చంద్రబాబుది దింపుడుకళ్లెం ఆశ

పోలవరంలో కమీషన్ల కోసమే బాబు సమీక్షలు

ఉద్యోగుల పీఎఫ్‌ అకౌంట్ల డబ్బులు ఎలా డ్రా చేస్తారు

టీడీపీని ప్రజలు బంగాళాఖాతంలో కలుపుతారు

ప్రజలంతా మార్పు కోరుకుంటున్నారు

మే 23వ తేదీన ప్రజా తీర్పు వెల్లడవుతుంది

ముఖ్యమంత్రిగా వైయస్‌ జగన్‌ ప్రమాణస్వీకారం చేయడం ఖాయం

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్‌రెడ్డి, రఘురామిరెడ్డి, అంజద్‌భాషా

వైయస్‌ఆర్‌ జిల్లా: దింపుడుకళ్లెం ఆశతో చంద్రబాబు ఉన్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు ఎద్దేవా చేశారు. వైయస్‌ఆర్‌ జిల్లా వైయస్‌ఆర్‌ సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్‌రెడ్డి, అంజద్‌ భాషా, రఘురామిరెడ్డి, కడప మేయర్‌ సురేష్‌బాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. వైయస్‌ఆర్‌ జిల్లాలో తాగునీటి సమస్య దారుణంగా ఉన్నా.. చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ప్రజలకు సర్వీస్‌ చేయాలనే తపన లేదు కానీ, ప్రజా ధనాన్ని ఎలా లూటీ చేయాలనే కుట్ర చేస్తున్నాడని మండిపడ్డారు. సీఎఫ్‌ఎంఎస్‌ రిపోర్టు ప్రకారం గత నెల 27వ తేదీన ఉద్యోగుల పీఎఫ్‌ అకౌంట్‌లో రూ. 402 కోట్లు ఉంటే వాటిని కూడా చంద్రబాబు డ్రా చేశారని మండిపడ్డారు. ఇప్పుడు ఆ అకౌంట్‌లో రూ. 5.69 కోట్లు మాత్రమే ఉన్నాయన్నారు. ఉద్యోగుల పీఎఫ్‌ అకౌంట్‌ కాకుండా, జనరల్‌ ఫండ్, 13వ ఆర్థిక సంఘం, 14వ ఆర్థిక సంఘం నిధులు మొత్తం డ్రా చేసి పసుపు – కుంకుమ పేరుతో అక్కచెల్లెమ్మలను, సుఖీభవ పేరుతో రైతన్నల ఓట్లు కొనుగోలు చేయాలనే దురుద్దేశంతో ప్రవర్తించాడని ధ్వజమెత్తారు. ఇంతకంటే దారుణమైన ముఖ్యమంత్రి ఎక్కడా ఉండరన్నారు. ప్రజలంతా మార్పు కోరుకుంటున్నారని, వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఒక్క అవకాశం ఇద్దామని సంకల్పించారన్నారు. మాట ఇస్తే మడమ తప్పని నాయకుడికి ఓట్లు వేశారని, అన్ని స్థానాల్లో వైయస్‌ఆర్‌ సీపీ విజయం సాధిస్తుందని రవీంద్రనాథ్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 

కమీషన్ల కోసం కోడ్‌ ఉల్లంఘిస్తున్నారు

కమీషన్ల కోసం చంద్రబాబు పోలవరం సమీక్షలు చేపడుతున్నాడని కడప మేయర్‌ సురేష్‌బాబు ధ్వజమెత్తారు. ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు కడపలో ఒక్క బోరు వేయించిన పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో కరువుపై చర్చ జరపకుండా కమీషన్ల కోసం ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ చంద్రబాబు చర్చలు జరుపుతున్నాడని మండిపడ్డారు. రాయలసీమ మీద చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. అలుగు రిజర్వాయర్‌ నుంచి ఇప్పటి వరకు నీరు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి సువర్ణ పాలన వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమన్నారు. 

చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలి

ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ అధికారులతో చంద్రబాబు సమీక్ష సమావేశాలు నిర్వహించడం ఎంత వరకు సమంజసమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంజద్‌భాషా ప్రశ్నించారు. జిల్లాలో తాగడానికి గుక్కెడు నీరు లేక ప్రజలు అల్లాడుతుంటే పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు ఎందుకు సమీక్షలు చేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు పాలనలో కరువు తాండవించిందని, బోర్లు కూడా అన్ని ఎండిపోయాయన్నారు. 

రాష్ట్ర ఖజానా ఖాళీ చేయాలని చంద్రబాబు కుట్ర చేస్తున్నాడని అంజద్‌భాషా మండిపడ్డారు. గతంలో మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యేనాటికి ఖాజానా మొత్తం చంద్రబాబు ఖాళీ చేసి అప్పగించాడని గుర్తు చేశారు. దేవుడి దశతో మంచి వర్షాలు కురిశాయని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడంతో వైయస్‌ఆర్‌ ఐదేళ్లు సువర్ణ పాలన అందించారన్నారు. ఉద్యోగుల అకౌంట్లు, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు, మైనార్టీ కార్పొరేషన్‌ నిధులు ఖాళీ మొత్తం చంద్రబాబు ఖాళీ చేశాడని మండిపడ్డారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని అంజద్‌భాషా అన్నారు. జగనన్న పాలనలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారని మార్పు కనిపిస్తుందన్నారు. చంద్రబాబు పార్టీని బంగాళాఖాతంలో కలపడానికి ప్రజలు నిర్ణయించుకున్నారు. ప్రజా నిర్ణయం 23వ తేదీన వెల్లడవుతుందని స్పష్టం చేశారు. 

బాబుకు సమీక్ష నిర్వహించే హక్కు ఉందా?

ఎన్నికల కోడ్‌ ఉన్నప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహించే హక్కు చంద్రబాబుకు ఉందా.. ఈసీ ఆదేశాలను కూడా చంద్రబాబు బేఖాతరు చేశారని ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ధ్వజమెత్తారు. సాగు నీరు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయి. రైతులు నష్టపోతున్నారు. తాగునీరు కూడా ఇవ్వలేని దుర్భర పరిస్థితుల్లో చంద్రబాబు ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తారు. జూన్‌ 8 వరకు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని చంద్రబాబు అంటున్నాడంటే.. తరువాత దిగిపోతాడని ఆయనే ఒప్పుకుంటుడన్నారు. ప్రజలంతా మార్పు కోరుకున్నారు. కచ్చితంగా 23వ తేదీన ప్రజా తీర్పు వెల్లడవుతుంది. వైయస్‌ఆర్‌ సీపీ 120 స్థానాల్లో విజయం సాధిస్తుంది.. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 

Back to Top