ప్రైవేటీక‌ర‌ణ వ‌ద్దు.. ప్రత్యామ్నాయం చూడండి

`విశాఖ ఉక్కు` రాష్ట్రానికే ఆభరణం, ప్లాంట్‌ను కాపాడుకుంటాం

సంస్థ పునరుద్ధరణకు ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలి

కేంద్రంతో కలిసి పనిచేయడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది

పోరాడి సాధించుకున్న ప్లాంటు.. 2002 నుంచి 2015 వరకూ సంస్థ లాభాల్లోనే ఉంది

పెట్టుబడుల ఉపసంహరణ కన్నా అండగా ఉండి చేయూతనివ్వండి

రుణాలను ఈక్విటీలుగా మారిస్తే వడ్డీ భారం ఉండదు

సొంత గనులు కేటాయిస్తే ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది

విశాఖ స్టీల్ ప్లాంట్‌పై ప్ర‌ధాన‌మంత్రికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ లేఖ‌

తాడేప‌ల్లి: దీర్ఘకాలం పోరాడి సాధించుకున్న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ తెలుగు ప్రజలకు ఎప్పటికీ చెరగని ముద్రగానే నిలుస్తుందని, రాష్ట్ర సంస్కృతిలో ఒక భాగంగా నిలుస్తుందని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ అన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ (రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగం లిమిటెడ్‌–ఆర్‌ఐఎన్‌ఎల్, విశాఖ)లో వంద శాతం పెట్టుబడులు ఉపసంహరణపై పునరాలోచన చేయాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌.. ప్ర‌ధాని నరేంద్ర మోదీని కోరారు. సంస్థ పునరుద్ధరణకు ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలన్నారు. సంస్థ పునరుద్ధరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రానికి ఆభరణమైన ఈ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రభుత్వం కాపాడుకుంటామ‌ని, ప్రైవేటీక‌ర‌ణ నిర్ణ‌యాన్ని ఉప‌సంహ‌రించుకోవాల‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌ధానిని కోరారు. ఈ మేర‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌ధానికి లేఖ రాశారు. 

లేఖలోని అంశాలివీ..

- ఆర్‌ఐఎన్‌ఎల్‌ ఆధ్వర్యంలో పనిచేస్తున్న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ నుంచి వ్యూహాత్మకంగా వంద శాతం పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ (సీసీఈఏ) అనుమతిచ్చినట్లు మీడియాలో వచ్చిన వార్తలు రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. 
- ఆర్‌ఐఎన్‌ఎల్‌ అధీనంలో ఒక ప్రత్యేక సంస్థగా నిలిచిన విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ (వీఎస్‌పీ) కేంద్ర ఉక్కు శాఖ కింద పనిచేస్తూ, నవరత్నాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. 
- దాదాపు 20 వేల మందికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగా మరెందరికో విశాఖ నగరంలో ఉపాధి కల్పిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలలో అతిపెద్దగా నిలుస్తోంది.
- దేశంలోని సముద్ర తీర ప్రాంతంలో ఏర్పాటైన తొలి స్టీల్‌ ప్లాంట్‌ అయిన విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అత్యంత నాణ్యమైన ఉక్కును తయారుచేస్తూ.. నిర్మాణ, మౌలిక వసతులు, ఉత్పత్తి తోపాటు, ఆటోమొబైల్‌ రంగం అవసరాలు కూడా తీరుస్తోంది.
- ఇది దీర్ఘకాల పోరాటం ద్వారా సాధించుకున్న సంస్థ. దాదాపు దశాబ్ద కాలం పాటు ‘విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు’ అన్న నినాదంతో కొనసాగించిన ఉద్యమంలో 32 మంది అసువులు బాసారు. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్‌ 17, 1970లో నాటి ప్రధాని విశాఖలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుపై ప్రకటన చేశారు.
 
2015 వరకూ లాభాల్లోనే ఉంది..
2002 నుంచి 2015 వరకు విశాఖ ఉక్కు కర్మాగారం అత్యుత్తమ పనితీరు ప్రదర్శించి లాభాల బాటలో నడిచిందన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నాను. 2002లో ఖాయిలా పరిశ్రమగా బీఐఎఫ్‌ఆర్‌కు నివేదించారు. విశాఖ నగరంలోనే ఉన్న స్టీల్‌ ప్లాంట్‌కు 19,700 ఎకరాల భూమి ఉంది. దాని ప్రస్తుత మార్కెట్‌ విలువే సుమారు లక్ష కోట్లకు పైగా ఉంటుంది. సంస్థ ఉత్పత్తి సామర్థ్యం 7.3 మిలియన్‌ టన్నులు కాగా, ఇటీవలే ఆర్‌ఐఎన్‌ఎల్‌ సంస్థను ఆ«ధునీకరించడంతో పాటు, ఉత్పత్తి సామర్థ్యం పెంచడానికి విస్తరణ చర్యలు చేపట్టింది. ఆ దిశలో వనరుల సేకరణ కోసం ప్రయత్నాలు కూడా మొదలుపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ రంగంలో ఉత్పన్నమైన మాంద్యంతో విశాఖ ఉక్కు కర్మాగారం కూడా 2014–15 నుంచి క్రమంగా నష్టాల బాట పట్టింది. సొంతంగా గనులు లేకపోవడంతో ఉత్పత్తి వ్యయం దారుణంగా పెరిగింది. ఫలితంగా లాభాలు పూర్తిగా పడిపోయాయి.

చేయూతనిస్తే లాభాల బాటే..
విశాఖ ఉక్కు కర్మాగారం నుంచి పెట్టుబడులు ఉపసంహరించడం కంటే, ఆ సంస్థకు కాస్త అండగా నిలిచి చేయూతనిస్తే తప్పనిసరిగా అది లాభాల బాటలో నడుస్తుందని గట్టి నమ్మకంతో చెబుతున్నాను. సంస్థకు అవసరమైన గనులను కేటాయిస్తే ఉత్పత్తి వ్యయం గణనీయంగా తగ్గుతుంది. అదే విధంగా ఎక్కువ వడ్డీ రుణాలను, తక్కువ వడ్డీ రుణాలుగా మార్చడం, రుణాలను వాటాల రూపంలోకి మార్చాలనే ఈ కింది అంశాలను పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను..

‘టర్న్‌ ఎరౌండ్‌’ సాధనకు నిరంతర ఆపరేషన్‌
ఆర్థిక అంశాలకు సంబంధించిన అన్ని రంగాలతో పాటు, స్టీల్‌ రంగం కూడా ఆర్థిక మాంద్యం నుంచి క్రమంగా కోలుకుంటున్న విషయం తెలిసిందే. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పూర్తి ఉత్పాదక సామర్థ్యం 7.3 మెట్రిక్‌ టన్నులు కాగా, ఆర్‌ఐఎన్‌ఎల్‌ గత ఏడాది డిసెంబరు నుంచి 6.3 మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తితో గరిష్ట స్థాయిలో పనిచేస్తూ ప్రతినెలా దాదాపు రూ.200 కోట్ల లాభాలు ఆర్జిస్తోంది. ఇదే తరహాలో మరో రెండేళ్లు పనిచేస్తే, సంస్థ ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. 

ఉత్పత్తి వ్యయం తగ్గించేందుకు సొంత గనులు
ప్రస్తుతం విశాఖ స్టీల్‌ ప్లాంట్‌.. తన ఉత్పత్తి కోసం జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎండీసీ)కు చెందిన బైలదిల్లాలోని గనుల నుంచి మార్కెట్‌ ధరకు ఇనుప ఖనిజం కొనుగోలు చేస్తోంది. ఒక్కో మెట్రిక్‌ టన్ను ఇనుప ఖనిజాన్ని దాదాపు రూ.5,260కు కొనుగోలు చేస్తోంది. దేశంలోని అన్ని ఉక్కు కర్మాగారాలకు సొంతంగా ఇనుప ఖనిజ గనులున్నాయి. వాటి ద్వారా ఆయా సంస్థల అవసరాలు 60 శాతం మేర తీరుతుండగా, మిగిలిన ఇనుప ఖనిజాన్ని అవి ఎన్‌ఎండీసీకి చెందిన గనుల నుంచి కొనుగోలు చేస్తున్నాయి. చివరకు.. కేంద్ర ప్రభుత్వ రంగంలోని స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సెయిల్‌)కు కూడా 200 ఏళ్లకు సరిపడా ఇనుప ఖనిజం గనులు సొంతంగా ఉన్నాయి. కానీ, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఎన్‌ఎండీసీ నుంచి కొనుగోలు చేస్తోంది. దీంతో ఆర్‌ఐఎన్‌ఎల్‌పై రూ.3,472 కోట్లకు పైగా భారం పడుతోంది. అందువల్ల ఈ రంగంలోని మిగిలిన సంస్థలతో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పోటీపడే విధంగా సొంత గనులు కేటాయించాలి. ఇది ఉత్పత్తి వ్యయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఒడిశాలో ఒక ఇనుప ఖనిజం గని ఉంది. అది సంస్థ పునరుద్ధరణకు ఎంతో దోహదకారిగా నిలుస్తుంది.

ఆర్థిక పునర్వ్యవస్థీకరణ
సంస్థ స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలను ఈక్విటీలుగా మార్చడంవల్ల సంస్థపై రుణాలు తిరిగి చెల్లించే ఒత్తిడి తగ్గుతుంది. అలాగే, రుణాలపై వడ్డీల భారం కూడా తగ్గుతుంది. అంతేకాక.. సంస్థ రుణం భారం రూ.22 వేల కోట్లు కాగా, దానికి అత్యధికంగా 14 శాతం వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. ఈ రుణాలను బ్యాంకులు ఈక్విటీలుగా మారిస్తే, వడ్డీ భారం పూర్తిగా పోవడంతో పాటు, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్, విశాఖ) కూడా స్టాక్ ఎక్స్‌ఛేంజీలో లిస్ట్‌ అవుతుంది. ఆ ప్రక్రియతో స్టాక్‌ మార్కెట్‌ ద్వారా ప్రజల నుంచి నిధుల సేకరణకు అవకాశం కూడా ఏర్పడుతుంది.

ఈ చర్యలు సంస్థపై రుణభారం తగ్గిస్తాయి. తద్వారా పనితీరు మరింత మెరుగుకావడంతోపాటు ఆర్థికంగా వెసులుబాటూ కలుగుతుంది. అందువల్ల విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో వ్యూహాత్మకంగా వంద శాతం పెట్టుబడులు ఉపసంహరించాలని తీసుకున్న నిర్ణయంపై పునరాలోచన చేసి, సంస్థ పునరుద్ధరణకు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలి. సమాజానికి, ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకు ఎంతో విలువైన, ముఖ్యమైన విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పునరుద్ధరణ ప్రక్రియ కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top