విజయవాడ: దేశ చరిత్రలో సీఎం హోదాలో చంద్రబాబు మాట్లాడినట్లు ఎవరూ మాట్లాడలేదని వైయస్ఆర్‌సీపీ సీనియర్ నేత, మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. రుషికొండ భవనాల నిర్మాణంలో అవినీతి జరిగితే కాంట్రాక్టర్లకు బిల్లులు ఎందుకు చెల్లించారు? అని ప్రశ్నించారు. రుషికొండ నిర్మాణలపై విచారణకు సిద్ధం ఉన్నామని బొత్స స్పష్టం చేశారు. సోమవారం శాసన మండలి మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. ‘శాసన మండలిలో అధికారపక్షం కుప్పిగంతులేసింది. సచివాలయ భవనాలపై మంత్రి అచ్చెన్నాయుడికి క్లారిటీ లేదు. తాత్కాలిక భవనాలు అని ఎప్పుడూ చెప్పలేదని అచ్చెన్నాయుడు చెబుతున్నారు. అలాంటప్పుడు కొత్తగా నిర్మాణాలకు టెండర్లు పిలవడమెందుకు. వైయస్ఆర్‌సీపీ వాళ్లకు పనిచేయొద్దని ముఖ్యమంత్రి ఎలా చెబుతారంటే సమాధానం లేదు. చంద్రబాబు మాదిరి ఇంత వరకూ ఏ ముఖ్యమంత్రి మాట్లాడలేదు. లబ్ధిదారుల్లో పార్టీలు చూడటమేంటి. రుషికొండ భవనాల్లో అక్రమాలు జరిగితే ఎందుకు బిల్లులు చెల్లించారు.నిజంగా అవినీతి జరిగితే ఎంక్వైరీ వేయండి. రాజధాని కోసం సుమారు మూడు నాలుగు లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. గతంలో టీడీపీ ప్రభుత్వం రాజధానికి రూ.6 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. బడ్జెట్ పై చర్చను డైవర్ట్ చేయడానికి టీడీపీ సభ్యులు ప్రయత్నం చేశారు.ప్రపంచ బ్యాంకుకు లేఖలు రాయాల్సిన అవసరం మాకేంటి. అధికారంలో ఉన్నది వాళ్లా..మేమా. ఆడలేక మద్దెల ఓడ అన్నట్లుంది కూటమి నేతల తీరు’అని మండిపడ్డారు.