నేనే వచ్చి శంకుస్థాపన చేస్తా

పెన్నానది నుంచి వరద నివారణ కోసం చర్యలు 

సోమశిల ఆఫ్రాన్‌కు రూ.120 కోట్లు, కరకట్ట బండ్‌ నిర్మాణానికి రూ.100 కోట్లు మంజూరు

పొర‌పాటున‌ వరద సాయమందనివారు తక్షణమే దరఖాస్తు చేసుకోండి

నెల్లూరు జిల్లా వరద బాధితులతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌

నెల్లూరు: వరద బాధితులకు ఇంటికి రూ. 2వేలతో పాటు రేషన్‌ కూడా అందినట్టు అందరూ చెబుతున్నారని, సాయమందని వాళ్లు తక్షణమే గ్రామ, వార్డు సచివాలయాలో దరఖాస్తు చేసుకోవాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. నెల్లూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలు దేవరపాలెం, పెనుబల్లి, భగత్‌సింగ్‌ కాలనీల్లో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పర్యటించారు. దేవరపాలెంలో కోతకు గురైన కరకట్టను పరిశీలించారు. ఫొటో ఎగ్జిబిషన్‌ ద్వారా వరద నష్టాన్ని సీఎంకు అధికారులు వివరించారు. వరద బాధితుల సమస్యలను స్వయంగా సీఎం అడిగి తెలుసుకున్నారు. వారి నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. కలెక్టర్, అధికారులు ఏరకంగా స్పందించారో అందరినీ అడిగి తెలుసుకున్నానని అన్నారు. కలెక్టర్‌కు సీఎంకు వైయస్‌ జగన్‌ అభినందనలు తెలిపారు. సచివాలయంలో సోషల్‌ ఆడిట్‌ కోసం జాబితాను ప్రదర్శిస్తున్నామని, వరద సాయం ఎవరికైనా పొరపాటున అందకపోయి ఉంటే దరఖాస్తు చేసుకోవాలని, వెంటనే ప్రతి ఒక్కరికీ సాయం అందేలా అధికారులు చూస్తారన్నారు. 

పెన్నానది నుంచి వరద నివారణ కోసం చర్యలు తీసుకుంటామని చెప్పారు. కరకట్ట బండ్‌ నిర్మాణం కోసం రూ.100 కోట్లు మంజూరు చేస్తున్నామన్నారు. పండగ అయిపోయిన వెంటనే శంకుస్థాపన చేస్తామని, శంకుస్థాపన కార్యక్రమానికి కూడా తానే హాజరవుతానని సీఎం చెప్పారు. అదే విధంగా సోమశిల డ్యామ్‌ అఫ్రాన్‌ నిర్మాణం కోసం రూ.120కోట్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు. నెల్లూరు, సంగం బ్యారేజీలతో పాటు కరకట్ట బండ్‌ నిర్మాణానికి, సోమశిల డ్యామ్‌ ఆఫ్రాన్‌ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేస్తానని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చెప్పారు. ఈలోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయమని అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు. ఏ ఒక్కరికీ ఏ సమస్య ఉన్నా గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సీఎం వైయస్‌ జగన్‌ సూచించారు. 
 

Back to Top