ముంపు ప్రాంతానికి రక్షణ కవచం

విజయవాడలో 80 వేల మందికి కృష్ణానది వరద నుంచి రక్షణ

సీఎం వైయ‌స్‌ జగన్‌ ప్రత్యేక శ్రద్ధతో రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం 

రూ.369.89 కోట్లతో నదిలో 2.26 కిలోమీటర్ల మేర నిర్మాణం 

12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా ముంపు భయం లేదిక 

రూ.12.3 కోట్లతో గోడ వెంబడి ఆహ్లాదకరంగా రివర్‌ ఫ్రంట్‌ పార్కు 

నేడు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌  చేతుల మీదగా ప్రారంభం

 విజయవాడ :  సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో విజయవాడలో ప్రకాశం బ్యారేజికి దిగువన ఉన్న కృష్ణా నదిని ఆనుకొని ఉన్న కాలనీ­ల్లోని 80 వేల మందికి వరద ముంపు బాధ తప్పింది. కృష్ణా నదికి కొద్దిపాటి వరద వచ్చి బ్యారేజి నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారంటేనే నగరంలోని కృష్ణలంక రణదీర్‌నగర్, కోటినగర్, తారకరామనగర్, భూపేష్‌గుప్తానగర్, పోలీస్‌కాలనీ, రామలింగేశ్వరనగర్‌ ప్రాంతాల ప్రజలు వణికిపోయేవారు. 3 లక్షల క్యూసెక్కుల వరద వస్తే ఈ ప్రాంతాలు మునిగినట్టే.

దీంతో వరద మొద­లవగానే ఈ ప్రాంతాల ప్రజలు సామా­న్ల­తో సహా సురక్షిత ప్రాంతాలు, పునరావాస కేంద్రాలకు తరలిపోయేవారు. నేడు 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా చుక్క నీరు కూడా ఇళ్లలోకి రాకుండా రూ.369.89 కోట్లతో 2.26 కిలోమీటర్ల రక్షణ గోడ నిర్మించారు. అంతేకాదు.. ఆ రక్షణ గోడ వెంబడి రూ.12.3 కోట్లతో రివర్‌ఫ్రంట్‌ పార్కును అభివృద్ధి చేశారు. ఆహ్లాదకరమైన వాతావరణంతో, వాకింగ్‌ ట్రాక్‌తో కూడిన ఈ పెద్ద పార్కు ఇప్పుడు నగరవాసులకు మంచి సందర్శనీయ ప్రాంతంగా మారనుంది. రక్షణ గోడ­ను రాష్ట్ర ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మంగళవారం జాతికి అంకితం చేసి,  రివర్‌ఫ్రంట్‌ పార్కును ప్రారంభించనున్నారు.  

దశాబ్దాలుగా ముంపు సమస్య 
నగరంలో కృష్ణా నది దిగువన ఉన్న ఈ కాలనీలకు ముంపు సమస్య దశాబ్దాల తరబడి అపరిష్కృతంగా ఉంది. విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని కృష్ణలంక రణధీర్‌నగర్, కోటినగర్, తారకరామనగర్, భూపేష్గుప్తానగర్, పోలీస్‌కాలనీ, రామలింగేశ్వరనగర్‌ ప్రాంతాలు ముంపుకు గురయ్యేవి. వాటిలో తారకరామనగర్, రణ«దీర్‌నగర్, భూపేష్‌ గుప్తా కాలనీలు 3 లక్షల క్యూసెక్కులు వరదకే మునిగిపోయేవి. పోలీస్‌కాలనీ, రామలింగేశ్వర్‌నగర్‌ తదితర ప్రాంతాలు ఏడు లక్షల క్యూసెక్కులు దాటితే ముంపునకు గురయ్యేవి. ఎన్ని ప్రభుత్వాలు మారినా పాలకులు పట్టించుకోలేదు. ఉమ్మడి రాష్ట్రానికి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తొలిసారిగా ఈ సమస్యపై దృష్టి సారించారు. కృష్ణా నది రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం చేపట్టాలని తలంచారు.

తొలి విడతగా రూ. 100 కోట్లు కూడా మంజూరు చేశారు. ఆయన మరణం తర్వాత దానిని ఎవరూ పట్టించుకోలేదు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్మాణ పనులు చేపట్టినప్పటికీ, తూతూమంత్రంగా నాసిరకంగా చేశారు. దీంతో చిన్నపాటి వరదకే కాలనీలన్నీ మునిగిపోయాయి. వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పటిష్టమైన రక్షణ గోడ నిర్మించి, ఈ కాలనీలకు వరద నుంచి శాశ్వత రక్షణ కల్పించాలని నిర్ణయించారు. అందులో భాగంగా రెండో దశలో రూ. 134.43 కోట్లు వెచ్చించి కోటినగర్‌ నుంచి కనకదుర్గమ్మ వారధి వరకు రిటైనింగ్‌ వాల్‌ నిర్మించారు. అంతేకాకుండా కనకదుర్గమ్మ వారధి ఎగువ ప్రాంతంలో పద్మావతి ఘాట్‌ నుంచి వారధి వరకు మూడో దశలో రూ.235.46 కోట్లతో రిటైనింగ్‌ వాల్‌ నిర్మించారు. 

ముస్తాబైన రివర్‌ ఫ్రంట్‌ పార్కు 
కృష్ణానది ముంపు ప్రాంత వాసుల కష్టాలు తీర్చడమే కాకుండా, నగర వాసులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు రూ. 12.3 కోట్లతో రివర్‌ ఫ్రంట్‌ పార్కును కూడా అభివృద్ధి చేశారు. ఈ పార్కులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా ట్రీ కెనాఫీ, వాకింగ్‌ ట్రాక్, సిట్టింగ్‌ ఏరియా, ఓపెన్‌ జిమ్, ప్లే ఏరియాతో సుందరంగా రూపొందించారు. సందర్శకుల వాహనాల పార్కింగ్‌కు అనువైన స్థలాన్ని ఏర్పాటు చేశారు. ఈ పార్కును కుటుంబ సమేతంగా వెళ్లి వీక్షించే విధంగా ముస్తాబు చేశారు.

ముంపు సమస్యకు పరిష్కారం  
ఒకప్పుడు కృష్ణానదికి వరద వచ్చిందంటే కరకట్ట ప్రాంతాల వారు ఆందోళనకు గురయ్యేవా­రు. ఇళ్లను కాళీ చేసి పునరావాస శిబిరాలకు తరలి వెళ్లాల్సి వచ్చేది. ఎంతో మంది పాలకులు వచ్చినా పట్టించుకోలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత రిటైనింగ్‌ వాల్‌ను చిత్తశుద్ధితో పూర్తి చేశారు. తొలుత వారధి దిగువన నిర్మాణం చేపట్టారు. హామీ ఇవ్వని ఎగువ ప్రాంతంలో కూడా రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం చేపట్టారు. అంతే కాకుండా ఆహ్లాదకరమైన వాతావరణం కోసం పార్కును సైతం ఏర్పాటు చేశారు.  – దేవినేని అవినాష్, వైయ‌స్ఆర్‌సీపీ విజయవాడ తూర్పు ఇన్‌చార్జి

 వరద ప్రాంతాలకు రక్ష   
కృష్ణానది పరివాహక ప్రాంతాలు వర­ద ముంపుకు గురికాకుండా ప్రభుత్వం రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం చేపట్టింది. రూ. 369.89 కోట్లతో రెండు దశల్లో పనులు పూర్తయ్యాయి. దీంతో ముంపు ప్రాంతాలైన రణధీర్‌నగర్, భూపేష్గుప్తా నగర్, తారకరామ నగర్‌ తదితర ప్రాంతాలకు రక్షణ ఏర్పడింది. ఇప్పుడు కృష్ణా నదికి వరద వచ్చినా ముంపు సమస్య ఉండదు. అంతే కాకుండా నగర వాసులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు పార్కును కూడా అభివృద్ధి చేశాం. వాటిని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభిస్తారు.– ఎస్‌ డిల్లీరావు, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌
 

Back to Top