స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు మేం వ్యతిరేకం

 మంత్రి అవంతి
 

విశాఖపట్నం: స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు మేం వ్యతిరేకమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం వ్యతిరేకిస్తూ మహా పాదయాత్రను మంత్రి అవంతి శ్రీనివాస్‌, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఆదివారం ప్రారంభించారు. కాకతీయ గేట్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ప్రారంభించిన ఈ పాదయాత్రలో గ్రేటర్ విశాఖ మేయర్ హరి వెంకట కుమరి, ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌, స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు పాల్గొన్నాయి. 

ఈ సందర్భంగా మంత్రి అవంతి మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌ లాభాల్లో నడుస్తోందన్నారు. పార్టీలకతీతంగా స్టీల్‌ప్లాంట్‌ కోసం పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఏడు నెలలుగా రోడ్లపైకి వచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంపై వ్యతిరేకిస్తున్న కేంద్రం పట్టించుకోవడం లేదని మంత్రి మండిపడ్డారు.

కేంద్రం నిర్లక్ష్యం...
విభజన హామీలను పట్టించుకోకుండా కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైయ‌స్సార్‌సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ ధ్వజమెత్తారు. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అని, స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేశామన్నారు. స్టీల్‌ప్లాంట్‌ కోసం పోరాటం చేస్తూనే ఉంటామని ఎమ్మెల్యే అమర్‌నాథ్‌ అన్నారు.

Back to Top