నేడు రేషన్‌ డోర్‌ డెలివరీ వాహనాల ప్రారంభం

జెంజ్ స‌ర్కిల్ వ‌ద్ద జెండా ఊపి ప్రారంభించ‌నున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

రాష్ట్ర వ్యాప్తంగా 9,260 వాహనాలు ప్రారంభం

ఫిబ్రవరి 1 నుంచి ఇంటింటికీ నాణ్యమైన బియ్యం సరఫరా
 

తాడేపల్లి: ప్రజా పంపిణీ వ్యవస్థలో సరికొత్త చరిత్రకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. దేశంలోనే తొలిసారిగా ఇంటి వద్దకే రేషన్‌ సరుకుల పంపిణీ వంటి వినూత్న కార్యక్రమానికి సీఎం నాంది పలకనున్నారు. రేషన్‌ డోర్‌ డెలివరీ చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 9,260 వాహనాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. పాదయాత్రలో రోజువారీ కూలీలు, వృద్ధులు, రోగులు ఎదుర్కొంటున్న కష్టాలను చూసిన వైయస్‌ జగన్‌.. ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే రేషన్‌ సరుకుల సరఫరా వాహనాలను కాసేపట్లో సీఎం వైయస్‌ జగన్‌ ప్రారంభించనున్నారు. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి 2,500 రేషన్‌ డోర్‌ డెలివరీ వాహనాలను విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ వద్ద ముఖ్యమంత్రి జగన్‌ జెండా ఊపి ప్రారంభిస్తారు. 

రాష్ట్ర వ్యాప్తంగా రేషన్‌ డోర్‌ డెలివరీ వాహనాల ప్రారంభం అట్టహాసంగా జరగనుంది. విజయవాడలో సీఎం ప్రారంభించిన అనంతరం.. కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి మినహా మిగిలిన జిల్లాలకు కేటాయించిన వాహనాలను మంత్రులు ప్రారంభిస్తారు. 9,260 వాహనాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 1వతేదీ నుంచి నాణ్యమైన రేషన్‌ బియ్యం డోర్‌ డెలివరీ చేయనున్నారు. లబ్ధిదారులకు నాణ్యమైన, మెరుగుపరచిన బియ్యాన్ని ఇంటివద్దే అందచేసేందుకు ఏటా రూ.830 కోట్లు అదనంగా వెచ్చిస్తూ పథకాన్ని రూపొందించారు. 

మొబైల్‌ వాహనంలో వసతులు ఇలా
మొబైల్‌ వాహనంలో తూకం వేసే యంత్రం (వేయింగ్‌ స్కేల్‌), కొలతల పరికరాలు ఉంటాయి. ఎల్‌ఈడీ ల్యాంప్స్, ఈ–పాస్‌ యంత్రాల ఛార్జింగ్‌ పాయింట్లు, మినీ ఫ్యాన్, చిన్న మైక్‌ ఉంటుంది. ప్రథమ చికిత్స బాక్సు, నగదు పెట్టె, అగ్ని మాపక యంత్రం, నోటీసు బోర్డు ఏర్పాటు చే శారు. తూకం యంత్రం 12 నుంచి 18 గంటల పాటు బ్యాటరీ బ్యాకప్‌ ఉంటుంది. 

నిరుద్యోగ యువతకు ఉపాధి..
బియ్యం, నిత్యావసర సరుకులను కార్డుదారులకు ఇంటివద్దే అందించేందుకు 9,260 మొబైల్‌ వాహనాలను రివర్స్‌ టెండర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. నిరుద్యోగ యువతకు జీవనోపాధి కల్పించేందుకు ఈ వాహనాలను వివిధ కార్పొరేషన్ల ద్వారా 60 శాతం సబ్సిడీతో సమకూర్చింది. ఒక్కో వాహనం విలువ రూ. 5,81,000 కాగా రూ.3,48,600 సబ్సిడీగా అందించింది. ఈ వాహనాలకు పౌరసరఫరాల సంస్ధ ప్రతి నెలా అద్దె చెల్లిస్తూ ఆరేళ్ల పాటు వినియోగించుకోనుంది.

ఏ వర్గాలకు ఎన్ని వాహనాలు..
ఎస్టీ కార్పొరేషన్‌  ద్వారా 700
ఎస్సీ కార్పొరేషన్‌  ద్వారా 2,300
బీసీ కార్పొరేషన్‌  ద్వారా 3,800
మైనారిటీస్‌ కార్పొరేషన్‌  ద్వారా 660
ఈబీ కార్పొరేషన్‌  ద్వారా 1,800

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top