ప్రజల దృష్టి మరల్చేందుకు టీడీపీ నిరసనలు

చంద్రబాబు తీరుపై మంత్రి అవంతి ఫైర్‌
 

విశాఖపట్టణం: ఏ మంచి కార్యక్రమం చేపట్టినా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిరసనలకు పిలుపునివ్వడం అలవాటు అని మంత్రి అవంతి శ్రీనివాస్‌ రావు పేర్కొన్నారు. రేషన్ రవాణా ట్రక్కుల పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తున్న సమయంలో చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా నిరసనలకు పిలుపునిచ్చారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల దృష్టి మరల్చేందుకు నిరసనలకు పిలుపునిస్తున్నారని మండిపడ్డారు. కళా వెంకట్రావు వ్యవహారంలో పోలీసులు చట్టం ప్రకారం వ్యవహరించారని తెలిపారు. ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం చేయడం చంద్రబాబుకు అలవాటు అని పేర్కొన్నారు. రాముడిని చూడటానికి బూట్లు వేసుకుని వెళ్లిన సంస్కారం చంద్రబాబుది అని చెప్పారు. 

బుల్లెట్ ప్రూఫ్ వాహనం లేకపోతే..
విజయసాయిరెడ్డిపై హత్యాయత్నం జరిగిందని.. బుల్లెట్ ప్రూఫ్ వాహనం లేకపోతే విజయ సాయిరెడ్డి ప్రాణానికే ప్రమాదం వాటిల్లేదని మంత్రి అవంతి ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ నేతల దాడిలో కారు అద్దాలు దెబ్బతిన్నాయని వివరించారు. విజయసాయి రెడ్డిపై దాడిని నిరోధించాల్సినది పోయి రెచ్చగొట్టారని ఆరోపించారు. రాజ్యసభ సభ్యుడిపై రాళ్లు, కర్రలు విసరడం ఉన్మాదం కాదు కానీ.. ప్రోత్సహించిన వారిని అరెస్ట్ చేయడం ఉన్మాదమా...!? అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకే చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ఉత్తరాంధ్ర ప్రశాంతత దెబ్బతీయవద్దని కోరుతున్నట్లు విజ్ఞప్తి చేశారు. తమ ప్రభుత్వం గ్రాఫ్ పెరగడాన్ని సహించలేకే తప్పుదారి పట్టిస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్‌ తెలిపారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top