అనంతపురం : మహిళలు అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదని, ప్రతి ఒక్కరూ ఆత్మ విశ్వాసంతో అడుగులు వేయాలని అనంతపురం జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. వైయస్ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో మహిళా విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధిగా మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి హాజరయ్యారు. ముందుగా దివంగత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం మహిళలతో కలిసి కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అనంత మాట్లాడుతూ.. మహిళ లేకపోతే ఈ సృష్టే లేదన్నారు. అలాంటి మహిళా లోకానికి ప్రతి ఒక్కరూ గౌరవ మర్యాదలు ఇవ్వాలన్నారు. సమాజంలో ఎవరూ చేయలేని బాధ్యతలను వాళ్లు చేస్తున్నారన్నారు. ఆడ, మగ అనే తేడా లేకుండా అందరూ సమానమే అనే భావన రావాలన్నారు. వైయస్ జగన్ హయాంలో మహిళా సాధికారతకు పెద్దపీట వేశామని తెలిపారు. మహిళలకు ఆర్థికంగా చేయూత అందించడమే కాకుండా ఐదేళ్ల కాలంలో ఏకంగా రూ.1,89,519 కోట్లను నేరుగా మహిళల ఖాతాల్లో జమ చేశామన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల నాటికి మహిళల పేరిట పొదుపు సంఘాలలో ఉండే రూ.25,571 కోట్ల రుణాన్ని నాలుగు దఫాలుగా నేరుగా మహిళల చేతికి అందజేసినట్లు చెప్పారు. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రుణాలు మాఫీ చేయకుండా మహిళల్ని మోసగించడమే కాకుండా.. సున్నా వడ్డీ పథకం సైతం రద్దు చేశారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి వచ్చాక సున్నా వడ్డీ పథకాన్ని మళ్లీ అమలు చేసి ఏకంగా రూ. 4,969.04 కోట్లను అందించారన్నారు. వైయస్ జగన్ హయాంలో మహళాభ్యున్నతికి కృషి చేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సున్నా వడ్డీ పథకానికి తిలోదకాలు ఇచ్చిందన్నారు. తల్లికి వందనం పథకానికి ఎగనామం పెట్టారన్నారు. మహిళల రక్షణ, భద్రత కోసం తెచ్చిన ‘దిశ’ను కూడా కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా మహిళా సాధికారత, మహిళాభ్యున్నతి, మహిళల రక్షణ అనేవి మేడిపండు చందంగా ఉంటాయని విమర్శించారు.