చంద్రబాబు లాంటి మోసగాడు ప్రపంచంలోనే ఉండడు

పాపాల బైరవుడు బాబు చేసిన తప్పులను మన ప్రభుత్వం సరిదిద్దుతోంది

బాబు చేసిన అప్పులు, బకాయిలు చూసి ఆర్థిక వ్యవస్థ అంటారా..? ఆర్థిక అరాచకం అంటారా..?

రామోజీరావు, రాధాకృష్ణ, టీవీ5 నాయుడు సమాధానం చెప్పాలి

కాకి పిల్ల కాకికి ముద్దు.. చంద్రబాబు ఎల్లో మీడియాకు ముద్దు

చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే ఒక్క పథకం అయినా ఉందా..?

రాజ్యాంగ వ్యవస్థలపై టీడీపీకి ఉన్న గౌరవం ఏంటో గవర్నర్‌ ప్రసంగంలో చూశాం

ఈ రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు చేసిన మేలు ఏమిటీ..?

40 ఏళ్ల రాజకీయ అనుభవం ఏం చేసుకోవడానికో అర్థంకావడం లేదు

వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వ పాలనకు ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలే నిదర్శనం

విద్యా, వైద్యం, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాం

నాడు–నేడుతో స్కూళ్లు, ఆస్పత్రులను ఆధునీకరిస్తున్నాం

కేవలం రెండేళ్ల పాలనలోనే మేనిఫెస్టోలోని 95 శాతం హామీలు అమలు చేశాం

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాల్లోని పేద అక్కచెల్లెమ్మలకు అండగా నిలిచాం. 

ప్రజలంతా గత – ప్రస్తుత ప్రభుత్వాల పరిపాలన గురించి ఆలోచన చేయాలి

అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

అసెంబ్లీ: ఎన్నికల ముందు హామీలిచ్చి.. అనంతరం ఆ హామీలను, ప్రజలను గాలికొదిలేసే చంద్రబాబు లాంటి మోసగాడు ప్రపంచంలోనే ఉండడని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చే కనీసం ఒక్క సంక్షేమం అయినా ఉందా..? చంద్రబాబు పేరు చెబితే ఒకే ఒక్క స్కీమ్‌ గుర్తుకువస్తుంది.. అది వెన్నుపోటు మాత్రమేనని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తన జీవితంలో తానిచ్చిన ఎన్నికల వాగ్దానాలకు, అధికారంలోకి వచ్చిన తరువాత తానిచ్చిన విలువ ఏంటో అందరికీ తెలుసన్నారు. అదే వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాలకు ఎలాంటి విలువ ఇస్తుందో.. దాదాపు 34 నెలలు సాగిన ∙పరిపాలనలో ప్రతి ఒక్కరూ చూస్తున్నారన్నారు. అధికారంపోయి వెయ్యి రోజులు అయిన సందర్భంగా రగిలిపోతున్న చంద్రబాబు పార్టీ, దాని అనుబంధ సంస్థలకు, ఎల్లో మీడియాకు, వేర్వేరు పార్టీలు, సంస్థల్లో చంద్రబాబు బాగు కోసం అహర్నిశలు కష్టపడుతున్న వీరందరికీ ప్యాన్‌ ఫార్టీ టాబ్లెట్లు, జలిసిల్‌ సిరప్, ఈనో ప్యాకెట్లు విరివిగా లభించాలని కోరుకుంటున్నానని సీఎం వైయస్‌ జగన్‌ చురకలంటించారు. 

అసెంబ్లీలో సీఎం వైయస్‌ జగన్‌ ఇంకా ఏం మాట్లాడారంటే..

చంద్రబాబు గౌరవ సభ తరఫున సభలో జరిగిన కొన్ని సంఘటనలు, టీడీపీ సభ్యుల అసభ్యప్రవర్తన, అనుచిత వ్యాఖ్యలకు గౌరవ సభ వేదిక కాగా, ప్రభుత్వ ఆహ్వానం మేరకు సభకు వచ్చిన గవర్నర్‌ను ఏ విధంగా అవమానించారో చూశాం. ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్‌ ప్రసంగం, రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన, విధానాలను ప్రస్తావించే అంశం. కొత్తగా మన ప్రభుత్వంలో జరుగుతున్నది కాదు. ప్రతి సందర్భంలో గవర్నర్‌ రావడం, ప్రసంగించడం, ప్రభుత్వ పరిపాలన, విధానాలను ప్రస్తావించి, అందులోని అంశాలను చెప్పడం పరిపాటిగా సాగుతోంది. ఇందులో ఏదైనా అంశాలతో విభేదించాలని అనుకుంటే.. ప్రతిపక్ష నాయకుడికి సమయం ఇస్తారు. అదొక పద్ధతి. కానీ, సభలో ఏం జరిగిందో అందరూ చూశారు. 

వాస్తవానికి ప్రతిపక్ష నేత చంద్రబాబే సభకు వచ్చి ఉండొచ్చు. బాబును రావొద్దని ఎవరూ చెప్పలేదు. ఎందుకు సభకు రాకుండా ఆయన తరఫున సభ్యులను పంపించాడు. ఆయనకు ఎందుకు మొహం చెల్లుబాటుకావడం లేదో ఆయనకే తెలియాలి. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రంలో ప్రధమ వ్యక్తి గవర్నర్‌. అంతేకాకుండా 87 సంవత్సరాల పెద్ద వయస్సు కలిగినవారు. అలాంటి వ్యక్తి సభకు వచ్చినప్పుడు దాదాపుగా దాడిచేసినంత పనిచేశారు. ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదు. ఏరోజూ ప్రతిపక్షంలో ఉండగా ఇలా చేయలేదు. గవర్నర్‌ ప్రసంగం అయిపోయినప్పుడు కూడా తిరిగి వెళ్లే క్రమంలో కూడా లాబీల్లో గవర్నర్‌ గోబ్యాక్, డౌన్‌ డౌన్‌ అంటూ గవర్నర్‌కు అతిదగ్గరగా వచ్చి నినాదాలు చేశారు. రాజ్యాంగ వ్యవస్థలు అంటే చంద్రబాబుకు ఎంతటి కడుపుమంటో అర్థం అవుతుంది. కేవలం ఆయన ముఖ్యమంత్రి స్థానంలో లేడు కాబట్టే సమస్య. 

గవర్నర్‌ ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తి. అటువంటి వ్యక్తి మీద అవమానకరంగా టీడీపీ ప్రవర్తించిన తీరు దిగజారుడు రాజకీయానికి నిదర్శనం. రాష్ట్ర ప్రభుత్వం మీద టీడీపీ విమర్శలన్నింటికీ సమాధానంగా నేను నేరుగా వారిని ప్రశ్న అడగాలనుకున్నా.. ఈ రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు చేసిన మేలు ఏమిటీ..? ఐదు సంవత్సరాల బాబు పాలన చూసిన తరువాత.. ఎన్నికల్లో ప్రజలే తీర్పు ఇస్తూ ఓటు వేశారు. ఐదేళ్ల పాటు చంద్రబాబు పాలన చూసిన తరువాత.. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చే కనీసం ఒక్క సంక్షేమం అయినా ఉందా..? చంద్రబాబు పేరు చెబితే ఒకే ఒక్క స్కీమ్‌ గుర్తుకువస్తుంది.. అది వెన్నుపోటు. 

2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ సీపీ 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది లోక్‌సభ ఎంపీలను గెలుచుకుంది. 34 నెలల పాలనలో ఎలా పరిపాలన చేశాం.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చాం. మంచి పాలన చేశామా.. చేయలేదా అని చెప్పడానికి ఆ తరువాత జరిగిన ప్రతీ ఎన్నికల్లో, చివరకు నవంబర్‌లో జరిగిన మున్సిపాలిటీలతో కలుపుకుంటే రాష్ట్ర ప్రజలు తిరుపతి ఎంపీ ఉప ఎన్నిక అయినా, బద్వేలు ఉప ఎన్నిక, పంచాయతీ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీ, నగర పంచాయతీ, ఏ ఎన్నికలు అయినా కుప్పంతో సహా ప్రజలు ఫ్యాన్‌ గుర్తుకే ఓటు వేశారంటే.. దాని అర్థం ఏంటీ..? 

87 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే.. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ 84 మున్సిపాలిటీలు కైవసం చేసుకుంది. వాస్తవం చెప్పాలంటే 85.. కానీ, కోర్టు ఒకస్థానానికి రిజల్ట్‌ ఆపేసింది. 12 మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు జరిగే వైయస్‌ఆర్‌ సీపీ క్లీన్‌స్వీప్‌ చేసింది. 13 జిల్లా పరిషత్‌ ఎన్నికలు జరిగితే 13 వైయస్‌ఆర్‌ సీపీ గెలుచుకుంది. 9,702 ఎంపీటీసీల ఎన్నికల్లో 8,298 అంటే 86 శాతం వైయస్‌ఆర్‌ సీపీ గెలిచింది. 652 జెడ్పీటీసీ ఎన్నికలు జరిగితే 639 జెడ్పీటీసీ స్థానాలు అంటే 98 శాతం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలిచింది. 648 ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు జరిగితే.. 639 అంటే 98.6 శాతం వైయస్‌ఆర్‌ సీపీ గెలిచింది. ఇంతగా ప్రజలు ఆప్యాయతలు, అభిమానం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీపై చూపారంటే.. ప్రజలు తీర్పుల ద్వారా తెలుగుదేశం పార్టీని కొన్ని ప్రశ్నలు అడిగారు. చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు చేసింది ఏంటయ్యా అని ప్రజలు చంద్రబాబును ప్రశ్నించారు. గతంలో ఎప్పుడూ ఇంత మెజార్టీ ఎవరికీ రాలేదు. ఎందుకిచ్చారంటే.. ప్రభుత్వం చేస్తున్న మంచిని ఆశీర్వదిస్తూ చంద్రబాబును ప్రజలు సూటి ప్రశ్నలు అడిగారు. 

దాదాపు 3 ఏళ్ల పాలనలో కోవిడ్‌ సహా.. ప్రపంచమే ఊహించని కష్టాలు ఎదురైనప్పటికీ ఆర్థిక పరిస్థితులు, వ్యవస్థలు తలకిందులు అయినప్పటికీ.. జగన్‌ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడని ప్రజలు తీర్పునిచ్చారు. కాబట్టి మేనిఫెస్టోలోని 95 శాతం వాగ్దానాలు ఇప్పటికే నిలబెట్టుకున్న పార్టీకి ప్రజలు తమ దీవెన, ఆశీస్సులు అందించారు. మరోసారి అడుగుతున్నాను.. చంద్రబాబు గత వికృతపాలనను, మీ ప్రస్తుత వైఖరికి ప్రజలు ఛీ కొడుతూ ఇచ్చిన తీర్పు ఇది. 

ఏ ఒక్క గ్రామానైనా తీసుకోండి. అందులో ఏ ఒక్క పేద కుటుంబానైనా తీసుకోండి. 2014 నుంచి 2019 మధ్య, 2019 నుంచి 2022 మధ్య పోల్చి చూడమని ప్రజలను  కోరుతున్నా. ఏ ఒక్క నియోజకవర్గానైనా, చివరకు కుప్పం మున్సిపాలిటీ అయినా, కుప్పం నియోజకవర్గం అయినా, ఎవరి పాలన బాగుందో ప్రజలను అడగమని కోరుతున్నా. ఏ ఒక్క జిల్లా అయినా తీసుకొని పోల్చి చూడండి. ఏ ఒక్క సామాజిక వర్గానైనా తీసుకోండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైన్టా, కాపు ఇలా ఎవరినైనా తీసుకోండి. ఎవరి హయాంలో ఎంత మేలు జరిగిందో అడగండి. ప్రజలంతా దీని గురించి ఆలోచన చేయాలని కోరుతున్నా. 

ఏ ఒక్క రంగానైనా తీసుకున్నా.. వ్యవసాయం, విద్య, వైద్యం, మహిళల సాధికారత, పరిపాలన సంస్కరణలు, గ్రామాల్లో ప్రస్పుటంగా కనిపిస్తున్న మార్పులు.. ఇలా ఏరంగానైనా తీసుకుంటే.. తెలుగుదేశం పార్టీ చేసిన చెడు కనిపిస్తుంది. మన ప్రభుత్వం చేస్తున్న మంచి కనిపిస్తుంది. చంద్రబాబును ప్రశ్నిస్తున్నా.. ఈ చర్చ చేయలేకనే గవర్నర్‌ ప్రసంగం ప్రతులను చించేయడం, ప్రజలకు వాస్తవాలు తెలియకుండా భ్రమ కల్పించడంలో దిట్ట చంద్రబాబు. చంద్రబాబు హయాంలో ఏ పథకానికి అయినా పారదర్శక విధానంతో అర్హులైన ప్రతి ఒక్కరికీ, కులం, మతం, పార్టీ, వర్గం చూడకుండా ఏ ఒక్క సంక్షేమ పథకానైనా అమలు చేశారా..? అని చంద్రబాబును ప్రశ్నిస్తున్నాను. లంచం లేకుండా టీడీపీ హయాంలో ఒక్క పథకానైనా ఇచ్చారా..? ప్రజలకు కావాల్సింది జన్మభూమి కమిటీ దోపిడీలా..? ఎలాంటి లంచాలు, అవినీతి, వివక్షకు తావులేని పారదర్శకమైన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థనా..? అనేది ఆలోచించాలి. 

సూర్యోదయానికి ముందు ఒకటో తేదీన అది ఆదివారమైనా, సెలవు దినమైనా చిరునవ్వుతో పొద్దున్నే తలుపుతట్టి గుడ్‌మార్నింగ్‌ చెబుతూ పెంచిన పెన్షన్లు ఇచ్చే వ్యవస్థ మీ పరిపాలనలో ఏరోజైనా ఆలోచన చేయగలిగారా..? ఎన్నికల 2 నెలల ముందు వరకు చంద్రబాబు ఇచ్చిన పెన్షన్ల సొమ్ము ఎంత..? నెలకు వెయ్యి రూపాయలు ఇచ్చాడు. ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు చంద్రబాబు హయాంలో 42 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇచ్చేవారు. ప్రభుత్వానికి అయ్యే ఖర్చు నెలకు రూ.500 కోట్లు కూడా అయ్యేది కాదు. ఈరోజు మన ప్రభుత్వం రూ.2500 పెన్షన్‌ ఇస్తున్నాం. ఈరోజు 62 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. ఈరోజు రూ.1567 కోట్లు నెలకు పెన్షన్ల కోసం ఖర్చు చేస్తున్నాం. 

చంద్రబాబు పాలనలో చిన్న సర్టిఫికెట్‌ కావాలన్నా.. మండల, జిల్లా కేంద్రానికి వెళ్లి లంచాలు ఇచ్చుకుంటూ చెప్పులు అరిగేలా తిరిగాల్సిన పరిస్థితి ఉండేది. ప్రతి 2 వేల జనాభాకు దాదాపుగా 540 పౌర సేవలు అందించే గ్రామ, వార్డు సచివాలయాల గురించి కనీసం ఆలోచన చేసే పరిస్థితి చంద్రబాబుకు ఉందా..? చంద్రబాబు ఊహకు కూడా అందని విషయమిది. అలాంటి మంచి ఆలోచనలు చేయలేని వ్యక్తి ప్రధానమంత్రి, రాష్ట్రపతి పదవులు తిరస్కరించాను చెప్పుకునే చంద్రబాబుకు ఈ ఆలోచనలు ఎందుకు తట్టలేదు. ఎంతసేపు పదవుల గురించి తప్ప.. ఏరోజూ జనం గురించి, వారి మంచి గురించి ఆలోచన చేసిన పాపానపోలేదు. అందుకనే చంద్రబాబు దుర్బుద్ధికి.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 23 మంది ఎమ్మెల్యేలను అనైతికంగా తీసుకున్నాడు. అందుకనే దేవుడు, ప్రజలు మొట్టికాయలు వేసి అదే 23 మంది ఎమ్మెల్యేలను ఇచ్చారు. ఎంపీలను కూడా ముగ్గురుని లాక్కున్నాడు.. అదే 3 ఎంపీలు ఇచ్చారు. 

గ్రామాన్ని తీసుకుంటే.. ప్రతి 2వేల మందికి పౌర సేవలు అందించే గ్రామ సచివాలయంలో ఊరిలోకి వెళ్లిన వెంటనే కనిపిస్తుంది. గ్రామ సచివాలయంలో 10 మంది పిల్లలు యూనిఫాం వేసుకొని చిరునవ్వుతో సేవలు అందించే పరిస్థితి కనిపిస్తుంది. నాలుగు అడుగులు వేస్తే రైతులకు విత్తనం నుంచి పంట అమ్మకం వరకు అన్ని విధాలుగా రైతుకు సాయం అందేలా రైతు భరోసా కేంద్రాలు అక్కడే కనిపిస్తాయి. మరో నాలుగు అడుగులు ముందుకేస్తే.. నిర్మాణంలో ఉన్న వైయస్‌ఆర్‌ విలేజ్‌ క్లినిక్‌లు కనిపిస్తాయి. 24/7 అక్కడే మిడ్‌లెవల్‌ హెల్త్‌ ప్రాక్టీస్‌నర్స్, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్ల రిపోర్టింగ్, ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్టుతో ప్రతి మండలానికి రెండు పీహెచ్‌సీలు, ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు డాక్టర్లు, ప్రతి పీహెచ్‌సీకి 104 వాహనం, ఒక డాక్టర్‌ పీహెచ్‌సీలో సేవలు అందిస్తే.. మరో డాక్టర్‌ అదే 104 వాహనం ఎక్కి తనకు కేటాయించిన గ్రామాలు తిరుగుతారు. రెండ్రోజులకు ఒకసారి గ్రామాలకు వెళ్లి రోగులను చూడటం, నెలకు కనీసం 4–5 సార్లు గ్రామాలకు అటెండ్‌ అయ్యి ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్టులతో పనిచేసే వైయస్‌ఆర్‌ విలేజ్‌ క్లినిక్స్‌ గ్రామాల్లో కనిపిస్తాయి. మరో నాలుగు అడుగులు ముందుకేస్తే.. ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌ కనిపిస్తుంది. ఒక గ్రామ రూపురేఖలు మారుతున్నాయనేందుకు నిదర్శనాలు ఇవే. మరో నాలుగు అడుగులు ముందుకేస్తే డిజిటల్‌ గ్రంథాలయాలు కనిపిస్తాయి. మరో నాలుగు అడుగులు వేస్తే మెరుగులు దిద్దుకుంటున్న అంగన్‌వాడీలు కనిపిస్తాయి. ఇంగ్లిష్‌ మీడియం బోధించి శాటిలైట్‌ ఫౌండేషన్, ఫౌండేషన్‌ స్కూళ్లుగా మార్పు చెందుతున్నాయి. ఇవన్నీ కూడా మారుతున్న మన గ్రామంలో కనిపిస్తున్న పరిస్థితులు. 

మండలం కూడా ఎప్పుడూ జరగని విధంగా అభివృద్ధి చెందుతుంది. ప్రతి మండలానికి 108 వాహనం, రెండు పీహెచ్‌సీలు, ప్రతీ పీహెచ్‌సీకి ఇద్దరు  డాక్టర్లు, ప్రతీ పీహెచ్‌సీకి ఆధునిక 104 వాహనంతో పాటు ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్టు కనిపిస్తుంది. ఇది కేవలం 34 నెలల కాలంలో మన ప్రభుత్వం మార్చిన, మార్చబోతున్న గ్రామ స్వరూపం. 

చంద్రబాబుకు గ్రామం అంటే ఏమాత్రమైనా గౌరవం, ప్రేమ, ప్రజల అవసరాలు తెలుసుకునే  స్వభావాలు ఏవీలేవు. గ్రామాలు మాత్రమే కాదు.. జిల్లా స్వరూపం కూడా మారుస్తున్నాం. ప్రతి 6 నుంచి 8 నియోజకవర్గాలకు, గరిష్టంగా 7 నియోజకవర్గాలకు కొత్త జిల్లా ఏర్పాటు అవుతుంది. పరిపాలన సంస్కరణలో విజన్‌ ఎవరిది అని అడుగుతున్నా..? కొత్త జిల్లాలతో మనం చేస్తున్న పరిపాలన వికేంద్రీకరణ మీద రాజధానుల వికేంద్రీకరణ వద్దంటున్నవారు కూడా అక్కడ కాదు.. మా జిల్లా హెడ్‌ క్వార్టర్స్‌ ఇక్కడ పెట్టండి అని చివరికి చంద్రబాబు బావమరిది కూడా హిందూపూర్‌ జిల్లా కేంద్రం కావాలని డిమాండ్‌ చేశారు. ఎవరికి ఎంత విజన్‌ ఉందని తెలుసుకోవడానికి ఇది చాలు. చివరకు బాబు కూడా కుప్పంలో రెవెన్యూ డివిజన్‌ కావాలని తన పాలనలో చేయకుండా.. మన పరిపాలనలో అడుగుతున్నాడంటే.. ఎవరికి ఎంత విజన్‌ ఉందో ప్రజలకు అర్థం అవుతుంది. 

రాజధానుల వికేంద్రీకరణ అంటే నా భూములు, నావారి భూములు, వాటిరేట్లు ఇవి తప్ప.. 13 జిల్లాలు, అక్కడి ప్రజల ప్రయోజనాలు ఇవేవీ చంద్రబాబు డెమోక్రసీలో లేవు. మూడు ప్రాంతాల మధ్య సమానమైన అభివృద్ధి, శాశ్వతంగా ప్రజాభిమానాలు ఒకరిపట్ల ఒకరికి ఉండాలనే తపన.. ఇటువంటి ఆలోచనలు ఏరోజూ చంద్రబాబు చేసిన పరిస్థితి లేదు. ప్రజాప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రజల సభ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇళ్ల స్థలాలు అయినా, ఇంగ్లిష్‌ మీడియం చదువులైనా, రాజధాని అయినా, రాజధానిలో చివరకు పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయం తీసుకున్నా.. ఏ కోర్టులో అయినా వ్యతిరేకంగా ఏ తీర్పు వచ్చినా సంతోషపడేవారు చంద్రబాబు ఒక్కడే. కేసులు వారే వేయిస్తారు..  తీర్పులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రావడంతో ప్రజలు నష్టపోతున్నారని తెలిసినా కూడా సంతోషం చంద్రబాబుకు వస్తుంది. 

సంకుచితమైన చంద్రబాబు నిర్ణయాలకు, ప్రజల విశాల ప్రయోజనాలు, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ప్రధానంగా మనం చేస్తున్న నిర్ణయాలకు మధ్య ఎంత తేడా ఉందో ఆలోచన చేయండి. అన్ని విషయాల్లోనూ చంద్రబాబుది అదే పరిస్థితి. 

గవర్నమెంట్‌ బడులను చంపేయాలని గతంలో చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. నిజంగా చంద్రబాబు మరో ఐదేళ్లు సీఎంగా ఉండుంటే ప్రభుత్వ పాఠశాలలు మూసివేసేవారు. గవర్నమెంట్‌ బడులను బతికించడానికి మాత్రమే కాకుండా వైభవం తీసుకువచ్చేందుకు 34 నెలల కాలంలో ఎంత కష్టపడుతున్నామో చూడండి. చంద్రబాబు ప్రభుత్వ ఎంతసేపూ నారాయణ, చైతన్య స్కూళ్లకోసం నడిస్తే.. మన ప్రభుత్వంలో గవర్నమెంట్‌ స్కూల్‌ను కార్పోరేట్‌ స్థాయికి తీసుకువచ్చేందుకు పరుగెత్తుతున్నాం. 

పేదవర్గాల వారి పిల్లలు గవర్నమెంట్‌ బడిలో తెలుగు మీడియంలో మాత్రమే చదవాలి. వారి పిల్లలు మాత్రం కేవలం ఇంగ్లిష్‌ మీడియంలో చదవాలన్న చంద్రబాబు విధానం మంచిదా..? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదల పిల్లలు కూడా ప్రభుత్వ బడుల్లో ఉచితంగా ఇంగ్లిష్‌ మీడియంలో చదవాలన్న మా విధానం మంచిదా..? అని ప్రజలనే అడుగుతున్నా. 

ఈ తరం పిల్లలు కూడా వారి పొల్లాల్లో కూలీలుగా, వారి వ్యాపారాలు, పరిశ్రమల్లో వెట్టిచాకిరి చేసేవారిగా మిగిలిపోవాలన్న చంద్రబాబు అన్యాయమైన ఆలోచన కరెక్టా..? ఈతరం పిల్లలు రాబోయే ప్రపంచంలో ఎక్కడైనా బతికేందుకు, ఎదిగేందుకు అవకాశం ఉన్న చదువులు చదివించాలన్న మా విధానం కరెక్టా..? ఒక్కసారి ఆలోచన చేయాలి. 

అమ్మఒడి వంటి పథకం పెట్టాలనే ఆలోచన కలలో అయినా కనగలడా..? చదివించే తల్లుల కష్టాలు, పేదింటి పిల్లలు మధ్యలో చదువు ఎందుకు మానేసే పరిస్థితి ఎందుకువస్తుందో ఏనాడైనా చంద్రబాబు ఆలోచన చేశాడా..? 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఏం చేసుకోవడానికో అర్థం కావడం లేదు. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్క స్కీమ్‌ కూడా లేదు. వెన్నుపోటు స్కీమ్‌ ఆనాడు ఎన్టీఆర్‌ దగ్గర నుంచి చివరకు మన ప్రధాని మోడీ వరకు తెలుసు.

ఇంతటి కోవిడ్‌ సమయంలో గవర్నమెంట్‌ బడుల్లో చదివే పిల్లల సంఖ్య రెండేళ్ల కాలంలో పెరిగిందంటే ఎవరిది ప్రజల మనసు తెలిసిన పాలన. చంద్రబాబు పాలనలో ప్రభుత్వ బడులు శిథిలావస్థలో ఉంటే.. ఈరోజు నాడు–నేడుతో స్కూళ్ల రూపురేఖలు మారుతున్నాయి. ఇంగ్లిష్‌ మీడియం, బైలింగ్వల్‌ టెక్ట్స్‌ బుక్స్, సబ్జెక్ట్‌ టీచర్స్‌ ప్రక్రియ కూడా మొదలైంది. వచ్చే ఏడాది సబ్జెక్ట్‌ టీచర్స్‌ రాబోతున్నారు. బడికి వైభవం తీసుకువస్తున్నాం. కాంపౌండ్‌ వాల్, ఫర్నిచర్, డ్రింకింగ్‌ వాటర్, బాత్‌రూమ్స్‌ కూడా లేని చంద్రబాబు పాలనలోని స్కూళ్లు బాగున్నాయా..? దాదాపుగా 10కిపైగా హంగులతో రూపం మారిన మన స్కూళ్లు బాగున్నాయా..? అని ప్రజలంతా ఆలోచన చేయాలి. 

స్కూళ్లు తెరిచేనాటికి సకాలంలో యూనిఫామ్స్, షూ, ఎటువంటి పెండింగ్‌ బకాయిలు లేకుండా గోరుముద్ద, టెక్ట్స్‌బుక్స్, నోట్‌బుక్స్‌ ఇవన్నీ ఇస్తుంటే.. జగన్‌ మామ థ్యాంక్యూ అని పిల్లలు చెబుతున్న మా పరిపాలన ఎలా ఉంది చూడమని అడుగుతున్నా. ఈ చర్యలన్నీ తీసుకున్నాం కాబట్టే 1 నుంచి 10 వరకు చదివే పిల్లల సంఖ్య 2018–19తో పోల్చితే ప్రైవేట్, గవర్నమెంట్‌ స్కూళ్లలో పిల్లల సంఖ్య మొత్తం 70.43 లక్షలు ఉంటే ఈరోజు 73.05 లక్షలకు పెరిగింది. అదే కేవలం ప్రభుత్వ పాఠశాలలను తీసుకుంటే 2018–19లో ఎన్‌రోల్‌మెంట్‌ 37.20 లక్షలు ఉంటే.. ఈ రోజు 43.43 లక్షలకు చేరింది. గవర్నమెంట్‌ బడుల్లో 6.5లక్షల మంది పిల్లలు ప్రైవేట్‌ నుంచి ప్రభుత్వ పాఠశాలలకు మారుతున్న పరిస్థితి మనరాష్ట్రంలోనే కనిపిస్తుంది. గవర్నమెంట్‌ బడుల్లో చదవాలంటే.. ఎమ్మెల్యేలతో రికమండేషన్‌ తీసుకునే పరిస్థితిలోకి వెళ్లింది. 

ఇదే చంద్రబాబు హయాంలో అయితే బడుల్లో విద్యార్థుల సంఖ్య లక్ష పెరిగినా.. ప్రపంచ విద్యారంగానికే చంద్రబాబు చుక్కాని అని, చుక్క రామయ్య కంటే చంద్రబాబు గొప్ప విద్యావేత్త అని, వందశాతం అక్షరాస్యత ఉన్న దేశాల అధ్యక్షులు, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ కూడా చంద్రబాబు అపాయింట్‌మెంట్‌ కోసం కరకట్ట మీద క్యూ కడుతున్నారని ఇవన్నీ విని ఉండేవాళ్లం. ఎల్లో మీడియాలో నెలల తరబడి స్టోరీలు ఉండేవి. మాకు అలాంటి కథలు అవసరం లేదు. పేద విద్యార్థుల వ్యతలు తీరితే చాలని సంతోషపడతాం. 

బాబు పాలనలో అరకొరగా ఫీజురీయింబర్స్‌మెంట్‌ ఇచ్చినా కూడా బ్రహ్మాండంగా ఉందని, కాలేజీలకు ఎప్పుడు ఇస్తారో తెలియక, రెండేళ్ల వరకు బకాయిలు పెట్టినా చాలా బాగుందని గతంలో ఎల్లోమీడియా డబ్బాలు కొట్టేది. దాదాపు రూ.18 వందల కోట్లు చంద్రబాబు ఎగ్గొట్టి.. కట్టకుండా దిగిపోయినా బాబు పాలనే బాగుందని, అదే జగన్‌ పాలనలో బకాయిలు అన్నీ చెల్లించి వసతి దీవెనతో పాటు పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌ త్రైమాసిక చెల్లింపులు చేస్తున్నా కూడా బాగోలేదని ఎవరికి అనిపిస్తుంది.. రామోజీరావు, రాధాకృష్ణ, టీవీ5 నాయుడుకు అనిపిస్తుంది. ఒకేరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతిలో సేమ్‌ స్టోరీ. విద్యార్థులకు, తల్లిదండ్రులు మంచి పాలన చూసి సంతోషిస్తున్నారు. 

మధ్యాహ్న భోజనంలో 8 నెలలకు పైచిలుకు బకాయిలు పెడుతూ.. చంద్రబాబు హయాంలో ఇచ్చిన నీళ్ల చారు బాగుందా..? లేకపోతే రోజుకు ఒక మెనూతో మన ప్రభుత్వం అందిస్తున్న గోరుముద్ద బాగుందా అని అడుగుతున్నా. కాకి పిల్ల కాకికి ముద్దు.. చంద్రబాబు ఎల్లో మీడియాకు ముద్దు. 

అక్కచెల్లెమ్మల విషయానికొస్తే.. 2014 ఎన్నికల నాటికి అక్కచెల్లెమ్మలకు ఉన్న డ్వాక్రా రుణాలు అన్ని మాఫీ చేస్తానని చెప్పి, ఒక్క రూపాయి కూడా మాఫీ చేయకుండా చివరకు 2016 నుంచి సున్నావడ్డీ కూడా ఎగ్గొట్టి.. ఏ, బీ గ్రేడుల్లో ఉన్న డ్వాక్రా సంఘాలను సీ, డీ గ్రేడ్లకు దిగజార్చాడు. చంద్రబాబు హయాంలో ఎన్‌పీఏలు 18 శాతం పోయాయి. చివరకు ఎన్‌పీలను కూడా ఎంపీఏలుగా మార్చిన చంద్రబాబు పాలన బాగుందా..? లేక డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు రూ.25 వేల కోట్లకు పైగా రుణాల మొత్తాన్ని నాలుగు వాయిదాల్లో వారి చేతుల్లో పెడతామని మాటిచ్చి.. ఇప్పటికే సగం.. రూ.12,758 కోట్లు దాదాపు 80 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు నేరుగా అందించి.. మిగతా మొత్తాన్ని కూడా అన్నమాట ప్రకారం చెల్లిస్తున్న మన వైయస్‌ఆర్‌ ఆసరా బాగుందా..? అడుగుతున్నా. సున్నావడ్డీ ఎగ్గొట్టిన చంద్రబాబు పాలన బాగుందా..? లేకపోతే సున్నావడ్డీ పథకానికే రూ.2354 కోట్లు చెల్లించిన వైయస్‌ఆర్‌ సున్నావడ్డీ బాగుందా అని అడుగుతున్నా. 

ఎమ్మార్వో వనజాక్షిని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ జుట్టుపట్టుకొని ఈడ్చినట్టే ఆర్థికంగా పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలను రోడ్డుమీదకు ఈడ్చిన చంద్రబాబు ప్రభుత్వానికి అక్కచెల్లెమ్మలు, మహిళలు అని పలికే అర్హత కూడా లేదు. చంద్రబాబును మహిళలు ఎంతగా చీదరించుకుంటున్నారో ఆయన ప్రజల్లోకి వెళ్లలేదు కాబట్టి అర్థం కావడం లేదు. 

ఆడపిల్లల చదువుల గురించి, బడుల్లో టాయిలెట్ల నిర్మాణం గురించి, ఏ కారణంతో బాలికలు బడి మానేస్తున్నారు.. వారికి ఇవ్వాల్సిన రక్షణ గురించి కనీసం ఏరోజు అయినా ఆలోచన చేసిన చంద్రబాబు చంద్రబాబుకు ఉందా..? ఇటువంటి మనిషి మాత్రం సెల్‌ఫోన్‌ నేనే కనిపెట్టా.. హైదరాబాద్‌ సిటీ నేనే కట్టా.. అదిగో హైపర్‌ లూప్, ఇదిగో బుల్లెట్‌ ట్రైన్, ఇక్కడే ఎయిర్‌బస్, బిలిగేట్స్‌ నా కంప్యూటర్‌ స్కిల్స్‌ చూసి మూర్చపోయాడు. సత్యనాదెళ్లకు నేను చదువులు చెప్పించాను. పీ.వీ.సింధుకు నేనే బ్యాడ్మింటన్‌ నేర్పించానని బడాయిలు, కళ్లార్ప కుండా అబద్ధాలు చెప్పే చంద్రబాబుకు దిశ యాప్, దిశ చట్టం, దిశ పోలీస్‌ స్టేషన్లు, ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు, 2 వేల మంది జనాభాకు గ్రామ సచివాలయంలో మహిళా పోలీస్, ఇటువంటి కాన్సెప్టులు చంద్రబాబు బు్రరలోకి వచ్చాయా..? కేవలం 5సార్లు ఫోన్‌ షేక్‌ చేస్తే చాలు ఎస్‌ఓఎస్‌ వెళ్లిపోతుంది. కోటి 13 లక్షల మంది అక్కచెల్లెమ్మలు దిశయాప్‌ను డౌన్లోడ్‌ చేసుకున్నారు. 5సార్లు ఫోన్‌ షేక్‌ చేస్తే చాలు రూరల్‌ ప్రాంతాల్లో 20 నిమిషాలు, అర్బన్‌ ప్రాంతాల్లో 10 నిమిషాల్లోపు పోలీసులు వెళ్లిపోతారు. ఇంకా సమయానికి తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. 

ఇప్పటికే దిశ యాప్‌ ద్వారా 9 వేల మంది అక్కచెల్లెమ్మలు రక్షణపొందారు. దీన్ని మా ఘనతగా ఏరోజూ చెప్పుకోలేదు. ఒక బాధ్యతగా మహిళల భద్రత కోసం ఆలోచిస్తున్నామని గర్వంగా చెబుతున్నాను. అయినా కూడా బాబు బు్రరతక్కువ పాలనే అద్భుతమని, ఆమోఘమని, ప్రత్యేకంగా బు్రరకథలు చెప్పడానికి ఈనాడు, రాధాకృష్ణ, టీవీ5 ఇలాంటి నలుగురు ప్రత్యేకమైన కళాకారులను, వారి కింద బృందాలను తయారు చేసుకున్నాడు తప్ప.. ప్రజలకు నిజాయితీగా మంచి చేసి మన్ననలు పొందాలనే ఆలోచన ఏనాడూ చంద్రబాబు చేయలేదు. 

45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో బాధ్యత గల వయస్సులో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మల జీవితాల గురించి, ఆ కుటుంబ బాధ్యతను పంచుకుంటే మంచి జరుగుతుందనే ఆలోచన ఒక్కసారైనా చంద్రబాబు చేశాడా..? ఈ వయస్సులో ఉన్న 25 లక్షల అక్కచెల్లెమ్మలకు నాలుగేళ్లలో మనం ఇస్తున్న డబ్బు రూ.75 వేలు. వరుసగా క్రమం తప్పకుండా నాలుగేళ్ల పాటు అక్కచెల్లెమ్మలకు రూ.18750 చొప్పున రూ.75 వేలు ఇస్తాం. ఇప్పటికే రెండేళ్ల పాలనలో వైయస్‌ఆర్‌ చేయూత పథకం ద్వారా అక్షరాల రూ.9 వేల కోట్లు ఖర్చు చేశాం. డబ్బులు ఇవ్వడమే కాకుండా బ్యాంకులు, కార్పొరేట్‌ దిగ్గజాలు రిలయన్స్, హిందుస్థాన్‌ లివర్, ఐటీసీ, అమూల్‌తో జత చేసి అక్కచెల్లెమ్మలు వారి కాళ్ల మీద వారు నిలబడే ఒక్క గొప్ప ఆలోచనకు శ్రీకారం చుట్టాం. 

కోవిడ్‌ సమయంలోనూ జగనన్న అమ్మఒడి, వైయస్‌ఆర్‌ ఆసరా, 31 లక్షల ఇళ్ల పట్టాలతో పాటు ఇళ్ల నిర్మాణం ఇవన్నీ చేస్తూనే చేయూత వంటి పథకం అమలు చేస్తున్నాం. ఈస్ఫూర్తితోనే కాపు నేస్తం, ఈబీసీ నేస్తం పథకాలను తీసుకువచ్చాం. 45–60 సంవత్సరాల మధ్య చాలా బాధ్యత గల వయస్సులో ఉన్న ప్రతి ఒక్క  పేద అక్కచెల్లెమ్మలకు అండగా నిలబడుతున్నామని గర్వంగా చెబుతున్నాను. 

ఇటువంటి ఆలోచనలో మీ జీవితకాలంలో చేశారా..? అక్కచెల్లెమ్మలకు తోడుగా నిలబడితే ఆ కుటుంబాలు పేదరికం నుంచి బయటపడతాయనే ఆలోచన చంద్రబాబుకు తట్టిందా అని అడుగుతున్నా. అటువంటి మనస్సు ఆయనకు లేదు కాబట్టే ఈ ఆలోచనలురావు.

ఎప్పుడూ, ఎవరూ ఆలోచన చేయని విధంగా 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చాం. చంద్రబాబు పార్టీ పుట్టి 40 ఏళ్ల చరిత్రలో ఏనాడైనా ఇటువంటి మంచి కార్యక్రమం చేశామనే చరిత్ర ఉందా..? రెండు దశల్లో ఇళ్ల నిర్మాణం జరుగుతుంది. మొదటి దశ వేగంగా పుంజుకుంటుంది.  ఇళ్ల నిర్మాణం పూర్తయితే.. ప్రతి అక్కచేతికి రూ.5 నుంచి 10 లక్షలు విలువ చేసే ఆస్తి వారి చేతికే ఇచ్చినట్టు అవుతుంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు వెళ్తే.. ఆ ఇల్లు రూ.20 లక్షల ఆస్తి అవుతుంది. ఇటువంటి మంచి కార్యక్రమాలు పూర్తవుతే.. ఆ 23 సీట్లు కూడా దక్కకుండాపోతాయనే భయంతో వీటిని అడ్డుకునేందుకు కోర్టుల్లో కేసులు వేయిస్తారు. కేసులు వేయించడం, విమర్శలు చేయడం తప్ప.. పేదలను గుండెల్లో పెట్టుకున్న చరిత్ర టీడీపీకి ఎప్పుడూ లేదు. 

అక్కచెల్లెమ్మలకు శాశ్వతంగా ఒక చిరునామా ఉండాలని, వారి సామాజిక హోదాను పెంచాలని చంద్రబాబు ఏరోజూ ఆలోచన చేసిన దాఖలాలు లేవు. చంద్రబాబు పార్టీ జెండా ఎప్పుడైనా గమనిస్తే.. ఆ పార్టీగుర్తులోనే గుడిసె కనిపిస్తుంది. ఆ గుడిసెలోనే పేదలుండాలని కోరుకునే మనస్తత్వం చంద్రబాబుది. పేదలకు పక్కా ఇల్లు అవసరమని ఎప్పుడూ బాబు గుర్తించలేదు. కట్టీకట్టని టిడ్కో ఇళ్లను కూడా మేమే కట్టామని డ్రామాలు. 2.62లక్షల టిడ్కో ఇళ్లు కూడా కంప్లిట్‌ కాకుండా వదిలేశారు. ఆ ఇళ్లకు డ్రైనేజీలు, కరెంటు, రోడ్లు, ఇంటికి నీటి కనెక్షన్‌లు లేని పరిస్థితి. అటువంటి దారుణమైన పరిస్థితుల్లో టిడ్కో ఇళ్లు ఉన్నాయి. వాటి బాధ్యత కూడా మన ప్రభుత్వమే తీసుకొని.. పూర్తి చేసే కార్యక్రమం చేస్తుంటే.. దానికి మనకు క్రెడిట్‌ ఇవ్వకపోగా.. అబద్ధాలు అలవాటుపడిన వ్యక్తి.. హైదరాబాద్, ఎయిర్‌పోర్టు, ఔటర్‌ రింగ్‌ రోడ్డు, పీవీ నర్సింహరావు ఎక్స్‌ప్రెస్‌ హైవే కూడా నేనే కట్టానని భజన చేసుకుంటాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న తరువాత కూడా 31 లక్షల మంది పక్కా ఇళ్లు లేకుండా ఎందుకు మిగిలిపోయారన్న ప్రశ్నకు చంద్రబాబు దగ్గర సమాధానం ఉందా..? 

నామినేటెడ్‌ పోస్టుల విషయానికి వస్తే.. దేశ చరిత్రలో తొలిసారిగా నామినేటెడ్‌ పదవులు, కాంట్రాక్ట్‌లలో 50 శాతం కచ్చితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇవ్వడంతో పాటు 50 శాతం కచ్చితంగా మహిళలకే ఇచ్చేట్టుగా ఏకంగా చట్టం చేసిన తొలి ప్రభుత్వం మనది. 

బీసీలను పనిమూట్లుగా ఉపయోగించుకోవడం తప్ప.. వారికి చంద్రబాబు చేసిందేమిటీ..? అని ప్రజలంతా ఆలోచన చేసుకోవాలి. చంద్రబాబు పాలనలో ఒక్కసారైనా నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, చేదోడు, తోడు ఇటువంటి పథకాలు ఆలోచనలోకైనా వచ్చాయా..? చంద్రబాబు పరిపాలనలో అగ్రిగోల్డ్‌ బాధితులు కళ్లముందటే ఇబ్బందులు పడుతున్నా కూడా అగ్రిగోల్డ్‌ కంపెనీని దోచుకుంది.. సర్వనాశనం చేసింది చంద్రబాబు అయితే.. ఆ బాధితులకు రూ.905 కోట్లు చెల్లించింది మన ప్రభుత్వం. ఇవన్నీ చంద్రబాబు చేయలేదు కాబట్టి.. ఈరోజు కులాలు, ప్రాంతాలు మధ్య చిచ్చుపెడుతున్నాడు. నిత్యం ఏదో ఒక సంఘటనను తీసుకొని కులాలు, ప్రాంతాలు, మతాల మధ్య చిచ్చుపెడుతూ.. దానితో ప్రభుత్వానికి ఏ సంబంధం లేకపోయినా పొగ వేయాలని నానా తంటాలు పడుతున్నాడు. చంద్రబాబుకు తోడు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 నిత్యం డబ్బాలు వాయిస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి లేడు కాబట్టి.. ఆ స్థానానికి బాబును తీసుకురావాలనే తాపత్రయంతో అబద్ధాలు చెప్పడంలో వీరంతా స్థాయి మరిచిపోయి ప్రవర్తిస్తున్నారు. 

అధికారంలో ఉండగా పట్టపగలు గుడులు కూలగొట్టిన చరిత్ర ఉన్న చంద్రబాబుకు.. అధికారం పోతే చీకట్లో విగ్రహాలు విరిచేయాలన్న ఆలోచనలు, రథాలు తగలబెట్టాలన్న ఆలోచనలు ఇటువంటి వారికి రాకుండాపోతాయా..? కూలగొట్టిన గుడుల స్థానంలో తిరిగి కట్టించే కార్యక్రమం, చంద్రబాబు తగలబెట్టి మాపై మసిపూశారో అటువంటి రథాలను కూడా మళ్లీ పునర్‌ నిర్మించి.. వాటికి వైభవం తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఎటువంటి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారో.. ప్రచారాలు చేస్తున్నారో ప్రజలంతా ఆలోచన చేయాలి. 

అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోపే 1.30 లక్షల శాశ్వత ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర మనది. ఆర్టీసీని ప్రభుత్వంలో కలుపుకున్న చరిత్ర మనది. వైద్య, ఆరోగ్య శాఖలో డాక్టర్లు, నర్సులు లేని పరిస్థితి ఉండకూడదని ఏకంగా 39 వేల పోస్టులు భర్తీ చేస్తున్న చరిత్ర మనది. ప్రభుత్వ ఆస్పత్రులను గాలికొదిలేసి.. ఎలుకలు కొరికి పిల్లలు చనిపోయిన చరిత్ర చంద్రబాబుది. ప్రభుత్వ సంస్థలను మూసేయడం, పప్పు, బెల్లాలకు అమ్మేయడం మాత్రమే తెలిసిన వ్యక్తి గత  ప్రభుత్వ పెద్ద అయితే.. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగాల గురించి మాట్లాడే నైతిక హక్కు ఇటువంటి వారికి ఉందా..? 

ప్రభుత్వంలో విలీనమైన ఆర్టీసీలో 52 మంది కనిపిస్తున్నారు. 1.30 లక్షల మంది సచివాలయాల్లో ఉద్యోగాలు చేస్తున్న పిల్లలు కనిపిస్తున్నారు. ఏకంగా 2.70 లక్షల మంది వలంటీర్లుగా మన కళ్ల ఎదుటే తిరుగుతూ చిరునవ్వుతో సేవలు అందిస్తున్నారు. మరో లక్ష మంది అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ఆప్కాస్‌ ద్వారా మెరుగైన జీతాలు అందేలా ఒక కార్పొరేషన్‌ కూడా క్రియేట్‌ చేశాం. మరో 20 వేల మందికి కాంట్రాక్టు ఉద్యోగాలిచ్చాం. 34 నెలల కాలంలో గవర్నమెంట్‌ సెక్టార్లలో రకరకాల కేటగిరీల్లో ఇచ్చిన ఉద్యోగాలు 6.03 లక్షల మందికి ఇచ్చాం. 

కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు మెరుగైన జీతాలు ఇచ్చేందుకు టైమ్‌ స్కేల్‌ను కూడా అమలు చేసింది మన ప్రభుత్వమే. ఎన్నికలకు నెల ముందు కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌కు టైమ్‌ స్కేల్‌ అని చంద్రబాబు జీవో ఇచ్చాడు. ఆ జీవోలో ఏం రాస్తాడంటే.. జూన్‌ నుంచి అమలు చేస్తామని రాస్తాడు. ఇటువంటి వ్యక్తులు ఉద్యోగుల గురించి మాట్లాడుతున్నారంటే.. ఆలోచన చేయాలి. ఇటువంటి వారికి కమ్యూనిస్టు కామ్రెడ్‌లు తానాతందానా అని అంటారు. 

అంగన్‌వాడీల్లో పనిచేస్తున్న వారికి, ఆశా వర్కర్లకు, మధ్యాహ్న భోజన కార్మికులకు, శానిటరీ వర్కర్లు, హోంగార్డులకు, 104, 108 సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకు ఇలా అనేక విభాగాల్లో పనిచేస్తూ.. చాలని జీతాలతో బతుకుబండిని ఈడుస్తున్న 3,07,727 మందికి మేలు చేసేలా గతంలో వీరి జీతాలు రూ.11 వందల కోట్లు అయితే.. ఇప్పుడు మనం ఇస్తున్నది రూ.3 వేల కోట్లు. 

అంతేకాకుండా భారమైన పీఆర్సీ విషయంలోనూ.. రాష్ట్ర ఇబ్బందులు ఎన్ని ఉన్నా.. ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో పెరగకపోయినా అంతిమంగా ఉద్యోగుల సంతోషాన్ని ప్రమాణికంగా తీసుకొని వారి వేతనాలను కూడా వీలైనంత ఎక్కువగా, పెంచగలిగినంత పెంచాం. 

వైద్యరంగం..
ఆరోగ్యశ్రీ ఆలోచన చంద్రబాబుకు రాలేదు. కనీసం దాన్ని సక్రమంగా అమలు చేసే మనసు కూడా వీరికి లేదు. మనందరి ప్రభుత్వ పాలనలో 5 లక్షల రూపాయలలోపు వార్షిక ఆదాయం ఉన్నవారికి ఆరోగ్యశ్రీ వర్తింపుజేస్తున్నందు వల్ల ఈరోజు రాష్ట్రంలో 95 శాతం మందికి ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. గతంలో వెయ్యి ప్రొసీజర్లకు మాత్రమే ఆరోగ్యశ్రీ అమలులో ఉంటే.. ఈ రోజు 2600 ప్రొసీజర్లకు ఆరోగ్యశ్రీ అమలవుతుంది. అంతేకాకుండా మనిషి బాగోలేక ఆస్పత్రికి వెళ్లి ఆపరేషన్‌ చేయించుకుంటే డాక్టర్లు విశ్రాంతి తీసుకోమని చెబితే.. ఆ కుటుంబం ఇబ్బంది పడకూడదని నెలకు రూ.5 వేలు ఆ మనిషి చేతుల్లో పెట్టేందుకు ఆరోగ్య ఆసరా అమలు చేస్తున్నాం. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని ఎప్పుడూ ఏడ్చే చంద్రబాబు ఇటువంటి మంచి స్కీమ్‌ గురించి ఆలోచన చేశాడా..? 

ఆరోగ్యశ్రీ స్కీమ్‌ను నిర్వీర్యం చేస్తూ సంవత్సరం పైగా నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు బకాయిలు పెట్టాడు. రూ.680 కోట్లు చంద్రబాబు పెట్టిన బకాయిలను మన ప్రభుత్వం క్లియర్‌ చేసింది. ఈరోజు నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు ప్రతీ నెలా ఆటో డెబిట్‌ కింద జమ అవుతుంది. ఎక్కడా కూడా డిలే లేదు. అంత గొప్పగా ఆరోగ్యశ్రీ సాగుతోంది. 

104, 108 దాదాపుగా 11 వందల వాహనాలను కొత్తగా కొని పంపించాం. ఇవేకాకుండా గ్రామాల్లో వైయస్‌ఆర్‌ విలేజ్‌ క్లినిక్స్‌ ఏర్పాటవుతున్నాయి. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్టులు, పీహెచ్‌సీలు, విలేజ్‌ క్లినిక్స్‌తో అనుసంధానమై పనిచేస్తాయి. కోవిడ్‌ సమయంలో టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్‌మెంట్‌ విషయంలో దేశంలో అగ్ర రాష్ట్రాల్లో మనది ఒకటి. కోవిడ్‌ మరణాలు అతి తక్కువ ఉన్న రాష్ట్రం మనదే అని గర్వంగా చెబుతున్నాను. 

పెద్ద రాష్ట్రాల మాదిరిగా మన దగ్గర సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు లేకపోయినా.. గ్రామ స్థాయిలో సచివాలయాలు, వలంటీర్లు, ఆశా వర్కర్లు, పనిచేసిన తీరు దాదాపుగా 36 సార్లు ఫీవర్‌ సర్వే జరిగింది. ఎర్లీ టెస్టింగ్, ఎర్లీ ట్రీట్‌మెంట్‌తో అందరినీ కాపాడుకోగలిగాం. మరణాలు అతి తక్కువగా నమోదయ్యాయి. వీటికి శాశ్వత పరిష్కారం తీసుకురావాలని టెరిషరీ కేర్‌ మన దగ్గరే వృద్ధి చెందాలనే ఉద్దేశంలో రాష్ట్రంలో 11 టీచింగ్‌ ఆస్పత్రులు ఉంటే.. వీటికి అదనంగా మరో 16 టీచింగ్‌ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి మనిషి ప్రాణాలు విలువ తెలుసు కాబట్టి వారిని బ్రతికించే కార్యక్రమం చేస్తున్నాం. 

ప్రభుత్వ ఆస్పత్రులు శిథిలావస్థకు చేర్చిన గత పరిస్థితికి.. ఈ ఆస్పత్రులను మెరుగుపర్చాలనే మన ప్రభుత్వ తపనకు తేడా గమనించాలని కోరుతున్నాను. ఈరోజు ఆస్పత్రుల్లో నాడు–నేడుతో అక్షరాల రూ.16 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఆస్పత్రుల రూపురేఖలు మార్చుతున్నాం. గవర్నమెంట్‌ ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత ఎక్కడా లేకుండా.. ఎంతమంది డాక్టర్లు, ఎంత మంది నర్సులు కావాలో అంతమంది ఉండేట్టుగా చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా 39 వేల మంది డాక్టర్లు, నర్సులను రిక్రూట్‌ చేస్తున్నాం. మనుషులను బతికించడం, వైద్యరంగం వంటి అంశాలను మాట్లాడే కనీసం అర్హత కూడా చంద్రబాబుకు లేదు. 

రైతు–వ్యవసాయం
రైతును చంద్రబాబు మోసం చేస్తే.. మన ప్రభుత్వం అదే రైతన్నకు ఇవాళ న్యాయం చేస్తున్నాం. రూ. 87,612 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానని చంద్రబాబు మోసం చేసి.. కేవలం రూ.15 వేల కోట్లు కూడా ఇవ్వని పరిస్థితి గతంలో మనం చూశాం. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు రైతుకు రూ.12,500 రైతు భరోసా కింద నాలుగేళ్ల పాటు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పినా.. రైతు కష్టాన్ని చూసి వారికి ఇంకా మేలు చేసే ఉద్దేశంతో అదే రైతు భరోసా సొమ్మును ఏటా రూ.13500 పెంచి ఐదేళ్ల పాటు దాన్ని వర్తింపజేస్తూ ఈరోజు దేశంలో ఎక్కడా జరగని విధంగా అమలు చేస్తున్నాం. ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ రైతులు, కౌలు రైతులకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాం. 

అరకోటికి పైగా రైతులకు మంచి చేసే ఇలాంటి స్కీమ్‌ పెట్టాలని చంద్రబాబుకు ఏనాడూ తట్టలేదు. రైతుకు పెట్టుబడి సాయం చేయాలి. 80 శాతం మంది రైతులకు ఒక హెక్టార్‌లోపు కూడా భూములు లేవు. రూ.13500 పెట్టుబడి ఖర్చు ఇస్తే.. దాని వల్ల అప్పులు తీసుకోవాల్సిన దుస్థితికి పోకుండా 80 శాతం పెట్టుబడి డబ్బులు ఉంటాయనే ఆలోచనలు చంద్రబాబు చేయలేదు.

ఉచిత విద్యుత్‌ ఇస్తే.. కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవడానికి అని చెప్పిన చంద్రబాబు, వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు.. వ్యవసాయ విద్యుత్‌ బిల్లులు కూడా కట్టని రైతుల ఇళ్లలో సామాగ్రిని రోడ్డు మీద వేసి వేలం వేయించిన ఈ వ్యక్తి, రైతులను కరెంటు దొంగలన్న ఈ వ్యక్తి, కరెంటు బకాయిల వసూలు కోసం ప్రత్యేక పోలీస్‌ స్టేషన్లు పెట్టిన ఈ వ్యక్తి, ప్రత్యేక కోర్టులు పెట్టిన ఈ వ్యక్తి.. మనం రైతు భరోసా కేంద్రాలు పెడుతుంటే.. వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తుంటే.. తన డెయిరీ, తన వారి డెయిరీలు కూడా అమూల్‌ పాలవెల్లువతో రేట్లు పెంచాల్సిన దుస్థితి వచ్చింది కాబట్టి.. దాన్ని కూడా విమర్శిస్తున్నాడు. 

ఈ ప్రభుత్వం రైతు భరోసా సొమ్ము ఇస్తుంటే జీర్ణించుకోలేని పరిస్థితుల్లో చంద్రబాబు ఉన్నాడు. చంద్రబాబు హయాంలో రూ.960కోట్ల ధాన్యం సేకరణ బిల్లులు సంవత్సరం తరబడి కట్టకుండా వదిలేశాడు. ఆ బకాయిలను మన ప్రభుత్వం కట్టింది. రూ.384 కోట్ల విత్తన బకాయిలను మన ప్రభుత్వం కట్టింది. వీటన్నింటికీ మించి రూ. 9 వేల కోట్ల కరెంట్‌ బకాయిలను వదిలేస్తే.. మన ప్రభుత్వం చిరునవ్వుతో స్వీకరించి కడుతున్నాం. 

ఎన్నికల సమయంలో రైతు మాదిరిగానే తలపాగా కట్టి ఫొటోలకు పోజులు ఇస్తాడు. ఎన్నికల హామీలిచ్చి.. అనంతరం వారికి టోపీ పెట్టి దేశ చరిత్రలో ఇటువంటి గొప్ప మోసగాడు ఎవరూ ఉండరు. ఇటువంటి వ్యక్తి మన వ్యవసాయ విధానాన్ని విమర్శిస్తుంటే.. ఇంతకంటే సిగ్గుపడాల్సిన వ్యవహారం ఉండదు. రైతులను, వారి కుటుంబాలను నమ్మించి మోసం చేసి, చివరకు వారి బంగారం కూడా వేలం వేసే పరిస్థితి తీసుకువచ్చిన చంద్రబాబు పాలనకు, సున్నావడ్డీ పంటరుణాలు, క్రమం తప్పకుండా కట్టేందుకు రైతులకు అవగాహన కల్పిస్తూ.. ఈ–క్రాప్‌ ద్వారా అందరికీ ఉచిత పంటల బీమా, అదే సీజన్‌ ముగిసేలోగా ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఖరీఫ్‌లో జరగరానిది జరిగితే.. మరో ఖరీఫ్‌ రాకముందే ఇన్సూరెన్స్‌ ఇవన్నీ టెన్షన్‌గా జరుగుతున్నాయి. ఎక్కడా డిలే లేకుండా జరుగుతున్నాయి. రైతు భరోసా కేంద్రాలు విత్తనం నుంచి పంట విక్రయం వరకు తోడుగా ఉన్నాయి. ఈ–క్రాప్‌ విధానం గ్రామస్థాయిలోనే జరుగుతున్నాయి. ఇవన్నీ మారుతున్న వ్యవసాయ రంగంలో జరుగుతున్న విప్లవాత్మక మార్పులకు శ్రీకారం. 

రైతనన్నను ఇన్ని రకాలుగా వంచన చేసిన ప్రభుత్వం చంద్రబాబుది అయితే.. రైతన్నకు అన్ని రకాలుగా మేలు చేస్తున్న ప్రభుత్వం మాది కాదా అని గుండెల మీద చెయ్యి వేసుకొని ఆలోచన చేయాలి. 

ఈ మధ్యకాలంలోనే చంద్రబాబు నుంచి, ఈనాడు, అప్పుడప్పుడు ఆంధ్రజ్యోతి, టీవీ5లో చూస్తుంటాం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, అప్పులు అని పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తుంటారు. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందంటూ, పరిమితులకు మించి అప్పు చేశామంటూ చేస్తున్న ప్రచారాన్ని గమనించండి. 2014 నాటికి రూ.1,20,556 కోట్ల అప్పు ఉంటే.. చంద్రబాబు ఐదేళ్ల సమయంలో ఆ అప్పును రూ.2,68,225 కోట్లకు తీసుకెళ్లాడు. ఇదికాకుండా.. ఈ పెద్ద మనిషి చెల్లించకుండా వదిలేసిన బకాయిలు రూ.39 వేల కోట్లు, ఇదేకాకుండా ప్రభుత్వ గ్యారెంటీ మీద చేసిన అప్పులు 2014 నాటికి రూ.14,028 కోట్లు అయితే.. చంద్రబాబు హయాంలో 2019 నాటికి మరో రూ.58 వేల కోట్లకు పెంచాడు. ఇవేకాకుండా విద్యుత్‌ సంస్థల పంపిణీకి సంబంధించిన బకాయిలు 2014లో రూ.2,893 కోట్లు ఉంటే.. చంద్రబాబు హయాంలో 2019 నాటికి రూ.21,540 కోట్లకు పెంచాడు. విద్యుత్‌ కొనుగోలు చేసి వారికి కూడా డబ్బులు ఎగ్గొట్టాడు. ఇవేకాకుండా విద్యుత్‌కు సంబంధించి వివిధ రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు అన్నింటికీ సంబంధించి అప్పులు రూ.20,703 కోట్లు ఉంటే.. ఐదేళ్ల సమయంలో రూ.68,596 కోట్లకు పెంచాడు. దీన్ని ఆర్థిక వ్యవస్థ అంటారా.. ఆర్థిక అరాచకం అంటారో ఈనాడు,ఆంధ్రజ్యోతి, టీవీ5కి తెలియాలి. 

ఇటువంటి అరాచకాలు చేసి.. ఆ అప్పులు, ఆ వడ్డీల భారాన్ని మనందరి ప్రభుత్వం నెత్తిన వేసి.. అదే నోటితో విమర్శలు చేస్తున్నాడు. రాష్ట్రం మీద ఇంత భారం మోపి.. ఏదైనా ప్రజలకు మంచి చేశాడా అంటే.. అది కూడా లేదు. చంద్రబాబు చేసిన అప్పు అంతా అవినీతికి పోతే.. మనం చేసే అప్పు పేదవాడి జేబుల్లోకి వెళ్తుంది. టీడీపీ హయాంలో ఏ ఒక్క సంవత్సరం కూడా ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి లోబడి అప్పు చేసింది లేదు. కేవలం జీఎస్‌డీపీలో 3 శాతం మాత్రమే అప్పు చేయొచ్చు అనే నిబంధన ఉంటే.. దాన్ని తుంగలో తొక్కి 2014–15లో 3.95 శాతం అప్పు చేశాడు. 2015–16లో 3.65 శాతం మేరకు, 2016–17లో 4.52 శాతం, 2017–18లో 4.12 శాతం, 2018–19లో 4.07 శాతం అప్పు చేశారు. ఇలా ప్రతి ఏటా ఎక్కువగా అప్పులు చేసినందు వల్ల ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తరువాత చేయగల అప్పు పరిమితిని రూ.16,419కోట్లను కేంద్రంతో యుద్ధం చేయాల్సి వస్తుంది. 

చంద్రబాబు ప్రభుత్వం చేసిన పాపాలు ఇప్పుడు మనల్ని వెంటాడుతున్నాయి. పాపాల బైరవుడు చేసిన తప్పులను సరిదిద్దడానికి వైయస్‌ఆర్‌ హయాం నుంచి చంద్రబాబు వచ్చే వరకు గత ప్రభుత్వాలు చేసిన అండర్‌ బారోయింగ్‌లను వెతికి తీసి ఆ మేరకు అడ్జస్ట్‌ చేసే ప్రయత్నం మనం ఈరోజు కేంద్రంతో పోరాటం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాం. చంద్రబాబు హయాంలో ప్రతీ ఏటా కంపౌండెడ్‌ యానివల్‌ గ్రోత్‌ రేట్‌ (సీఏజీఆర్‌)17.33 శాతం పెరిగితే.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబుకు కనిపించవు. మన హయాంలో వారు చేసిన అప్పులు ఒకవైపును కట్టుకుంటూనే పెరిగిన మన అప్పు కేవలం 14.88 శాతం మాత్రమేనని తెలియజేస్తున్నాను. పాపాలు చంద్రబాబువి.. ప్రాయశ్చితం మనది. 

ఇవన్నీ చూసి బాబు గొప్ప ఆర్థికవేత్త అంటారా.. లేకపోతే నిజాన్ని దాచి మన ప్రభుత్వం మీద నిందలు వేయడానికి జర్నలిజాన్ని ఉపయోగించుకుంటున్నారు. దీన్ని జర్నలిజం విలువలు అంటారా..? అని ఆలోచన చేసుకోవాలి. 

చేతగానివాడికి కోపం ఎక్కువ అనే సామెత ఉంది. అందుకనే రోజుకు ఒక జూమ్‌ మీటింగ్, అరడజన్‌ ప్రెస్‌మీట్లు పెట్టిస్తాడు. అందులో తిట్టపోటీ పెట్టిస్తాడు. ముఖ్యమంత్రిని తిట్టండి అని రెచ్చగొడతాడు. ఎల్లో మీడియాలో ఆనందంగా ప్రసారం చేస్తారు. ఇవన్నీ పద్ధతి ప్రకారం ప్రతీరోజూ ఇదే జరుగుతుంది. కానీ, ప్రజలకు అర్థం కావాల్సింది ఒక్కటే.. ఈ రాష్ట్రానికి చంద్రబాబు, ఆయన పార్టీ చేసిన మేలు ఏమిటీ..? వీరు చేసింది అంతా దుర్మార్గమే. మంచి చేసే మన ప్రభుత్వం మీద కళ్లార్పకుండా అబద్ధాలు చెబుతూ నిందలు వేసే మరో దుర్మార్గానికి శ్రీకారం చుట్టారు. అందరూ ఆలోచించాలని మరోసారి కోరుతున్నాను. 

తమకు అధికారంపోయి వెయ్యి రోజులు అయిన సందర్భంగా రగిలిపోతున్న చంద్రబాబు పార్టీ, దాని అనుబంధ సంస్థలకు, ఎల్లో మీడియాకు, వేర్వేరు పార్టీలు, సంస్థల్లో చంద్రబాబు బాగు కోసం అహర్నిశలు కష్టపడుతున్న వీరందరికీ ప్యాన్‌ 40 టాబ్లెట్లు, జలిసిల్‌ సిరప్, ఈనో ప్యాకెట్లు విరివిగా లభించాలని కోరుకుంటూ.. దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు మన ప్రభుత్వంపై కలకాలం ఉండాలని ఆశీస్తూ సెలవు తీసుకుంటున్నాను’ అని సీఎం వైయస్‌ జగన్‌ తన ప్రసంగాన్ని ముగించారు.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top