అమరావతి: రాజకీయంగా పోరాటాలు చేసే చట్టసభల్లోకి వచ్చామని, ఎవరూ కూడా గాలికి రాలేదంటూ వైయస్ఆర్‌సీపీ(ysrcp) సీనియర్ నేత, మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఇవాళ శాసన మండలిలో ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు(Atchannaidu) అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. సోమవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మంత్రి అచ్చెన్నాయుడు విపక్ష సభ్యులను ఉద్దేశించి గాలికి వచ్చారంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగతంగా కించపరిచేలా మాట్లాడడంతో బొత్స మండిపడ్డారు. బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) ఏమన్నారంటే.. ‘‘మంత్రి అచ్చెన్నాయుడు నేను ఒకే ప్రాంతం నుంచి వచ్చాం. సుదీర్ఘ రాజకీయాలు చేసిన అనుభవం నాకు ఉందని అచ్చెన్నాయుడికి తెలుసు. మేం గాలికి వచ్చామని మంత్రి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరం. ఆయన తన వ్యాఖ్యలు విత్ డ్రా చేసుకోవాలి. మేం ఎవరిని వ్యక్తిగతంగా కించపరిచేలా మాట్లాడటం లేదు. వ్యక్తిగతంగా నాపై మాట్లాడటం ఇద్దరికీ గౌరవంగా ఉండదు. మేమంతా రాజకీయంగా పోరాటాలు చేసే ఇక్కడకు వచ్చాం’’ అని బొత్స, అచ్చెన్నకు హితవు పలికారు. చంద్రబాబు సిగ్గుపడాలి `గత ప్రభుత్వం అర్హులైన ప్రతీ ఒక్కరికీ అన్నీ పథకాలు ఇచ్చింది. మా పార్టీ వాళ్ళకే పనులు, పథకాలు ఇవ్వాలని వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడూ చెప్పలేదు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న చంద్రబాబు పథకాలపై చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి చంద్రబాబు ఇలా మాట్లాడటానికి సిగ్గుపడాలి. లబ్ధిదారులకు పార్టీలు అంట గడతారా?. అర్హులైన లబ్ధిదారులకు పథకాలు ఇవ్వాల్సిన భాధ్యత ప్రభుత్వానికి ఉంది. ప్రమాణం చేసి పదవులు తీసుకున్న వ్యక్తులు ఇలాంటి మాటలు మాట్లాడతారా?. కేవలం కార్యకర్తలకు ఇవ్వమనటానికి ఇదేమైనా మీ సొంత ఆస్తి అనుకుంటున్నారా?. మా ప్రభుత్వంలో గత ఐదేళ్లలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ పథకాలు ఇచ్చాం` అంటూ బొత్స సత్యనారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు.