సచివాలయం: ముఖ్యమంత్రి వైయస్ జగన్ అధ్యక్షతన సచివాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ నెల 16వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. అదే విధంగా పలు ముసాయిదా బిల్లులపై మంత్రివర్గం చర్చించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల వైయస్ఆర్ చేయూత పథకంపైనా కేబినెట్‌లో చర్చ జరిగింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని గుర్తించిన మంత్రివర్గ ఉపసంఘం.. సీబీఐ దర్యాప్తును సిఫార్స్ చేస్తూ కేబినెట్‌కు నివేదిక సమర్పించింది. ఫైబర్ గ్రిడ్‌లో రూ.1000 కోట్ల టెండర్లలో అవినీతిపై సీబీఐ దర్యాప్తునకు మంత్రివర్గ ఉప సంఘం సిఫార్స్ చేసింది. చంద్రన్న కానుకలో అవినీతి జరిగినట్లుగా కేబినెట్ సబ్ కమిటీ గుర్తించింది. హెరిటేజ్ నెయ్యి కొనుగోళ్లలోనూ అవకతవకలు జరిగినట్లు గుర్తించిన మంత్రివర్గ ఉపసంఘం.. ఫైబర్ గ్రిడ్‌లో టెరా సాఫ్ట్‌వేర్, వేమూరి రవిప్రసాద్ కేంద్రంగా అవినీతి జరిగినట్లుగా నిర్ధారించింది. వీటిపై సీబీఐ దర్యాప్తునకు ప్రభుత్వానికి సిఫార్స్ చేసింది.