కలిసికట్టుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం

అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి 

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి
 
నగర అభివృద్ధిలోనూ మీ భాగస్వామ్యం మరువలేనిది

వ్యక్తిగతంగా నా కుటుంబానికి మీరంతా ఆప్తులు

మీ సమస్యల పరిష్కారానికి నా వంతు సహకారం

అపరిష్కృతంగా ఉన్న సమస్యలకు త్వరలోనే పరిష్కారం
  
ఏపీ ఎన్జీఓ నూనత షాపింగ్‌ కాంప్లెక్స్‌ భవనం ప్రారంభం

ఎన్జీఓ కొత్త భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన ెమ్మెల్యే అనంత

అనంతపురం :  ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోందని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. మంచి పరిపాలన అందించడంలో ఉద్యోగుల సహాయ సహకారాలు మరింతగా ఉండాలని కోరారు. అందరూ కలిసికట్టుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలోని టవర్‌క్లాక్‌ సమీపంలో ఏపీ ఎన్‌జీఓ నూతన షాపింగ్‌ కాంప్లెక్స్‌ను ప్రారంభించడంతో పాటు ఎన్జీఓ నూతన భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) చంద్రశేఖర్‌రెడ్డితో పాటు ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బండి శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట శివారెడ్డి, జిల్లా అధ్యక్షుడు బి.చంద్రశేఖరరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధిలో ప్రభుత్వ ఉద్యోగుల సహకారం ఎనలేనిదని చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావించి ముందుకెళ్తున్నామన్నారు.

అనంతపురం నగరంలో రూ.700 కోట్లతో అభివృద్ధిని శరవేగంగా చేస్తున్నామని చెప్పారు. టవర్‌క్లాక్‌ సమీపంలో బ్రిడ్జి నిర్మాణం సమయంలో కొన్ని భవనాలు తొలగించాల్సి వచ్చిందని, ఈ సమయంలో ఎన్జీఓ సంఘం నేతలు, ఉద్యోగులు సహకారం అందించారని గుర్తు చేశారు. ఇందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తన తండ్రి, తాను ఎంపీగా ఉన్న సమయంలో ఎన్జీఓలకు అండగా నిలిచామని.. ప్రత్యేక నిధులు కూడా కేటాయించినట్లు గుర్తు చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అందించే విషయంలో మీ తోడ్పాటు మరింత అవసరమని అన్నారు. సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నాలుగేళ్లుగా ఎంతో సమర్థవంతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారంటే అందులో ఉద్యోగుల భాగస్వామ్యం ఎంతో ఉందని కొనియాడారు. కోవిడ్‌ వంటి పరిస్థితులు ఎదురుకావడంతో ఆర్థిక సమస్యలు వచ్చాయని, అయినా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

ఇప్పటికే అనేక సమస్యలకు పరిష్కారం చూపామని, అపరిష్కృతంగా ఉన్న సమస్యలకూ త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు సంబంధించి ఏ సమస్య పరిష్కారం కోసమైనా ఉద్యోగ సంఘం నేతలతో  ప్రభుత్వం చర్చిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. పీఆర్సీ విషయంలోనూ మంచి వార్త వింటారని తెలియజేశారు. అందరూ కలిసికట్టుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. ఉద్యోగులతో తన కుటుంబానికి 50 ఏళ్లుగా ప్రత్యేక అనుబంధం ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తన కుటుంబంలోని సభ్యులేనని, ఏ సమస్య వచ్చినా వ్యక్తిగతంగా.. ప్రభుత్వపరంగా తన సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏపీ ఎన్జీఓ జిల్లా సెక్రటరీ చంద్రమోహన్, అనంతపురం నగర అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, నగర కార్యదర్శి శ్రీధర్‌బాబు, రాష్ట్ర ఉపాధ్యక్షులు దస్తగిరి రెడ్డి, వైఎస్‌ఆర్‌ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, కర్నూలు జిల్లా కార్యదర్శి జవహర్, ఎన్జీఓ నేతలు, ఉద్యోగులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

Back to Top