అన్ని రాజ‌కీయ పార్టీల‌కు ఒకే నిబంధ‌న‌లు

లోకేష్ పాద‌యాత్ర‌పై ఎలాంటి పక్షపాతంకాని, వివక్ష కాని లేదు.  

“యువగళానికి షరతుల సంకెళ్లు’’ అంటూ “ఈనాడు’’ దినపత్రికలో అస‌త్యాలు ప్ర‌చారం

ఈనాడు క‌థ‌నంపై చిత్తూరు పోలీసుల ఖండ‌న‌

అమ‌రావ‌తి:  రాష్ట్రంలో గత సందర్భాల్లో వేర్వేరు పార్టీలు, ఆయా పార్టీలకు చెందిన నాయకులు ఇలాంటి రాజకీయ కార్యక్రమాలు చేసినప్పుడు తు.చ. తప్పకుండా  నిబంధనలు, ఆదేశాలు అమలు చేస్తామ‌ని చిత్తూరు పోలీసులు పేర్కొంటున్నారు. ఈ నెల 25న ఈనాడు ప‌త్రిక‌లో వ‌చ్చిన “యువగళానికి షరతుల సంకెళ్లు’’ అంటూ ప్ర‌చురిత‌మై క‌థ‌నాన్ని పోలీసులు తీవ్రంగా ఖండించారు. 

 •  “యువగళానికి షరతుల సంకెళ్లు’’ అంటూ “ఈనాడు’’ దినపత్రికలో ప్రచురించిన కథనంలో అంశాలను ఖండిస్తున్నాం. ఇందులోని విషయాలన్నీ వక్రీకరణలతో కూడి ఉన్నాయి. 
 •  చట్టాల ప్రకారం, ఇండియన్‌ పోలీస్‌ యాక్ట్‌ ప్రకారం, వివిధ సందర్భాల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు అన్ని పార్టీలకూ వర్తిస్తాయి.
 •   పాదయాత్రలు, నిరసనలు, బంద్‌లు, హర్తాళ్లు లాంటి నిర్వహించినప్పుడు పాటించాల్సిన నియమ నిబంధనలన్నింటినీ కూడా చాలా స్పష్టంగా పేర్కొన్నారు. వీటికి ఎవ్వరూ కూడా అతీతులు కారు. ఇందులో పేర్కొన్న అంశాలను నారా లోకేష్‌ పాదయాత్రకు కూడా వర్తింపు చేస్తున్నాం. 
 •  ఇందులో ఎలాంటి పక్షపాతంకాని, వివక్ష కాని లేదు.  
 •  రాష్ట్రంలో గత సందర్భాల్లో వేర్వేరుపార్టీలు, ఆయా పార్టీలకు చెందిన నాయకులు ఇలాంటి రాజకీయకార్యక్రమాలు చేసినప్పుడు తు.చ. తప్పకుండా ఇవే నిబంధనలు, ఆదేశాలు అమలు చేయడం జరిగింది. 
 •  ఉదాహరణకు… గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయ‌స్ జగన్‌గారు, ప్రతిపక్షనేతగా 2017లో పాదయాత్ర చేస్తున్న సందర్భంలో అనుమతులు తీసుకున్న సందర్భంగా పేర్కొన్న నియమనిబంధనలే.. ఇప్పుడు కూడా వర్తిస్తున్నాయి. ఆరోజైనా, ఈరోజైనా అవే నియమాలు, అవే నిబంధనలు ఉన్నాయి. 
 •  ఆనాడు శ్రీ వైయ‌స్ జగన్‌గారు పాదయాత్ర ప్రారంభించినప్పుడు పోలీసు యంత్రాంగం అనుమతి మంజూరు చేస్తూ, ఒక సుమోటో కేసు విచారణ సందర్భంగా 2007లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోని అంశాలను పాటించాలంటూ స్పష్టంగా చెప్పారు. 
 •  అంతేకాక ఒక జిల్లాలో పాదయాత్రను పూర్తిచేసిన వెంటనే, కొత్త జిల్లాలోకి వచ్చేటప్పుడు సంబంధిత జిల్లా పోలీసు అధికారినుంచి మళ్లీ అనుమతులు పొందారు. అందులోకూడా నిర్దేశించిన నియమ నిబంధనలను పేర్కొన్నారు.
 •  నారాలోకేష్‌గారి పాదయాత్ర సందర్భంగా పోలీసులు ఇచ్చిన అనుమతులు, ఇదే సమయంలో పాటించాల్సిన నియమనిబంధలోని అంశాలన్నీకూడా.. సుప్రీంకోర్టు ఆదేశాల్లోని అంతర్భాగాలే తప్ప.. కొత్తగా రూపొందించినవి కావు.
 •  ఆరోజు గౌరవ ముఖ్యమంత్రి, అప్పటి ప్రతిపక్షనేత యస్‌.జగన్మోహన్‌రెడ్డిగారి పాదయాత్రకు ఇచ్చిన అనుమతులు, అందులో పేర్కొన్న సుప్రీంకోర్టు ఆదేశాలు, వివిధ జిల్లాల పోలీసు అధికారులు ఇచ్చిన అనుమతులు, పాటించాల్సిన నియమనిబంధనల గురించి వారు పేర్కన్న నియమనిబంధనల ప్రతులను దిగువన ఇస్తున్నాం. గమనించగలరు.
 • ప్రజల రక్షణ, శాంతి భద్రతల పర్యవేక్షణ పోలీసు యంగ్రాంగం ప్రధాన విధి. మాకు అన్ని పార్టీలూ సమానమే. రేపు ఏ రాజకీయ పార్టీకి చెందినవారైనా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టేటప్పుడు ఇవే నియమనిబంధనలు వర్తిస్తాయి, అమలవుతాయి.  
 • జిల్లా పోలీసు యంత్రాంగం
 • చిత్తూరు
 •  
Back to Top