గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాం 

హోం, గిరిజన సంక్షేమం, వివిధ శాఖల అధికారులతో సీఎం వైయ‌స్‌ జగన్‌ సమీక్ష

కేంద్ర హోం శాఖ సమావేశం నేపథ్యంలో సీఎం సమావేశం

తాడేప‌ల్లి:  గిరిజ‌నుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నామ‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అన్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా గిరిజనులకు ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలు ఇచ్చామ‌ని చెప్పారు. వామపక్ష తీవ్రవాదంపై కేంద్ర హోంశాఖ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వంలోని పలు శాఖలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సెప్టెంబరు 26న సమావేశం నేపథ్యంలో హోం, గిరిజన సంక్షేమంతో పాటు వివిధ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. ఢిల్లీలో కేంద్ర హోంశాఖ సమావేశంలో ప్రస్తావించనున్న అంశాలపై చర్చించారు. గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, పాఠశాలలు, ఇతర మౌలిక వసతుల కల్పన  విషయంలో కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై చర్చ జరిపారు. 

రాష్ట్రంలో మావోయిస్టుల కార్యకలాపాలు, తదితర అంశాలను సమావేశంలో డీజీపీ వివరించారు. మావోయిస్టుల కార్యకలాపాలు గణనీయంగా తగ్గాయని డీజీపీ తెలిపారు. సాయుధ మావోయిస్టుల బలం సుమారు 50కి పరిమితమైందన్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకే పరిమితమైందని డీజీపీ తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు గిరిజనుల జీవితాలపై విశేష ప్రభావం చూపుతున్నాయన్నారు.  గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా వారి గడప వద్దకే సేవలు అందుతున్నాయన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలు అతిపెద్ద కార్యక్రమమని, దీనిపట్ల గిరిజనులు సంతోషంగా ఉన్నారని డీజీపీ వెల్లడించారు. మావోయిస్టుల రిక్రూట్‌మెంట్‌ పట్ల గిరిజన యువకులు ఆసక్తి చూపడం లేదన్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలే దీనికి ప్రధాన కారణమని డీజీపీ అన్నారు.

ఈ సందర్భంగా సీఎం వైయ‌స్‌ జగన్‌ ఏమన్నారంటే...?
♦గతంలో ఎన్నడూలేని విధంగా గిరిజనులకు ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలు ఇచ్చాం
♦అంతేకాదు ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలు ఉన్న గిరిజన రైతులకు రైతు భరోసాకూడా ఇస్తున్నాం
♦ప్రతి ఏటా రూ.13,500 గిరిజన రైతుల చేతిలో పెడుతున్నాం
♦ఆ భూముల్లో బోర్లు వేసి, పంటల సాగుకోసం కార్యాచరణకూడా రూపొందించాం:
♦దీన్ని అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తాం
♦ఆసరా, చేయూత, అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన తదితర పథకాలతో గిరిజనులకు జీవితాల్లో వెలుగులు నింపుతున్నాం
♦31,155 ఎకరాల డీకేటీ పట్టాలను 19,919 మంది గిరిజనులకు ఇచ్చాం
♦గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలు ఇచ్చాం
♦వాలంటీర్లగా వారిని నియమించాం
♦తద్వారా పెద్ద సంఖ్యలో గిరిజనులకు ఉద్యోగాల కల్పన జరిగింది
♦వారి గ్రామాల్లోనే వారికి ఉద్యోగాలు ఇచ్చాం
♦స్థానిక సంస్థల ఎన్నికల్లో ట్రైబల్‌ప్రాంతాల్లో గిరిజనులకు పూర్తి రిజర్వేషన్‌ ఇచ్చాం
♦ఈ కార్యక్రమాలన్నీ కూడా గిరిజనుల జీవన ప్రమాణాలను కచ్చితంగా పెంచుతాయి
♦36 షెడ్యూలు మండలాల్లో పాఠశాలలు, హాస్టళ్లను నాడు – నేడు కింద 10అంశాల ద్వారా మెరుగుపరుస్తున్నాం
♦నాడు – నేడు కార్యక్రమాలకు తగిన సహకారం అందించాల్సిందిగా కేంద్రాన్ని కోరాలన్న సీఎం

♦అలాగే షెడ్యూలు ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో చేస్తున్న నాడు–నేడు కార్యక్రమాలకూ తగిన సహకారాలు అందించాలంటూ కేంద్రాన్ని కోరాల్సిందిగా అధికారులకు సూచించిన సీఎం
♦ట్రైబల్‌ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న టవర్ల మ్యాపింగ్‌ జాగ్రత్తగా చేయాలని సమావేశానికి హాజరైన టెలికాం అధికారులకు సీఎం ఆదేశం
♦దాదాపు 400 టవర్ల ద్వారా 900 గ్రామాలకు టెలికాం సౌకర్యం కల్పిస్తున్నామన్న అధికారులు
♦సమగ్రంగా ఇంటర్నెట్, మొబైల్‌ టెలికాం సౌకర్యం ఇచ్చేలా విధానం ఉండాలన్న సీఎం
♦దీనిపై ఒక ప్రణాళిక రూపొందించి, ఆమేరకు కేంద్రం సహకారం కోరాలన్న సీఎం
♦ఒక్క గ్రామం కూడా మిగిలిపోకుండా అన్ని గిరిజన గ్రామాలకూ ఇంటర్నెట్, మొబైల్‌ సౌకర్యం కల్పించే దిశగా అడుగులేయాలన్న సీఎం
♦గ్రామ సచివాలయాలు ఉన్న ప్రతిచోటా కూడా పోస్ట్‌ఆఫీసు ఉండేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం
♦ఆ మేరకు మ్యాపింగ్‌ చేసుకుని , మిగిలిన పోస్ట్‌ ఆఫీసులు తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని  కోరాలన్న సీఎం
♦ట్రైబల్‌ యూనివర్శిటీని త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం
♦గిరిజనుల్లో చాలామంది పిల్లలకు ఆధార్‌ లేదన్న అధికారులు
♦ట్రైబల్‌ ప్రాంతాల్లో అన్ని గ్రామ సచివాలయాలను ఆధార్‌ సెంటర్లుగా గుర్తించేలా కూడా కేంద్రాన్ని కోరాలన్న సీఎం 

ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమం) పాముల పుష్పశ్రీవాణి,  హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, డీజీపీ గౌతం సవాంగ్, ప్రిన్స్‌పల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్స్‌ ఎన్‌ ప్రతీప్‌ కుమార్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ట ద్వివేది, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ కే వి రాజేంద్రనాథ్‌ రెడ్డి, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి కాంతిలాల్‌ దండే, ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, గిరిజన సంక్షేమశాఖ కమిషనర్‌ రంజిత్‌ బాషా, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Back to Top