నా నమ్మకం మంచి మీద, నా ధైర్యం ప్రజలు మీద

పెడన సభలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

దేవుడిచ్చిన ఈ పదవిని కోట్లాది ప్రజల మంచి కోసం వాడుతున్నా

జాతీయోద్యమంలో చేనేతలు గొప్ప పాత్ర పోషించారు

వైయస్‌ఆర్‌ నేతన్న నేస్తం పథకంతో చేనేత కుటుంబాలకు తోడుగా నిలిచాం

వరుసగా నాల్గవ ఏడాది 80,546 మంది నేతన్నల కుటుంబాల‌కు రూ.193 కోట్లు జమ

నేతన్న నేస్తం ద్వారా రూ.776 కోట్లతో ఒక్కో కుటుంబానికి రూ.96 వేలు అందజేశాం

మూడేళ్లలో నేతన్న సంక్షేమానికి రూ.2,049 కోట్లు వెచ్చించాం

గడిచిన మూడేళ్లలో ఏకంగా రూ.1.65 లక్షల కోట్లు డీబీటీ ద్వారా అందించాం

ప్ర‌భుత్వం అందిస్తున్న సాయంతో నేత‌న్న‌ల ఆదాయం మూడు రెట్లు పెరిగింది

మన చేనేత వస్త్రాలను అంతర్జాతీయ స్థాయి మార్కెట్‌కు పరిచయం చేశాం

దేశ చరిత్రలో ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వమైనా చేనేతలకు ఇంతగా అండగా నిలబడిందా..

జరుగుతున్న మేలును, మారుతున్న స్థితిగతులను ఒక్కసారి గమనించండి

నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలను ఉన్నత స్థాయికి చేర్చేలా అడుగులు

సామాజిక న్యాయం అంటే ఇది అని చేతల్లో చూపించిన ప్రభుత్వం మనది

మచిలీపట్నం పోర్టుకు కోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడం సంతోషం

కృష్ణా: ‘‘కోట్ల మంది ప్రజలకు మంచి చేయడానికి దేవుడు ఈ ముఖ్యమంత్రి పదవి ఇచ్చాడు. దేవుడునాకిచ్చిన అవకాశాన్ని మంచిచేయడం కోసం వాడుతున్నాను. నా నమ్మకం నేను చేసిన మంచి మీద, కోట్లాది మంది ప్రజల మీద ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాను. నా నమ్మకం ప్రజలు, నా ధైర్యం ప్రజలు అని సగర్వంగా తెలియజేస్తున్నా’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. వైయస్‌ఆర్‌ నేతన్న నేస్తం పథకం ద్వారా చేనేత కుటుంబాలకు అండగా నిలిచామని, వరుసగా మూడేళ్లలో నేతన్న నేస్తం పథకం ద్వారా ఒక్కో నేతన్న కుటుంబానికి రూ.72 వేలు అందజేశామని, నేడు అందిస్తున్న రూ.24 వేలతో కలిపి మొత్తం రూ.96వేలను చేనేత కుటుంబాలకు అందజేసినట్టు అవుతుందన్నారు. ఒక్క వైయస్‌ఆర్‌ నేతన్న నేస్తం పథకానికే నాలుగు విడుతల్లో రూ.776 కోట్లు అందించామని, అంతేకాకుండా సామాజిక పెన్షన్ల ద్వారా నేతలన్నకు మరో రూ.880 కోట్లు. ఆప్కో ద్వారా మరో రూ.393 కోట్లు.. ఇలా మూడేళ్లలోనే నేతన్నల సంక్షేమానికి మన ప్రభుత్వం తరఫున చేసిన వ్యయం ఏకంగా రూ.2,049  కోట్లు అని సగర్వంగా తెలియజేస్తున్నాను అని సీఎం వైయస్‌ జగన్‌ అన్నారు. 

కృష్ణా జిల్లా పెడనలో వరుసగా నాల్గవ ఏడాది వైయస్‌ఆర్‌ నేతన్న నేస్తం అమలుకు సీఎం వైయస్‌ జగన్‌ శ్రీకారం చుట్టారు. మగ్గం ఆడించి నూలు వడికిన సీఎం వైయస్‌ జగన్‌.. ఆ తరువాత ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చేనేత కుటుంబాలను, రాష్ట్రంలోని ప్రజలందరినీ ఉద్దేశించి ప్రసంగించారు. 

ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ ఏం మాట్లాడారంటే..
‘‘దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. పెడనలో వైయస్‌ఆర్‌ నేతన్న నేస్తంతో దాదాపు 80 వేల కుటుంబాలకు మంచిచేస్తూ రూ.193 కోట్లు నేరుగా బటన్‌ నొక్కి నేతన్న కుటుంబాలకు అందజేస్తున్నాం. 

మన నేతన్నలు మగ్గాల మీద కేవలం విడిగా ఉన్న ధారాలను కలిపి వస్త్రాలను చేయడమే కాదు.. ఒక రాట్నం, ఒక మగ్గం ఈ దేశ రూపురేఖలు మార్చేసింది. మన స్వాతంత్య్రసమర పోరాటం ఒక్కసారి గమనిస్తే.. భిన్నమతాలను, భిన్న కులాలను, భిన్న ప్రాంతాలను, భిన్న భాషలను, భిన్న ఆచారాలను అన్నింటినీ ఏకం చేసి జాతీయ ఉద్యమం చేయగలిగారు మననేతన్న. మన చేనేత గొప్పదైన మన సంస్కృతికి, మన చరిత్రకు, స్వాతంత్య్ర పోరాటాలకు నిదర్శనాలుగా నిలబడ్డాయి. అటువంటి మగ్గాన్ని, వేల సంవత్సరాల మన చేనేతను నమ్ముకొని ఈ పోటీ ప్రపంచంలో కూడా బతకడానికి ఇబ్బందులు పడుతున్న పరిస్థితులను శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రతి చోటా గమనిస్తూనే ఉన్నాం. వారిని ఆదుకోవాలనే ఆలోచన ఏ ఒక్కరూ చేయలేదు. అటువంటి ఆలోచన, అటువంటి గట్టి అడుగులు మీ బిడ్డ ఆధ్వర్యంలో జరుగుతున్నాయని సగర్వంగా తెలియజేస్తున్నాను. 

అద్భుతమైన వస్త్రాలను నేచే నేతన్న జీవితాలు ఎలా ఉన్నాయో నా 3648 కిలోమీటర్ల పాదయాత్రలో చాలా చోట్ల గమనించా. నా కళ్లారా చూశా. చెప్పిన బాధలన్నీ విన్నాను. నేను విన్నాను.. నేను ఉన్నానని ఆరోజు ఏదైతే చెప్పానో.. ఆ మాటను మర్చిపోలేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే వైయస్‌ఆర్‌ నేతన్న నేస్తం పథకం 2019లో నా పుట్టినరోజు నాడే శ్రీకారం చుట్టాను. మగ్గం, నేతన్న మీద ఉన్న నా ప్రేమకు నా పుట్టినరోజున చేసిన ఆ కార్యక్రమానికి నిదర్శనం. మగ్గం ఇంట్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆదుకునేలా వైయస్‌ఆర్‌ నేతన్న నేస్తం ప్రతీ సంవత్సరం క్రమం తప్పకుండా రూ.24 వేలు అందజేసే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. గడిచిన మూడేళ్లలో ఏ ఒక్క సంవత్సరం మిస్‌ కాకుండా ప్రతీ సంవత్సరం రూ.24 వేలు ఇచ్చుకుంటూ ఇప్పటికే రూ.72 వేలు అందజేశాం. ఈరోజు నాల్గవ సంవత్సరం మగ్గమున్న ప్రతీ నేతన్న కుటుంబానికి మరో రూ.24 వేలు బటన్‌ నొక్కి నేరుగా వారి బ్యాంక్‌ అకౌంట్లలోకి జమ చేయబోతున్నాం. ఆ కార్యక్రమం కూడా నేతలన్నకు ఉన్న గత అప్పులకు ఏ బ్యాంక్‌ జప్తు చేసుకోకుండా నేతన్నలకు తోడుగా ఉండే కార్యక్రమం చేస్తున్నాం. 

ఈరోజుతో నాలుగో ఏడాది రూ.24 వేలతో కలిపి ప్రతీ కుటుంబానికి అక్షరాల రూ.96 వేలు కేవలం వైయస్‌ఆర్‌ నేతన్న నేస్తం ద్వారా అందించడం జరిగిందని మీ బిడ్డలా సగర్వంగా తెలియజేస్తున్నాను. వైయస్‌ఆర్‌ నేతన్న నేస్తం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 80,546 నేతన్న కుటుంబాలకు అక్షరాల రూ.193 కోట్లు నేరుగా వారి బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేస్తున్నాం. ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు.. నేరుగా బటన్‌ నొక్కుతున్నాం.. నేరుగా ఆ కుటుంబాలకు డబ్బు చేరుతుంది. ఈ తేడాను  గమనించాలని ప్రతీ నేతన్న కుటుంబాన్ని వినయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. 

రూ.193 కోట్లు 80,546 నేతన్న కుటుంబాలకు ఇచ్చే ఈ డబ్బుతో కలిపితే మూడేళ్ల పరిపాలన కాలంలో అక్షరాల రూ.776 కోట్లు కేవలం వైయస్‌ఆర్‌ నేతన్న నేస్తం ద్వారా ప్రతి కుటుంబానికి రూ.96 వేలు ఇచ్చినట్టుగా అవుతుందని సగర్వంగా తెలియజేస్తున్నాను. నేతన్నల కోసం వైయస్‌ఆర్‌ నేతన్న నేస్తం ద్వారా చెల్లించిన రూ.776 కోట్లు కాకుండా.. సామాజిక పెన్షన్ల ద్వారా నేతలన్నకు అందించింది మరో రూ.880 కోట్లు. ఆప్కో ద్వారా చెల్లించింది మరో రూ.393 కోట్లు ఇలా మూడేళ్లలోనే నేతన్నల సంక్షేమానికి మన ప్రభుత్వం తరఫున చేసిన వ్యయం ఏకంగా రూ.2,049  కోట్లు అని సగర్వంగా తెలియజేస్తున్నాను. 

భారత దేశ చరిత్రలో ఏ ఒక్క రాష్ట్రంలో అయినా గతంలో మన రాష్ట్రాన్ని పరిపాలించిన ప్రభుత్వం అయినా మన నేతన్నలకు ఇంతగా అండగా నిలబడిందా అనేది మనసాక్షిని అడగండి అని కోరుతున్నాను. ఇలా మనందరి ప్రభుత్వం నేతన్నల వృత్తికి, వారి ఆదాయానికి, వారి కుటుంబాలకు తోడుగా ఉంటూ చేసిన వ్యయం వల్ల.. నేతన్న కుటుంబాలకు ఎలాంటి మంచి జరిగిందో రెండు మాటల్లో చెబుతాను. 

ఈ ఆర్థికసాయంతో తమ మగ్గాలను.. జాకర్డ్‌ లిఫ్టింగ్‌ మెషీన్లు తదితర ఆధునీక పరికరాలతో అప్‌గ్రేడ్‌ చేసుకునే అవకాశం చాలా మంది నేతలన్నకు అవకాశం వచ్చింది. కొత్త డిజైన్లతో నాణ్యమైన వస్త్రాలను ఉత్పత్తి చేయడం ప్రారంభించారు. సులువుగా మగ్గాన్ని నడపడం మొదలుపెట్టారు. ఇలా ఈ ఆర్థికసాయం వారి బ్రతుకులను ఏ స్థాయిలో మార్చిందో గమనిస్తే.. 2018–19లో నెలకు రూ.4680 మాత్రమే ఉన్న ఆదాయం.. ఈరోజు వైయస్‌ఆర్‌ నేతన్న నేస్తం దన్నుతో వారుమగ్గాలు అప్‌గ్రేడ్‌ చేసుకోవడం వల్ల ఏకంగా ఆదాయం మూడు రెట్లు పెరిగి రూ.15 వేలకు చేరిందని ప్రతీ స్టడీ చెబుతుంది. 

అంతేకాకుండా నేసిన వస్త్రాలకు సరైన ధర లభించేలా మార్కెటింగ్‌లో కూడా విపరీతమైన మార్పులు తీసుకువచ్చాం. అప్కో వస్త్రాలను మన ప్రభుత్వం వచ్చిన తరువాత ఆన్‌లైన్‌ ద్వారా అంతర్జాతీయ మార్కెట్‌కు వీరిని పరిచయం చేశాం. నేతన్న ఆదాయం పెంచే దిశగా అడుగులు వేస్తూ.. ఈకామర్స్‌ సంస్థలు అయిన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్ర, గోక్రాప్, లూమ్‌ఫోక్స్, మిరావ్‌ వంటి వ్యాపార దిగ్గజాలతో ఒప్పందాలను చేసుకొని ఆప్కో ద్వారా పూర్తిగా మార్కెటింగ్‌ చేసే స్థాయికి పెంచగలిగాం. ఇంతగా మనసు పెట్టి నేతన్నలకు మేలు చేసిన ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడైనా చూశారా..? అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలని కోరుతున్నాను. 

ఒక్క నేతన్నలే కాదు.. బీసీ సోదరులు, అక్కచెల్లెమ్మలూ అందరూ ఆలోచన చేయండి. వారి ఆర్థిక, రాజకీయ, సామాజిక, విద్య, మహిళా సాధికారతల కోసం మనందరి ప్రభుత్వం మనసుపెట్టి ఈ మూడేళ్ల కాలంలో ఏం చేశామో నాలుగు మాటల్లో చెబుతాను. 

- బీసీ కమిషన్‌ను శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేసిన తొలి ప్రభుత్వంమనది. 
- బీసీ కులాలకు ఏకంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన తొలి ప్రభుత్వం మనది.
- బీసీలను బ్యాక్‌ బోన్‌ (వెన్నెముక)క్లాస్‌లుగా మారుస్తానని మాటిచ్చా. ఆ మాట నిలబెట్టుకుంటూ అక్షరాల రూ.1.65 లక్షల కోట్లు డీబీటీ ద్వారా అందించాం. ఇందులో నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలకు చెందిన అక్కచెల్లెమ్మలకే 75 శాతం పైగా డబ్బులు ఇవ్వగలిగాం. 
- మంత్రి మండలిని గమనిస్తే.. మొదటి విడతలో 56 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇస్తే.. రెండో విడతలో 70 శాతం మంత్రిమండలిలో పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇచ్చాం. 
- రెండు మంత్రి వర్గాల్లో ఐదుగురికి డిప్యూటీ సీఎం పదవులు ఇస్తే.. అందులో నాలుగు అంటే 80 శాతం నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే అవకాశం ఇచ్చాం. 
- శాసనసభ స్పీకర్‌గా బీసీ, శాసనమండలి చైర్మన్‌గా ఎస్సీ, మండలి డిప్యూటీ  చైర్‌పర్సన్‌గా నా మైనార్టీ అక్క కనిపిస్తుంది. 
- సామాజిక న్యాయ చరిత్రలో ఒక సరికొత్త అధ్యయానికి శ్రీకారం చుట్టాం. 
- ఈ మూడేళ్ల కాలంలో రాజ్యసభకు 8 మందిని పంపిస్తే అందులో నలుగురు బీసీలే. 
- శాసనమండలికి ప్రభుత్వం వచ్చిన తరువాత 32 మందిని పంపిస్తే..  వారిలో 18 మంది నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఉన్నారు. 
- 98 మంది మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీ చైర్మన్‌ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చింది ఏకంగా 70 పదవులు అంటే 71.4 శాతం పదవులు ఇచ్చాం. 
- మొత్తం మండల ప్రజా పరిషత్‌ అంటే ఎంపీపీల పదవులు చూస్తే 648 అయితే మన పార్టీ గెలుచుకుంది 637. అందులో నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 66.7 శాతం కట్టబెట్టాం. 
- జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో 13 స్థానాల్లో వైయస్‌ఆర్‌ సీపీ క్లీన్‌స్వీప్‌ చేసింది. వీటిలో నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు 13లో 9 అంటే 70 శాతం పదవులు ఇచ్చాం. 

అంతెందుకు ఒకే ఒక్క చిన్న ఉదాహరణ.. గతంలో చంద్రబాబు పాలన 2014–19లో కృష్ణా జిల్లాను తీసుకోండి.. అప్పుడు జెడ్పీ చైర్మన్‌ ఎవరు.. విజయవాడ మేయర్‌గా పనిచేసింది ఎవరు..? మన కనకదుర్గమ్మ టెంపుల్‌ చైర్మన్‌గా పనిచేసింది ఎవరు..? గతంలో విజయవాడ మేయర్‌ కోనేరు శ్రీధర్, కృష్ణా జిల్లా జెడ్పీ చైర్మన్‌గా పనిచేసింది గద్దె అనురాధ, కనకదుర్గాటెంపుల్‌ చైర్మన్‌ యలమంచిలి గౌరంబాబు అందరూ ఒకే సామాజికవర్గానికి చెందినవారు. కానీ, ఈరోజు విజయవాడ మేయర్‌ నా చెల్లి భాగ్యలక్ష్మి బీసీ, కృష్ణా జిల్లా నా మరో చెల్లి హారిక బీసీ, కనకదుర్గమ్మ గుడికి చైర్మన్‌గా నా బీసీ అన్న సోమినాయుడు.. ఎక్కడ చూసిన ఈరోజు కనిపిస్తుంది నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలే కనిపిస్తున్నారు. సామాజిక న్యాయం అంటే ఇది అని చేతల్లో చూపించిన ప్రభుత్వం మనది.

నామినేటెడ్‌ పదవులు, నామినేటెడ్‌ పనుల్లో ఏకంగా 50 శాతం నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇవ్వాలని రిజర్వేషన్‌ కల్పిస్తూ ఏకంగా చట్టం చేసిన ప్రభుత్వం మనది. అందులో కూడా 50 శాతం పదవులు అక్కచెల్లెమ్మలకే రిజర్వేషన్‌ కల్పిస్తూ చట్టం చేసిన ప్రభుత్వం మనది. వివిధ కార్పొరేషన్‌లకు చైర్మన్‌లను నియమించాం. దాదాపుగా 137 చైర్మన్‌ పదవుల్లో నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఏకంగా 58 శాతం ఇచ్చాం. ఇందులో అక్షరాల 50 శాతం నా అక్కచెల్లెమ్మలకే ఇచ్చాం. బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. ఎస్సీలకు ప్రత్యేకంగా 3 కార్పొరేషన్లు, ఎస్టీలకు ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్‌ ఏర్పాటు చేశాం. 

వ్యవసాయ మార్కెటింగ్‌ కమిటీల్లో నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కనిపిస్తారు. 50 శాతం పైచిలుకు నా అక్కచెల్లెమ్మలు కనిపిస్తారు. ఆలయ బోర్డుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందులో సగం మంది అక్కచెల్లెమ్మలు కనిపిస్తారు. తేడా గమనించండి అని కోరుతున్నాను. ఈ వర్గాలందరికీ వందశాతం మేలు జరిగించాలనే తపన, తాపత్రయంతో మన ప్రభుత్వం అడుగులు ముందుకేస్తుంది. పేదరికం నుంచి వీరంతా బయటపడాలి.. పేదరికం అనేది వీరి ఛాయలకు కూడా రాకూడదు. వీరి పిల్లలు బాగా చదవాలి.. పెద్దపెద్ద ఉద్యోగాలకు ఎదగాలి. డాక్టర్లు, ఇంజినీర్లు, కలెక్టర్లు వంటి పెద్ద స్థానాల్లో ఉండాలి. పేదరికం నుంచి బయటకు రావాలి. వందశాతం ఫీజురీయింబర్స్‌మెంట్‌తో విద్యా దీవెన అనే పథకాన్ని అమలు చేస్తున్నాం. విద్యా దీవెన ఒక్కటే కాదు.. వసతి దీవెన అనే పథకానికి శ్రీకారం చుట్టి అమలు చేస్తున్నాం. 

నా అక్కచెల్లెమ్మల పిల్లలు బాగా చదవాలి. భావి ప్రపంచంతో పోటీపడాలి. ఇంగ్లిష్‌ మీడియంలో చదవాలని, మొత్తం గవర్నమెంట్‌బడులన్నీ రూపురేఖలు మారుస్తూ నాడు–నేడు పథకం తీసుకువచ్చాం. ఇంగ్లిష్‌ మీడియం తీసుకువచ్చాం. నా అక్కచెల్లెమ్మలు బాగుపడాలి.. వారి జీవితాల్లో వెలుగు నింపాలి.. ఇల్లు లేని అక్కచెల్లెమ్మ ఉండకూడదని ఏకంగా 31 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేశాం. ఆ పట్టాలన్నీ నా అక్కచెల్లెమ్మల పేరు మీదనే రిజిస్ట్రేషన్‌ చేయించాం. ఈరోజు శరవేగంగా వివిధ దశల్లో 22 లక్షలకు సంబంధించి ఇళ్ల నిర్మాణం కొనసాగుతోంది. ఈ ఇళ్లు పూర్తవుతే.. ఒక్కో ఇంటి విలువ కనీసం రూ.7–10 లక్షలు ఉంటుందని అనుకున్నా.. అక్షరాల 31 లక్షల ఇళ్లు అంటే ఏకంగా నా అక్కచెల్లెమ్మల చేతుల్లో రూ.2–3 లక్షల కోట్లు పెట్టినట్టు అవుతుంది. ఇంతగా అక్కచెల్లెమ్మల గురించి ఆలోచన చేస్తున్నాం. అక్కచెల్లెమ్మలు చిరునవ్వుతో, సంతోషంగా ఉంటే ఆ కుటుంబం బాగుపడుతుందని ప్రతీ పథకంలో అడుగులు ముందుకువేశాం. 

జగనన్న అమ్మఒడి, జగనన్న ఆసరా, జగనన్న సున్నావడ్డీ, జగనన్న చేయూత ప్రతీ పథకం అక్కచెల్లెమ్మలకు తోడుగా నిలిచాం. ఈ మధ్య కాలంలో గవర్నమెంట్‌లో ఉద్యోగాలిచ్చాం. దాదాపు 1.30 లక్షల మంది గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇందులో నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ చెల్లెమ్మలు, తమ్ముళ్లు అక్షరాల 86 శాతం అని సగర్వంగా తెలియజేస్తున్నాను. బతుకులు మారుతున్నాయి.. రూపురేఖలు మార్చే అడుగులు మన రాష్ట్రంలో పడుతున్నాయి. రాష్ట్ర చరిత్రలో, బహుశా దేశ చరిత్రలోనూ ఏ ప్రభుత్వంలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, మహిళా న్యాయాలకు ఈరోజు ఎప్పుడూ జరగని విధంగా అడుగులు పడుతున్నాయి. 

ఇన్ని మంచి పనులు జరుగుతున్నాయని జీర్ణించుకోలేని కుట్రదారులు చాలామంది ఉన్నారు. మంచి జరుగుతుంటే సంతోషపడే హృదయాలు కావు ఇవి. రాళ్లు వేసే హృదయాలు అవి. అటువంటి కుళ్లు, కుతంత్రాలు ఈరోజు మన కళ్ల ఎదుటనే చూస్తున్నాం. కోట్ల మందికి మంచి చేయడానికి దేవుడు ఈ ముఖ్యమంత్రి పదవి ఇచ్చాడని అనుకుంటే..  ఆ నమ్మకం జనం మీద పెట్టుకొని పరిపాలన చేస్తారు. నేను  చేస్తున్నది అదే. దేవుడునాకిచ్చిన అవకాశాన్ని మంచిచేయడం కోసం వాడుతున్నాను. నేను చేసిన మంచి మీద నా నమ్మకం, ప్రజలందరి మీద ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాను. 

కానీ, కుట్రదారులు ఎలా ఉన్నారంటే.. వారికి అప్పట్లో ఇచ్చిన సీఎం పదవి.. కేవలం తన వాళ్ల కోసం, తన ఈనాడు, తన ఆంధ్రజ్యోతి, తన టీవీ5, తన దత్తపుత్రుడు కోసం.. వారంతా కలిసి రాష్ట్రాన్ని దోచుకో, పంచుకో, తినుకో అనే స్కీమ్‌ కోసం గతంలో నడిచిన పరిపాలన గమనించండి. టీడీపీ ప్రభుత్వంలో డీపీటీ స్కీమ్‌ నడిచింది. ఈరోజు తేడాను గమనించండి. ఆరోజున ఇదే రాష్ట్రం,ఇదే బడ్జెట్‌.. ఆ రోజు అప్పులు కంపౌండెట్‌ యానివల్‌ గ్రోత్‌ రేట్‌ 19 శాతం ఉంటే.. ఈరోజు 15 శాతం మాత్రమే.. గతంలో కంటే అప్పులు తక్కువగానే చేస్తున్నాం. ఈరోజు అదే రాష్ట్రం, అదే బడ్జెట్‌ కేవలం తేడా ముఖ్యమంత్రి మార్పు. మరి వారెందుకు చేయలేకపోయారు.. మీ బిడ్డ ఎలా చేయగలుగుతున్నాడని ఒక్కసారి ఆలోచన చేయండి అని కోరుతున్నాను. 

అక్షరాల రూ.1.65 లక్షల కోట్లు ఈ మూడేళ్ల కాలంలోనే నా అక్కచెల్లెమ్మలకు ఇవ్వగలిగాను అంటే కారణం..ఈరోజు లంచాలు లేవు, వివక్ష లేదు. మీ బిడ్డ బటన్‌ నొక్కుతున్నాడు.. నేరుగా నా అక్కచెల్లెమ్మల బ్యాంక్‌ అకౌంట్‌లోకి డబ్బులు చేరుతున్నాయి. తేడాను గమనించాలని కోరుతున్నాను. నాకు వీళ్ల మాదిరిగా ఎన్నెన్నో పత్రికలు, ఎన్నెన్నో టీవీ చానళ్లు లేవు.. నాకు ఈనాడు, ఆంధ్రజ్యోతి సపోర్టు. టీవీ5 అండ ఉండకపోవచ్చు.. దత్తపుత్రుడి సాయం అంతకంటే ఉండకపోవచ్చు.. వాళ్లకులేనిది నాకు ఉన్నది దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు కచ్చితంగా చెబుతున్నాను. నా నమ్మకం ప్రజలు, నా ధైర్యం ప్రజలు అని తెలియజేస్తున్నాను. దేవుడు ఇంకా మంచి చేసే  అవకాశం మీ బిడ్డకు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 

పోర్టు శంకుస్థాపన చేసేందుకు ఈ జిల్లాకు వస్తాను

చివరగా పెడన నియోజకవర్గ అభివృద్ధి గురించి జోగి రమేష్‌ అడిగాడు. 102 కోట్ల రూపాయలకు సంబంధించి పనులు కావాలని కోరారు. రోడ్లు,కాంపౌండ్‌ వాల్, డ్రైనేజీ సిస్టమ్, నీటి సరఫరా, బ్రిడ్జి,బీటీ రోడ్లు రకరకాల ప్రపోజల్స్‌ జోగి రమేష్‌ ఇచ్చాడు. ఇవాళ చెబుతున్నాను.. 102 కోట్లు అడిగాడు.. మొత్తం మంజూరు చేస్తున్నానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకో శుభవార్త కూడా వచ్చింది.. కాసేపటి కిందటనే మచిలీపట్నం పోర్టుకు కోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని తెలిసింది. ఇక నా తరువాత కార్యక్రమం ఆ మచిలీపట్నం పోర్టుకు శంకుస్థాపన చేసేందుకు ఈ జిల్లాకు వస్తాను. 
 

Back to Top