తాడేపల్లి: అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే సీఎం వైయస్ జగన్ లక్ష్యమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఐదేళ్లు పరిపాలించిన చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టారని, అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని సీఎం వైయస్ జగన్ గాడిలో పెడుతున్నారన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఇచ్చిన మాట నిలబెట్టుకునే నాయకుడు వైయస్ జగన్ అని, పేదల జీవితాల్లో వెలుగులు నింపడానికి శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నారని చెప్పారు. రాజధాని పేరుతో చంద్రబాబు గ్రాఫిక్స్ చూపించారని, అమరావతిలో మోసపోయింది దళితులే. దళితుల అసైన్డ్ భూములు టీడీపీ నేతలు లాక్కున్నారని దుయ్యబట్టారు. దళితుల భూములను సీఎం వైయస్ జగన్ మళ్లీ వెనక్కి ఇచ్చేస్తున్నారన్నారు. పంటలు పండే భూములను చంద్రబాబు స్వార్థం కోసం లాక్కొని రైతులను రోడ్డున పడేశారని మండిపడ్డారు. అమరావతి ప్రాంత రైతులను, రైతు కూలీలను సీఎం ఆదుకున్నారని, కౌలు ఒప్పందాన్ని 10 ఏళ్ల నుంచి 15 ఏళ్లకు, రైతు కూలీలకు పింఛన్ రూ.2,500 నుంచి రూ. 5 వేలకు పెంచారన్నారు. రూ. లక్ష కోట్లు పెట్టి ఒకే చోట అభివృద్ధి చేస్తే మిగతా ప్రాంతాల పరిస్థితేంటీ..? అని చంద్రబాబును ప్రశ్నించారు. తన మీడియా బలంతో చంద్రబాబు కృత్రిమ ఉద్యమం చేయిస్తున్నాడని, టీడీపీ డ్రామాలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. వికేంద్రీకరణ నిర్ణయాన్ని అన్ని ప్రాంతాల ప్రజలు స్వాగతిస్తున్నారని వివరించారు.