గ్రామ సచివాలయాన్ని ఒక బిడ్డ మాదిరిగా చూడాలి

కలెక్టర్లకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆదేశాలు

మండలాల్లో ఎక్కడా అవినీతి కూడా లేకుండా చూడాలి

సెప్టెంబర్‌ నుంచి కొత్త పాలసీ అమల్లోకి

మధ్యాహ్న భోజనం క్వాలిటీపై దృష్టి పెట్టాలి

 కరువు పీడిత ప్రాంతాల్లో నవధాన్యాల సాగుపై అవగాహన

‘స్పందన’ కార్యక్రమంపై సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమీక్ష

అమరావతి:  ప్రతి కలెక్టర్‌ గ్రామ సచివాలయాన్ని ఒక బిడ్డ మాదిరిగా చూడాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సూచించారు. సంతృప్తి స్థాయిలో పథకాలు అమలు జరగాలని ఆదేశించారు.  జిల్లా కలెక్టర్లు, ఎస్సీలు, ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. స్పందన కింద వస్తున్న దరఖాస్తుల సంఖ్య పెరుగుతోందని సీఎం తెలిపారు. అంకితభావం చూపుతున్నందుకే ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తున్నారని చెప్పారు. కలెక్టర్లు సీరియస్‌గా చూస్తున్నారనే సంకేతం ప్రజల్లోకి వెళ్లిందన్నారు. మండలాల్లో ఎక్కడా అవినీతి కూడా లేకుండా చూడాలని ఆదేశించారు. కలెక్టర్లు, ఎస్పీలు ఆకస్మిత తనిఖీలు చేయాలని సూచించారు. అవినీతి చేస్తే సహించబోమని ప్రతి సమీక్షలో చెప్పాలన్నారు. ఇసుక లభ్యతపై సీఎం వైయస్‌ జగన్‌ ఆరా తీశారు. సెప్టెంబర్‌ నుంచి కొత్త పాలసీ అమల్లోకి వస్తుందని సీఎం తెలిపారు. అన్ని ఇసుక ర్యాంపుల్లో సీసీ కెమెరాలు ఉంటాయని చెప్పారు. ఇసుక లభ్యత లేకపోతే రేటు పెరిగి ప్రజలు ఇబ్బంది పడతారన్నారు. ఇసుక కొరత అన్నది లేకుండా చూడాలని ఆదేశించారు. అవసరమైతే ఇ సుక ర్యాంపుల సంఖ్య పెంచాలని సూచించారు.

మధ్యాహ్న భోజనం క్వాలిటీపై దృష్టి పెట్టాలని కలెక్టర్లకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. మధ్యాహ్న బోజన పథకానికి సమయానికి చెల్లింపులు జరగాలన్నారు. బిల్లుల చెల్లింపులపై ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టి పెడుతుందన్నారు. గుడ్డు నాణ్యత బాగోలేదని తన దృష్టికి వచ్చినట్లు సీఎం పేర్కొన్నారు. మధ్యాహ్న భోజన పథకం బాధ్యతను కలెక్టర్లకే అప్పగిస్తున్నామని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాలకు భవనాలు గుర్తింపు తప్పనిసరి చేయాలన్నారు. అన్ని వసతలు ఉన్నాయా? లేదా ? అన్నది చూసుకోవాలన్నారు.కంప్యూటర్, ఇంటర్నెట్‌ కనెక్షన్, స్కానర్, ప్రింటర్‌ ఉండాలన్నారు. దరఖాస్తు పెట్టిన 72 గంటల్లో రేషన్‌ కార్డు, పెన్షన్‌ ఇచ్చేట్లు ఉండాలని, అప్పుడే ప్రజల హృదయాల్లో గ్రామ సచివాలయం నిలుస్తుందన్నారు. ప్రతి కలెక్టర్‌ గ్రామ సచివాలయాన్ని ఒక బిడ్డ మాదిరిగా చూడాలని సూచించారు. సంతృప్తి స్థాయిలో పథకాలు అమలు జరగాలని ఆదేశించారు. గ్రామ సచివాలయాల ఉద్యోగాల కోసం ప్రతి జిల్లాలో కనీసం లక్ష మంది పరీక్షలు రాస్తున్నారని, ఇంత మంది పరీక్ష రాయడం ఎప్పుడూ ఇలా చూడలేదన్నారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా కలెక్టర్లు చూడాలని సీఎం సూచించారు. మినరల్‌ వాటర్‌ ప్లాంట్లు, మురుగునీటి శుద్ధి ప్లాంట్ల మీద కూడా దృష్టి పెట్టాలన్నారు. వాటిని తిరిగి నిర్వహణలోకి తీసుకురావాలన్నారు. కరువు పీడిత ప్రాంతాల్లో నవధాన్యాల సాగుపై దృష్టిపెట్టాలని ఆదేశించారు. ఆ దిశగా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. 
 

Back to Top