ఉద్యోగులకు మంచిచేయాలనే తపన, తాపత్రయంతో..

ఉద్యోగుల ఆకాంక్షలు, రాష్ట్ర వాస్తవ ఆర్థిక పరిస్థితుల్లో 23 శాతం ఫిట్‌మెంట్‌

కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు కూడా వర్తింపు

రిటైర్మెంట్‌ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంపు

01–07–2018 నుంచి పీఆర్సీ, 01–04–2020 నుంచి మానిటరీ బెనిఫిట్, 01–01–2022 నుంచి కొత్త జీతాలు అమల్లోకి..

ఈ నిర్ణయాలతో సంవత్సరానికి రూ.10,247 కోట్లు అదనపు భారం

జూన్‌ 30లోగా కారుణ్య నియామకాల పూర్తికి ఆదేశం

సొంతిల్లు లేని ప్రభుత్వ ఉద్యోగులకు జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లో 10 శాతం ప్లాట్లు, 20 శాతం రిబేట్‌

రెండు వారాల్లో ఉద్యోగులకు సరికొత్త హెల్త్‌ స్కీమ్‌

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జూలై నుంచి సవరించిన రెగ్యులర్‌ జీతాలు 

ఉద్యోగుల అనుభవం రాష్ట్రానికి సంబంధించిన ఆస్తిగా భావిస్తున్నా

ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

తాడేపల్లి: మంచి చేయాలనే తపన, తాపత్రయంతో ప్రతి అడుగు వేస్తున్నామని, సీఎస్‌తో కూడిన అధికారుల కమిటీ 14.29 శాతం మించి ఫిట్‌మెంట్‌ ఇవ్వలేమని చెప్పినప్పటికీ ఉద్యోగుల ఆకాంక్షలను, రాష్ట్ర వాస్తవ ఆర్థిక పరిస్థితిని బేరీజు వేసుకొని వీలైనంత మంచి చేయాలనే తపన, తాపత్రయంతో ఫిట్‌మెంట్‌ను 23 శాతంగా నిర్ణయించామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పెండింగ్‌లో ఉన్న అన్ని డీఏలను ఒకేసారి జనవరి జీతంతో కలిపి ఇవ్వాలని ఆదేశాలిచ్చానని చెప్పారు. ఈ నిర్ణయాల వల్ల సంవత్సరానికి రూ.10,247 కోట్లు అదనపు భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడుతున్నప్పటికీ ఉద్యోగులకు మంచి జరగాలని, విపత్కర పరిస్థితుల్లోనూ ఈ బాధ్యతను స్వీకరిస్తున్నాను అని ముఖ్యమంత్రి చెప్పారు. 

ఉద్యోగ సంఘాల నేతలతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ, ఆర్థిక శాఖ అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ ఏం మాట్లాడారంటే..

‘వీలైనంత త్వరగా మంచి పరిష్కారం చూపించాలని ఆర్థిక శాఖ అధికారులతో సుదీర్ఘంగా చర్చించాం. ఈరోజు ఉదయం కూడా రెండోసారి అధికారులతో సుదీర్ఘ చర్చ జరిగింది. మంచి చేయాలనే తపన, తాపత్రయంతో ప్రతి అడుగు వేస్తున్నాం. మన ఆర్థిక పరిస్థితులు, రాష్ట్ర విభజనతో ఏర్పడ్డ సంక్లిష్ట పరిస్థితులు, కోవిడ్‌ వల్ల ఆదాయం తగ్గిన పరిస్థితుల మధ్య ఒమిక్రాన్‌ ఏ రూపం దాల్చుతుందో.. భవిష్యత్తులో రాష్ట్ర, దేశ ఆర్థిక పరిస్థితులపై దాని ప్రభావం ఎలా చూపబోతుందో ఇవన్నీ పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితుల్లో మనం ఉన్నామని నిన్నటి సమావేశంలో ఉద్యోగ సంఘాలకు వివరించడం జరిగింది. 

ఆర్థిక పరిస్థితి బాగులేదని ఆర్థిక శాఖ అధికారులు చెప్పారు. 14.29 శాతం ఫిట్‌మెంట్‌ కంటే ఎక్కువ ఇచ్చే పరిస్థితి దయచేసి తేవొద్దండీ అని ఆర్థిక శాఖ అధికారులు నాతో చెప్పారు. ఉద్యోగుల ఆకాంక్షలను మనసులో పెట్టుకొని మనం కూడా నాలుగు అడుగులు ముందుకువేయాలని సీఎస్, ఆర్థిక శాఖ కార్యదర్శికి చెప్పాను. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి ప్రజలకు సంతృప్తి స్థాయిలో జరగాలంటే ఉద్యోగుల సహకారం ఎంతో అవసరం. పీఆర్సీతో సహా కొన్ని అంశాలను లేవనెత్తారు. వాటిని కూడా పరిష్కరించే దిశగా సీఎస్, ఆర్థిక శాఖ అధికారులతో చర్చించాం. వాటికి సంబంధించి నిర్దిష్ట టైమ్‌లైన్‌ చెప్పాలనే విషయాలను చెప్పాను. 

- కోవిడ్‌ కారణంగా మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పాం. ఆ మాటకు కట్టుబడి ఉన్నాం. జూన్‌ 30వ తేదీలోపు కారుణ్య నియమాకాలకు పూర్తి చేయాలని సీఎస్, అధికారులకు ఆదేశాలిస్తున్నాం. 

- ఉద్యోగుల హెల్త్‌ స్కీమ్‌కు సంబంధించి కొన్ని కొన్ని సూచనలు, సలహాలు ఉద్యోగ సంఘాల నుంచి వచ్చాయి. వాటికి సంబంధించి.. సీఎస్‌ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. కేవలం రెండు వారాల్లో సమస్యలన్నీ పరిష్కరించాలని ఇప్పటికే ఆదేశాలిచ్చాం. ఉద్యోగ సంఘాల సమక్షంలో సీఎస్‌కు మరోసారి ఆదేశాలిస్తున్నాను. 

- సొంతిల్లు లేని ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వమే జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ (ఎంఐజీ) లేఅవుట్లలో 10 శాతం స్థలాలను ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయించాలని చెప్పాం. నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌ కింద తీసుకొని సొంతిల్లు లేని ఉద్యోగులు ఉండకూడద‌ని, 10 శాతం ప్లాట్లు కేటాయించడమే కాకుండా 20 శాతం సబ్సిడీ ప్రభుత్వమే భరిస్తుంది. 

- గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగులందరికీ జూన్‌ 30వ తేదీలోగా ప్రొబేషన్, కన్ఫర్మేషన్‌ ప్రక్రియ పూర్తిచేసి సవరించిన రెగ్యులర్‌ జీతాలను ఈఏడాది జూలై నుంచి ఇవ్వాలని ఆదేశాలిస్తున్నాం. 

- ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్‌ బకాయిలు పీఎఫ్, జీఎల్‌ఐ, లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ తదితర అంశాలన్నీ ఏప్రిల్‌ నాటికి పూర్తిగా క్లియర్‌ చేయాలని ఆదేశాలిచ్చాం. 

- పీఆర్సీ అమలు చేసే నాటికి పెండింగ్‌ డీఏలు ఉండకూడదని చెప్పాను. పెండింగ్‌లో ఉన్న అన్ని డీఏలను ఒకేసారి జనవరి జీతంతో కలిపి ఇవ్వాలని ఆదేశాలిచ్చాను. 

- సీఎస్‌తో కూడిన అధికారుల కమిటీ 2022 అక్టోబర్‌ నుంచి కొత్త పీఆర్సీ ప్రకారం సవరించిన జీతాలు ఇవ్వాలని నివేదించిన‌ప్ప‌టికీ.. ఉద్యోగుల ఆకాంక్షల మేరకు పది నెలల ముందే అంటే.. జనవరి 1, 2022 నుంచే పీఆర్సీని అమలు చేసి.. జీతాలు ఈనెల నుంచే ఇవ్వాలని ఆదేశాలిచ్చాం. 

- కొత్త స్కేల్స్‌ను రెగ్యులర్‌ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు కూడా మేలు చేయాలనే ఉద్దేశంతో వారికి కూడా 2022, జనవరి జీతాలతోనే అమలు చేయాలని ఆదేశాలిచ్చాం. 

- సీఎస్‌తో కూడిన అధికారుల కమిటీ 2022 అక్టోబర్‌ నుంచి కొత్త పీఆర్సీ ప్రకారం మానిటరీ బెనిఫిట్స్‌ ఇవ్వాలని చెప్పినప్పటికీ మీ అందరి ప్రభుత్వంగా 2020 ఏప్రిల్‌ నుంచే (21 నెలల ముందు నుంచే) ఇవ్వాలని కూడా ఆదేశాలిచ్చాం. 

- కేంద్ర ప్రభుత్వం విస్తృత ప్రాతిపదికన తీసుకొని సైంటిఫిక్‌ పద్ధతిలో ఓ వ్యక్తి కాకుండా ఏకంగా ఓ కమిటీ వేసి.. ఆ కమిటీ ద్వారా సెంట్రల్‌ పేరివిజన్‌ కమిషన్‌ చేసే ప్రతిపాదనను యధాతథంగా తీసుకొని ఇప్పటికే అనేక రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. ఇక నుంచే ఈ పద్ధతిలోనే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా పయనించాలని నిర్ణయం తీసుకుంది. 

- సీఎస్‌తో కూడిన అధికారుల కమిటీ 14.29 శాతం మించి ఫిట్‌మెంట్‌ ఇవ్వలేమని, రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితులను, సమస్యలను అన్ని కోణాల్లో క్షుణ్ణంగా అధ్యయనం చేసి వాస్తవిక సంఖ్యను చెప్పినప్పటికీ, ఉద్యోగుల ఆకాంక్షలను.. రాష్ట్ర వాస్తవ ఆర్థిక పరిస్థితిని బేరీజు వేసుకొని ఉద్యోగులకు వీలైనంత మంచి చేయాలనే తపన, తాపత్రయంతో ఫిట్‌మెంట్‌ను 23 శాతంగా నిర్ణయించాం. 

- అధికారుల కమిటీ చెప్పిన 14.29 శాతం కంటే దాదాపు 9 శాతం పెంచి ఫిట్‌మెంట్‌ అందిస్తున్నాం. ఉద్యోగ సోదరులందరూ సవినయంగా అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. ఈ పీఆర్సీ అమలు 01–07–2018 నుంచి, మానిటరీ బెనిఫిట్‌ అమలు 01–04–2020 నుంచి, కొత్త జీతాలు 01–01–2022 నుంచి అమల్లోకి వస్తాయి. ఈ నిర్ణయాల వల్ల సంవత్సరానికి రూ.10,247 కోట్లు అదనపు భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడుతున్నప్పటికీ ఉద్యోగులకు మంచి జరగాలని, విపత్కర పరిస్థితుల్లోనూ బాధ్యతను స్వీకరిస్తున్నాను. 

- మంచి చేయడానికి మన ప్రభుత్వం ఎల్లవేళలా ఉద్యోగులకు తోడుగా ఉంటుందని భరోసా ఇస్తున్నాను. సుదీర్ఘకాలం ప్రజాసేవలోనే పనిచేశారు. ఉద్యోగుల అనుభవం రాష్ట్రానికి సంబంధించిన ఆస్తిగా భావిస్తున్నాను. ఇంకా మంచి చేయాలనే ఆలోచనతో, మీ సేవలను మరింత మెరుగ్గా ఉపయోగించుకోవాలని ఉద్యోగులందరికీ మరింత మేలు చేయాలని రిటైర్మెంట్‌ వయస్సును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాం. 01–01–2022 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. 

- ఉద్యోగులకు మేలు చేసే విషయంలో మనసుతో, గుండెతో స్పందించి ఈ నిర్ణయాలను ప్రకటిస్తున్నాను. దేవుడి ఆశీస్సులు, ప్రజలందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం మంచి పాలన అందించడంలో ఉద్యోగుల సహాయ, సహకారాలు మరింతగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను. 

Back to Top