీబీఐని ప్రశ్నించారు. సీబీఐ అధికారి ఎవరైతే ఉన్నారో.. ఆయన గుడ్డలూడదీసేలా జడ్జిగారు ప్రశ్నించిన సంగతి అందరం చూశాం కదా..? సీబీఐ ఏవిధంగా తప్పుడు దర్యాప్తు చేస్తున్నారో.. ఉద్దేశపూర్వకంగా ఎంపీ అవినాశ్‌ గారిని, జగన్‌ గారిని టార్గెట్‌ చేసి బురదజల్లే కుట్రగా సమాజానికి అర్ధమయ్యేటట్లు ఈరోజు హైకోర్టు చెప్పింది. సీబీఐలో ఉన్న ఒక కీలక అధికారి, వ్యవస్థల్ని మేనేజ్‌ చేయడంలో సిద్ధహస్తుడైన చంద్రబాబు ఎత్తుగడల్లో భాగంగానే ఆయనతో చేతులు కలిపి జగన్‌ గారిపై రాజకీయంగా కక్షసాధింపు తీర్చుకుంటున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇదే సంగతిని సమాజానికి కూడా మేం తెలియజేస్తున్నాం. 

 నౌ ఆర్‌ నెవర్‌ బాబుకు అధికారం రాదుః
చంద్రబాబు ఎన్ని పిల్లిమొగలేసినా ఆయనకు ఇక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారం అనేది రాదు రాదు. ఇది రాసిపెట్టుకోవాల్సిన వాస్తవం. 2019 ఎన్నికలతోనే ప్రజలు ఆయన రాజకీయ సమాధిని పేర్చారు. కనుక, ఆయన భ్రమల్లో బతకడమే గానీ ఎన్ని ఆసనాలు వేసినా... అధికారంలోకి రావడం కలేనని బాబు ఒప్పుకోవాల్సిందే.

Back to Top